16, ఆగస్టు 2013, శుక్రవారం

జీవితాలు ఇక తెరిచిపెట్టిన పుస్తకాలు


“మరుగేలరా ఓ రాఘవా” అని  పాడుకునే రోజులకు రోజులు  దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు  మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. ‘బతుకు బస్ స్టాండ్’ అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి  ఇప్పుడు నెట్లో షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:
2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయడం కోసం చట్నీస్ కు  ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
“గుడ్ మార్నింగ్. నాకు వెంటనే నాలుగు ప్లేట్లు .....”
“ఒక్క నిమిషం సర్! మీ మల్టీ పర్పస్  కార్డ్ నెంబర్ చెబుతారా?”
“కార్డు నెంబరా! ఒక్క నిమిషం ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049 998-45-54610"
“థాంక్స్. అయితే మీ పేరు శ్రీనివాసరావు. ఎల్లారెడ్డి గూడా ఆర్.బీ.ఐ. క్వార్టర్స్ పక్కన మధుబన్ అపార్ట్ మెంట్లో 302 నెంబరు ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ అయిదేళ్లుగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్ లైన్ నెంబరు 23731056. మొబైల్ 9849130595.  ఇప్పుడు చెప్పండి. మీకేమి కావాలి?”
“నాకేమి కావాలో చెబుతాను సరే! ఇంతకీ  నా ఫోను నెంబర్లన్నీ మీ దగ్గర ఎలావున్నాయి?”
“సిష్టం తో కనెక్ట్ అయివున్నాం సర్”   
“సరే! నాకు త్వరగా నాలుగు ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...”
“వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి  శ్రీనగర్ కాలనీలోని క్లినిక్ లో  షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు  బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాను.”
“ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
“యెంత సర్! చాలాతక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా  పన్నెండు వందలు”
“కార్డు మీద పే చెయ్యవచ్చా?”
“తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్!  కంప్యూటర్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే  మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ బాగాలేదు. మూడు వాయిదాలు కట్టలేదు.  హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు పోయివుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్  మాత్రమే కట్టాల్సి వుంటుంది”
“ ఓ షిట్! ************”
“సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. ఆ సమయంలో మీరు ఏ పీ నైన్ వన్ జీరో ఫైవ్ సిక్స్ నెంబరు  శాంత్రో కారులో వెడుతున్నట్టు పోలీసు రికార్డులో వుంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.”
“ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”
“అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి  ఏమిటి తల్లి! బల్లి లాగా...”
ఇవతల వ్యక్తి  పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు. 

ఇస్తినమ్మ వాయినం - పుచ్చుకుంటి వాయినం


టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి  గ్రహీతలను  నిర్ణయించే బాధ్యత నాకిస్తే నేను ఖచ్చితంగా ఆ బహుమతిని  గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.



ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి,   పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో  ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.


అలాటిది, వానయినా వంగిడి అయినా,  కార్లూ డ్రయివర్లూ లేకున్నా,  ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను  అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న  విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా అది మన ప్రాప్తం. (16-08-2013)

ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!



అందరి సంగతేమో కానీ దేవుడుతో నాకు కొన్ని పేచీలున్నాయి. నేను ఆయన్ని అడిగేవన్నీ చాలా అత్యల్ప స్వల్ప విషయాలని నా ధృఢనమ్మకం. ఆయన్నేమన్నా మణులడిగానా మాన్యాలడిగానా. పూర్వం కాలం రాక్షస భక్తుల మాదిరిగా కోరరాని వరాలేమన్నా  కోరానా!  లేదే!  ఏదో కొంచెం అహంకారం తగ్గించవయ్యా మగడా! అన్నాను.

పనిలో పనిగా, కాస్త  చేయి తీరిక చేసుకుని ఆ చేత్తోనే నా అజ్ఞానం కూడా కొంత తగ్గించమని మొక్కుకున్నాను. పట్టించుకున్న పాపాన పోతేగా! ఆయన లెక్కలు ఆయనకున్నట్టున్నాయి. దేవుడు కదా! కాళ్ళూ చేతుల మాదిరిగా తెలివితేటలు కూడా మనుషులకంటే  ఆయనగారికి ఎక్కువే కాబోలు.

