15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 3


గవర్నర్ నరసింహన్ గారు వీఐపీ సిఫారసు లేఖలపై ఆక్షలు విధించడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఇత్యాది కారణాల చేత తిరుమలలో రద్దీ తగ్గే అవకాశం, సామాన్య జనాలకు దైవ దర్శనం సులభంగా జరగగలదన్న ఆశాభావం జనాల్లో కలిగింది.  దానికి తోడు టీవీల్లో 'తిరుమలలో రద్దీ ఓ మోస్తరు' అని స్క్రోలింగులు, తిరుపతిలో దిగగానే హోటళ్ళలో వేచి వుండే పని లేకుండా కాఫీ పలహారాలు చేయడానికి సీట్లు దొరకడం ఇవన్నీ ఆశల్ని మరింత చిగురింపచేసాయి. కానీ పైన కొండ మీద పరిస్థితులు షరా మామూలే! పైన తిరగడానికి అనువుగా వుంటుందని కింద నుంచి ప్రైవేటు టాక్సీ తీసుకు వెడితే అణువణువునా ఆంక్షలే. మొక్కుబళ్ళు  తీర్చడానికి బయలుదేరితే ముందుకు పోవడానికి వీల్లేదని ట్రాఫిక్ పోలీసు చెయ్యి అడ్డం పెట్టాడు. ఓ యాభయ్ ఇవ్వండని మా డ్రైవర్ అడిగి తీసుకుని ఇవ్వడానికి వెడితే అతగాడు తన  పక్కన వున్నవాడి వైపు సైగ చేసాడు. అతడి కలెక్షన్ ఏజెంటు చేతిలో డబ్బు పడగానే 'అడ్డం పెట్టిన పోలీసు చెయ్యి' మా కళ్ళ ముందే కిందికి దిగిపోయింది. తల నీలాలు ఇవ్వడానికి ఎస్వీ గెస్ట్ హౌస్ వద్దకు వెడితే, అక్కడ క్షురకులు ఖాళీగానే వున్నారు కాని  కింద నుంచి టోకెన్ తెమ్మన్నారు. కారు లేకపోతే ఆ ఎండలో  ఇంతే సంగతులు. అంతకుముందే  డబ్బులు చేతిలో పడ్డాయి కాబట్టి పోలీసు కిమ్మనలేదు.



ముందే చెప్పినట్టు అందుబాటులో వున్న టెక్నాలజీని వాడుకుంటున్నారే కాని, యాత్రీకుల కోణం నుంచి కాదు. భక్తులు కొండ మీదకు రాగానే అన్నీ ఒకే  గొడుగు కింద - పదే పదే పది చోట్లకు తిరగకుండా వున్న కంప్యూటర్ల వ్యవస్థను సమర్ధవంతంగా యెందుకు ఉపయోగించుకోరో అర్ధం కాదు. రూము ఖాళీ చేసి డిపాజిట్ డబ్బు తిరిగి తీసుకోవాలంటే రిఫండ్ రసీదు ఇచ్చే కౌంటర్ ఒకటయితే, డబ్బు తీసుకోవాల్సిన కౌంటర్ మరొకటి. రెండు చోట్లా క్యూలో నిలబడాలి. లడ్డూ టోకెన్ తీసుకునే కౌంటర్ ఒకటయితే, వాటికి కావాల్సిన సంచీ కొనాలంటే మరో కౌంటరు కు వెళ్ళాలి. మళ్ళీ క్యూలో నిలబడాలి. తోడు లేకుండా వెళ్ళే వృద్ధుల కష్టాలు చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది.   యాత్రీకులకు సేవ చేయడం కోసం ఉద్యోగులను నియమిస్తున్నారో, ఉద్యోగులను నియమించడం కోసం ఉద్యోగాలు సృష్టిస్తున్నారో అర్ధం కాదు. ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త  మాల్తూసియన్   కొత్త ఉద్యోగాల సృష్టికి ఏనాడో ఒక సూత్రం చెప్పారు. " గొయ్యి తవ్వించు.  ఆ గోతిని పూడ్పించు". అంటే ఏమిటన్నమాట.  గొయ్యి తవ్విన వాడికి ఓ ఉపాధి. పూడ్చిన  వాడికి మరో ఉపాధి.అలావుంది. టీడీడీ వ్యవహారం.

