4, ఏప్రిల్ 2014, శుక్రవారం

రంగులు కడుక్కుంటున్నారా!


ఒక్కోసారి ఎంతో అనుభవం వున్న రాజకీయ నాయకులు కూడా పొంతనలేని, హేతువుకు నిలవని ప్రకటనలు చేస్తుంటారా అనిపిస్తుంది.
సీ.ఎన్.ఎన్. ఐ.బి.ఎన్., సర్వే ఫలితాలు అనుకూలంగా రాకపోయేసరికి వైసీపీ నాయకుడు డాక్టర్ మైసూరారెడ్డి గారు అవన్నీ తప్పులతడక అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతకు ఇరవై రోజులక్రితం అదే సంస్థ వైసీపీకి పరిస్తితి అనుకూలంగా వుందని చెబుతూ సర్వే ఫలితాలు ఇచ్చినప్పుడు డబ్బులిచ్చి రాయించుకున్నారని ఓ టీడీపీ అగ్రనాయకుడు చేసిన ఆరోపణను గుర్తుకు తెచ్చి, ఇప్పుడు అనుకూలంగా రాయించుకోవడానికి తామెన్ని  డబ్బులిచ్చారో చెప్పమని రిటార్ట్ ఇచ్చి వున్నట్టయితే హుందాగా వుండేది, టిట్ ఫర్ టాట్ లెక్కన జనం లెక్కవేసేవాళ్ళు. అలా కాకుండా వాదనకు నిలవని వాదన వినిపించినట్టుగా అనిపించింది.
అలాగే టీడీపీ బలం పెరుగుతోందని ఆ సంస్థ తాజాగా జరిపిన సర్వే వివరాలు ప్రకటిస్తూ ఓ ప్రధాన పత్రిక, 'వైసీపీ గ్రాప్ పడిపోతోంది, టీడీపీ పుంజుకుంటోంది' అని మొదటి పుటలో ప్రచురించింది. అంటే అర్ధం, వైసీపీ గ్రాఫ్ ఒకప్పుడు పైన వున్నట్టే కదా! పైగా వాపు చూసి బలుపని భ్రమిస్తున్నారని కూడా అదే పత్రిక గతంలో ఎన్నో సార్లు రాసింది. ఇలాటి వ్యాఖ్యలు స్వవచన ఘాతుకమని ఆ పత్రిక వారికి అనిపించలేదా!
ఇక రాష్ట్రాన్ని రికార్డు కాలం పాలించిన చంద్రబాబు నాయడు గారు ఏకంగా 'సీ'అంటే 'జగన్' అని భాష్యం చెప్పారు. 'ఏ' ఫర్ యాపిల్' అని చదువుకున్న చిన్న  పిల్లలు కూడా 'సీ' అంటే 'జగన్'  యెలా అవుతుందని  ప్రశ్నిస్తున్నారు. అలా కాకుండా టైటానియం కుంభకోణంలో  జగన్ కు ప్రమేయం వుందని ఆరోపించి వుంటే కొంత సబబుగా వుండేది. పైగా 'సీ' అంటే 'చంద్రబాబు' అని ఎవరైనా ప్రత్యారోపణ చేయడానికి  ఆస్కారం వున్న వ్యాఖ్యానం అది.
'పైగా అమెరికా ఎఫ్.బీ.ఐ. అంటే మన దగ్గర సీ.బీ.ఐ. కాదు, అధికారంలో వున్నవాళ్ళు చెప్పినట్టు ఆడడానికి' అంటూ కొందరు తెలుగు దేశం నాయకులు మరో ఆడుగు ముందుకు వేసి మాట్లాడారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో రాజకీయాలు లేవనీ, సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని లోగడ వీరే అన్న మాటలు వీరికే గుర్తు లేవని  అనిపిస్తోంది ఈ విమర్శలు విన్నాక.  
ఎన్నికల వేడిలో మరీ జాగ్రత్తగా మాట్లాడడానికి వీలుండక పోవచ్చు కానీ వీలున్నంత వరకు చేసే వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు కొంత హేతుబద్ధంగా వుండేట్టు చూసుకోవడం అవసరం.