అహంకారం తగ్గిస్తే తనకు ఇక బొత్తిగా పనివుండదన్న సందేహం వల్ల కావచ్చు. అజ్ఞానులు లేకపోతె తననిక నమ్మేవాళ్ళు కూడా వుండరన్న అనుమానం వల్ల కావచ్చు. మొత్తానికి ఏమయితేనేం దేవుడు నా గోడు పట్టించుకోలేదు. దానితో నా అహంకారం, అజ్ఞానం రెండూ ఒకటి నొకటి పెనవేసుకుని  - పాదు చేసి, నీరు పోసి పెంచిన పూలపొదలా నన్ను గట్టిగా అల్లుకుపోయాయి.

అలా అల్లుకుపోయిన ఆ రెండూ ఇప్పుడు  నా ఈ రాతల్లో  మఠం వేసుక్కూర్చున్నాయి. వెనక్కి తిరిగి చూసుకోకుండా  ఎడాపెడా రాసేస్తున్న ఈ  పోస్టింగుల్లో నక్కి నక్కి చూస్తున్నాయి. 

అందువల్ల మీ అందరికీ నా మనవేమిటంటే – 
అలాటి అజ్ఞానపు ఆలోచనలు, దురహంకార  ధోరణులూ ఈ రాతల్లో ఎక్కడయినా పంటికింద రాయిలా తగిలితే  పెద్దమనసు చేసుకుని 
 నా అజ్ఞానాన్ని మన్నించండి. నా అహంకారాన్ని క్షమించండి.
ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా!

15, ఆగస్టు 2013, గురువారం

అనగనగా ఓ మేక కధ



అనగనగా ఓ వూరు. ఆ వూర్లో ఓ రైతు. ఆ రైతు దగ్గరో గుర్రం. దానికి తోడు ఓ మేక.
ఆ గుర్రానికి వున్నట్టుండి జబ్బు చేసింది. యజమాని పశువుల వైద్యుడికి కబురు చేసాడు.
అతడొచ్చి గుర్రానికి పరీక్షలు చేసాడు. జబ్బు బాగా ముదిరిందని నిర్ధారించుకున్న వైద్యుడు రైతుతో చెప్పాడు.
నేను మళ్ళీ రేపు వస్తాను. వరసగా మూడు రోజులు మందిస్తాను.  మూడు రోజుల్లో నేనిచ్చిన మందు పనిచేసిందా సరి, లేకపోతే ఇక అది బతకడం కష్టంఅని తేల్చి చెప్పాడు.
పక్కనే వున్న మేక ఆ సంభాషణ విన్నది. పోయి గుర్రంతో చెప్పింది.        