(ఇంకా వుంది)

తిరుపతికి వెళ్ళొద్దాం రండి! - 2


తిరుమల దివ్య క్షేత్రాన్ని అనుదినం వేలాదిమంది సందర్శిస్తుంటారు. వారిలో అధిక సంఖ్యాకుల కోరిక ఒక్కటే. దేవుడ్ని లిప్తకాలం పాటయినా దర్శించి సేవించుకోవాలని. కొద్దిమంది మాత్రం కోరుకునేది వేరే. ఎలాటి ఇబ్బంది లేకుండా సుఖంగా వెళ్ళి కళ్ళారా దేవుడ్ని కావాల్సినంత సేపు చూసి హారతి తీసుకుని మళ్ళీ అంతే సుఖంగా కడుపులో చల్ల కదలకుండా తిరిగిరావాలని. వీలయితే మరోమారో, ముమ్మారో అదేవిధంగా దర్శనం చేసుకోవాలని. వారిలో చాలామందికి ఆ కోరికా తీరుతుంది. ఎందుకంటే ఆ మేరకు ముందుగానే ప్రయత్నం చేసుకువస్తారు కాబట్టి.


తిరుమలవాసుడి దర్శనానికి అనేక మార్గాలు వున్నాయి. సర్వదర్శనం. కాలిబాట భక్తుల దర్శనం, మూడువందల రూపాయల శీఘ్రదర్శనం. ఇవికాక కంకణ దర్శనం. వృద్ధులు, వికలాంగులకోసం మహాద్వార దర్శనం. ఇవే కాక చాలా వున్నాయి కాని పైకి చెప్పరు. సమాచార హక్కు చట్టం కూడా తమకు వర్తించదని చెప్పే అధికారులు వున్నారు కాబట్టి ఆ రహస్య దర్శనాలు గురించి మాట్లాడకపోవడమే మంచిది.
తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్లకు ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతుంది. అక్కడ ప్రతి ఏర్పాటు, ప్రతి సౌకర్యం భక్తుల కోణం నుంచి ఆలోచించి అమలుచేస్తున్న దాఖలా లేదు. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఎంతో మంచి పేరు, సమర్ధత కలిగిన అధికారులు ఎంతో మంది టీటీడీ  ఈవోలుగా  పనిచేశారు. చేస్తున్నారు కూడా. వీరిలో చాలామందితో  నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కొందరితో స్వేచ్చగా మాట్లాడే చనువు కూడా వుంది. వారి హయాంలో కూడా ఇదే వరస. ఎందుకో ఆ కుర్చీలో కూర్చున్న తరువాత వారి వరసే మారిపోతుంది. ఒకాయన అయితే ఏకంగా ఒక వ్యాఖ్య చేశారు. "ఇక్కడికి ప్రతిరోజూ కొన్ని వేల మంది వస్తుంటారు. వారిలో చాలామంది సిఫారసులతో వస్తారు. వారి కోరికలు తీర్చడమే గగనంగా వుంటే ఇక సామాన్యులను పట్టించుకునే తీరిక ఎక్కడ వుంటుంది. అయినా సామాన్య భక్తులకు ఇవన్నీ పట్టవు. వారికి ఏదో ఒకవిధంగా దర్శనం అయితే చాలు. తిట్టుకున్నా కొండ దిగగానే మరిచిపోతారు. ఇక మిగిలింది ఓ రెండు వేలమంది. వారిలో కూడా రోజూ రెండువందలమందిని కనిపెట్టి చూసుకుని వసతి, దర్శన ఏర్పాట్లు చక్కగా చూసుకుంటే చాలు. మమ్మల్ని అడిగేవాళ్ళు వుండరు."
(ఇంకా వుంది)

'పవనం' ఎటు వీస్తుందో చూడాలి!

