22, ఆగస్టు 2013, గురువారం

ఒకనాటి ఇద్దరు మిత్రులు

 సరిగ్గా   ముప్పయేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు అనతికాలంలోనే  వేరైపోతాయని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం అంత త్వరగా ఆవిరి కాగలదని కానీ,  ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు నాయుడు,  కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి.


(ఒకనాటి  మిత్రులు వై.ఎస్., బాబు)  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టీకి ఆయనే  అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటికి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టీ  అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.
అందుకే - చంద్రబాబు - రాజశేఖరరెడ్డి అదృష్టవంతులయిన రాజకీయ నేతల కోవలోకి చేరిపోయారని చెప్పడం. పార్టీలో - ప్రభుత్వంలో ఎదురులేని స్థితికి చేరుకోవడం - అస్తిత్వానికి ముప్పులేకపోవడం - సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి అతిగా పెరిగిపోయి – అహంకారానికీ,  మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయనంతకాలం - ఎలాంటి అనర్థాలకు అవకాశం ఉండదు. రెండోతరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపఠంలో   ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న స్థాయిలో వూహాగానాలు ఊపిరి పోసుకున్నాయి.  ఆయన హయాంలోనే  ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైకెక్కించే పధకాల రచనకు కంప్యుటర్ వేగంతో శ్రీకారం చుట్టారు.


(1996 లో కాలు విరిగి ఆసుపత్రిలో వున్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో)

ఆ తర్వాత జరిగింది చరిత్ర - మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారి వీధులకెక్కారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో - వరుస కరువులతో రైతాంగం వెన్ను విరిగింది. విధ్యుత్ కొరత  ప్రజల కడగండ్లని మరింత పెంచింది. ఆర్ధిక  సంస్కరణలు,  ధరల  పెంపుకు దోహదంచేసి - పరిస్థితులు మరింత దిగజారేలా చేశాయి. జరుగుతాయనుకున్న ఎన్నికలు మరింత దూరం జరగడం - తాత్కాలిక సర్కారు పాలనాధికారాలకు  ఎన్నికల కమీషన్ ముక్కుతాడు విధించడం - చంద్రబాబుని మరింత వుక్కిరి బిక్కిరి చేసాయి.  ముందరి కాళ్ళకు బంధాలు వేశాయి. ప్రత్యేక తెలంగాణా పేరుతో వుద్యమం ప్రారంభించి - ఎన్నికల్లో పోటీ చేసిన టీ.ఆర్.ఎస్. నేత చంద్రశేఖర రావుతో - కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చేతులు కలపడంతో - రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు చరమగీతం పాడినట్టయింది. కణకణమండే ఎండాకాలంలో రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో జరిపిన సుదీర్ఘ పాదయాత్రతో సాధించిన కాంగ్రెస్ విజయంతో - చంద్రబాబు పాలన - రెండో టరం వ్యవధి పూర్తికాకుండానే ముగిసిపోయింది.


(ముఖ్యమంత్రి వై.ఎస్.తో రచయిత)  

ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.  2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు.  గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే, బహుశా, ఏ  రెండేళ్ళో, మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపోయివుండేవారేమో. కాని ఈసారి, అంటే 2004లో,  సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు  కనుకనే – అయిదేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడమే కాకుండా  పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ ను  సృష్టించారు. అంతే కాకుండా,  ఒకనాటి తన  రాజకీయ మిత్రుడు చంద్రబాబు తరహాలోనే రెండో పర్యాయం కూడా తన పార్టీని వరసగా మరోమారు అధికార పీఠం ఎక్కించగలిగారు. హెలికాప్టర్ దుర్ఘటనలో ఆకస్మిక మరణం చెందకపోయివుంటే ,  సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరిట వున్న రికార్డును అధిగమించే అవకాశం కూడా  ఆయనకు దక్కి వుండేదేమో.

రాజకీయంగా విడిపోయిన ఈ రాజకీయ మిత్రులు ఇద్దరు  చివరికి భౌతికంగా కూడా విడిపోవడం విషాదకర విషయం.