నువ్వు ఎలాగో అలా ఓపిక తెచ్చుకుని మామూలుగా వుండాలి సుమా!  ఇలాగే వున్నావంటే ఇక నువ్వు ఎందుకూ పనికి రావని తీర్మానించుకుని ప్రాణాలతో వుండగానే గొయ్యి తీసి నిలువునా పాతేస్తారు. నీ ఇష్టం.
రెండో రోజు వైద్యుడు మందిచ్చి వెళ్ళిన తరువాత కూడా గుర్రం కదలలేదు. మేక మళ్ళీ వచ్చి హిత బోధ చేసింది.
చూడు మిత్రమా! ఎంతో కొంత ఓపిక చేసుకో. వైద్యుడు వచ్చేవేళకు కాస్త లేచి తిరుగు. లేదంటే మందు  పని చేయడం లేదనుకుని నిన్ను పాతి పెడతారు. నా మాట వినుఅంది.   
వైద్యుడు మూడో రోజు కూడా వచ్చాడు. యధాప్రకారం ఇవ్వాల్సిన మందు ఆఖరి మోతాదు కూడా ఇచ్చాడు. ఇచ్చి రైతుతో చెప్పాడు.
నేను చేయాల్సిన ప్రయత్నం చేసాను. రేపు ఉదయం మరో సారి వస్తాను. అప్పుడు కూడా ఈ పరిస్తితే వుంటే ఇక చేయగలిగింది ఏమీ వుండదు, గుర్రాన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టడం మినహా. ఎందుకంటే ఈ గుర్రానికి వచ్చింది  ఆషామాషీ రోగం కాదు. అంటు  వ్యాధి. అది ఇతరులకు సోకకుండా వుండాలంటే ఇంతకంటే మార్గం లేదు.
వైద్యుడిని సాగనంపడానికి రైతు వెళ్ళగానే మేక వచ్చి మళ్ళీ గుర్రంతో పోరు పెట్టింది.
నా మాట విను మిత్రమా! నువ్వు ఇక ఎందుకూ  పనికిరావని  వీళ్ళకు అర్దమయింది. ఏదో  ఇన్నాళ్ళబట్టి ఒకరికొకరం కష్టాలు, సుఖాల్లో తోడు నీడగా ఓ చోట వుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఏదో విధంగా ఓపిక చేసుకో. నెమ్మదిగా లేచి నిలబడు. అలాగే. అలాగే. నెమ్మదిగా ఒక్కొక్క కాలు కూడదీసుకుని నిలబడు. అమ్మయ్య నా మాట ఇన్నాల్టికి నీకు అర్ధం అయినట్టుంది. ఎలాగో అలా లేచి నిలబడ్డావు. అలాగే శక్తి కూడదీసుకుని లగెత్తి పారిపో. ఇక్కడ వున్నావంటే నీకు చావు తప్పదు. ముందు అది గుర్తు పెట్టుకో.”             
నాకు తెలుసు. పరుగు పందెంలో నిన్ను మించిన వాడు లేడు. మొదలు పెట్టిన పరుగు ఆపకు. అలాగే పరిగెట్టు.అని సంతోషంతో ఉత్తేజపరచసాగింది.
గుర్రం లేచి ఇంటి పెరడులో పరిగెత్తుతుండగానే రైతు తిరిగివచ్చాడు. ఆ దృశ్యం చూడగానే అతడికి మహాదానందం అనిపించింది. మృత్యు ముఖంలో ప్రవేశించిన గుర్రం లేచి పరుగులు తీస్తూ వుండడం గమనించిన  సంతోషంలో భార్యను కేకేసి చెప్పాడు.
మందు పనిచేసింది. గుర్రం తేరుకుంది. ఈ ఆనందాన్ని ఇరుగూ పొరుగుతో కలసి పంచుకుందాం. ఈ రాత్రే విందు భోజనానికి ఏర్పాట్లు చేయి. మేకను కోసి అందరికీ వండి పెట్టు.
ఇది విన్న మేక ప్రాణాలు పైనే పోయాయి. (26-06-2012)
        

14, ఆగస్టు 2013, బుధవారం

కాశ్మీర్ జోక్


ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
 కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత  పౌరాణిక ఇతిహాసంలోని  ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో  సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార  వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.
అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు  వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు

ఒరులేయవి యొనరించిన


1997 లో 28  ఏళ్ళ ఓ యువకుడిని సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ప్రేమించి పెళ్ళాడినప్పుడు ఆ కుటుంబం సంగతి యేమో కాని దేశం యావత్తు నివ్వెరపోయింది. అంతకు 52 ఏళ్ళ క్రితమే  1942 లో జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని - తన  తండ్రి  అభీష్టానికి వ్యతిరేకంగా  పార్శీ కుటుంబానికి చెందిన   ఫిరోజ్  గాంధీని (వాస్తవానికి జాతిపిత మహాత్మా గాంధీకి ఈ ఫిరోజ్ గాంధీకి ఎలాటి బంధుత్వం లేదు) పరిణయం ఆడిన దగ్గరనుంచి ఇలాటి వివాహాలకు ఆ కుటుంబం బాగా అలవాటు పడిపోయిందనే చెప్పాలి. తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ ఇటలీ వనిత సోనియాను, అతడి తమ్ముడు సంజయ్ గాంధీ,  మేనకా (మనేకా) గాంధీని పెళ్ళిచేసుకుని తమ తలిదండ్రుల సంప్రదాయాన్ని కొనసాగిస్తే, సోనియా గారాలపట్టి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా ను పెళ్ళాడి  మూడో తరంలో కూడా ప్రేమ వివాహాల వొరవడిని మరింత  ముందుకు తీసుకువెళ్ళింది. ఆమె తమ్ముడు రాహుల్ గాంధీ మాత్రం ప్రేమ వివాహం మాట సరే  అసలు పెళ్ళిమాటే తలపెట్టడంలేదు.