3, ఏప్రిల్ 2014, గురువారం

కడుపు కోత


పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా, ఒక్కోసారి ఆ రంగానికి ఒకప్పుడు చెందిన మనిషిగా కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. చదవం, చూడం అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. అవి ఏం రాస్తున్నాయి అనే దానికంటే వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రిక నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని తెలుగు పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు. మునుపటి మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి. ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి అన్ని రంగాల్లో వుండే అవలక్షణాలు అన్నీ కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. నిన్న మహా టీవీ ఎడిటర్స్ టైం లో ఐ వెంకట రావు గారు ఇదే చెప్పారు. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి.. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే తెలుగునాట దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకు ఎదురవుతాయి.
ఎందుకంటే గొంగట్లో అన్నం తింటున్నాం కనుక.

అంతయు మన మేలునకే....

రవి తాళ్ళూరి వారు ఇంగ్లీషులో ఓ జోకు పోస్ట్ చేశారు. చిన్నదే. తెనిగిస్తే...


"అదేమిట్రా బుడుగూ. మీ అమ్మ పొద్దట్నించి నోరు తెరవడం లేదు. ఏంటి కధ?"
"అమ్మ బజారుకు వెడుతుంటే లిప్ స్టిక్ తెమ్మంది. పొరబాటున ఫెవి స్టిక్ తెచ్చిచ్చా!"

2, ఏప్రిల్ 2014, బుధవారం

ఇలా చేసి మాడండి!


"ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.
"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి గారు రాసిన ఉత్తరం చూద్దాం.
"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా కాదు కదా రవ్వ జావ  కూడా తయారుకాలేదు,  అని మంగళగౌరీదేవి గారు రాశారు.



"చాలా సంతోషం మంగళగౌరీదేవిగారు,  మీరు మా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం  మాత్రమే కాకుండా ఆచరించి చూస్తున్నందుకు. కాకపొతే ఓ సందేహం. అదేమిటంటే,  మీరు స్టౌ వెలిగించడం మరచిపోయారని. యెంత రేడియో విని వంటచేసేవారికయినా ఈ కనీస  ప్రాధమిక సూత్రం తెలిసే వుంటుందన్న ఉద్దేశ్యంతో స్టౌ వెలిగించడం గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. నిజంగా అది మా పొరపాటే!"

(కార్టూనిష్ట్ లేపాక్షి గారికి కృతజ్ఞతలతో)   

రేవల్లి నరేందర్, ఆ నలుగురు .....

నరేందర్, ఆ నలుగురు .....

పొద్దున్నే విషాద వార్త. సీనియర్ క్రీడా వ్యాఖ్యాత, జర్నలిష్ట్ రేవల్లి నరేందర్ ఇక లేడు. అతడి భార్య ఉషతో మాట్లాడాను. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో వుంది. మరి కాసేపట్లో బంజారాహిల్స్ లోని పాత జర్నలిష్టు కాలనీ ( చట్నీస్ రెస్టారెంట్ దగ్గర) లోని వాళ్ళ ఇంటికి తీసుకు వస్తారు అని చెప్పింది. బహుశా ఉదయం పదీ పదిన్నర మధ్య కావచ్చు. ఈ విపత్తును తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఉషకు ప్రసాదించాలని, నరేందర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ సర్వేశ్వరుడిని కోరుకుంటున్నాను.


ఉష చెప్పింది పదీ పదిన్నర. ఓ పది నిమిషాలు ముందే వెళ్లాను. కాసేపటికే అంబులెన్సు వచ్చింది. నరేందర్ ని తీసుకువచ్చి హాల్లో పడుకోబెట్టారు. దాదాపు ఇరవై రోజులకు పైగా మృత్యువుతో అలుపెరగని పోరాటం చేసి వోడిపోయాడు. స్పోర్ట్స్ ఎనలిస్ట్ కదా! ఆటలో గెలుపు వోటములు సహజాతి సహజంగా తీసుకునే ధీమంతం వున్నమనిషి. అందుకే కాబోలు వోటమిని స్పోర్టివ్ గానే తీసుకున్నట్టున్నాడు. కాబట్టే మొహంలో అలసట ఛాయలు లేవు. హాయిగా నిద్రపోతున్నట్టుగా. 
ఉష ధైర్యంగానే దిగింది అంబులెన్స్. కానీ ఇంట్లోకి రాగానే ఇన్నాళ్ళుగా దాచుకున్న, అణచిపెట్టుకున్న దుఃఖం పొంగుకుని వచ్చింది. వోదార్చే ప్రయత్నమే కాని నిజంగా ఆ క్షణంలో  ఏ వోదార్పు అక్కరకు వస్తుంది. ఎవరికీ, ముఖ్యంగా ఆ వయస్సులోని ఏ అమ్మాయికీ రాకూడని కష్టం.
అందరూ వస్తున్నారు. ఏదో చెప్పాలని. ఎవరికీ గొంతు పెగలదు. ఈ నిశ్శబ్ధం నిజంగా భయంకరం.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

