9, నవంబర్ 2013, శనివారం

ఇదో చిత్రం



తెలతెల్లారుతున్నప్పుడు, కంటున్న  కలలకు తెరపడుతున్నప్పుడు,  కళ్ళు తెరవాలంటే తగని బద్ధకం. ఇంకాసేపు అలాగే  పడుకోవాలని, నిద్ర పోవాలని తెగ అనిపిస్తుంది. ఇక  మధ్యాహ్నం భోజనం చేసీ చేయగానే ఓ కునుకు తీయాలని చావుకోరిక పుడుతుంది. కాని  అదేవిటో చిత్రం,  రాత్రి వేళ మాత్రం అర్ధరాత్రి బాగా  పొద్దుపోయిన తరువాత కూడా నిద్రపట్టి చావదు.


8, నవంబర్ 2013, శుక్రవారం

ఏవీఎస్ అనే మూడక్షరాలా! తుత్తి అనే రెండక్షరాలా !!


మూడయితేనేం రెండయితేనేం ఈ రెండూ ఇప్పుడు లేవు. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అనే నవ్వుల రేడు మనల్ని విషాదంలో ముంచేసి ఎక్కడో ఎవ్వరో ఎవరికీ తెలియనివారిని నవ్వులతో ముంచేయడం కోసం ఈ రోజు అర్జంటుగా ఎవ్వరివద్దా   సెలవు తీసుకోకుండానే వెళ్ళిపోయారు.


నేను పనిచేసిన ఆంధ్రజ్యోతిలోనే ఆయనా నా తరువాత పనిచేశారు. నేను నమ్మిన నవ్వుల్నే ఆయన అఖిలాంధ్ర లోకానికి పంచిపెట్టాడు. ప్రెస్ క్లబ్  ఫంక్షన్ కు పిలవగానే వచ్చి, పిలవకుండానే ఆపక్కనే  వున్న మా ఇంటికి వచ్చి ఆ రాత్రి నవ్వుల పువ్వులు పూయించి వెళ్లారు.
ఎవీఎస్ ఒక జర్నలిస్టు. ఒక హాస్య రచయిత. ఒక మిమిక్రీ కళాకారుడు. ఒక రాజకీయ వ్యాఖ్యాత. అన్నింటికీ మించి ఒక మానవతావాది.
మంచివాళ్ళంటే ఆ దేవుడికి ఇష్టం. ఏవీఎస్ లాటి మనుషులంటే మరీ  ఇష్టం. ఆయన చెప్పే ‘తుత్తి’ జోకులంటే మరీ మరీ ఇష్టం. అందుకే చెప్పాపెట్టకుండా ఈ పయనం.
ఆయనకు నా శ్రద్ధాంజలి. 

(08-11-2013) 

చాయ్ పట్టుకొచ్చిన ముఖ్యమంత్రి అంజయ్య


‘అంజయ్య గారితో నా అనుభవాలు’ చదివిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ  మరో జ్ఞాపకాన్ని తట్టిలేపారు.
అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో -  రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గురించి ఆకాశవాణి  ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దానికి  ముఖ్యమంత్రి సందేశం కూడా జోడిస్తే బాగుంటుందని రేడియో అధికారులు భావించారు.   రికార్డింగ్ యూనిట్  తీసుకుని, అప్పుడు ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్న గోపాలకృష్ణ, నేనూ కలసి   ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాము. మాటా మంతీ మధ్య అంజయ్యగారు ఎవర్నో పిలిచి అందరికీ చాయ్ తెమ్మని చెప్పి మళ్ళీ కబుర్లలో పడిపోయారు. రికార్డింగ్ కూడా పూర్తయింది.  కాని,  చాయ్ రాలేదని గ్రహించిన అంజయ్యగారు తానే లేచి వెళ్ళి మా అందరికీ ట్రేలో తేనీరు తెచ్చి ఇచ్చారు. ‘ఎలాటి భేషజాలు లేని ముఖ్యమంత్రిని చూడడం తన సర్వీసులో అదే మొదటిసారి’ అని గోపాలకృష్ణ పదే  పదే గుర్తుచేసుకుంటూ వుండేవారు.

(08-11-2013)

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 2


పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. వినిపించవచ్చు.
ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా  సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై.  అబ్ ఆప్  వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే
ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీమక్తర్ (వసీం అక్తర్) చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది.  నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. ఉర్దూ లో అ ఆలు తెలియకపోయినా ఆయనకు అభిమానిగా మారాను. నాకు ఉర్దూ రాదు కాని వసీమక్తర్ కు తెలుగు తెలుసు. పొడి పొడి మాటల్లోనే భావం అర్ధం అయ్యేలా చెప్పేవాడు. ఇక వార్తలు సరేసరి. ముందే చెప్పినట్టు సంగీతం వింటున్నట్టుగా వుండేది. దురదృష్టం ఏమిటంటే ఇటువంటివారి ఫోటోలు దొరక్కపోవడం. వసీమక్తర్ చనిపోయిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎంతోమంది ఆయన్ని కడసారి చూడడానికి వచ్చారు. వాళ్ళల్లో అన్ని మతాల వాళ్లు వున్నారు. వసీమక్తర్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకురావడం ఆయన్ని గురించిన మరో జ్ఞాపకం.
కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది. ఆ అదృష్టం నాకు దక్కింది.

