22, డిసెంబర్ 2013, ఆదివారం

కోతి వీసా



అనగనగా ఒక వూరు. ఆ వూర్లో ఓ జంతు ప్రదర్సన శాల.

అసలే ఇది చిట్టిపొట్టి కధ. ఈ కధలో పదేపదే వచ్చే ఈ పదాన్ని అలా సాగదీసి రాయడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ల భాషలో పొట్టిగా జూఅనుకుందాము.

ఆ జూ లోని ఓ బోనులో జూలు బాగా పెంచుకున్న ఓ సింహం వుంది. రోజుకు కనీసం ఓ కిలో మాంసం కూడా తన మొహాన విదల్చడం లేదని ఆ జూ అధికారులపై దానికి తగని కోపం. జూలు విదిల్చి, కాలు దువ్వాలని వుంది కానీ  ఏం లాభం.  తానున్నది అడవి కాదాయే. పైగా ఆ జూ అధికారులు అడవి జంతువులకన్నా క్రూరులు.  వాళ్లకు తిక్క తిరిగిందంటే దొంగలెక్కలు రాసి ఆ మాత్రం మాంసం కూడా పెట్టకుండా తన డొక్క మాడ్చగల సమర్ధులన్న సంగతి ఆ మృగ రాజుకు తెలుసు. అందుకే అనువుగాని చోట అధికులమనరాదుఅన్న నీతి వాక్యం ప్రకారం మిన్నకుండి పోయింది.

కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలవదు. దాని గోడు విన్న తధాస్తు దేవతలు కరుణించారేమో తెలియదు. ఏదయితేనేమి, దుబాయిలో వున్న ఓ జూ అధికారి   రోజు ఈ జూ చూడడానికి వచ్చి, తగిన ఆహారం లేక చిక్కిపోయిన ఈ సింహాన్ని చూశాడు. ‘చక్కనమ్మ చిక్కినా అందం’ అనుకున్నాడేమో దాన్ని తన దుబాయ్ జూ కు తీసికెళ్ళాడు.

ఎమిరేట్స్ విమానం ఎక్కిన దగ్గరనుంచి సింహానికి ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఆ దేశంలో జూలన్నీ సెంట్రల్ ఏసీ అని ఎవరో చెప్పగా విన్న సంగతి గుర్తు వచ్చి దాని వొళ్ళు పులకరించి పోయింది. ఎంచక్కా చల్లటి బోనులో కూర్చుని దుబాయ్ జూ అధికారులు రోజూ ఆహారంగా పెట్టే ఒకటి రెండు మేకలను కడుపారా తింటూ కడుపులో మాంసం  కదలకుండా కాలక్షేపం చేసే సన్నివేశాలను వూహించుకుంటూ ఆ సింహం దుబాయ్ జూ చేరుకుంది.

అది కలలు కన్నట్టే దానిని ఒక ప్రత్యేక బోనులో వుంచారు. నీటుగా దుస్తులు ధరించిన జూ పనివాడు ఒకడు పొద్దున్నే వచ్చి చాలా నీటుగా ప్యాక్ చేసిన ఆహారం పొట్లాన్ని అందించాడు. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటూ సింహం ఆత్రంగా ఆ పాకెట్ విప్పింది. అందులో మూడు నాలుగు అరటి పండ్లు వున్నాయి. అసలే పరాయి దేశం - భాష అర్ధం కాక పొరపడ్డారేమోనని మొదటి రోజు సర్దిచెప్పుకుంది. కానీ రెండో రోజూ, ఆ మరునాడు కూడా పనివాడు అరటి పండ్లే పెట్టడంతో సింహానికి తిక్కరేగింది.



పండ్లు పట్టుకుని వచ్చినవాడిని నిలబెట్టి దులిపేసింది.

ఏం ఇక్కడ మీ అందరికీ నన్ను చూస్తే తమాషాగా వుందా. నేనెవరనుకుంటున్నారు. మొత్తం అడవికే రాజుని. అరటి పండ్లు తినడానికి నేనేమన్నా కోతి ననుకుంటున్నారా?’ అని గాండ్రించింది.

అయితే, సింహం గాండ్రింపులకు బెదిరిపోవడానికి ఆ జూ పనివాడు అడవిలో ఏనుగు కాదు కదా. అందుకే అతగాడు తాపీగా జవాబు చెప్పాడు.

