25, సెప్టెంబర్ 2013, బుధవారం

మరి కొన్ని పడి లేచిన కెరటాలు


జీవితం అన్నాక ఎదురు దెబ్బలు సహజం. సమస్యలు మళ్ళీ మళ్ళీ తలెత్తినప్పుడు చాలామంది వాటి నుంచి తప్పుకోవాలని చూస్తారు. కాని కొందరు  వాటిని మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. అలాటి వారినే మనం ‘విజేతలుగా’ పరిగణిస్తూ వుంటాం. వీళ్ళు సమస్యలో భాగంగా మారరు. పరిష్కారంలో భాగంగా వుంటారు.  మనం ముందు చెప్పుకున్న హోండా ఈ కోవలోని వాడే. వీరి సంఖ్య తక్కువయినా, చెప్పుకోదగ్గవారు ఇంకెందరో వున్నారు.
ఐన్ స్టీన్ ను చిన్నప్పుడు మందమతి అని స్కూల్లో నుంచి బయటకు పంపేశారు. దాంతో ఆయన నిరుత్సాహపడి వుంటే ఈ ప్రపంచం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయివుండేది.       
నార్మా జీన్ బకర్ కు మంచి మోడల్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక. కానీ మోడలింగ్ సంస్థల వాళ్లు ‘నీ ఆకారం మోడలింగుకు పనికి రాదు పొమ్మన్నా’రు. ‘కాకపొతే ఇంతదాకా వచ్చావు కాబట్టి మా కంపెనీలో చిన్న గుమాస్తా ఉద్యోగం ఇస్తాం చేసుకో’మన్నారు. ఆ క్షణంలో ఆవిడ జీవితంతో రాజీ పడివుంటే మంచి మోడలే కాదు,  చలనచిత్రరంగం  ఒక అద్భుతమైన అందాల నటిని కళ్ళ చూడలేకపోయేది. ఎందు కంటే ఆ  నార్మానే తదనంతర కాలంలో హాలీవుడ్ ప్రపంచాన్ని కంటి చూపుతో శాసించిన మార్లిన్ మన్రో కాబట్టి.

మన దగ్గర అమితాబ్ బచ్చన్ సరేసరి. ఏ స్వరంతో అయితే అమితాబ్ హిందీ చలన చిత్ర రంగాన్ని దశాబ్దాల తరబడి ఏలాడో, అదే కంఠం  సినిమాకు పనికిరాదని మొదట్లో ఆయన మొహం మీదే చెప్పిన విషయం మరువలేనిది. అప్పుడు అమితాబ్ నిరుత్సాహపడి వెనుతిరిగి వుంటే.
కానీ విజేతలు ఆ పని చేయరు.

NOTE:  Courtesy image owner 
(25-09-2013) 

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

పడిలేచే కెరటాలు


సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు.
పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో!  హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.
అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు  సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి  తన కంపెనీని నిలబెట్టాడు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి  చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.


ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.
అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.
యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం  బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు. కంపెనీ అప్రతిహతంగా   అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.

‘పడిలేచిన కెరటం’ అంటే ఇదేనేమో! 
NOTE : Courtesy Image Owner 
(24-09-2013)             

23, సెప్టెంబర్ 2013, సోమవారం

దోమ వరం కధ


ఒక దోమ దేవుడ్ని గూర్చి సుదీర్ఘంగా, అతిఘోరంగా కొన్ని వేల క్షణాలపాటు తపస్సు చేసిన మీదట దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తపస్సు ఫలించిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన దోమ, ‘మనిషిని నేను కుట్టగానే చనిపోవాలి’ అనే వరం ఇమ్మని అడిగింది.  దేవుడు ‘తధాస్తు’ అంటూ వరం ప్రసాదించి నాలుగు చేతులు విలాసంగా వూపుకుంటూ అదృశ్యం అయిపోయాడు.