కిందటి ఎన్నికల్లో అన్నయ్య పార్టీ పెట్టి ఒక పార్టీ తలరాత తుడిచేసాడు. ఆయన తమ్ముడు పార్టీ (పూర్తి పార్టీ కూడా  కాదు, వెనుకటి సినిమాల్లో మాదిరిగా పార్ట్లీ కలర్ అంటే  పూర్తి కలర్ కాకుండా  కొన్ని సన్నివేశాలే రంగుల్లో. అన్ని సీట్లల్లో పోటీ లేదు.  పైగా కామన్ సింబల్ కూడా లేదు.) పెట్టి అదే  పార్టీ తల రాత మారుద్దామని అనుకుంటున్నట్టు వుంది.



యువతలో ఆయనంటే క్రేజ్ వుంది. వాళ్ల సంఖ్య కూడా ఈసారి వోటర్ల జాబితాలో బాగా పెరిగిందని చెబుతున్నారు.  ఈ వోట్లు  గెలవడానికి కాకుండా ఒకరిని వోడించడానికి, మరొకర్ని గెలిపించడానికి పనికొస్తాయేమో! చూడాలి.

తిరుపతి వెళ్ళొద్దాం రండి! -1


తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుందామని అనుకుంటున్నారా! అలాటి వారికి నా ఉచిత సలహా!
కళ్ళూ చెవులూ రెండూ మూసుకుని యాత్రకు బయలుదేరండి. అదెలా అని అడగకండి. అక్కడ కళ్ళు తెరిచారంటే     ముడుపులతో మునిగితేలుతున్న సిబ్బందే మీకు కనిపిస్తారు. వీరిలో పెద్ద గద్దలు, పిల్లకాకులూ అందరూ వున్నారు. మినహాయింపు ఇచ్చే వాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  అంతా కలిసి పగలంతా  పోగేసుకున్న సొమ్మును రాత్రికి రాత్రే వాటాలు వేసుకుని పంచుకుంటారన్నది  స్థానికులు  బాహాటంగా చెప్పుకునే  దేవ  రహస్యం.   యాత్రీకులు, భక్తులు (కావలనే వీరిని విడదీసి చెప్పాల్సి వస్తోంది. భక్తులందరూ యాత్రీకులు కావచ్చుకాని, యాత్రీకులందరూ భక్తులు కారు) కలసి ఆ దేవదేవుడికి   చెల్లించుకునే ముడుపుల వివరాలు  బహిర్గతం చేస్తారు కాని ఈ బలవంతపు, నిర్లజ్జపు  వసూళ్లకు లెక్కాడొక్కా వుండవు. అయితే,  ఓ అనధికార అంచనా ప్రకారం తిరుమల తిరుపతుల్లో హారతి కర్పూరం అయ్యే భక్తుల  డబ్బు,  ఇంచుమించుగా ఆ ఏడుకొండల వాడి ఆదాయం అంత వుండొచ్చట.  చెవులు మూసుకుని వెళ్ళమని చెప్పింది ఇందుకే. ఇలాటి అప్రాచ్యపు విషయాలన్నీ ముందు చెవుల్లో పడి,ఆ పిదప మనసులో దూరి వున్న కాస్త మానసిక ప్రశాంతిని  దూరం చేస్తాయి. మూసుకున్న చెవులను దర్శనం అయ్యేదాకా అలాగే వుంచండి. ఎందుకంటే, దేవుడి సన్నిధానంలో వుండాల్సిన ప్రశాంతత, నిశ్శబ్ద ఆధ్యాత్మిక వాతావరణం మచ్చుకు కూడా వుండవు. క్యూలోవెనుకవారు మీద పడుతుంటే,  తమ ప్రమేయం ఏమీ లేకుండానే ముందుకు జరిగిపోతున్న జనాలను చేతులతో ముందుకు నెడుతూ 'ముందుకు జరగండి'  అనే 'శ్రీ వారి సేవకుల' హెచ్చరికలే గర్భగుడిలో  సైతం   కర్ణ కఠోరంగా వినవస్తుంటాయి.(ఇక్కడ గర్భగుడి అనే పదం కేవలం దేవాలయం అనే అర్ధంలో మాత్రమే. సామాన్యులకు గర్భగుడిలో ప్రవేశం అందని మావే. అది 'పెట్టిపుట్టిన' పెద్దమనుషులకు మాత్రమే. మిగిలినవారికి 'లఘు' దర్శనం. 'మహా లఘు' దర్శనాలే. అసలీ పేర్లు పెట్టిన వారికి 'పద్మ శ్రీ' బిరుదులివ్వాలి.)

