26, ఆగస్టు 2013, సోమవారం

పెళ్ళంటే – పెళ్ళంటే బాజాలు, భజంత్రీలు

పెళ్ళంటే బంధు మిత్రుల సమాగమాలు, పాత పరిచయాల పునః సమీక్షలు (తిరగమోతలు) కూడా.  ఈరోజు ఆదివారం  షరా మామూలు పనులకు స్వస్తి చెప్పి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వీటితో బిజీ బిజీ.
ఉదయం మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో తమిళనాడు  గవర్నర్ రోశయ్య గారి మనుమరాలు ఐశ్వర్య  పెళ్లి. ఆ తరువాత కాసేపటికే కూకట్ పల్లి లో మాస్కో స్నేహితుడి  కుమారుడి పెళ్లి వుండడం చేతా, వీ ఐ పీల పెళ్ళిళ్ళలో రాకపోకలు (ట్రాఫిక్) కాస్త కష్టం అన్న ఎరుక, అనుభవం రెండూ  వుండడం చేతా,  కాస్త ముందుగా మాదాపూర్ వివాహానికి వెళ్లాను. అది కొంత కలసి వచ్చింది. రోశయ్యగారు ఒక ప్రత్యేక ఎంక్లోజర్ లో కూర్చుని అప్పుడే బ్రేక్ ఫాస్ట్ మొదలు పెట్టబోతున్నారు. నన్ను చూడగానే నాకు  కూడా ఉపాహారం తెమ్మని పురమాయించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి గారు,  మాజీ మంత్రి సత్యనారాయణరాజు గారు అక్కడే వున్నారు. ఆ తరువాత రోశయ్యగారు పెళ్లి వేదికపైకి వెళ్ళగానే సీనియర్ జర్నలిస్టు మిత్రుడు శ్రీ వల్లీశ్వర్ తో కలసి అనేకమందిని కలుసుకునే అవకాశం కలిగింది.  ఈమధ్య కాలంలో వ్యక్తిగతంగా కలవడానికి వీలుపడని వారు ఎందరో అక్కడ కలిశారు. శ్రీయుతులు వెంకయ్యనాయుడు గారు,  డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వర రావుగారు, (సత్యం) రామలింగరాజుగారు, హెచ్ జే దొరగారు, డాక్టర్ మల్లు రవి గారు  ఇలా అనేకమంది.
తదుపరి మాస్కో మిత్రుడు కమాండర్ దాసరి గారి పెద్దబ్బాయి పెళ్లి, సత్యనారాయణ వ్రతం కూకట్ పల్లిలో. జలవాయువిహార్ కమ్యూనిటీ హాల్ లో లంచ్. మాస్కోలో కలిసిమెలిసి తిరిగిన కుటుంబాలన్నీ అక్కడ కలిశాయి.
ఆ తరువాత నిజాంపేట్ లో ఓ గృహప్రవేశం. 1980లో చిక్కడపల్లిలో కలిసివున్న కేవీ రావు దంపతుల కూతురు స్మిత,  అల్లుడు వాసుదేవ శాస్త్రి ముచ్చటగా కట్టుకున్న ఇల్లు. పొందికగా వుంది. నాటి చతుర్ముఖ పారాయణం బ్యాచ్ కలిసింది. సంతోషమనిపించింది.
కింది ఫోటోలో: మాస్కో టీమ్ 


కుర్చీల్లో కూర్చున్న వాళ్లు : ఎడమనుంచి:  త్రిలోచన రమణ, రమా పరకాల, నిర్మల అంటే మా ఆవిడ, విశాల. నిలుచున్నవాళ్ళు : కేవీ రమణ, పరకాల సుధీర్, భండారు శ్రీనివాసరావు అనగా నేను, దాసరి రాము, శ్రీధర్ కుమార్

(25-08-2013)

పలుకే బంగారమాయెరా!


Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన  నాలాగే ‘బాపూ రమణల’ వీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా.  ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన  విషయాలు అందులో  వున్నాయి.  కానీ శ్రీనివాసులు  గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో,  కింద ఇస్తున్నాను.