మనసునేమో కాని వయసుని మోసం చేయలేం


రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.
చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో  బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే.  బస్సెక్కి తుర్రున  వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె -  నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. మరో అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు  కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు.  టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు  పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల వూరొచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి  వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.
పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతి మందాన మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.  
రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్నగీత  గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు  నాగేశ్వర్రావులావుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు.  నవ్వుకోవడం నా వంతయింది.
రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు.  తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు.  కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. ‘నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క’ అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. ‘చూశారా నా స్పెషాలిటీ’ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని  చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


చూస్తుండగానే రామారావుకు ఏళ్ళు మీదపడడం మొదలయింది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. అతికించినట్టు పెదాలపై   చిరునవ్వు. అయితే అందులో నాకు జీవం కనబడ్డం లేదు.
రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతున్నట్టు అనిపిస్తోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కావు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.
ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక.
Photo courtesy image owner 

జై జగన్ ! నై జగన్ !


గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలు, ఇక దేశంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా కేవలం రెండే రెండు అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఒకటి తెలంగాణా, రెండోది జగన్. ఒకటి కాంగ్రెస్ పుణ్యమా అని ఎన్నికలకు ముందే దాదాపుగా సమసిపోయింది. అది వున్నన్నాళ్ళు,  'ప్రో తెలంగాణా యాంటీ తెలంగాణా' అనే రెండు కోణాలుగా విడిపోయాయి. సమాజంలో వున్న అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు, చదువుకున్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, పత్రికలు, టీవీలు, జర్నలిస్టులు చివారాఖరుకు బంధుమిత్రులు అందరూ రాష్ట్రం చీలకముందే రెండుగా చీలిపోయారు. సరే ఆ అంకం ముగిసింది. కానీ మిగిలివున్న జగన్ అంశం ఇంకా సెలవేస్తూనే వుంది. నిజం చెప్పాలంటే తెలంగాణా అంశం వల్ల జగన్ అంశం కాస్త తెరచాటు అయింది కానీ, ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేసిన విషయం మరోటిలేదు. జగన్ని సమర్ధించేవాళ్ళందరూ అవినీతిని సమర్ధించేవాళ్లని కొందరు ఆరోపిస్తే, జగన్ని వ్యతిరేకించేవాళ్లందరూ  పైకి కనబడేంత పత్తిత్తులు కాదని జగన్ మద్దతుదారుల వాదనగా సాగింది. ఈ వాదోపవాదాల మాటున అనేక కీలక అంశాలు చాటుకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో, మళ్ళీ ముందు చెప్పుకున్నట్టుగానే పౌర సమాజం రెండుగా విడిపోయింది.