(రాబర్ట్ వాద్రా - ప్రియాంకా గాంధి) 

ఇక ప్రస్తుతానికి వస్తే, రాబర్ట్ వొధేరా అనాలో రాబర్ట్ వాద్రా అని పలకాలో ప్రియాంకాతో పెళ్లినాటికి  ఎవరికీ  అంతుపట్టని ఆ  వ్యక్తి ఈనాడు మీడియా దృష్టిని  ప్రముఖంగా ఆకర్షిస్తున్నాడు.  నిజానికి అతడీనాడు అంత అనామకుడేమీ కాదు. దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి, యూపీయే అధినాయకురాలు అయిన సోనియా గాంధీకి స్వయానా ఇంటల్లుడు కావడం, భావిభారత ప్రధాన మంత్రిగా చూడాలని  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులన్నీ కోరుకుంటున్న  రాహుల్ గాంధీ అనుంగు సోదరి ప్రియాంక గాంధీని మనువాడడం కూడా అతడికింత ప్రచారం రావడానికి  కారణాలు కావచ్చు.  అయితే,  హమేషా మీడియా దృష్టి పడే కుటుంబానికి చెందినవాడే కాని మీడియా దృష్టిపెట్టాల్సినంత మనిషి కాదు రాబర్ట్ వాద్రా.  అయినా కానీ,  ఈనాడు  అందరి దృష్టీ అతడిపైనే వుంది. దీనికి కారకుడు ఎవరయ్యా అంటే,  రాజకీయాలను క్షాలనం చేస్తానంటూ ఏకంగా   ఓ రాజకీయ పార్టీని కొత్తగా పెట్టిన కేజ్రీవాల్. అవినీతి వ్యతిరేక ఉద్యమనేత  అన్నా హజారే బృందంలో వుంటూ,   రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్  ఆ  వెనువెంటనే ప్రయోగించిన తన తొలి ఆరోపణాస్త్రాన్ని  నేరుగా  రాబర్ట్ వాద్రా  మీదికే సంధించడంవల్లనే    వాద్రా  పేరు దేశవ్యాప్తంగా మారుమోగడం మొదలయింది.


(రాబర్ట్ వాద్రా)