(నేను తిరుపతికి వెళ్ళిన సందర్భాలే తక్కువ. మళ్ళీ అందులో, పైన చెప్పిన 'పెట్టిపుట్టిన' వారి జాబితాలోనే వెళ్ళిన సందర్భాలే మరీ  ఎక్కువ. అందువల్ల ఎలాటి సిఫారసులు లేకుండా సాధారణ పద్దతిలో వెడితే యెలా వుంటుందో చూద్దామన్న కోరిక కలిగింది. ఎన్నికల కోడ్ కూడా దీనికి సహకరించింది. అలా అని అదేదో అక్కడ తూచ తప్పకుండా అమలవుతోందని అనుకుంటే  అత్యాశే సుమా!.  ఓసారి అలా వెళ్ళి వచ్చి,  తెలుసుకున్న విషయాలను నలుగురితో పంచుకోవాలని చేసిన ప్రయత్నం ఇది. అనుభవాలను చిన్న చిన్న భాగాలుగా రాయాలని సంకల్పం. ఇది కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాదు. మెచ్చుకోవాల్సిన సందర్భాలు కూడా అనుభవంలోకి వచ్చాయి. సాధ్యమైనంత నిష్పాక్షికంగా రాయాలనేది మరో ఉద్దేశ్యం. ఎవరినీ నొప్పించడం  ఈవ్యాస పరంపర లక్ష్యం ఎంతమాత్రం కాదు. - భండారు శ్రీనివాసరావు)
(15-03-2014)

12, మార్చి 2014, బుధవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 22

లెనిన్ సమాధి
1924 జనవరి 21 వ తేదీన సోవియట్ వ్యవస్థ  నిర్మాత,  అక్టోబర్ విప్లవ సారధి అయిన   వ్లాదిమిర్ లెనిన్ మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై  ఆయన  శరీరాన్ని రసాయనిక ప్రక్రియల  ప్రకారం   భద్రపరచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో  ప్రజల సందర్శనార్ధం వుంచారు.


ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు  నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ సూచకమయిన కవాతు)ని చూడడానికి జనం ఎగబడేవారు. సుశిక్షితులయిన సైనికులు, చేతుల్లో తుపాకులతో మసోలియం ప్రధాన ద్వారం వద్ద  పోతపోసిన విగ్రహాల్లా నిలబడివుండేవారు. విధి నిర్వహణ సమయం ముగిసిన తరువాత  వారినుంచి బాధ్యతలు  స్వీకరించడానికి వచ్చిన వారి సహచరులు మరబొమ్మల మాదిరిగా కవాతు చేస్తూ వచ్చేవారు. కనుమూసి తెరిచేటంతలో వారి స్థానాలకి వీళ్ళు, వీళ్ళ స్థానాలలోకి వాళ్లు తటాలున మారిపోయే దృశ్యాన్ని రెప్పలార్పకుండా చూడడానికి సందర్శకులు చలినీ, మంచునీ లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడేవారు.


