2, అక్టోబర్ 2013, బుధవారం

సలాం రేడియో


తెలుగు రేడియో వార్తలకు డెబ్బయ్ అయిదేళ్ళు. ఇందులో ముప్పయ్యేళ్లకు పైగా నేను ఆ వార్తావిభాగంలో  పనిచేసాను. నిజంగా నన్ను నేను అభినందించుకోవాల్సిన విషయమే! సెహభాష్ శ్రీనివాసరావు.


(దేవులపల్లి అమర్)


ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్లో షరా మామూలు రాజకీయ చర్చలు ప్రారంభించడానికి  ముందు, కార్యక్రమ సమర్పకులయిన శ్రీ దేవులపల్లి అమర్,  ప్రజాశక్తి పత్రికలో ప్రచురించిన  ఈ విషయాన్ని ప్రస్తావించి రేడియో వార్తలు గురించి రెండు ముక్కలు మాట్లాడానికి అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషం అనిపించింది. థాంక్స్ అమర్.
75 వసంతోత్సవాన్ని న్యూ ఢిల్లీ లో ఆకాశవాణి వారు నిన్న నిర్వహించారు.  1938 లో తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఆలిండియా రేడియో వార్తాప్రసారాలు మొదలు పెట్టింది. ఈ భారతీయ భాషల్లో చిరకాలం వార్తలు చదివిన 14 మంది  సీనియర్ న్యూస్ రీడర్లను ప్రసార భారతి సీ.ఈ.ఓ. జవహర్ సర్కార్ ఘనంగా సత్కరించారు. తెలుగులో వార్తల ఘనాపాఠీలుగా పేరుతెచ్చుకున్న శ్రీయుతులు కందుకూరి సూర్యనారాయణ, డి.వెంకట్రామయ్య, ఏడిద గోపాలరావులను సన్మానించారు. వయోభారం కారణంగా శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.


రేదోయోకు, రేడియోలో పనిచేసిన, ఇంకా చేస్తున్నవారికి గుర్తింపు, గౌరవం క్రమంగా తగ్గిపోతున్న రోజుల్లో ఈ పేరుతొ అయినా గుర్తుచేసుకున్న ఆకాశవాణి వారు అభినందనీయులు.
సలాం రేడియో.
(02-10-2013)         


1, అక్టోబర్ 2013, మంగళవారం

చదివి వొదిలెయ్యండి మహా ప్రభూ!