1969 లో జన్మించిన రాబర్ట్ వాద్రా పెద్ద  శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినవాడేమీ కాదు. తండ్రి రాజేంద్ర వాద్రా ఒక సాధారణ వ్యాపారి. కొయ్యతో, ఇత్తడితో చేసిన బొమ్మలను, వస్తువులను విక్రయించే వ్యాపారం. తల్లి మౌరీన్ స్కాటిష్ జాతీయురాలు. ప్రియాంకాతో పెళ్ళయిన తరువాత రాబర్ట్ కు తండ్రితో పొసగలేదు. ఒక దశలో తండ్రికీ తనకూ సంబంధం లేదని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.
ఇక ఈ వివాదంలో చిక్కుకున్న మరో వ్యక్తి  కుశ్ పాల్ సింగ్. తన  మామగారినుంచి దక్కిన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించాడు. మామ రఘువేంద్ర సింగ్ స్తాపించిన డీ.ఎల్.ఎఫ్. సంస్థ నష్టాల  వూబిలో కూరుకుపోయివున్న తరుణంలో,  కుశ్ పాల్ సింగ్ అందులో  తన వాటాలను అమ్ముకోవాలని ఒక దశలో  అనుకున్నాడు కూడా.  కానీ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్  గాంధీతో యాదృచ్చికంగా జరిగిన పరిచయం  కుశ్ పాల్ సింగ్ జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. సింగ్ వ్యాపారాన్ని ఆకాశం అంచులకు తాకించింది. ఫలితంగా ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో ఆయన పేరు చేరింది. రాజకీయ ప్రాపకం వుంటే ఏదయినా సాధ్యం అని  కుశ్ పాల్ సింగ్ నిరూపించాడు. అత్యంత సంపన్నుడయిన సింగ్,  అత్యంత రాజకీయ ప్రాపకం వున్న రాబర్ట్ నడుమ వ్యాపార సంబంధాలు బలపడడంలో ఆశ్చర్యం లేదు. వారిరువురి  మధ్యా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో  సాగిన ఆర్ధిక లావాదేవీలనే  కేజ్రీవాల్ బయటపెట్టి సంచలనం సృష్టించారు.       
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో డి.ఎల్.ఎఫ్  అనే ఓ  బడా  సంస్థకు  లాభం లేదా మేలు జరిగేలా సోనియా అల్లుడిగా రాబర్ట్ వాద్రా పలుకుబడి ఉపయోగపడిందని, దానికి ప్రతిఫలంగా వాద్రాకు డి.ఎల్.ఎఫ్. కొన్ని కోట్లు విలువచేసే  ఆస్తులను కట్టబెట్టిందని  కేజ్రీవాల్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వున్న డి.ఎల్.ఎఫ్. సంస్థ, అరవై ఐదుకోట్ల రూపాయల  వడ్డీలేని, పూచీకత్తు అవసరం లేని రుణాన్ని  రాబర్ట్ వాద్రాకు ఇచ్చిందన్నది కేజ్రీవాల్ సంధించిన మొదటి అస్త్రం. వ్యాపార లావాదేవీల్లో  డబ్బు సర్దుబాట్లు చేసుకోవడం నేరం కాకపోవచ్చు. కానీ, ఇంతపెద్ద మొత్తాలు చేతులు మారుతున్నప్పుడు ఆ విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా జరగడానికి అవకాశం వుండదు. అయినా ఆ శాఖ మిన్నకుండా వున్నదంటే కచ్చితంగా రాబర్ట్ వాద్రా సోనియా కుటుంబంలో సభ్యుడు కావడమే కారణమని కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు.
ఆయన అంతటితో ఆగలేదు. మరికొన్ని ఆధారాలతో కూడిన కొత్త ఆరోపణలు చేశారు. నేను నీకీ పని చేసిపెడతాను. ప్రతిఫలంగా నువ్వు నాకు ఇది చేసిపెట్టు అనే పద్ధతిలో (ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని క్విడ్ ప్రోకొ  అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు) డీ.ఎల్.ఎఫ్.,  వాద్రాల  నడుమ అనేక రకాల  లావాదేవీలు సాగాయని కేజ్రీవాల్ వాదన.
అవినీతిని నిర్మూలించే  విషయంలో స్వపర భేదాలు లేకుండా సొంత పార్టీవారిని సైతం జైలు వూచలు లెక్కబెట్టిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలకు ఈ వివాదం కొరుకుడు పడడం లేదు. సాక్షాత్తు పార్టీ అధినేత్రి అల్లుడిపై గురిపెట్టిన ఈ కొత్త సంకటం నుంచి యెలా బయటపడాలన్నది వారికి సవాలుగా మారింది. అయితే నూటపాతికేళ్ల ఘన చరిత్ర వున్న పార్టీ కాబట్టి తొందరగానే తేరుకుని ఎదురు దాడి మొదలు పెట్టింది. తమ అధినాయకురాలిపై  ఈగ వాలితేనే  సహించలేని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు ఒక్కుమ్మడిగా లేచి,  రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నాయి.
ఏదిఏమయినా, కేంద్రంలో యూపీయే ప్రభుత్వం ఇప్పటికే రకరకాల ఆరోపణల్లో నిలువులోతున కూరుకుపోయి వుంది. కేంద్రమంత్రుల్లో మచ్చ పడని మంత్రుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మసకబారిన చరిత్ర వున్నవారిని సాధ్యమయినంత త్వరగా వోదిలించుకోని పక్షంలో ప్రభుత్వం పుట్టి మునిగే అవకాశాలు పెరుగుతాయి.
దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడుకోవాలన్నది నీతి వాక్యం.
కాంగ్రెస్ అధినేత్రి ఏం చేస్తారో వేచి చూడాలి.              
నన్నయ మహాభారతంలో ఒక పద్యం వుంది.
‘ఒరులేయవి యొనరించిన  
నరవరయప్రియము తన మనంబునకగుదా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్’ -    
‘ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు’ అన్నది దాని తాత్పర్యం.