నువ్వు సింహానివన్న విషయం ఇక్కడ పుట్టిన పిల్లులకు కూడా తెలుసు. కాకపోతే నిన్నిక్కడికి కోతివీసా మీద తీసుకొచ్చిన సంగతే నీకు తెలిసినట్టు లేదు

నీతి:

పరాయి దేశంలో కోతిగా వుండడంకన్నా మాతృదేశంలో సింహంగా బతకడం మేలు.

Note: Courtesy Image Owner 

శ్రీ తిరుమల రామచంద్ర గారి శత జయంతి


నా వయస్సు అరవై ఎనిమిది. అంటే నేను పుట్టకమునుపే ఆయన విఖ్యాత పత్రికల్లో జర్నలిష్టు. ఒకటి రెండు భాషల్లో అరకొర అభినివేశం నాదయితే అనేక భాషల్లో మంచి పట్టు సాధించిన ప్రజ్ఞాశీలి వారు. ఎక్కడో ఏదో జెర్రి పోతంత అదృష్ట రేఖ కనీ కనబడకుండా వుందేమో. లేకపోతే నేనేమిటి ? అంతటి పండిత ప్రకాండుడి శత జయంతి సందర్భంగా ఈరోజున జరిగే ఓ సమావేశానికి అధ్యక్షత వహించడం ఏమిటి? పెట్టిపుట్టకపోతే ఇలాటిది సాధ్యమా!


తిరుమల రామచంద్ర గారి గురించి చెప్పడం ఆయనకే సాధ్యం అని నా నమ్మకం. తనని గురించి తాను చెప్పుకున్నా అందులో సొంత గొప్పలు కనబడవు. పైగా మానవ సహజమైన బలహీనతలను కూడా ఆయన ఎంతమాత్రం భేషజాలకు పోకుండా నిర్భీతిగా రాసుకున్నారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి ఇదే గీటురాయి.
పుట్టిన వందేళ్ళ తరువాత ఆయన్ని గుర్తుంచుకుని వేడుక చేస్తున్న సందర్భం ఇది. ఈ పుణ్యం కట్టుకున్నవాళ్ళు బహుధా అభినందనీయులు. ఎందుకంటే – అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నట్టు రామచంద్ర గారు జీవించి వుండగా వారికి ‘షష్టిపూర్తి జరగలేదు. సప్తతి లేదు. అశీతి అసలే లేదు. సహస్ర చంద్ర దర్శన ఉత్సవం సమకూడలేదు. పూర్ణ జీవితం అనుభవించి కూడా రామచంద్రగారు త్రిదశుడు’ అన్నారు అక్కిరాజువారు. అంటే ఏమిటట. ఎప్పుడూ ముప్పయ్యేళ్ళవాడిగానే జీవించారట. బాల్య, కౌమార, యవ్వన, నిర్మల, నిర్భర, నిరంతర, సమధికోత్సాహ మనస్విత తోనే ఆయన ఎనభై నాలుగేండ్ల జీవితాన్ని యదృచ్చాలాభ సంతుష్టంగానే గడిపారని అద్భుతమయిన కితాబు ఇచ్చారు.
కొందరు కొన్నిట్లో తమ ప్రతిభ కనబరుస్తారు. కానీ రామచంద్రగారో. ఆయన వేలు పెట్టని రంగం లేదు. పత్రికా రచయిత, కవి, గ్రంధకర్త, విమర్శకుడు, బహుభాషా కోవిదుడు. అంతేనా అంటే అంతే  కాదు. పదం బాగాలేదేమో కాని ఆయన దేశదిమ్మరి. ఆయనలా వూళ్ళుపట్టుకుని తిరిగిన జర్నలిష్టు మరొకరు కనబడరు. జీవిక కోసం ఆయన ఎత్తని అవతారం లేదు. అనంతపురం జిల్లాలో ఓ మారుమూల కుగ్రామం రాఘవం పల్లి(రాగంపల్లి) లో పుట్టి, నాటి బళ్ళారి జిల్లా ఆనెగొందిలో ప్రాధమిక విద్య, తిరుపతి దేవస్థానం కళాశాలలో చదువు, నెల్లూరు ఆయుర్వేద కళాశాల, చెన్నపట్నం మైలాపూర్ కాలేజీ ఇలా ఇలా సాగి లాహోరు, బెలూచిస్తాన్, క్వెట్టా, చమన్ ప్రాంతాలు తిరిగి, కాన్పూర్ లో డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికలో చేరడం వరకు సాగిపోయింది. అంతటితో ఆగితే ఆయన రామచంద్రగారు యెట్లా అవుతారు. హైదరాబాదులో మీజాన్ ఉర్దూ పత్రిక, తరువాత ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక దినపత్రికల్లో చాలాకాలం తన రచనలతో వాటికి ఒక విశిష్టతను తెచ్చిపెట్టారు.
‘హంపీ నుంచి హరప్పా దాకా’ అనే రచనలో తిరుమల రామచంద్ర గారు తన జీవితానుభవాలను రసరమ్యంగా కూర్చారు. ఈ శుభ సందర్భంలో వారికి నా కైమోడ్పు. (22-12-2013)

21, డిసెంబర్ 2013, శనివారం

పాత సన్నిహితులతో కాసేపు....

