12, మే 2012, శనివారం

‘నేను అమ్మను నాయనా!’






‘నేను అమ్మను నాయనా!’


(మే నెలలో రెండో ఆదివారం భారత దేశంలో ‘మాతృ దినోత్సవం’. ఈ  సందర్భంగా ‘అమ్మలగన్న అమ్మలందరికీ’ ఇది అంకితం)







అంత వయసూ, ఎంతో అనుభవం వుండీ కూడా అధికారి అడిగే  ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక వసుంధర తత్తర పడింది. 
‘టైం స్లాట్’  తీసుకుని వచ్చిన అప్పాయింట్ మెంట్ కాబట్టి వెనుక ఎవ్వరూ లేరు.
ఆఫీసర్ మళ్ళీ అడుగుతున్నాడు.
‘చెప్పండి మేడం! మీరెవ్వరు? ఏం చేస్తుంటారు?’
నిజమే. తనెవ్వరు? ఏం చేస్తుంటుంది? 
ఏం జవాబు చెప్పాలి?
వసుంధర లిప్త పాటు ఆలోచించింది.
ఆలోచించి చెప్పడం మొదలు పెట్టింది.
‘పిల్లల  మానసిక, భౌతిక పెరుగుదలను నేను కనిపెట్టి చూస్తుంటాను. ఆ పెరుగుదల ఏరీతిన సాగుతున్నది ఎప్పటికప్పుడు గమనిస్తుంటాను. ఒకరకంగా చెప్పాలంటే ఇది రీసెర్చ్ కిందికి వస్తుంది. అంతే  కాదు, పిల్లల ఆహారం, చదువూ సంధ్యా అన్నీ చూస్తుంటాను. పెద్దలతో పిల్లల ప్రవర్తన, నడవడిక యెలా వుండాలో బోధిస్తుంటాను.’
కౌంటర్ వెనుకనుంచి ప్రశ్నలు సంధిస్తున్న అధికారికి మతి పోయింది.
ఉత్సుకతను అణచుకోలేక మళ్ళీ అడిగాడు. 
‘ ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి మేడం! ఇంతకీ మీరేం చేస్తుంటారు?’
‘నా వయస్సు  ఇప్పుడు అరవై. చాలా ఏళ్లుగా నా ఈ రీసెర్చ్ సాగుతూనే వుంది. ముగింపు  కూడా కనుచూపు మేరలో  కానరావడం లేదు. పెళ్ళయిన నాటినుంచి  నా ఈ ఉద్యోగం రాత్రింబగళ్ళు చేస్తూ వస్తూనే వున్నాను. కనీసం ఒకటంటే ఒక్క రోజు కూడా సెలవు లేకుండా, ఆదివారాలు సయితం  పనిచేస్తూ వచ్చిన దానికి గుర్తింపుగా ఇప్పటికి రెండు సర్టిఫికేట్లు  దొరికాయి. ఆ రెండూ ఇప్పుడు నా దగ్గర లేవు. నా కనుసన్నల్లో పెరిగి, పై చదువులకోసం విదేశాలకు వెళ్ళిన నా ఇద్దరు పిల్లలే ఆ సర్టిఫికేట్లు. వారిదగ్గరకు వెళ్లడానికే ఇదిగో ఈ ప్రయత్నం. కాకపొతే ఇన్నాళ్లబట్టి నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు బాసులు ఇద్దరే. ఒకడు పైన వున్న భగవంతుడు అయితే, రెండోది నన్ను కట్టుకుని కనిపెట్టుకుని వున్న భర్త. పోతే జీతమంటారా! పనిలో పొందే మానసిక ఆనందమే నాకు దొరికే ప్రతిఫలం.
‘ఇంత చెప్పిన తరువాత కూడా నేనెవరంటావా?
‘అమ్మను నాయనా! నేను అమ్మను!!’ (12-05-2012)


(అమ్మను గురించి ‘ఈ’ మెయిల్ పంపిన వారికి కృతజ్ఞతలతో- భండారు శ్రీనివాసరావు)