అనగనగా ఓ అరబ్  షేక్. అతనిదగ్గర కుప్పలుకుప్పలుగా డబ్బుతో పాటు  పిడికెడు గుండె కూడా వుందని రుజువు చేస్తూ,  అదో రోజు చెప్పాపెట్టకుండా లబ్ డబ్ అని గబగబా కొట్టుకోవడం మానేసింది. షేకా మజాకా!  ఆయన్ని అమాంతం హెలికాప్టర్లో తీసుకువెళ్ళి ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. ఓ పెద్ద డాక్టర్ వచ్చి చూసి వెంటనే గుండెకు ఆపరేషన్ చేయాలన్నాడు. డాక్టర్ తలచుకుంటే ఆపరేషన్ కు అడ్డేముంది.
ఆయన అలాతప్పా షేక్ కాదు. అల్లాగే ఆయన రక్తం కూడా. ఆ గ్రూపు రక్తం ఇచ్చే దాతకోసం ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. చివరకు స్కాట్లాండ్ పెద్దమనిషి రక్తం, ఇతగాడి రక్తం సరిపోవడంతో ఆ రక్తం ఎక్కించి డాక్టర్లు పని పూర్తిచేశారు. అరబ్ షేకు గారు కోలుకుని ఇంటికెళ్ళి పోయారు. వెళ్ళీ వెళ్ళగానే తనకు రక్త దానం చేసిన స్కాట్లాండ్ పెద్దమనిషికి పెద్దమనసుతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వుత్త మాటలతో కాకుండా ఆ ఉత్తరంతో పాటు ఓ ఖరీదయిన బీ ఎం డబ్ల్యూ కారూ, ఓ బుట్టెడు వజ్రాలు, ఓ గంపెడు రత్నాలు కానుకగా పంపాడు. స్కాట్లాండ్ పెద్దమనిషికి మాట పడిపోయింది. ఓ రెండు సీసాలు రక్తం ఇస్తే ఇలా బదులు తీర్చుకున్న అరబ్ షేక్  ఔదార్యాన్ని తలచుకుని షేక్ అయిపోయాడు.
ఇంతలో అరబ్ షేక్ గారికి మళ్ళీ రోగం తిరగబెట్టింది. మళ్ళీ ఆసుపత్రిలో చేర్చారు. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వబోయే సమయంలో వారికి స్కాట్లాండ్ పెద్దమనిషి గుర్తుకువచ్చి రక్తం కోసం కబురు చేశారు. అతడు పట్టరాని ఆనందంతో (విమానంలో) ఎగురుకుంటూ వచ్చి రక్తం ఇచ్చేసి తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిన దగ్గర నుంచీ ఒకటే యావ. కిందటి సారి పంపిన కానుకలే ఎంతో ఎక్కువ. మరి ఈసారి ఏం పంపుతాడో అని ఆత్రంగా ఎదురు చూస్తుండగా ఆ  ఘడియ రానే వచ్చింది. కొరియర్ వాడు వచ్చి ఓ పెద్ద పార్సెల్ అప్పచెప్పి చక్కాపోయాడు.
తెరిచి చూస్తే అందులో కొన్ని ఎండు  ఖర్జూరాలు, ఒక ఉత్తరం వున్నాయి. అందులో ఇలావుంది.
‘రక్తదానం చేసి నా ప్రాణం నిలబెట్టినందుకు కృతజ్ఞతలు. ఏవిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది’
అది చదివిన స్కాట్లాండ్ వాడికి దిమ్మ తిరిగింది. ఇదేమిటి ఇలా జరిగింది అని మధన పడుతుండగానే మరో రోజు అరబ్ షేక్ గారినుంచి మరో ఉత్తరం వచ్చింది.
‘అప్పుడలా ఏమిటి? ఇప్పుడిలా ఏమిటి? అని  బెంగ పడుతున్నావు కదూ. అవును మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు నాలో ప్రవహిస్తున్నది ఆరబ్ రక్తం. రెండోసారి నాలో వున్నది స్కాట్లాండ్ నెత్తురు’
(నెట్లో  డాక్టర్ భరత్ బాబు పోస్ట్ చేసిన ఓ ఇంగ్లీష్ కధ ఆధారంగా)

(01-10-2013)

30, సెప్టెంబర్ 2013, సోమవారం

రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి!


