27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?


మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా?? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?

26, సెప్టెంబర్ 2013, గురువారం

ఏమి సేతురా లింగా !


ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నేకోరగనేల? కోరితినిబో యాతండు రానేల?
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల?
ట్టెనుబో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్


కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో వివిధ పార్టీల పరిస్థితి. 
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి 
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే - 
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.


పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా - 
లోలోపల ఏదో తెలియని గుబులు వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి! 
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే! 
ఆ నాడు సర్కారు ఎక్స్ ప్రెస్ కాస్త  లేటుగా వచ్చి – నా  పెళ్ళి చూపులకు మీరు మరికాస్త ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో. 
అలాగే - భవనం వెంట్రామ్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు, సహాధ్యాయి అయిన   ఎన్‌. టీ. రామారావు గారిని  రాజభవన్‌కు ఆహ్వానించకపోయి వున్నా, లేదా వెంకట్రామ్‌ గారి సలహా మేరకు రామారావుగారికి  కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వున్నా  - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ పండితుడు. 
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించి  వుండేదే కాదు పొమ్మన్నాడు.
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత జగన్ మోహన రెడ్డి కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం కాకపోయినా ఏదో ఒక ఈశాన్య రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్ గా వేసివున్నా  రాష్ట్రంలో రాజకీయ పరిస్తితి మరో రకంగా వుండేదని ఇంకో పరిశీలకుడు అభిప్రాయపడ్డాడు.
కుంతి పడ్డ మధనం కూడా ఇలాటిదే.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది 
ఆదీ అంతం అంటూ లేని ఆ వేదాంతం చెప్పేదేమిటంటే -  
‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’
రోట్లో తలదూర్చిన తరువాత రోకటి పోటుకు వెరవకూడదు.

ఈ సూత్రం పార్టీలకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తుంది.

(26-09-2013)

25, సెప్టెంబర్ 2013, బుధవారం

మరి కొన్ని పడి లేచిన కెరటాలు


జీవితం అన్నాక ఎదురు దెబ్బలు సహజం. సమస్యలు మళ్ళీ మళ్ళీ తలెత్తినప్పుడు చాలామంది వాటి నుంచి తప్పుకోవాలని చూస్తారు. కాని కొందరు  వాటిని మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. అలాటి వారినే మనం ‘విజేతలుగా’ పరిగణిస్తూ వుంటాం. వీళ్ళు సమస్యలో భాగంగా మారరు. పరిష్కారంలో భాగంగా వుంటారు.  మనం ముందు చెప్పుకున్న హోండా ఈ కోవలోని వాడే. వీరి సంఖ్య తక్కువయినా, చెప్పుకోదగ్గవారు ఇంకెందరో వున్నారు.
ఐన్ స్టీన్ ను చిన్నప్పుడు మందమతి అని స్కూల్లో నుంచి బయటకు పంపేశారు. దాంతో ఆయన నిరుత్సాహపడి వుంటే ఈ ప్రపంచం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయివుండేది.       
నార్మా జీన్ బకర్ కు మంచి మోడల్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక. కానీ మోడలింగ్ సంస్థల వాళ్లు ‘నీ ఆకారం మోడలింగుకు పనికి రాదు పొమ్మన్నా’రు. ‘కాకపొతే ఇంతదాకా వచ్చావు కాబట్టి మా కంపెనీలో చిన్న గుమాస్తా ఉద్యోగం ఇస్తాం చేసుకో’మన్నారు. ఆ క్షణంలో ఆవిడ జీవితంతో రాజీ పడివుంటే మంచి మోడలే కాదు,  చలనచిత్రరంగం  ఒక అద్భుతమైన అందాల నటిని కళ్ళ చూడలేకపోయేది. ఎందు కంటే ఆ  నార్మానే తదనంతర కాలంలో హాలీవుడ్ ప్రపంచాన్ని కంటి చూపుతో శాసించిన మార్లిన్ మన్రో కాబట్టి.

మన దగ్గర అమితాబ్ బచ్చన్ సరేసరి. ఏ స్వరంతో అయితే అమితాబ్ హిందీ చలన చిత్ర రంగాన్ని దశాబ్దాల తరబడి ఏలాడో, అదే కంఠం  సినిమాకు పనికిరాదని మొదట్లో ఆయన మొహం మీదే చెప్పిన విషయం మరువలేనిది. అప్పుడు అమితాబ్ నిరుత్సాహపడి వెనుతిరిగి వుంటే.
కానీ విజేతలు ఆ పని చేయరు.