పోతే, జర్నలిస్టులుగా వున్నవాళ్ళు కూడా ఇందుకు అతీతం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ వుండడం ఇందులో విషాదం. తెలంగాణా వంటి భావోద్వేగ సమస్య పట్ల వైఖరులను కొంత సమర్ధించుకోవచ్చు కానీ పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న అంశం పట్ల కూడా ఉద్వేగాలకు ఆవల నిలబడి ఆలోచించుకోలేని పరిస్తితి ఏర్పడడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. కాకపొతే ఈ విషయంలో సమాజంలోని అన్నివర్గాలు ఇక వెనక్కు రాలేనంత ముందుకు వెళ్ళిపోవడం చూస్తే, రాగల పరిణామాలను కాలానికి వొదిలి వేచి చూడడమే మంచిదని అనిపిస్తోంది.
సరే! మిగిలిన అన్ని వర్గాలను వొదిలిపెట్టి విషయాన్ని  మరో  కోణం నుంచి చూద్దాం.
పదిమందిని కలుసుకోవడంతో పాటు పది రకాల మనుషుల్ని కలుసుకోగగల వెసులుబాటు జర్నలిష్టులకు (మాత్రమే) వుంటుంది. ఈ క్రమంలోనే  ఒక సైకాలజిష్టు కలిసారు. ఆయన విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా వుందా లేక ఆయన కూడా ఈ సమాజంలో భాగమే కనుక అందరిలాగే ఒక వాదానికే కట్టుబడి ఈ మాటలు చెబుతున్నారా అన్నది ఆయన విజ్ఞతకు, ఆ పలుకులలోని వాస్తవికతను ముందే చెప్పినట్టుగా కాలానికి వొదిలి వేద్దాం. తొందరపడడం యెందుకు, తేల్చే ఘడియ కనుచూపు మేరలో వున్నప్పుడు. ఎలాగు మనకో సామెత వుండనే వుంది. 'విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడ'ని. ఇక ఆయన ఏం చెప్పారంటే....ఆయన మాటల్లోనే......
"ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు దానిలోని ఔచిత్యాలను గమనంలోకి తీసుకోరు. నమ్మకం, అభిమానం, కొండొకచో ప్రేమ వారినలా ప్రవర్తించేలా చేస్తుంది. వాటికి హేతుబద్ధమైన  లేదా శాస్త్రీయమైన  ప్రాతిపదికలు వుండవు. మన పిల్లవాడు అద్దం పగలగొడితే, చిన్నవాడు పోనీలే అనుకుంటాం. అదే పక్కపిల్లవాడు చేస్తే రాలుగాయి, అసలు పెంపకాన్ని అనాలి అనేస్తాం. ఇది మానవ సహజం.
"ఒకప్పుడు, ఆ మాటకు వస్తే ఇంత చదువు సంధ్యలు పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా సినిమా అభిమానులది ఇదే వరస. వాళ్ళకో అభిమాన హీరో వుంటాడు. అతన్ని ఎంతగా అభిమానిస్తారో అతడికి సినీ రంగంలో ప్రత్యర్ధిగా వున్న మరో హీరోను అంతగా ద్వేషిస్తారు. యెందుకు అంటే ఇతమిద్ధంగా కారణం చెప్పలేరు. ఎదుటి హీరోలో కనిపించే లక్షణాలన్నీ వారికి అవలక్షణాలుగా కానవస్తాయి. తమ హీరోలో బలహీనతలను వారసలు పట్టించుకోరు. ఈ అభిమానం, ఈ  వైమనస్యం వారిని ఏ స్తితికి తీసుకువెడతాయంటే ఆఖరికి వాళ్లు సినిమా పోస్టర్ల మీద పేడ కొట్టే పరిస్తితి వరకు దిగజారుస్తాయి. ప్రస్తుతం ఈ మనస్తత్వమే రంగూ రూపూ మార్చుకుని సోషల్ మీడియాలో విశృంఖల విహారం చేస్తోంది. మొదటి వాక్యం  చదివేసి ఒక అభిప్రాయానికి వచ్చేసి కామెంట్లు పెట్టేస్తారు. ఆవిధంగా ఇప్పుడు పౌర సమాజం, చదువుకున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తారతమ్యం లేకుండా రెండు వర్గాలుగా విడిపోయి, 'జై జగన్, నై జగన్' అని  వాదించుకుంటోంది. ఎవరి శాతం యెంత అన్న విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకు వున్నా  ఇంకా అసలు  లెక్కలు తేలలేదు. రాబోయే ఎన్నికల్లో ప్రస్పుటం అయ్యే ఈ లెక్కల్లోని వ్యత్యాసమే ఆయా రాజకీయ పార్టీల లెక్కల్ని, తలరాతల్ని  మార్చబోతోంది"
అయితే 'ఇందులో కొత్త విషయం ఏముంది, వేచి  చూడడం అన్న సలహా తప్ప' అన్న అనుమానం నాకూ వచ్చింది.
నాకనిపించేది ఏమిటంటే సినిమా హీరోలని అమితంగా అభిమానించే జనాలు వున్నట్టే, అసలు  అభిమానాలు, దురభిమానాలతో నిమిత్తంలేని ప్రేక్షక జనాలు కూడా వుంటారు. సినిమాల జయాపజయాల్లో వాళ్ల పాత్ర కూడా అంతర్లీనంగా వుంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా. 'చంద్రబాబు మా మేనత్త కొడుకు కాదు,  జగన్  మా మేనమామ కొడుకు కాదు' అనే బాపతు. వారెవరో, వారెందరో ఒక పట్టాన తేలడం కష్టం. చివరికి తేల్చేది, ముంచేది అలాటి వాళ్ళేనేమో!