(1982 లో అప్పుడు మంత్రిగా వున్న వై.ఎస్.తో రచయిత)




(ముప్పయ్ అయిదేళ్ళ  క్రితం  వీరిరువురూ, ‘ఒకే మంచం ఒకే కంచం’ చందాన స్నేహితులుగా వున్ననాటి రోజులకు ప్రత్యక్ష సాక్షిగా వున్న అనుభవంతో – భండారు శ్రీనివాసరావు)

21, ఆగస్టు 2013, బుధవారం

స్నేహశీలి, ఫిలిం జర్నలిస్ట్ ఎల్ . బాబూరావు ఇక లేరు


ప్రెస్ క్లబ్ లో ప్రతి ఒక్కరితో అరమరికలు లేని స్నేహం చేసి, ఆ స్నేహ మాధుర్యాన్ని అందరికీ పంచి అందరి మధ్య నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన సీనియర్ ఫిలిం జర్నలిస్టు శ్రీ ఎల్ బాబూరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ -

అనాయాస మరణం - దేవుడిచ్చే వరం

   





కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారు 




న్నడయినా చూసారా 
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం 
ఎప్పుడయినా గమనించారా 
అన్ని బాధలు, అందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం 
భాద్యతలన్నీ మోసీ మోసీ 
ఆ చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు  
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం 
దేవుడిచ్చే అభయం  
నిజమయిన భక్తుడు కనుకే 
అన్నయ్యకు దక్కిందా వరం


                             

( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006 ఆగస్టు 21 నాడు  ఆకస్మికంగా మరణించినప్పుడు  రాసిన అశ్రుగీతిక  - భండారు శ్రీనివాసరావు)    

20, ఆగస్టు 2013, మంగళవారం

1991 లో ఒక రోజు


మాస్కోలో ఆ సాయంత్రం తెలిసిన తెలుగు కుటుంబాలనన్నింటినీ భోజనానికి ఆహ్వానించాను. పిలిచిన  వాళ్లందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. డిన్నరుకు సర్వం సంసిద్ధం. అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో ఫోను మోగింది. అవతల పీ.టీ.ఐ. మాస్కో విలేఖరి.
ఆయన చెప్పింది చెవులో పడగానే రిసీవర్ చేతిలోనుంచి జారి పోయింది. ‘రాజీవ్ గాంధి ఈజ్ నో మోర్’
ఎక్కడో తమిళనాడులో చెన్నైకి దగ్గర్లో నోరు తిరగని పేరు కలిగిన ఒక వూళ్ళో బాంబు బ్లాస్ట్ జరిగింది. రాజీవ్ గాంధి అక్కడికక్కడే చనిపోయాడు.


వార్త తెలిసి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. అన్నం ముడితే వొట్టు.
నేను హైదరాబాదు ఫోను చేసాను. రాజభవన్ లో పనిచేస్తున్న నా స్నేహితుడు జ్వాలాకి. విషయం చెప్పకుండా అడిగాను ఏదయినా జరగరానిది జరిగిందా అని. ఏం లేదు అంతా బాగానే వుంది అన్నాడు. అప్పుడు అసలు విషయం చెప్పాను. కాసేపటి తరువాత విన్న విషయం నిజమే అని నిర్ధారణ అయింది.
నిజంగా విషాదకరమైన రోజు. భారత దేశానికి దిశా నిర్దేశనం చేసిన ఆ యువ నాయకుడికి శ్రద్ధాంజలి. (20-08-2013)

ఏవస్తువయినా ఆరణాలే

చిన్నప్పటి ఓ దృశ్యం 
వీధి పక్కన ఓ గుడ్డ పరచుకుని దానిమీద రకరకాల వస్తువులు పెట్టి 'ఏ వస్తువయినా ఆరణాలే !' అంటూ వ్యాపారం చేస్తుండేవారు.
అలాటి ఓ చిత్రం ఒకటి ఈరోజు నెట్లో మరో రూపంలో కనబడింది. ఇదే అది.