ఏటా గోదారి వొడ్డున జరిగే సంతకు వెళ్లడం అచ్చయ్యకు  అలవాటు. ఒక ఏడాది కొత్తగా కాపురానికి వచ్చిన తన పెళ్ళాం  బుచ్చమ్మను కూడా వెంట తీసుకు వెళ్లాడు..
గోదారి నదిలో లాంచి షికారు చేయాలని బుచ్చమ్మ ఉబలాటం.
‘వామ్మో ఇంకేమైనా వుందా. రూపాయి టిక్కెట్టు. రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి’ అని  అచ్చయ్య  సన్నాయి నొక్కులు.
మరుసటి ఏడూ ఇదే కధ. లాంచి ఎక్కాలని బుచ్చమ్మ. వామ్మో రూపాయి టిక్కెట్టు వద్దని అచ్చయ్య.
ఇలా ఏండ్లు గడిచిపోతున్నాయి కాని బుచ్చమ్మ లాంచి షికారు కోరిక తీరకుండానే వుండిపోయింది.
మళ్ళీ  తిరుణాల రోజులు వచ్చాయి. అచ్చయ్య, బుచ్చమ్మను తీసుకుని వెళ్లాడు.
లాంచీ కనబడగానే బుచ్చమ్మ అడిగింది  మొగుడ్ని.
‘ నాకు డెబ్బయ్ ఏళ్ళు వచ్చాయి కాని,  లాంచి ఎక్కాలన్న చిన్నప్పటి కోరిక మాత్రం  తీరనే లేదు. ఈ ఏడాదన్నా ఎక్కిస్తావాలేదా!’
‘వామ్మో! రూపాయి పెట్టి ఆ లాంచి ఎక్కడం ఎందుకే. వొడ్డున కూర్చుని చూస్తే సరిపోదా! రూపాయంటే రూపాయే! రూపాయంటే మాటలా మరి!’ మళ్ళీ పాత పాటే కొత్తగా పాడాడు అచ్చయ్య.
లాంచీ నడిపే సరంగు మొగుడూ పెళ్లాల మాటలు విన్నాడు.
‘రూపాయి టిక్కెట్టు కొంటే మీ ఇద్దర్నీ లాంచి ఎక్కిస్తాను. కాని ఓ షరతు. తిరిగి వచ్చిందాకా మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు మెదపకూడదు. నోరు తెరిచారంటే ఓ రూపాయి ఎక్కువ వసూలు చేస్తాను’
ఇద్దరూ ఆ షరతుకు వొప్పుకుని లాంచీ ఎక్కారు. ఎక్కిన దగ్గరనుంచి మూగనోము పట్టారు. నోరు తెరిస్తే వొట్టు. భార్య పొరబాటున నోరు విప్పితే రూపాయి డబ్బులకు నీళ్ళు వొదులుకోవాలని  అచ్చయ్య  భయం.
వాళ్లని మాటల్లో పెట్టి మాట్లాడించాలని సరంగు విశ్వప్రయత్నం చేసాడు. బోటును నదిలో గింగిరాలు కొట్టించాడు. కానీ, ఇద్దరూ  కిమ్మిన్నాస్తి.
లాంచి దిగిన తరువాత సరంగు అచ్చయ్యను  అడిగాడు అంత మౌనంగా ఎలావున్నారని.
‘మధ్యలో బుచ్చమ్మ నదిలో పడిపోయింది. అప్పుడు అరచి చెబుదామనుకున్నాను. కానీ, రూపాయంటే రూపాయే!  రూపాయంటే మాటలా మరి’
సరంగుకు నోట మాట పడిపోయింది.

(ఈ ఇంగ్లీష్ కధని పంపిన మోచర్ల కృష్ణమోహన్ గారికి కృతజ్ఞతలు)

దిల్ మాంగే మోర్



రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
‘ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తాను’ అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
‘రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో’
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు’
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
‘పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.’
‘సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి’
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
‘ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను’
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
‘మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి’
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
‘రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా’
మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
‘దిల్ మాంగే మోర్’  

(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం)

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

మళ్ళీ జరిగిన నా పెళ్లి


అరవై ఎనిమిదో ఏట నాకీ సాయంత్రం మరో  పెళ్ళిచేశారు. అదీ మా ఆవిడ సమక్షంలో.
ఈ పుణ్యం కట్టుకుంది ఎవరో కాదు, మా మేనకోడలి మొగుడు రాంపా గారు. రాయడం, రాసిన వాటిని పుస్తకాలు వేయడం వాటిని బంధు మిత్రుల సమక్షంలో ఆవిష్కరించడం అన్నీ ఓ వేడుకగా జరుపుకోవడం ఆయనకో సరదా. కానీ ఈసారి ఆయనకు యెందుకు అనిపించిందో తెలియదు కాని  మాట మాత్రం ముందు  చెప్పకుండా తెలిసిన నలుగుర్నీ  పిలిచి  ఆయన తాజాగా రాసిన ‘కొస విసుర్లు’ ఓ పుస్తకాన్ని నాకు ఏకంగా  అంకితం ఇచ్చేసాడు. పుస్తకాలు అంకితం తీసుకోవడానికి నేను చిన్న సైజు భోజరాజును, కృష్ణదేవరాయల్నీ కాదు. అయినా నన్నే యెందుకు ఎన్నుకున్నట్టు. ఎన్నుకొనెనుబో, ఆ వేడుకను ఓ పెళ్లి మాదిరిగా జరిపి మా దంపతులతో ఏడడుగులు నడిపించి తన కావ్య కన్నికను నా చేతిలో పెట్టి సలక్షణంగా అంకిత మహోత్సవాన్ని నిర్వహించడం యెందుకు. యెందుకు అంటే ఏం చెబుతాం. రాంపా గారి తీరే అంత.


