26, డిసెంబర్ 2013, గురువారం

ధన్యజీవి



కొద్ది రోజుల తేడాతో  ఇద్దరు అక్కయ్యలు కన్ను మూయడం మొత్తం మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండువారాలు కూడా కాలేదు ఆరో అక్కయ్య ప్రేమక్కయ్య (74) చనిపోయి. వార్త తెలియగానే  మా పెద్దక్కయ్య శ్రీమతి తుర్లపాటి సరస్వతి హుటాహుటిన కారులో తన వయస్సును కూడా (84) లెక్కపెట్టకుండా  ఆమెను చూడడానికి బెజవాడ నుంచి హైదరాబాదు వచ్చింది. తన కళ్ళముందే చిన్నవాళ్ళు దాటిపోతున్నారని గొల్లుమంది.



(శ్రీమతి తుర్లపాటి సరస్వతి)

 ఏమయిందో యేమో మూడో  రోజున ఆయాసంగా వుందంటే ఆస్పత్రిలో చేర్పించారు. అటునుంచి అటే ఐ.సీ.యూ, తరువాత వెంటిలేటర్ ఈ ఉదయం కల్లా అంతా అయిపోయింది. ప్రేమక్కయ్య పన్నెండో రోజుకు వచ్చిన బంధుగణం అంతా సరసక్కయ్య అంతిమ ఘడియలను చూడాల్సి వచ్చింది. ఎవరితో చేయించుకోకుండా పెద్ద ప్రాణం దాటిపోయింది. పెనిమిటి శ్రీ తుర్లపాటి హనుమంతరావు గారు చనిపోయిన నాటి నుంచి ఈ రెండేళ్లుగా సరసక్కయ్య ప్రాణం ఆయనకోసమే కొట్టుకుంది. దాదాపు డెబ్బయ్  ఏళ్ళ  దాంపత్య అనుబంధం. అందుకే ఆయనలేని లోకంలో ఎక్కువ కాలం మనలేకపోయింది. రోగం రొష్టు అంటూ పిల్లల్ని బాద పెట్టకుండా, తాను బాధ పడకుండా మా బావగారిని వెతుక్కుంటూ పైలోకాలకు వెళ్ళి పోయింది. ధన్యజీవి. నా వంటి ఎంతోమందికి అక్షరభిక్ష, అన్నభిక్ష పెట్టిన ఆదర్శ దంపతులు. వారికి నా నివాళులు. 

25, డిసెంబర్ 2013, బుధవారం

HAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS



HAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS

24, డిసెంబర్ 2013, మంగళవారం

పడగొట్టినా నిలబడతాం


యు ఎస్ ఎస్ న్యూయార్క్

పేరు చూడగానే ఇది అమెరికా నౌక అనితెలిసిపోతూనే వుంది. కాకపోతే,   ఇది ఆదేశం తాజాగా నిర్మించుకున్న ఓ  యుద్ధనౌక. ఉగ్రవాదుల పీచమణిచే లక్ష్యంతో అమెరికా రూపకల్పన చేసిన నౌకల శ్రేణిలో ఇది అయిదవది. ఈ భారీ యుద్ధ నౌకలో 360  మంది నావికులు, 700  మంది నౌకా సైనికులు అధునాతన యుద్ధ సామగ్రి, పరికరాలతో సదా సిద్ధంగా వుంటారు.
అన్ని యుద్ధ నౌకల్లో ఇదొకటి అనుకోవచ్చుకానీ దీనికొక ప్రత్యేకత వుంది. దీని నిర్మాణంలో సుమారు ఇరవై నాలుగువేల టన్నుల ఉక్కును   ఉపయోగించారు. అందులో మాత్రం విశిష్టత ఏముంది అనిపించవచ్చు. అలా వాడిన ఉక్కు ఒక్కటే  ఈ నౌకకు ఇంతటి  ప్రత్యేకతను సమకూర్చిపెట్టింది. పదమూడేళ్లక్రితం ఉగ్రవాదుల ముష్కర దాడిలో నేలమట్టం అయిన న్యూ యార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట హర్మ్యాల నిర్మాణంలో వాడిన ఉక్కు, ఇనుములనే సేకరించి, కరిగించి  వాటితో  ఈ యుద్ధ నౌకను నిర్మించారు. నౌకను తయారుచేసిన కర్మాగారానికి ఆ ఉక్కు శకలాలను తీసుకుని వచ్చినప్పుడు అక్కడి పనివారు దానిని చూసి నాటి ఘోర దృశ్యాలను తలచుకుని విచలితులయ్యారని నేవీ కెప్టెన్ కెవిన్ వెన్సింగ్ చెప్పారు. కరిగించిన ఆ ఉక్కును చేతితో తాకినప్పుడు ఉద్వేగంతో తన వొంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఫౌండ్రీ ఆపరేషన్స్ మేనేజర్ జూనియర్ షావర్స్ గుర్తుచేసుకున్నారు.