10, మే 2012, గురువారం

జగన్ తో అమీతుమీకి సిద్ధపడుతున్న అధిష్టానం


జగన్ తో అమీతుమీకి సిద్ధపడుతున్న అధిష్టానం
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వున్నట్టుండి పూర్తిగా మారిపోయింది.
వురుములతో కూడిన జల్లులు పడతాయనుకుంటే, పెను గాలులతో కుంభవృష్టి కురిసే సూచనలు కానవస్తున్నాయి.
ఈ నెల 28 వ తేదీన కోర్టుకు హాజరవ్వాలంటూ జగన్ ఆస్తుల కేసులో అనేకమందికి  సమన్లు జారీ అయిన నేపధ్యంలో,  వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తధ్యం అంటూ మొదలయిన  వూహాగానాలపై చర్చోపచర్చలు ఓ పక్క సాగుతుండగానే ఆయనకు సంబంధించిన మూడు ప్రధాన సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ  సీబీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాలక పక్షానికీ, అటు ప్రధాన ప్రతిపక్షానికీ పక్కలో బల్లెం మాదిరిగా తయారయిన సాక్షిదినపత్రిక, ‘సాక్షి టీవీల  మనుగడనే  ప్రశ్నార్ధకం చేసేలా వున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు, స్వాగతించేవారు రెండు వర్గాలుగా విడిపోయి అసలే సంక్షుభితంగా వున్న రాజకీయ వాతావరణాన్ని మరింత కల్లోలభరితంగా మార్చేసారు.
సీబీఐ నిర్ణయంవల్ల ప్రధానంగా ప్రభావితం అయ్యే జగన్ మోహన్ రెడ్డి దీన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా పత్రికా స్వేచ్చ పై జరిగిన దాడిగా ఆరోపించారు. సీబీఐ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆయనే కనుక ఆ ఆవేదనను ఓ మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ కొన్ని జర్నలిష్టుల సంఘాలు, వాటి నాయకులు, జర్నలిజంలో కాకలు తీరిన మరికొందరు పత్రికా రచయితలు సైతం సాక్షిసంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. పత్రికా స్వేచ్చను హరించే చర్యగా విమర్శించారు.  ఆ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిష్టులు, వారి కుటుంబాలనే కాకుండా వాటిపై పరోక్షంగా ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలను ఈ నిర్ణయం ఇబ్బందుల పాలు చేస్తుందని వారి అభిప్రాయం. మరికొందరు పత్రికారచయితలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ సంపాదన ద్వారా  కూడబెట్టుకున్న ధనంతో పత్రికలను నడపాలని చూడడం పత్రికావిలువలకు తగని పని అన్నది వారి వాదన. పై పెచ్చు బ్యాంకు ఖాతాల స్తంభనను వ్యతిరేకించేవారు ఆయననుంచి నెల మామూళ్ళు తీసుకుంటున్నారని ఆరోపించడం చూస్తే ఈ విషయంలో మీడియా యెలా విడిపోయి వ్యవహరిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, పత్రికా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థలు  కాబట్టి వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. అలాగే సీబీఐ చట్ట పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది కనుక  అందులోను తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. తప్పుపట్టాల్సింది ఏమన్నావుంటే అసలు ఈ మొత్తం  వ్యవహారం సాగిన తీరుతెన్నులనే!
న్యాయస్థానం ఆదేశాలమేరకు సీబీఐ ప్రారంభించిన రెండు కేసుల్లోను ఒకరకంగా కేంద్రబిందువు జగన్ మోహన రెడ్డే కావడం విశేషం. అక్రమ మైనింగు కేసులో ఎలాటి మచ్చపడకుండా దర్యాప్తును ఓ కొలిక్కి తేగలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ,  జగన్ ఆస్తుల కేసు విషయం వచ్చేసరికి  నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదన్న పేరును నిలుపుకోలేకపోయిందనే చెప్పాలి. దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్న అభిప్రాయం కలిగేలా కొన్నాళ్లు, విచారణ బాగా వూపందుకుంటోంది  అనే భావన కలిగేలా మరికొన్నాళ్ళు సీబీఐ వ్యవహార శైలి కనిపించింది. రాజకీయపరమైన వొత్తిళ్ల కారణంగా ఇలా జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం సర్వత్రా బలపడడానికి ఇది దోహదం చేసింది. దఫదఫాలుగా సీబీఐ చార్జ్ షీట్లు దాఖలు చేయడం అనుమానాలకు తావిచ్చేదిగా వుందని  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  గాదె వెంకటరెడ్డి కూడా అభిప్రాయ పడినట్టు మీడియాలో వచ్చింది. అలాగే,  జగన్ మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రితో అవగాహన కుదుర్చుకోవడం వల్లనే దర్యాప్తు మందగించిందని తెలుగుదేశం నాయకులు అనేకమంది ఆరోపించడం గమనిస్తే ఈ కేసును ప్రభావితం చేస్తున్నది ఆర్ధికపరమైన నేరం కాకుండా రాజకీయపరమైన వొత్తిళ్లన్న అభిప్రాయం సామాన్య జనంలో నాటుకుపోయింది.  ఇలా ఈ కేసుకు  రాజకీయ రంగు అంటుకోవడం వల్లనో యేమో అవినీతి సొమ్ముగురించి కొందరు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం జనాలను ఆకట్టుకోలేకపోయింది.  అందుకే  ఇటీవల వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ వరస విజయాలను కైవసం చేసుకోవడానికి  ప్రజల్లో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయమే  దోహదపడింది. జగన్ మోహన రెడ్డి అవినీతి గురించి తామెంతగా మొత్తుకుంటున్నా  జనం యెందుకు పట్టించుకోవడం లేదనే అసహనాన్ని కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయకులు కూడా పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరచడం గమనార్హం. జగన్ మోహన రెడ్డిని, ఆయన పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన ఇటువంటి  ‘పాశుపతాస్త్రం’ అంబులపొదిలో వుండికూడా  పాలక,  ప్రతిపక్ష నాయకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహాత్మక తప్పిదాల ఫలితంగా అంతటి  మహాశక్తివంతమైన అస్త్రం కూడా   నీరుకారిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. అవినీతి అన్నదాన్ని  ఒక అంశంగానే ప్రజలు స్వీకరించడానికి ఇచ్చగించని  స్తితి ఉత్పన్నం కావడానికి కొందరు పాలక, ప్రతిపక్ష నేతలు జగన్ పై అదేపనిగా చేసిన, చేస్తున్న  విమర్శలు, ఆరోపణలు చాలావరకు  ఉపకరించాయి. కాని, వారు మాత్రం ఈ వాస్తవాన్ని ఏమాత్రం  గమనించకుండా అవే ఆరోపణలను  అదే  పనిగా కొనసాగిస్తూనే  వున్నారు. ఇలా పదే పదే ఒకే రకమయిన ఆరోపణల దాడి చేస్తూ వుంటే,  జగన్ పట్లా ఆయన పార్టీ పట్లా జనం విముఖత పెంచుకుంటారని వారి ఆలోచన కావచ్చు. అయితే,  ఇలాటి ఆరోపణల కారణంగానే  ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ మకిలి అంటుకుంటోందన్న వాస్తవాన్ని వారు మరచిపోయారు. అసలు ఈ కేసుకు మూలం ఆర్ధిక పరమైన నేరం  అన్న భావనను  జనంలో కలిగించివుంటే, అందుకు తగ్గట్టుగా పాలక, ప్రతిపక్ష నేతలు ఎంతో కొంత సంయమనం పాటించి వ్యవహరించి వుంటే, ఉప ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడానికి అవకాశాలు తగ్గివుండేవి. తాము విడవకుండా ఎక్కుపెడుతున్న అస్త్రాలన్నీ అవతల ప్రత్యర్ధికి గట్టి కవచంలా మారుతున్నాయన్న నిజం ఇంకా ఆ పార్టీలకు బోధపడినట్టు లేదు. ‘లోపల అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’న్న నానుడి మాదిరిగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు వ్యవహరిస్తూ,  జగన్ మోహన రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోగల సత్తా, తెగువ ప్రదర్శించడంలో విఫలం అయ్యాయనే చెప్పాలి. వాటి ఆ బలహీనతలన్నీ వైరి పక్షానికి బలంగా, వరంగా మారాయి.