వరప్రసాదిని  అయిన దోమగారు కూని రాగాలు తీస్తూ  అలా అలా  వెళ్ళి ఓచోట  హాయిగా నిద్రపోతున్న మనిషిని తటాలున కుట్టింది. అంతే! ప్రాణం పోయింది. ఎవరిది? కుట్టిన దోమది. దోమ కుట్టగానే నిద్రాభంగం అయిన ఆ మనిషి, కుట్టిన చోటనే కూర్చుని నెత్తురు పీలుస్తున్న దోమని అరచేత్తో ఓ చరుపు చరిచాడు. దేవుడ్ని  కోరుకుని సంపాదించుకున్న  వరం ప్రకారం ఆ దోమ కుట్టగానే చనిపోయింది.
నీతి: తపస్సుచేయడం, దేవుడి అనుగ్రహం సంపాదించుకోవడంతోనే సరిపోదు. వరం యెలా కోరుకోవాలో కూడా తెలిసివుండాలి. 

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఏవని అడగను దేవుడిని?


ఆర్థర్ రాబర్ట్ యాషె మునుపటితరం టెన్నిస్ క్రీడాకారుల్లో మేటి. ప్రపంచంలో అగ్రగణ్య టెన్నిస్ ఆటగాడు. అనూహ్యంగా సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి బారిన పడి ఆ అమెరికన్ క్రీడాకారుడు అకాల మరణం చెందాడు. అతగాడి  గుండెకు  శస్త్ర చికిత్స చేసే సమయంలో పొరబాటున ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించిన ఫలితంగా అతడికి ఈ భయంకరమయిన రోగం సోకింది. ఈ విషయం తెలుసుకుని విశ్వవ్యాప్తంగా వున్న అతడి అభిమానులు ఎంతో బాధ పడ్డారు. వారిలో ఒక కుర్రవాడు అతడికి ఉత్తరం రాస్తూ ‘లోకంలో ఇంతమంది జనం వుంటే ఆ పాడు దేవుడు మీ ఒక్కరికే ఈ వ్యాధి యెందుకు కలిగించాడు’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. ఆర్ధర్ అతడికి రాసిన జవాబులో మొత్తం మానవ జీవిత పరమార్ధాన్ని కాచివొడబోశాడు.

ఆర్థర్ రాబర్ట్ యాషె 

ఆ సమాధానం ఇలావుంది.
“దేశదేశాల్లో లక్షలాదిమంది పిల్లలు. చాలామందికి  టెన్నిస్ ఆడాలనే కోరిక వుంటుంది.  వారిలో కొన్ని వేలమంది మాత్రమే టెన్నిస్ అంటే ఏమిటో ఎంతో కొంత తెలుసుకోగలుగుతారు. మళ్ళీ  వారిలో కొందరు మాత్రమే  టెన్నిస్ బ్యాట్ పట్టుకోగలుగుతారు.  
"వింబుల్డన్ స్తాయికి చేరేవాళ్ళు చివరకు ఓ యాభయ్ మంది వుంటారేమో. వారిలో ఓ నలుగురు  సెమీ ఫైనల్ చేరతారు. వాళ్ళలో ఇద్దరు ఫైనల్స్ ఆడితే మళ్ళీ వారిలో ఒక్కడే చాంపియన్ అవుతాడు. ఆ ఒక్కడిని నేనే. అనేకసార్లు ఈ అదృష్టం నన్ను వరించింది. వింబుల్డన్ కప్పును ఘనంగా  చేతిలో పట్టుకుని గర్వంగా అందరికీ చూపెడుతున్నప్పుడు ఎప్పుడూ  నాకు దేవుడు గుర్తు రాలేదు. వచ్చినా ఆయన్ని నేను అడిగిన గుర్తు లేదు, ఇంతమంది జనాలు వుంటే,  నన్నొక్కడినే టెన్నిస్ చాంపియన్ ని యెందుకు చేశావని? ఇప్పుడు ఈ స్తితిలో ఆ దేవుడ్ని ఏ మొహం పెట్టుకుని అడగను ఇంతమంది జనాల్లో  నన్నొక్కడినే ఈ వ్యాధి బారిన  యెందుకు పడేశావని?
“అందుకే దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఆనందం నిన్ను ఎప్పుడూ హాయిగా వుంచుతుంది. నువ్వు చేసే ప్రయత్నాలే  నిన్ను అత్యంత శక్తివంతుడ్ని చేస్తాయి. బాధలు వేదనలు నీలో మానవత్వాన్ని పెంచుతాయి.  ఓటమి అనేది  నిన్ను ఉదాత్తుడిగా  చేస్తుంది. గెలుపు నిన్ను మెరిపిస్తుంది. కాకపోతే, మన నమ్మకం, మన నడత ఈ రెండే  మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి”
(22-09-2013)