చిత్రమైన 'చిత్రం'

కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. ఈ చిత్రం అలాటిదే. ఇందులో ఒకరు ఫేస్ బుక్ మిత్రుల్లో చాలామందికి పరిచితుడే. జాగర్లమూడి రామకృష్ణ. సీనియర్ జర్నలిస్టు. పోతే రెండో వారే ‘ఈచిత్ర నాయకుడు’ అక్షరాలా నలభయ్ మూడేళ్ళ(?)


(మిత్రుడు జాగర్లమూడి రామకృష్ణ తో అలనాటి మా పెళ్లి పెద్ద గుడిమెట్ల జగన్నాధ శర్మ గారు)

 క్రితం చూసిన ఈ వ్యక్తిని ఈ రోజు మళ్ళీ ఈ ఫోటోలో చూస్తున్నాను. వీరి పేరు గుడిమెట్ల జగన్నాధ శర్మ గారు. ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంటులో పనిచేసి స్వచ్చంద పదవీ విరమణ చేసి ప్రసుతం హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ లో వుంటున్నారు. శర్మగారితో నాకో అవినాభావ సంబంధం ఒకటుంది. అలాటిది ఒకటుందని కూడా ఈ రోజే తెలిసింది. మా ఆవిడతో నా పెళ్లి, ‘ ప్రేమ పెళ్లి’  కావడం మూలాన,  మరీ మూడో కంటికి కూడా తెలియకుండా జరిగిందని చెప్పలేను కానీ,  తిరుపతి (తిరుమల) లో జరిగిన ఆ  మా పెళ్ళికి ‘అక్షరాలా’ మూడో ‘సాక్షి’ శర్మగారే. అదీ ఈ రోజు ఆయన ఫోనులో చెబితేనే తెలిసింది. 1971 డిసెంబరు 16 వ తేదీన ( సరిగ్గా ఆ రోజునే తూర్పు పాకీస్తాన్ విమోచన జరిగి బంగ్లాదేశ్ గా అవతరించింది) మద్రాసు నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ కారులో శర్మ గారు కూడా వున్నారుట. ‘ట’ ఏముంది, ఈ విషయాన్ని ఆయనే ధృవీరించారు కాబట్టి ఇక పేచీ లేదు. అంత ముఖ్యమైన వ్యక్తిని యెందుకు మరిచిపోయానన్నవిషయంలో ఇక ఆయనే నాతొ పేచీ పెట్టుకోవాలి. కానీ మనిషిని (ఫోటోలో) చూస్తుంటే పేచీకోరులా కానరావడం లేదు. ఆ రోజు పెళ్లి భోజనం ఎట్లాగో పెట్టలేదు కాబట్టి, ఇన్నేళ్ళ తరువాత  ‘ఆ లాంఛనం’ తీర్చుకునే అవకాశం శర్మ గారు ఇస్తారన్న నమ్మకం వుంది. పోతే, ఈ ‘చిత్ర’ విజయానికి సూత్రధారి, కర్తా కర్మా క్రియా అయిన  మిత్రుడు జాగర్లమూడి రామకృష్ణకు, ‘సారా మామూలు’గా కృతజ్ఞతలు.

నిర్ణయానికి ముందు ఆ తరువాత (ఆధారం ఈనాటి టీవీ స్క్రోలింగులు)



"తెలంగాణా విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధార్యం" – అన్ని ప్రాంతాల కాంగ్రెస్ నేతలు
"హైదరాబాదును వొదిలేదంటున్న టీ కాంగ్రెస్ నేతలు"  
"హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం చేయాలి" – మంత్రులు దానం నాగేందర్,  ముఖేష్ గౌడ్  
"ఉత్తరాంధ్రతో  గ్రేటర్ తెలంగాణా ఏర్పాటు చేయాలని రేణుకాచౌదరి విజ్ఞప్తి"    
"హైదరాబాదును యూటీ  లేదా ప్రత్యేకరాష్ట్రం చేయాలి" – కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు
ఏవిటో ఒక్క ముక్క అర్ధం అయిచావదు.
అయినా ఒక్క తల పగలగొట్టుకోవడానికి ఇన్ని ‘రాళ్ళు’ కావాలా?

(20-08-2013)