ఈ నేపధ్యంలో వచ్చిపడిన మినీ ఎన్నికల సంగ్రామాన్ని యెలా ఎదుర్కోవాలో తెలియని అయోమయ స్తితిలో పడిన అధికారపక్షం ఆరునూరయినాచేసి  కనీసం అయిదారు స్తానాలనయినా గెలుచుకుని పరువు కాపాడుకోవాలన్న తాపత్రయంలో పడిపోయింది. ఈ లక్ష్య సాధనలో రాష్ట్ర కాంగ్రెస్  నాయకుల శక్తి సామర్ధ్యాలపట్ల ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పార్టీ  అధిస్థానం ముందు జాగ్రత్తగా  తన దూతలను పంపి పడకేసిన పార్టీకి   కొంత చికిత్స జరపాలని చూసింది.  కానీ,  ఉపఎన్నికల ఫలితాలను గురించి అందుతున్న  వివిధ సర్వేల  వివరాలు ఢిల్లీ పెద్దలను కలవరపరుస్తున్నాయి. ఈ  పరిస్థితుల్లో  ఏమిచేసినా, తిమ్మిని బమ్మి చేసినా సరే, రానున్న ఉపఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అటుంచి అనేక చోట్ల  రెండో స్తానం కోసమో, మూడో స్తానం కోసమో పోటీ పడాల్సిన దుస్తితి దాపురించి  వుందన్న వాస్తవం వారికి  అర్ధం అయింది.
అందువల్లే, ఒక నిర్ధారణకు వచ్చిన అధిష్టానం  జగన్ మోహన రెడ్డి పట్ల అత్యంత కఠిన వైఖరి అవలంబించడానికే సిద్ధపడినట్టు కానవస్తోంది.  ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉపఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురయినా సరే జగన్ విషయంలో అమీతుమీ తెల్చుకోవడానికే సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ పై ముప్పేట దాడి చేసి, ఆయన ఆర్ధిక మూలాలనూ, ఆయన పార్టీకి దన్నుగా మారిన సాక్షి   మీడియా మూలాలనూ వేళ్ళతో సహా పెరికివేసే పధకానికి  పచ్చ జెండా వూపినట్టు తెలుస్తోంది. ఫలితమే రాష్ట్ర రాజకీయ చిత్రంలో చకచకా మారిపోతున్న పరిణామాలు.
బ్యాంకు ఖాతాల స్తంభన అంశాన్ని గోరంతలు కొండంతలు  చేసి చూపుతున్నారని కొందరు వాదిస్తున్నారు. నిజమే, కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాటం చేసే అవకాశం వున్న మాట నిజమే. జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించి ఇంకా అనేక వ్యాపార సంస్థలు వున్నాయి. వాటి జోలికి పోకుండా వీటి జోలికే ముందు యెందుకు వచ్చారన్న ప్రశ్నకు మాత్రమే సరయిన జవాబు దొరకడం లేదు.
ఇక్కడే పైకి కనిపించని రాజకీయ కోణం దాగివుందని జగన్ వర్గ ప్రతినిధులు చెబుతున్నారు. సాక్షి మీడియా పునాదులను బలహీనం చేయగలిగితే, రాజకీయంగా ఆయన స్వరాన్ని అదుపుచేయడం సాధ్య పడగలదని కాంగ్రెస్ పెద్దల ఆలోచన అన్నది వారి మనోగతం. కేవలం రాజకీయం మాత్రమే కాకుండా మరికొన్ని శక్తులు జగన్  మీడియాకు వ్యతిరేకంగా కంకణం కట్టుకున్నాయన్నది కూడా వారి ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే వుంది కాంగ్రెస్ నాయకుల ధోరణి. జగన్ సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన విషయంలో ప్రభుత్వానికి కానీ, ఏ ఇతర పార్టీలకు కానీ, ‘మీడియా’ సంస్థలకు కానీ  ఎలాటి ‘ప్రమేయం’ లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పష్టం చేశారు. ఇలాటి సందర్భాలలో ఈ విధమయిన ప్రకటనలు చేయడం  దేనికి సంకేతం అనుకోవాలి?
కోర్టును ఆశ్రయించడం ద్వారా సాక్షి యాజమాన్యం  దినవారీ ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను, సంస్థ  నిర్వహణ వ్యయాన్ని బ్యాంకులనుంచి పొందగల వెసులుబాటు వున్నప్పుడు ఇంత గగ్గోలు ఎందుకన్నది జగన్  ప్రత్యర్ధుల వాదన.
నిజమే, ఇలాటి సర్దుబాటు చేసుకోగల అవకాశం కోర్టు ద్వారా పొందవచ్చు. కానీ, సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ క్రమం తప్పకుండా వెలువడడానికీ, ప్రసారం చేయడానికీ ఇందువల్ల  వీలు పడుతుందేమో కానీ, పోగొట్టుకున్న విశ్వసనీయతను అటు  పాఠకుల నుంచీ, ఇటు  ప్రేక్షకులనుంచీ, ఆ మాటకు వస్తే, ప్రకటనకర్తలనుంచి తిరిగిపొందడం కష్టం. ఏ  మీడియా మనుగడకయినా ఇలాటి విశ్వాసం ఎంతో అవసరమన్నది మీడియా నిర్వాహకులందరికీ తెలిసిన విషయమే. ఈ కారణం వల్లే, అలాటి ఆయువు పట్టుపై దెబ్బతీయడం  ఖచ్చితంగా పత్రికా స్వేచ్చను హరించడమే అన్నవాదనకు బలం చేకూరుతోంది. ఇలా వాదించే వారందరూ జగన్ సొమ్ములో వాటా కోరుకునేవారని కానీ, ఆయన నుంచి ఏదోరకమైన లబ్ది  పొందుతున్నారని కాని  ముద్రవేయడం కూడా  సరికాదు. (10-05-2012)                   