రాష్ట్ర శాసనమండలి సమావేశాలు వాయిదా పడిన సందర్భంలో మండలి చైర్మన్ శ్రీ చక్రపాణి గారు నిన్న మధ్యాహ్నం మండలి ఆవరణలో పత్రికా విలేకరులకు విందు ఏర్పాటు చేశారు. నేను యాక్టివ్ రిపోర్టింగ్ లో లేకపోయినా పాత సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని వారు స్వయంగా ఆహ్వానించడం వల్ల నేను వెళ్లడం అనేకమంది పాత మిత్రులను కలుసుకోవడం జరిగింది. అవే ఈ చిత్రాలు. వీటిల్లో నా పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య, అనేక సంవత్సరాలుగా సన్నిహిత పరిచయం వున్న మండలి విప్ శ్రీ పద్మరాజు వున్నారు.





PHOTO COURTESY SHRI SALEEM 

కోతి పైలట్



విమానం కూలిపోయింది. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లతో సహా అందులో ప్రయాణిస్తున్నవారందరూ ఈ దుర్ఘటనలో మరణించారు, ఒక్క ఒక కోతి తప్ప. (విమానంలో కోతియేమిటంటే ఇక కధే లేదు)  

దాన్ని ఆసుపత్రిలో చేర్చారు. కాస్త కోలుకున్న తరవాత దుర్ఘటన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఆ కోతిని విచారించడం ప్రారంభించారు. ఈ కధలో మరో  కొత్తదనం ఏమిటంటే ఆ కోతికి మనిషి భాష తెలుసు.



దర్యాప్తు ఇలా సాగింది.

అధికారి: విమానం బయలుదేరినదగ్గరినుంచి అన్ని విషయాలు చెప్పు. అసలేం జరిగింది.

కోతి: ఏముంది ఎయిర్ హోస్టెస్ నాకు పళ్ళూ బిస్కెట్లు పెట్టింది. అవి తింటూ కూర్చున్నాను.

నీ సంగతి సరే! మిగిలినవారు ఏం చేస్తున్నారు?”

సీటు బెల్టులు పెట్టుకున్నారు. మందు కొడుతూ కూర్చున్నారు

పైలట్లు ఏం చేస్తున్నారు?

కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు

తరవాత?”

తరవాత ఏముంది ? ప్రయాణీకులందరూ ఫుల్లుగా మందు కొట్టి, ఎయిర్ హోస్టెస్ లు పెట్టింది తిని నిద్రలోకి జారుకున్నారు

మరి ఎయిర్ హోస్టెస్ లు ఏం చేస్తున్నారు?”

తీరిగ్గా కూర్చుని లిప్ స్టిక్ దిద్దుకుంటూ, మేకప్ సరిచేసుకుంటున్నారు.

పైలట్లు?”

యధామాదిరి కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు.

అది సరే! ప్రమాదం జరగడానికి ముందు ఎవరేం చేస్తున్నారు ?”

ఎయిర్ హోస్టెస్ లు పైలట్లకు ముద్దులు  పెడుతున్నారు.

మరి  పైలట్లు ?”

ఎయిర్ హోస్టెస్ లకు తిరిగి ముద్దులు  పెడుతున్నారు

నువ్వేం చేస్తున్నావు?”

ఒక్కత్తెను ఏం చేస్తాను,  కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నాను.

(నెట్ లో చక్కర్లుకొడుతున్న చిన్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)

 NOTE: Courtesy Cartoonist)

కాంగ్రెస్ నేర్చుకోని నీతి పాఠం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది?

కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా! అని అభయం ఇచ్చింది.


అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.



(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన అప్పుడు ఇప్పుడుగ్రంధం నుంచి)

తిరుక్షవర సేవలో....