21, సెప్టెంబర్ 2013, శనివారం

గ్యాస్ బ్యాంక్ అనుసంధాన ప్రక్రియ

గ్యాస్ విషయంలో నా అనుభవం ఎవరికయినా అక్కరకు వస్తుందేమో చూడండి. ఇదిగో ఈ పేపరు కటింగులో వున్నట్టు నెట్లో  ‘హెచ్ పీ గ్యాస్ ట్రాన్స్ పరెన్సీ’ (ఎవరికి వారు తమ గ్యాస్ కంపెనీ ది ఓపెన్ చేసుకోవాలి) అందులో రాసిన ప్రకారం వివరాలు నమోదు చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే –  ఆధార్  కార్డుతో, బ్యాంక్ ఖాతాతో నా గ్యాస్ కనెక్షన్  అనుసంధానం అయిందన్న విషయం అవగతం అయింది. ఇందుకోసం గతంలో నేను పడిన శ్రమ ఏమిటంటే – ముందు గ్యాస్ కంపెనీకి వెళ్ళి వాళ్లు ఇచ్చిన ఫారం తీసుకువెళ్ళి బ్యాంకులో ఇచ్చాను. బ్యాంకు మేనేజర్ నాకు ఆ బ్యాంకులో వున్న ఖాతా నెంబరు రాసి సంతకం చేసి ఇచ్చాడు. తిరిగి దాన్ని మా గ్యాస్ ఏజెన్సీ లో ఇచ్చాను. వూరికే ఇస్తే సరిపోదు. దగ్గరుండి ఆ వివరాలు కంప్యూటర్ లో నమోదు చేయించాలి. అప్పుడే పని పూర్తయినట్టు. ఆ తరువాత సిలెండర్ డెలివరీ ఇచ్చినప్పుడల్లా తొమ్మిది వందల రూపాయల చిల్లర ఇచ్చి తీసుకుంటున్నాము. వాళ్ళిచ్చే రసీదులో మొత్తం  తొమ్మిది సబ్సిడీ సిలిండర్లలో అది ఎన్నో సిలిండరో ఆ వివరం వుంటుంది. ఉదాహరణకు 4/9. అంటే తొమ్మిదింటిలో నాలుగు వాడేసుకున్నట్టు లెక్క. బ్యాంకులో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. మీ మొబైల్ ఫోనుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకుని వుంటే  క్షణాల్లో ఆ సమాచారం మీకు ఎస్ ఎం ఎస్ ద్వారా వెంటనే తెలిసిపోతుంది. ఇది గ్యాస్ సబ్సిడీ అనుసంధానపధకం గురించిన సంక్షిప్త శబ్ద చిత్రం. – భండారు శ్రీనివాసరావు


మార్కెటెక్నిక్స్


మార్కెటింగులో అనుసరిస్తున్న రకరకాల ఎత్తుగడలు గురించి ఓ హాస్య గుళిక – ఇంగ్లీషు  నుంచి ‘ఎత్తిపోత’ అని వేరే చెప్పక్కరలేదనుకుంటాను.






మీరో పార్టీకి వెళ్లారు. అక్కడో అందమైన అమ్మాయి కనిపించింది.
నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి –
‘నేను చాలా డబ్బున్నవాడిని, నన్ను పెళ్ళాడతావా?’ –
అని అడిగితె అది డైరెక్ట్ మార్కెటింగ్ టెక్నిక్

మీరో పార్టీకి వెళ్లారు. అక్కడో అందమైన అమ్మాయి కనిపించింది.
మీ స్నేహితుడొకడు  ఆమె దగ్గరకు వెళ్ళి –
‘అదిగో అక్కడ వున్నాడు చూసారు కదా! అతడు నాకు బాగా తెలుసు. మంచి సౌండ్ పార్టీ. అతడ్ని పెళ్ళాడతావా?’ –
 అని అడిగితే  అడ్వర్టైజ్ మెంటు

మీరో పార్టీకి వెళ్లారు. అక్కడో అందమైన అమ్మాయి కనిపించింది.
ఆ అమ్మాయే నేరుగా మీ  దగ్గరకు వచ్చి-
‘మీరు చాలా అందంగా వున్నారు. బాగా డబ్బున్నవారని కూడా తెలిసింది. మనం పెళ్లి చేసుకుందామా’ –
అని అడిగిందనుకోండి. అది బ్రాండ్ గుర్తింపు.