9, మే 2012, బుధవారం

ఏ తండ్రి చరిత్ర చూసినా!




(తండ్రులకు మాత్రమే!)
ఏ తండ్రి చరిత్ర చూసినా!

‘ఒపీనియన్స్ చేంజ్’ అన్నాడు గిరీశం.
వయసు పెరుగుతున్నకొద్దీ ఓ తండ్రి గురించి అతడి కొడుకు అభిప్రాయాలు యెలా మారిపోయాయో గమనిస్తే నిజమే కామోసు గిరీశం మాటలు అనిపిస్తుంది.
(నాలుగేళ్ల వయస్సులో)
“మా నాన్నకు అన్నీ తెలుసు”
(ఆరేళ్ళ వయస్సులో)
“ఏదో అనుకుంటాడు కానీ మా నాన్నకు అన్నీ తెలియవు”
(ఎనిమిదేళ్ళ వయస్సులో)
“ఏవిటో చెబితే అర్ధం చేసుకోడు.అసలు పిల్లల సంగతి ఆయనకేం తెలుసని”
(పద్నాలుగేళ్ల వయస్సులో)
“మా నాన్నవన్నీ పాతచింతకాయ పచ్చడి ఆలోచనలు”
(ఇరవైఒక్క ఏళ్ళ వయస్సులో)
“ఈ ముసలాయనకు  ఏం చెప్పినా, యెలా చెప్పినా ఓ పట్టాన అర్ధం కాదు”
(ఇరవై అయిదేళ్ళ వయస్సులో)
“ఈ విషయం గురించి మా నాన్నకు ఏదో కొంత తెలుసు కానీ, ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని చూస్తే పోనీలే పాపం అనిపిస్తుంది”
(ముప్పయ్యేళ్ళ వయస్సులో)
“ఈ విషయంలో మా నాన్నను అడిగివుంటే బాగుండి వుండేదేమో కదా!”
(ముప్పయి అయిదేళ్ళ వయస్సులో)
“ఇక నుంచి నాన్నను సంప్రదించకుండా ఒక్క పనీ చేయనుగాక చేయను”
(యాభయ్ ఏళ్ళ వయస్సులో)
“ఇలాటి సంకట పరిస్తితి ఎదురయినప్పుడు మా నాన్నే బతికివుంటే ఏమి చేసి వుండేవాడో!”
(అరవై ఏళ్ళ వయస్సులో తండ్రి సమాధి చెంత)
“నిజంగా  మా నాన్న చాలా గొప్పవాడు. ఆయన
 వున్నప్పుడు ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయాను
 వ్చ్! ఇప్పుడు అనుకుని ఏం లాభం?”