దీన్ని కొద్దిగా మార్చితే ప్రస్తుత రాజకీయ నాయకులకు అన్వయిస్తుంది. చట్టాన్ని అమలుచేయడంలో సమ్యక్ దృష్టి వుండాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తేలిగ్గా చెప్పడం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై వుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. 

‘అనగనగా ఇద్దరు ........’

అనగనగా ఓ వూళ్ళో ఇద్దరు వుండేవాళ్ళు

తాతయ్య కధ చెప్పడం మొదలుపెట్టగానే చిన్నారి శంకరం అల్లరి మానేసి బుద్ధిగా వినడం మొదలెట్టాడు.

ఆ ఇద్దరిలో ఒకరికి  ముట్టె పొగరు జాస్తి. వాడికి  లేని అవలక్షణాలు లేవు. కోపం వస్తే వొళ్ళూ పై తెలియదు.పక్కవారు పచ్చగా వుంటే  కంట్లో నిప్పులు పోసుకుంటాడు. వాడి  అత్యాశకు అంతులేదు.  దురాశకు అవధులు లేవు. అన్నీ తనకే  కావాలనుకుంటాడు. పైగాఈ లక్షణాలకు తోడు  తనమీద తనకే ఎక్కడలేని  జాలి. భేషజానికేం  తక్కువలేదు. లేనిపోని  గొప్పలు చెప్పుకుంటూ తనో గొప్పవాడినని భ్రమ పడుతుంటాడు. పచ్చి అబద్దాలతో పబ్బం గడుపుకుంటాడు. పైపెచ్చు అహంకారం. ఎవర్నీ లెక్కచేయని తత్వం. తప్పు చేయడం అసలు  తప్పే కాదనుకునే మనిషి
మనుషుల్లో ఇలాటివాళ్ళు కూడా వుంటారా తాతయ్యా?’ అమాయకంగా అడిగాడు శంకరం.
మరో రకం కూడా వుంటారు.’ చెప్పసాగాడు తాతయ్య.
ఈ ఇద్దరిలో రెండోవాడున్నాడే వాడే ఈ రెండో రకం. వీడు మొదటివాడికి పూర్తిగా విరుద్ధం.
వీడేమో  అతి మంచివాడు. మంచంటే కామంచి కాదు. పుటం వేసిన బంగారం లాంటి మనిషి. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ వుంటాడు. ఎదటివారిని నవ్విస్తుంటాడు. పక్కవాడికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే వీడికి కంట్లో నీరు తిరుగుతుంది. హాయిగా  హాయిని పంచి పెడుతూ ఎంతో  హాయిగా జీవించడం వీడి నుంచే నేర్చుకోవాలి. తనమీద తనకు యెనలేని విశ్వాసం. భవిష్యత్తు మీద ప్రగాఢమైన నమ్మకం.  ఉదార హృదయం. తన గురించి ఆలోచించకుండా అవసరంలో వున్నవాడికి సాయపడడం వీడి నైజం.
ఇలాటి వాళ్లు కూడా వుంటారా తాతయ్యా!’ మనవాడి సందేహం.
వుంటార్రా. అలాటివాళ్ళు వుండబట్టే మనందరం వుండగలుగుతున్నాం. అదిసరే. ముందు కధ విను.
ఈ ఇద్దరి నడుమా ఒకరోజు పోట్లాట వచ్చింది. అది చిలికి చిలికి గాలివానగా మారి భీషణ పోరాటంగా మారింది.
ఇద్దరిలో ఎవరు గెలిచారు తాతయ్యా?’ మనవడి ప్రశ్న.
తాతయ్య ఒక్క క్షణం ఆగి,
ఎవరు గెలుస్తారుమనం ఎవరికి పాలుపోసి పెంచితే వాడిదే గెలుపు.
అంటూ తాతయ్య విలాసంగా నవ్వాడు.

(తనకు బాగా నచ్చిన చిన్న కధ అని కితాబు ఇస్తూ గూగుల్ ప్లస్ లో సుజాతగారు పోస్ట్ చేసిన ఆంగ్ల కధకు స్వేచ్చానువాదం భండారు శ్రీనివాసరావు)