NOTE:  Courtesy image owner 
(25-09-2013) 

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

పడిలేచే కెరటాలు


సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు.
పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో!  హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.
అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు  సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి  తన కంపెనీని నిలబెట్టాడు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి  చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.


ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.
అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.
యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం  బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు. కంపెనీ అప్రతిహతంగా   అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.

‘పడిలేచిన కెరటం’ అంటే ఇదేనేమో! 
NOTE : Courtesy Image Owner 
(24-09-2013)             

23, సెప్టెంబర్ 2013, సోమవారం

దోమ వరం కధ


ఒక దోమ దేవుడ్ని గూర్చి సుదీర్ఘంగా, అతిఘోరంగా కొన్ని వేల క్షణాలపాటు తపస్సు చేసిన మీదట దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తపస్సు ఫలించిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన దోమ, ‘మనిషిని నేను కుట్టగానే చనిపోవాలి’ అనే వరం ఇమ్మని అడిగింది.  దేవుడు ‘తధాస్తు’ అంటూ వరం ప్రసాదించి నాలుగు చేతులు విలాసంగా వూపుకుంటూ అదృశ్యం అయిపోయాడు.


వరప్రసాదిని  అయిన దోమగారు కూని రాగాలు తీస్తూ  అలా అలా  వెళ్ళి ఓచోట  హాయిగా నిద్రపోతున్న మనిషిని తటాలున కుట్టింది. అంతే! ప్రాణం పోయింది. ఎవరిది? కుట్టిన దోమది. దోమ కుట్టగానే నిద్రాభంగం అయిన ఆ మనిషి, కుట్టిన చోటనే కూర్చుని నెత్తురు పీలుస్తున్న దోమని అరచేత్తో ఓ చరుపు చరిచాడు. దేవుడ్ని  కోరుకుని సంపాదించుకున్న  వరం ప్రకారం ఆ దోమ కుట్టగానే చనిపోయింది.
నీతి: తపస్సుచేయడం, దేవుడి అనుగ్రహం సంపాదించుకోవడంతోనే సరిపోదు. వరం యెలా కోరుకోవాలో కూడా తెలిసివుండాలి. 

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఏవని అడగను దేవుడిని?


ఆర్థర్ రాబర్ట్ యాషె మునుపటితరం టెన్నిస్ క్రీడాకారుల్లో మేటి. ప్రపంచంలో అగ్రగణ్య టెన్నిస్ ఆటగాడు. అనూహ్యంగా సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి బారిన పడి ఆ అమెరికన్ క్రీడాకారుడు అకాల మరణం చెందాడు. అతగాడి  గుండెకు  శస్త్ర చికిత్స చేసే సమయంలో పొరబాటున ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించిన ఫలితంగా అతడికి ఈ భయంకరమయిన రోగం సోకింది. ఈ విషయం తెలుసుకుని విశ్వవ్యాప్తంగా వున్న అతడి అభిమానులు ఎంతో బాధ పడ్డారు. వారిలో ఒక కుర్రవాడు అతడికి ఉత్తరం రాస్తూ ‘లోకంలో ఇంతమంది జనం వుంటే ఆ పాడు దేవుడు మీ ఒక్కరికే ఈ వ్యాధి యెందుకు కలిగించాడు’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. ఆర్ధర్ అతడికి రాసిన జవాబులో మొత్తం మానవ జీవిత పరమార్ధాన్ని కాచివొడబోశాడు.