మీరో పార్టీకి వెళ్లారు. అక్కడో అందమైన అమ్మాయి కనిపించింది.
నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి –
‘మీరు అందంగా వున్నారు. నాకు బాగా డబ్బుంది. మనం పెళ్లి చేసుకుందామా’ –
అని నేరుగా అడగగానే ఆవిడ చాలా తాపీగా చెంప చెల్లుమనిపిస్తే –
దాన్ని మార్కెటింగ్ భాషలో ‘కస్టమర్ ఫీడ్ బ్యాక్’ అంటారు.

మీరో పార్టీకి వెళ్లారు. అక్కడో అందమైన అమ్మాయి కనిపించింది.
నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి –
‘నాకు చాలా డబ్బుంది. మీరు అందంగా వున్నారు. మనం పెళ్లి చేసుకుందామా’ అని అడిగినప్పుడు –
ఆమె ఒక్క క్షణం అంటూ తన భర్తను పిలిచి పరిచయం చేసిందనుకోండి.
దాన్ని  ‘సరపరాకు, గిరాకీకి మద్య వున్న వ్యత్యాసం’ అంటారు.

మీరో పార్టీకి వెళ్లారు. అక్కడో అందమైన అమ్మాయి కనిపించింది.
నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి –
‘మీరు చాలా అందంగా వున్నారు మనం పెళ్లి చేసుకుందామా’ అని అడగబోతుండగా హఠాత్తుగా మీ ఆవిడ ఎంట్రీ ఇస్తే –

దాన్ని మార్కెటింగు పరిభాషలో    ‘కొత్త మార్కెట్లలో ప్రవేశించడానికి వీలు లేదు’ అని అర్ధం.

NOTE: Thanks to Cartoonist Sri Mallik 

(21-09-2013)

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

చాణక్య సూక్తులు


‘మరీ అంత నిజాయితీగా వుండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా  వున్న చెట్లనే కదా!

‘అన్ని  పాములు విషప్పురుగులు కావు.  విషపూరితం కాకపోయినా  పైకి అలా  కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.’ 

‘ఎవ్వడు కూడా  ఎలాటి స్వార్ధం లేకుండా మరొకడితో  జట్టు కట్టడు.  ఏ ప్రయోజం ఆశించకుండా  వుట్టిగా స్నేహం  చేస్తున్నానని ఎవడయినా  చెబితే దాన్ని నమ్మినవాడే  శుద్ద  అప్రయోజకుడు.’

‘యెందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల  ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? - ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏపనీ మొదలు పెట్టవద్దు.’  

‘అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం  అనుమానం వచ్చినా సరే, యెంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి.లేకపోతే మొదటికే మోసం.’

‘ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన, తిరుగులేని  శక్తులు. ఒకటి యువశక్తి. రెండోది ఆడదాని అందం.’

‘పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వొదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.’

‘పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం  నాలుగు దిక్కులకూ వ్యాపిస్తుంది.’

‘భగవంతుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం.’

‘మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మతః  కాదు.’

‘మీ సంతానానికి  అయిదేళ్ళు వచ్చేవరకు వారిని చాలా   ప్రేమగా చూసుకోండి.  ఆతరువాత అయిదేళ్ళు ఏదయినా  తప్పుచేస్తే వారిని  కఠినంగా దండించండి.  కానీ  పదహారేళ్ళు రాగానే మీ  స్నేహితుడి మాదిరిగా చూసుకోండి. అలా పెరిగి పెద్దయిన పిల్లలే మీ  జీవితంలో మీకు  అత్యంత ఆత్మీయులయిన  సన్నిహితులుగా మీ జీవితాంతం కలసి వుంటారు.'

‘మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం వుండదు. అంధుడి ముందు వుంచిన  అద్దం మాదిరిగా.’

‘విద్యాధనం అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి. అది వుంటే సంఘంలో గౌరవం లభిస్తుంది. విద్యాగంధం కలిగివుంటే అందం లేదనీ, వయస్సు మళ్లుతోందనీ మధన పడాల్సిన పని వుండదు. ఎందుకంటే , అది అన్నింటినీ కప్పిపెడుతుంది.’