(పిల్లలకు చెడ్డీలు మార్చినంత సులభంగా రాజకీయనాయకులు పార్టీలు మార్చగలరన్న అపవాదును రాజకీయనాయకులు మోస్తున్నారు. దీనికి తోడు  ‘ఈ దేశంలో ప్రతిదీ తమ సొంతం , ప్రతిదీ తమకు ఉచితం’ అనే భావన వారిలో ప్రబలిపోయిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి  సంకేతంగా నెట్లో ఇంగ్లీష్ లో  ప్రచారంలోవున్న  ఓ కధనం  నా తెలుగులో మీకోసం)


“క్షవరం చేయించుకుందామని పువ్వులమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఓ రోజు ఓ క్షవరశాలకు వెళ్లాడు. పని పూర్తయిన తరవాత డబ్బులు ఇవ్వబోయాడు. ఈ వారం రోజులూ నేను నా తోటివారికి నా చేతనయిన సర్వీసు ఉచితంగా చేద్దామనుకుంటున్నాను. అందువల్ల డబ్బులు తీసుకోనుఅని అతగాడు మృదువుగా తిరస్కరించాడు. ఆ మాటలకు ముగ్ధుడయిన ఆ పూల వ్యాపారి అక్కడినుంచి నిష్క్రమించాడు. మరునాడు క్షురకుడు తన దుకాణం వద్దకు వెళ్లేసరికి అందంగా తయారు చేసిన పూల బొత్తి షాపు ముందు కనిపించింది. మీ సేవకు ధన్యవాదాలుఅని దానికో చీటీ పెట్టివుంది.
“తరువాత, ఆ షాపుకు ఓ పోలీసు వచ్చాడు. బిల్లు చెల్లించబోయేటప్పుడు అతడికి కూడా అదే సమాధానం వచ్చింది. ఈ వారమంతా అందరికీ ఉచిత సేవ అందించాలన్న నిర్ణయానికి అనుగుణంగా డబ్బులు తీసుకోనని క్షురకుడు తెగేసి చెప్పాడు. మరునాటి ఉదయం అతడు దుకాణం తెరవడానికి వచ్చినప్పుడు ఆ పోలీసు పంపిన ధన్యవాదాల సందేశం, దానితో పాటు అతడి ఇల్లాలు స్వయంగా తయారు చేసిన మిఠాయిలు కనిపించాయి. 
“ఆ మరునాడు, ఘనత వహించిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు క్షవరం చేయించుకుందామని ఆ దుకాణానికే వెళ్లాడు. క్షురకుడు యధావిధిగా డబ్బులు తీసుకోకపోవడానికి కారణం ఆయన గారికి నివేదించుకున్నాడు. ఈ వారమంతా ఉచిత సేవ చేయాలని అనుకున్నానని పార్లమెంటు సభ్యుడితో చెప్పాడు. అస్తమానం ప్రజాసేవలో తరించే ఆ ప్రజా ప్రతినిధి ఆ మాటలు విని ఎంతో మురిసిపోయి వెళ్లి పోయాడు.
“మరుసటి రోజు ఉదయం క్షురకుడు తన దుకాణం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బారులు తీరి జనం కనబడ్డారు . విచారిస్తే తెలిసినదేమిటంటే వారంతా గౌరవ పార్లమెంటు సభ్యులేనని. ఉచితంగా దొరికే క్షవర సేవను అందుకుందామని వచ్చారని. తీరిగ్గా విచారించడమే ఇక అతగాడికి మిగిలింది”
సాధారణ జనాలకు, వారిని పాలించే రాజకీయ నాయకులకు - మనస్తత్వాల్లో స్తూలంగా వున్న తేడాను ఎత్తిచూపుతూ వెలువడిన ఈ కధనం ముక్తాయింపు ఇలా వుంది.

“చంటి పిల్లలకు వాడే డైపర్’ లనూ, రాజకీయనాయకులనూ తరచూ మారుస్తుండడం చాలా అవసరం” 
NOTE: Courtesy Cartoonist 

20, డిసెంబర్ 2013, శుక్రవారం

ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావు


(దేవుడ్ని నమ్మని శ్రీ నరిసెట్టి ఇన్నయ్య గారికి, దేవుడ్ని నమ్మే నాలాటి వారికి ఇది అంకితం)
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు. నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి మొక్కితే సాయి. అంతా నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని నమ్మని గోరాగారు దేవుడు లేదుఅనేవాడు. లేదుఏమిటండి లేడుఅనాలిగా అంటే అసలు ‘లేని’ వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే ఏమిటని ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో,పుట్టలో అంతటా నేనేఅన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.

సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.