ఈ అనుభవాల సమాహారమే ఈ వ్యాస పరంపర. 
(08-11-2013)   

గాంధీగారి కోతులు


"చెడు కనం, చెడు వినం, చెడు మాట్లాడం" ఇది గాంధీ గారి కాలం నాటి కోతుల మాట.
కానీ ఇవి ఇప్పటి కాంగ్రెస్  కోతులు. వీటి రూటే సపరేటు.


'మాలో ఒకరు చెడు కనరు, మరొకరు చెడు వినరు, ఇంకొకరు చెడు మాట్లాడరు. అయితే నలుగురికీ తెలియని అసలు విషయం ఏమిటంటే -  మాలో చెడు కనని కోతి చెడు వింటుంది, మాట్లాడుతుంది. చెడు వినని కోతి చెడు  కంటుంది, మాట్లాడుతుంది కూడా.  చెడు  మాట్లాడని కోతి వింటుంది, కంటుంది. ఇక మేం ముగ్గురం కలసి విన్నది, కన్నది, మాట్లాడింది ఆ చెడునంతా సమానంగా పంచుకుంటాం. పంచిపెడతాం.
అసలు సిసలు కాంగ్రెస్ కోతులం అన్నమాట. నేటి కాంగ్రెస్ కు అసలైన వారసులం అన్నమాట."  (08-11-2013)

(NOTE: PHOTO CREDIT GOES TO THE OWNER) 

7, నవంబర్ 2013, గురువారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 1


ఏ ముహూర్తాన మార్కొనీ మహాశయులు రేడియో కనిపెట్టారో కాని అనేక దశాబ్దాలపాటు అది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఇళ్ళల్లో అదో అపూర్వ వస్తువుగా వెలిగిపోయింది. కాలక్రమంలో వచ్చిన మార్పులనే  కారుమబ్బుల క్రీనీడల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతూ ఉనికిని కాపాడుకునే విఫల ప్రయత్నం చేస్తున్న రేడియో కదాకమామిషు:

మొత్తం దేశం సంగతి యేమో కాని దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. ఆయనే  రావు బహదూర్ సీ.వీ. కృష్ణ స్వామి సెట్టి.  1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. తొలిసారి విమానం ఎక్కిన భారతీయుల జాబితాలో పేరు దక్కిచ్చుకున్న వ్యక్తి. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు.  1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై  31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. కాకపొతే ఇది మూడేళ్లలోనే మూతపడింది. అయితే  కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది.   కాని ఆ పరిమిత ప్రసారాల్లో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవనీ ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ ఉవాచ. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం  కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు  చిత్తూరు, వేంకటగిరి మొదలయిన  చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని గోపాలకృష్ణ ఒక వ్యాసంలో రాశారు.



(1920 ప్రాంతంలో రేడియో వినడానికి  ఇంత శ్రమ పడేవారు) 

NOTE: COURTESY OWNER OF THE PHOTOGRAPH 

6, నవంబర్ 2013, బుధవారం

పార్టీలు వేరయినా ‘వరస’ ఒక్కటే!


పార్టీలు వేరయినా ‘వరస’  ఒక్కటే!
రాష్ట్ర విభజన అనండి రాష్ట్ర సమైక్యత అనండి – నిప్పూ ఉప్పూ మాదిరిగా ఏమాత్రం పొసగని  అన్ని పార్టీలదీ ఒక్కటే మాట - అదే చిత్రం! అదే విచిత్రం! కావాలంటే ఆయా పార్టీల నాయకులు తరచుగా చెప్పే  మాటలు ఓసారి  గమనించండి. అర్ధమై పోతుంది.
“కేవలం మా పార్టీని ఇరుకున పెట్టడానికి అవతలి పార్టీలు కుమ్మక్కై చేస్తున్న ఆరోపణ ఇది.  ఆ రాజకీయ పార్టీలన్నిటిది  ఒకటే లక్ష్యం.  వోట్లు, సీట్లు. ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకోవడం యెలా అన్న యావ తప్పితే వాటికి ఈ విషయంలో మా మాదిరిగా ఎంతమాత్రం  చిత్తశుద్ధి లేదు.”
ఈ మాటలు చెప్పింది, చెప్పేది  ఏ పార్టీ అన్నది, ఏ పార్టీవారన్నది అసలు లెక్క లోకే  రాదు. ఎందుకంటే తిరగేసి మరగేసి అందరూ ఏకధాటిగా వినిపించే వాదనల  సారాంశం ఇదే.  కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐ,,  ఇలా ఏ పార్టీ వారిదయినా ఒకటే స్వరం. ఒకటే రాగం. పల్లవులే వేరు,  ‘దారులు వేరయినా వారి బారులొక్కటే’ అన్న చందంగా.       
(ఇందుకు సీపీయం మినహాయింపు. ఎందుకంటే వారిది మొదటి నుంచీ  ఒకటే మాట – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని.  టీ.ఆర్.ఎస్. వాళ్లకు కూడా ఈ మినహాయింపు  కొంత వర్తిస్తుంది ఎందుకంటే ఆ పార్టీ  పుట్టిందే వేర్పాటు నినాదంతో కాబట్టి. వారికి మరో మాటా బాటా లేదు కాబట్టి)

నమ్మకం కుదరాలంటే  ఏదో ఒకరోజు ఉదయం కాస్త మనస్సు ఉగ్గపట్టుకుని  టీవీ చర్చలు చూడండి.
(06-11-2013)