(లెనిన్ సమాధి దాపులో మా ఆవిడ శ్రీమతి నిర్మలతో, శ్రీమతి సరోజ రామకృష్ణ ) 

సోవియట్ యూనియన్  విచ్చిన్నం తరువాత  ఏర్పడ్డ  కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు  ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు,  రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి  లెనిన్  మసోలియం నిర్వహణ వ్యయంకోసం ఇచ్చే  నిధులను నిలుపుచేసింది కూడా.  తదాదిగా,   అభిమానుల విరాళాలతోనే   నెట్టుకు వస్తున్నారు.
మసోలియం తెరిచి వుంచే  సమయాన్ని కూడా  బాగా తగ్గించారు. అయినా సందర్శకుల  సంఖ్య  తగ్గలేదు. భద్రతా కారణాల రీత్యా,  రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న  ఆంక్షల  వల్ల కూడా  లెనిన్ మసోలియం  సందర్శన  అనేది ఇప్పుడంత సులువయిన వ్యవహారం కాదు.
గత ఎనభై ఎనిమిది ఏళ్లుగా మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే  అపూర్వం. ఇన్నేళ్ళ నుంచి,  క్రమం తప్పకుండా ప్రతివారం  నిపుణులు లెనిన్ పార్ధివ  శరీరాన్ని  ప్రత్యేకించి చర్మాన్ని  చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడిబారకుండా తగిన  జాగ్రత్తలు తీసుకుంటారు.
పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ కాయానికి   రసాయనాలతో  ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఇందుకోసం రెండు నెలలపాటు సమాధిని మూసివేస్తారు. ఆ సమయంలో  లెనిన్ భౌతికకాయాన్ని నెల రోజులపాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి వుంచుతారు. చర్మం నెమ్మదినెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్ళీ సరయిన రీతిలో  తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తతంగం  ఉద్దేశ్యం.


డాక్టర్ ఇల్యా  జబ్రస్కీ అనే 90 సంవత్సరాల  నిపుణుడు 1934 నుంచి   1952 వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని వున్నవారిలో  వున్నారు.   ఆయన తండ్రి బోరిస్, 1924 లో లెనిన్ మరణించినప్పుడు ఆయన  శరీరాన్ని భవిష్యత్ తరాలకోసం భద్రపరచిన తొలి బృందంలో పనిచేశారు.
ఈ డాక్టర్  చెప్పేదాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు.  మొదటిసారి ఎంబామింగ్  (embalming - రసాయనిక పూత)  చేసినప్పుడే వాటినన్నింటినీ  తొలగించారు. కాకపొతే కనుబొమలు,  మీస కట్టుతల వెండ్రుకలను మాత్రం  యధాతధంగా వుంచేశారు.
పోతే,  లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరేచోట ఖననం చేయాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై  ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. యాభయ్ ఏళ్ళకంటే  తక్కువ వయసున్న రష్యన్లలో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూవుండడం విశేషం. లెనిన్ ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని  తొలగించి  సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపొతే, ఆ  కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో  నాజీల నుంచి  బాంబు దాడి ముప్పు వుండగలదన్న భయంతో ఆ పని చేశారు.
‘లెనిన్ మసోలియం నుంచి ఆయన  శరీరాన్ని  తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక యెంతమాత్రం అనుమతించకూడదు’  అనేవారి సంఖ్య  ఇప్పుడు ఆ దేశంలో  క్రమంగా పెరుగుతోంది.  నిజానికి లెనిన్ కూడా తన తదనంతరం  తన భౌతిక కాయాన్ని ఇలా భద్రపరచాలని  ఎన్నడు  కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన  భార్య  నదేజ్డా కృపస్కయా చేసిన విజ్ఞప్తి  కూడా అదే.  లెనిన్ పేరు మీద ఏవిధమయిన  స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను  ఆవిడ కోరారు.
కానీ, అప్పటి  సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతిక కాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు. దానితో  ఆవిడ సూచనలను  ఎవరూ  పట్టించుకోలేదు.
స్టాలిన్  చొరవతో పనులు శరవేగంతో సాగాయి. ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఒక మసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు.
ఇందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి   ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద  పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా  జారీ అయ్యాయి. అయితే ఇందుకు   చాలా సమయం పట్టేట్టు వుండడం,  లెనిన్ భౌతిక కాయం శిధిలం అయ్యే సూచనలు కానరావడంతో  ఆ ప్రయత్నం మానుకున్నారు. ఎంబామింగ్  చేసి,  రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు.   కొద్ది రోజులపాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం  ఈ విధానం ద్వారా సాధ్యం. ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ. కానీ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్విత ప్రాతిపదికపై  ఏళ్ళ తరబడి పాడయిపోకుండా  చేయడం యెలా అన్నది ఆనాటికి  కనీవినీ ఎరుగని  విషయం.
ఉక్రెయిన్ లో అనాటమీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్  వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం ఈ బృహత్తర  కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. అంతేకాదు, అసాధ్యం అనుకున్న ఈ పనిని  జయప్రదంగా పూర్తిచేసింది.


అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడడంతో  ప్రభుత్వం చురుగ్గా కదిలింది.  సోవియట్  సైనికులు నిరంతరాయంగా శ్రమించి అరుణ వర్ణం కలిగిన చలువరాతితో మరో మసోలియాన్ని క్రెమ్లిన్ గోడ దాపునే  ఆఘమేఘాలమీద నిర్మించారు. లెనిన్ బౌతిక కాయాన్ని అందులోకి తరలించారు.
1953 లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్  చేసి లెనిన్ మసోలియంలోనే  ఆయన దేహం  సరసనే  భద్రపరిచారు.  ఆ తరువాత కృశ్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతిక కాయాన్ని అక్కడనుంచి తొలగించి  క్రెమ్లిన్ గోడ పక్కన  ఖననం చేశారు.
గోర్భచెవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్ సిన్  ‘రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను  తలపించేదిగా వుండరాదని’  అభిప్రాయపడ్డారు. అయితే,  లెనిన్ శరీరాన్ని అక్కడనుంచి తొలగించడం  అప్పట్లో సాధ్యం కాలేదు.  పుతిన్ మూడో పర్యాయం రష్యా అధినేతగా ఎన్నికయిన  తరువాత మళ్ళీ ఈ మధ్యకాలంలో  ఈ ఆలోచన  కొత్త చిగుళ్ళు వేస్తున్నట్టు అనిపిస్తోంది.
2024 సంవత్సరానికి  కామ్రేడ్  లెనిన్ కన్ను మూసి వందేళ్ళు పూర్తవుతాయి. అప్పటిదాకా ఆగుతారా  లేక ఈ లోగానే  అంతపనీ చేస్తారా – వేచి చూడాలి.

పాతికేళ్ళనాటి మాస్కో - 21

అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు.
ఇటీవల కొందరు అనువాదం గురించి వెల్లడిస్తున్న అభిప్రాయాలు చదువుతున్నప్పుడు నేనూ కొన్ని భావాలను పంచుకోవాలని అనిపించింది.


కీర్తి శేషులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు లోగడ ’అనువాద సమస్యలు’ అనే పుస్తకం రాశారు. నేను పాతికేళ్ళ క్రితం మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని రికార్డ్ చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో మాస్కో ‘రాదుగ’  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఈ మధ్యనే ఆయన చనిపోయారు)  నాకు ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ‘రారా’ గా ప్రసిద్ధులయిన రెడ్డి గారు రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. అనువాద సమస్యలు అన్నింటికీ ఈ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.
నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.

కాబట్టి, రాసేది  అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి.                      

11, మార్చి 2014, మంగళవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 20


ఆస్తాంకినో టీవీ టవర్



అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన ఈ ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి.


మబ్బుల్ని చీల్చుకుని కానవస్తున్న టీవీ టవర్ 


ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.
‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపొతే వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అన్న ఆనిమల్ ఫాం రచయిత సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు అందులో వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి. ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి. కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.   
Courtesy Image owners