       

“నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన చెప్పిన మాటలు....అక్షరాలా ....’కొన్ని మాటలు....’ “
(26-08-2013)

చనిపోయి బతకడం

నిజానికిదొక అందమైన వూహ. అందరి విషయంలో ఇది నిజం కాదు.
మిత్రుడు,  సినీ జర్నలిస్టు ఎల్.బాబూరావు చనిపోయి  రోజులు కూడా గడవలేదు. అతడి జ్ఞాపకాలు ఇంకా అందరి మనస్సులో మెదులుతూనే వున్నాయి.  స్నేహితులందరూ రాత్రి ప్రెస్ క్లబ్ లో కలిసి అతడ్ని మరోమారు  సంస్మరించుకున్నారు. పుష్పాంజలి ఘటించి ఆ మంచి మనిషి మంచితనాన్ని గురించి నలుగురూ నాలుగు మంచిమాటలు చెప్పారు. చనిపోయి బతకడం అంటే ఇదేనేమో!



ఈ ఆత్మీయ కలయికకు సూత్రధారి మిత్రుడు వేణుగోపాల్, అతడికి  కృతజ్ఞతలు చెప్పుకోకుండా వుండలేము.   

23, ఆగస్టు 2013, శుక్రవారం

కదలిక



దూరానికి సరళరేఖల్లా కనబడ్డా

నిజానికి ఎన్నో కనబడని వొంకర్లు

ఆలోచనలకు పెయింట్ వేసి వుంచినా

నిద్రపట్టే వేళకు

మెదడు తుప్పురాలుతున్న చప్పుడు

నిశ్శబ్దం చేసే ధ్వని భరించడం ఎలా

పగలు పలురకాల అనుభవాల్ని నమిలి

నాలుక కొసతో నిశీధిని నంజుకుని

నవ్వి,నలిగి

పక్కపై చేరే సమయానికి

ఆలోచనల నల్లుల బారులు

లోపలి వ్యక్తి చేసే చీకటి ఆక్రందనలు

ఇక నిద్రపట్టడం ఎలా?

లేచి లైటు వెయ్యాలి.

-భండారు శ్రీనివాస రావు



(Image courtesy Shri Bhaasskar Palamuru (Bhaaskar Palamuru)

మౌనమె నీ భాష .........



ప్రతిపక్షం : కనబడకుండా పోయిన ఫైళ్ళ గురించి ప్రదానమంత్రిగారు స్వయంగా సమాధానం చెప్పితీరాల్సిందే.
మంత్రి కమల నాథ్ : అలా ప్రతిపక్షం పట్టుపడితే అసలు కుదరదు.
ప్రతిపక్షం : ఏం ఎందుకని? ఆయన సభలోనే వున్నారు కదా!

మంత్రి కమల నాథ్: సభలో వుంటే మాత్రం? ఎర్ర కోటనుంచి ప్రధానమంత్రి ప్రసంగించింది ఈనెలలోనే.  దాంతో ఆయన గారి  ఈనెల మాటలకోటా పూర్తయ్యింది.   

శనగల మంగళవారం -

'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం - వేయించిన  శనగలతో తప్పనిసరి పలహారం.'


(అమెరికా నుంచి ఫోటో పంపిన మిత్రుడు అయ్యగారి శ్యామసుందరం గారికి ధన్యవాదాలు) 



ఎక్కడ వేసిన......


టీవీ చర్చల బ్రేక్ సమయంలో అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవస్తుంటాయి. తెలంగాణా ప్రాంతానికి చెందిన  ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇలా అన్నారు.
‘తెలంగాణా విషయంలో సీ డబ్ల్యూ సీ  తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదు, వెనక్కి పోయే  ప్రసక్తి లేదు అని మా ఢిల్లీ నాయకులు పదేపదే బల్లగుద్ది మరీ  చెబుతున్నారు. చిత్రం ఏమిటంటే  ‘ముందుకు’ కూడా పోవడం లేదు.’
(23-08-2013)