ఆర్థర్ రాబర్ట్ యాషె 

ఆ సమాధానం ఇలావుంది.
“దేశదేశాల్లో లక్షలాదిమంది పిల్లలు. చాలామందికి  టెన్నిస్ ఆడాలనే కోరిక వుంటుంది.  వారిలో కొన్ని వేలమంది మాత్రమే టెన్నిస్ అంటే ఏమిటో ఎంతో కొంత తెలుసుకోగలుగుతారు. మళ్ళీ  వారిలో కొందరు మాత్రమే  టెన్నిస్ బ్యాట్ పట్టుకోగలుగుతారు.  
"వింబుల్డన్ స్తాయికి చేరేవాళ్ళు చివరకు ఓ యాభయ్ మంది వుంటారేమో. వారిలో ఓ నలుగురు  సెమీ ఫైనల్ చేరతారు. వాళ్ళలో ఇద్దరు ఫైనల్స్ ఆడితే మళ్ళీ వారిలో ఒక్కడే చాంపియన్ అవుతాడు. ఆ ఒక్కడిని నేనే. అనేకసార్లు ఈ అదృష్టం నన్ను వరించింది. వింబుల్డన్ కప్పును ఘనంగా  చేతిలో పట్టుకుని గర్వంగా అందరికీ చూపెడుతున్నప్పుడు ఎప్పుడూ  నాకు దేవుడు గుర్తు రాలేదు. వచ్చినా ఆయన్ని నేను అడిగిన గుర్తు లేదు, ఇంతమంది జనాలు వుంటే,  నన్నొక్కడినే టెన్నిస్ చాంపియన్ ని యెందుకు చేశావని? ఇప్పుడు ఈ స్తితిలో ఆ దేవుడ్ని ఏ మొహం పెట్టుకుని అడగను ఇంతమంది జనాల్లో  నన్నొక్కడినే ఈ వ్యాధి బారిన  యెందుకు పడేశావని?
“అందుకే దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఆనందం నిన్ను ఎప్పుడూ హాయిగా వుంచుతుంది. నువ్వు చేసే ప్రయత్నాలే  నిన్ను అత్యంత శక్తివంతుడ్ని చేస్తాయి. బాధలు వేదనలు నీలో మానవత్వాన్ని పెంచుతాయి.  ఓటమి అనేది  నిన్ను ఉదాత్తుడిగా  చేస్తుంది. గెలుపు నిన్ను మెరిపిస్తుంది. కాకపోతే, మన నమ్మకం, మన నడత ఈ రెండే  మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి”
(22-09-2013)



21, సెప్టెంబర్ 2013, శనివారం

గ్యాస్ బ్యాంక్ అనుసంధాన ప్రక్రియ

గ్యాస్ విషయంలో నా అనుభవం ఎవరికయినా అక్కరకు వస్తుందేమో చూడండి. ఇదిగో ఈ పేపరు కటింగులో వున్నట్టు నెట్లో  ‘హెచ్ పీ గ్యాస్ ట్రాన్స్ పరెన్సీ’ (ఎవరికి వారు తమ గ్యాస్ కంపెనీ ది ఓపెన్ చేసుకోవాలి) అందులో రాసిన ప్రకారం వివరాలు నమోదు చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే –  ఆధార్  కార్డుతో, బ్యాంక్ ఖాతాతో నా గ్యాస్ కనెక్షన్  అనుసంధానం అయిందన్న విషయం అవగతం అయింది. ఇందుకోసం గతంలో నేను పడిన శ్రమ ఏమిటంటే – ముందు గ్యాస్ కంపెనీకి వెళ్ళి వాళ్లు ఇచ్చిన ఫారం తీసుకువెళ్ళి బ్యాంకులో ఇచ్చాను. బ్యాంకు మేనేజర్ నాకు ఆ బ్యాంకులో వున్న ఖాతా నెంబరు రాసి సంతకం చేసి ఇచ్చాడు. తిరిగి దాన్ని మా గ్యాస్ ఏజెన్సీ లో ఇచ్చాను. వూరికే ఇస్తే సరిపోదు. దగ్గరుండి ఆ వివరాలు కంప్యూటర్ లో నమోదు చేయించాలి. అప్పుడే పని పూర్తయినట్టు. ఆ తరువాత సిలెండర్ డెలివరీ ఇచ్చినప్పుడల్లా తొమ్మిది వందల రూపాయల చిల్లర ఇచ్చి తీసుకుంటున్నాము. వాళ్ళిచ్చే రసీదులో మొత్తం  తొమ్మిది సబ్సిడీ సిలిండర్లలో అది ఎన్నో సిలిండరో ఆ వివరం వుంటుంది. ఉదాహరణకు 4/9. అంటే తొమ్మిదింటిలో నాలుగు వాడేసుకున్నట్టు లెక్క. బ్యాంకులో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. మీ మొబైల్ ఫోనుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకుని వుంటే  క్షణాల్లో ఆ సమాచారం మీకు ఎస్ ఎం ఎస్ ద్వారా వెంటనే తెలిసిపోతుంది. ఇది గ్యాస్ సబ్సిడీ అనుసంధానపధకం గురించిన సంక్షిప్త శబ్ద చిత్రం. – భండారు శ్రీనివాసరావు