మొత్తానికి ఏమయితేనేం నాలుగు దశాబ్దాల క్రితం  తిరుపతిలో  జరిగిన నా గుళ్ళో పెళ్లిని  ఎవరు చూడలేకపోయారు కాని ఈ రోజు ‘నవ్య’ వారపత్రిక  సంపాదకులు జగన్నాధ శర్మ గారితో సహా రాతల్లో, గీతల్లో చేయి తిరిగిన చాలామంది రచయితలు, కార్టూనిస్టులు అయిన ఘనాపాఠీలు  సాక్షి సంతకాలు చేశారు. అంటే ఈ తతంగానికి ప్రత్యక్ష సాక్షులు అన్నమాట. ఎవరెవరని చెప్పుదు అందరినీ. కానీ వారిలో కొందరు ఎవరయా అంటే- సినీ ప్రముఖులు జనార్ధన మహర్షి, అల్లాణి శ్రీధర్, రచయితలు కవనశర్మ, జీ ఆర్ మహర్షి, పొత్తూరి విజయలక్ష్మి, చిల్లర భవానీ దేవి, శంకర నారాయణ, జేఎల్ నరసింహం, కార్టూనిష్టులు సుభానీ, సరసి, లేపాక్షి, బాచీ, అరుణ్, కృష్ణ, అన్వర్, పినిశెట్టి,  వరంగల్ నుంచి తీరిక చేసుకుని వచ్చిన క్షణం తీరుబడిలేని డాక్టర్ అంజనీదేవి.    
అప్పటి అసలు పెళ్ళికి ఫోటోలు ఎట్లాగు లేవు. ఈ పెళ్లి ఫోటోలన్నా రేపు పోస్ట్ చేస్తారేమో చూడాలి.
షరా మామూలుగానే, ఆవిష్కరణ కార్యక్రమం రాంపా స్టైల్ లోనే జరిగింది. స్టేజి మీద ఓ చిన్న సైజు  గిలక  బావి సెట్టింగు పెట్టారు.  అందులోనుంచి జగన్నాధశర్మ  గారు, సభికుల కరతాళధ్వనుల నడుమ  చేంతాడుతో ‘కొస విసుర్లు’ పుస్తకాన్ని లాగి బయటకు తీశారు.


ప్రసంగాలు లేవు కాని ముచ్చట్లు చెప్పమన్నారు. అవి కూడా ఓ మోస్తరు ఉపన్యాసాల మాదిరిగానే సాగాయి. కాకపొతే వక్తలు మరికాసేపు మాట్లాడితే బాగు అన్నట్టుగా పసందుగా వున్నాయి.  ‘నవ్వుల సాయంత్రం’  అన్న రాంపా ఉద్దేశ్యం నెరవేరినట్టే అనిపించింది.
వచ్చిన సభికుల పేర్లతో చీటీలు రాసి డ్రా తీసి ఎనిమిది మందికి రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలను గుర్తుకు తెస్తూ చిన్న చిన్న ఇత్తడి ఏనుగు ప్రతిమలను బహుకరించడం కొసమెరుపు.

(29-09-2013) 

28, సెప్టెంబర్ 2013, శనివారం

బాబోయ్ హెచ్చార్!