‘ఈ నౌకను చూస్తున్నప్పుడు మా అందరికీ ఒక విషయం స్పురణకు వస్తుంది. అవును ‘వాళ్లు’ నేలమట్టం చేయగలిగారు. కానీ మమ్మల్ని ఆ నేల మీదనే ఎల్లకాలం వుంచలేరు. మళ్ళీ లేచి నిలబడతాం. ఈ నౌకే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.’
సముద్ర జలాల్లో ఠీవిగా నిలబడిన ఆ నౌకను చూస్తూ అన్నారాయన.

(శ్రీ పీవీవీజీ స్వామి గారు పంపిన మెయిల్ ఆధారంగా -  ఫోటోగ్రాఫర్ కు కృతజ్ఞతలు)

పద్మ'ఛీ'లు

'పద్మశ్రీ వెనక్కి ఇవ్వండి' - వార్త
పంచ్ డైలాగులకు అలవాటుపడ్డ సినిమా వాళ్ళతో కాస్త జాగ్రత్త. 'పద్మశ్రీ ఇచ్చిన వారికే తిరిగి వాపసు ఇస్తాం , ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ఫంక్షన్ పెట్టండి మీడియాను పిలవండి'అన్నా అనగలరు. - వ్యాఖ్య 

23, డిసెంబర్ 2013, సోమవారం

తానే మారునా!........



'చీపిరి యెంత గొప్పదయినా దాన్ని పట్టుకుని వూడ్చేది చెయ్యే కదా అనేది 'ఆ చెయ్యి' ధీమా!



(Courtesy Cartoonist)



బల్బు మాడింది


శంకరం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే ఏడేళ్ళ బుడుగు తండ్రిని అడిగాడు.
నేను ఇక్కడికి ఎక్కడినుంచి యెలా  వచ్చాను?’
శంకరానికి ముందా ప్రశ్న అర్ధం కాలేదు. అర్ధం అయినతర్వాత దానికి జవాబు ఏం చెప్పాలో ఓ పట్టాన అర్ధం కాలేదు.
తల్లి గర్భంలోనుంచి పిల్లలు యెలా వస్తారో  చెప్పే ఈడు  కాదు పిల్లాడిది. అందుకే సమాధానం చెప్పకుండా దాటవేద్దామనుకున్నాడు. వాడి వయసా చిన్నది. కొన్నేళ్ళు పోతే వాళ్ళకే తెలుస్తుంది అనుకునే సంస్కృతి ఇంటావంటా వొంటబట్టించుకున్న కుటుంబమాయె.
కానీ కాసేపటి తరువాత శంకరం మనసు మార్చుకున్నాడు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా బూజు పట్టిన పాత సంస్కృతినే పట్టుకుని వేలాడితే యెలా అని కూడా అనుకున్నాడు. అందుకే స్త్రీల  గర్భధారణ గురించీ, నవమాసాలు మోసి బిడ్డను కనే దాకా అతడు ఎక్కడినుంచి భూమిమీదకు యెలా వచ్చాడో అంతా అరటిపండు వొలిచి చెప్పినట్టు పిల్లాడికి చెప్పేసి అమ్మయ్యఅనుకున్నాడు. తను అందరిలాటి తండ్రిని కాదు కొంత స్పెషల్ అని కూడా అనుకున్నాడు.
మరి కాసేపటికి బుర్రలో బల్బ్ వెలిగింది.
వున్నట్టుండి బుడుగు ఎందుకా ప్రశ్న వేసాడు. అదే అడిగాడు.
ఏం లేదు నాన్నా! నిన్న మన పక్క వాటాలో దిగిన సుందరం అంకుల్ పిల్లాడిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అమలాపురం నుంచి అన్నాడు. దాంతో మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలని నిన్నడిగాను. అంతే!
బుడుగు జవాబుతో  శంకరం బుర్ర గిర్రున తిరిగింది.



(నెట్లో కానవచ్చిన ఇంగ్లీష్ ఆర్టికిల్ ఆధారంగా) 

NOTE: Courtesy Image owner

ఈరోజు పీవీ తొమ్మిదో వర్ధంతి - ఓ జ్ఞాపకం

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులుఅనధికారులుమందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమాఅన్నట్టు వుండేది.



మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండిఅన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా!అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.