ఉద్యోగంలో చేరి రెండేళ్లు కావస్తోంది. ప్రమోషన్ సంగతి దేవుడెరుగు ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. అలా  అనుకుని, అడగాలనుకుని  హెచ్ ఆర్ మేనేజర్ దగ్గరకు వెళ్లాను. వెళ్ళి ముసిముసి నవ్వొకటి విసిరి మనసులో మాట బయట పెట్టేలోగా ఆయనే ఒక మందహాసం పారేసి కుర్చీలో కూర్చోబెట్టి బాంబు లాటి కామెంటు ఒకటి నా మొహం మీదే పేల్చాడు.
‘చూడండి సుందరరావు గారు మీరు ఆఫీసుకు రాకుండానే జీతం తీసుకుంటున్నారట’
నాకు నోటమాట రాలేదు. ఇదేమిటి ఇలా ఎదురు వచ్చాడు.
మేనేజర్ మళ్ళీ  అడిగాడు
‘చూడండి సుందరరావు గారు ఏడాదికి ఎన్ని రోజులు?’
ఓ పక్క వొళ్ళు మండుతున్నా నెమ్మదిగా జవాబిచ్చాను
365 లేదా కొన్ని సార్లు 366
‘అవునా! మరయితే రోజుకు ఎన్ని గంటలు?’
అందుకే అంటారు  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని. ఏం చేస్తాను? పని నాది కదా, ఓపక్క నోరు నొక్కుకుని  మరో పక్క నోరు తెరిచి చెప్పాను.
24 గంటలు’
‘అవునా! మరి మీరు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు?’
‘ఉదయం పది నుంచి  సాయంత్రం ఆరుగంటల దాకా. అంటే ఎనిమిది గంటలు’
‘అవునా! అంటే  ఏమిటన్న మాట. రోజుకు 24  గంటల్లో మీరు పనిచేసేది మూడో వంతు’
(అవునొరేయ్ అవును)  
‘ఏడాదికి  366 రోజుల్లో మూడో వంతు అంటే యెంత 122రోజులు అవునా!’
(అవునొరేయ్ అవున్రా!)
‘మీరు పనిచేసేది వారానికి అయిదు రోజులు. శనాది వారాలు ఆఫీసుకి  రారు’
‘అంటే ఏమిటన్నమాట. 52  ఆదివారాలు, 52 శని వారాలు. మొత్తం 104  రోజులు ఆఫీసు మొహం చూడరు’
‘సరే! ఇందాకటి  122 రోజులనుంచి ఈ 104  తీసేస్తే మిగిలినవి ఎన్ని?’
(నాబొంద నీ శ్రాద్ధం)  
అలా నీళ్ళు నమలడం కాదు. నేను చెప్పేది వినండి. ఇవికాక ఏడాదికి రెండువారాలు,  రోగం రొస్టు అంటూ సిక్  లీవులు.    ఆ 14 తీసేస్తే మిగిలేవి నాలుగు రోజులు’

ఇక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, జనవరి ఫస్ట్, దీపావళి పండుగలకి  ఎట్లాగు  రారు.
‘అంటే ఏమిటన్నమాట. మీరు సంవత్సరంలో ఒక్క రోజు కూడా పనిచేయడం లేదన్నమాట. అంటే ఏమిటి అర్ధం. ఆఫీసులో  ఏపనీ చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటున్నారన్న మాట. ఎట్లాగు వచ్చారు కదా!ఇప్పుడు చెప్పండి  నన్నేం  చెయ్యమంటారో.  పనిచేయని కాలానికి తీసుకున్న డబ్బుల్ని  ఇకనుంచి ఎన్ని వాయిదాల్లో మీ నెల జీతం నుంచి పట్టుకోమంటారో చెప్పి మరీ  వెళ్ళండి.’
తోక మాట: ప్రత్యేకంగా చెప్పేదేవుంది. ఇది కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎత్తిపోతే!

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

రాజకీయ ఊసరవెల్లులు


“అప్పుడలా అని ఇప్పుడలా మాట్లాడడానికి సిగ్గువేయడం లేదా!”
“అదేమాట నిన్ను నేనూ అడుగుతున్నాను. నిన్న గాక మొన్న నువ్వు మాట్లాడినదేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమిటి? రంగులు మార్చడం కాకపొతే ఇదేమిటి?”
“నేనూ అదే అనేది.  మీ అసలు రంగు బయట పడిందని అంటున్నాను”
ఈ సంభాషణ అనంతం. నిరంతరం సాగిపోతూనే వుంటుంది, జీవనది మాదిరిగా. (27-09-2013)



NOTE: Courtesy Image Owner