(నెట్లో అందుకున్న ఓ ఇంగ్లీష్ కధనం ఆధారంగా)
09-05-2012 







































7, మే 2012, సోమవారం

నీతి కధలో నీతి


నీతి కధలో నీతి
లోక్ సభలో ప్రభుత్వ పనితీరుపై చర్చ జరుగుతోంది.
పాలక పక్షానికి చెందిన సభ్యుడు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ అనర్ఘళంగా ప్రసంగిస్తున్నాడు.
మేడం  స్పీకర్! మీ అనుమతితో నేనొక చిన్న కధ చెప్పదలచుకున్నాను.
అనగనగా  ఓ  ఊర్లో ఓ తండ్రి. అతడికి ముగ్గురు కొడుకులు. కొడుకుల ప్రయోజకత్వాన్ని పరీక్షించడానికి తండ్రి ముగ్గురు కుమారులకు తలా వంద రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు.
ఇదిగో ఈ వందా తీసుకువెళ్ళి ఏదయినా సరుకు కొనుక్కు రండి. మీరు తెచ్చిన దానితో ఈ గది నిండిపోవాలి సుమా!అని షరతు కూడా  పెట్టాడు.
పెద్దవాడు వెంటనే వెళ్లి  ఆ వందతో వరిగడ్డి కొనుక్కుని తెచ్చాడు. వాస్తవానికి  ఎక్కువే  వచ్చింది కాని అతడు తెచ్చిన గడ్డితో ఆ గది పూర్తిగా నిండలేదు.
రెండోవాడు వంద రూపాయలు పెట్టి  బోలెడు దూది పట్టుకు వచ్చాడు.  కానీ దానితో కూడా గది పూర్తిగా నిండలేదు. కొంత ఖాళీ మిగిలి పోయింది.
మూడోవాడు తన తెలివిని ఉపయోగించి వంద రూపాయల్లో ఒకే ఒక రూపాయి ఖర్చుచేసి  ఒక  కొవ్వొత్తి కొనుక్కుని తెచ్చాడు. దాన్ని వెలిగించగానే ఆ వెలుతురుతో గది నిండిపోయింది.
కధ పూర్తిచేసిన కాంగ్రెస్ సభ్యుడు మరో వాక్యంతో తన ప్రసంగాన్ని ముగించాడు.
చూశారా!  దేనికయినా  తెలివితేటలు కావాలి. మన ప్రధాని కూడా అచ్చం ఈ కధలోని మూడో కుమారుడిలాటివాడు. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మనదేశం  యావత్తూ ఆయన మేధస్సు వెలిగించిన కాంతి సంపదతో  నిండిపోతోంది.
సాటి పాలక సభ్యుల హర్షధ్వానాల నడుమ ఆయన కాలరు ఎగరేస్తూ  తన సీటులో కూర్చోబోతున్న తరుణంలో సభలో ఒక మూలనుంచి ఎవ్వరో సన్నగా గొణిగారు.
దేశం  వెలిగిపోవడం  సంగతి సరే! మరి మిగిలిన తొంభయి తొమ్మిది రూపాయలు ఏమయినట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు?”

(07-05-2012)

6, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన - 1



కాశీ సమారాధన - 1

(కొత్త సీరియల్ ప్రారంభం – ఆదివారం స్పెషల్)

మా బామ్మ గారు రుక్మిణమ్మ గారు ఏ వయసులో కాశీ యాత్ర చేసివచ్చారో తెలియదు కాని అప్పుడు నేను  చాలా చిన్నవాడిని. ఆవిడ రెండోసారి వెళ్లి వచ్చినప్పుడు మాత్రం నన్ను వెంట తీసుకువెళ్ళకుండా మా మూడో అన్నయ్య శ్రీ వేంకటేశ్వర రావును  తోడు తీసుకు వెళ్లడం, నాకు కోపం వచ్చి వాళ్లు వెడుతున్న ఎడ్లబండికి  అడ్డం పడుకోవడం, కాసేపటికి మా పెద్దన్నయ్య శ్రీ పర్వతాలరావు వచ్చి గదమాయించి నన్ను ఇంటికి తీసుకుపోవడం బాగా గుర్తు. మా బామ్మ గారు కాశీ యాత్ర చేసి తిరిగివచ్చిన తరువాత నేరుగా ఇంటికి రాకుండా వూరి నడుమ వున్న ముత్యాలమ్మ గుడి రావి చెట్టు వద్ద విడిది చేసేవారు. వూళ్ళోని వాళ్లందరూ గుమికూడి ఆమెను, ఆమె వెంట కాశీ వెళ్లి వచ్చిన వారిని మేళ తాళాలతో వూరేగింపుగా ఇంటికి తీసుకువచ్చేవారు. తరువాత కాశీ సమారాధన చేసి వూరబంతి (వూళ్ళోని వారందరికీ సామూహిక భోజనం) పెట్టి యాత్రావిశేషాలను పూసగుచ్చినట్టు చెప్పేవారు. వూరిజనమంతా వొళ్ళంతా చెవులు చేసుకుని వింటూ వారే కాశీ పోయివచ్చినంతగా మహాదానందపడేవారు.
ఆ తరువాత కాశీ గురించి విన్నది, కన్నది ఏనుగుల వీరాస్వామయ్య గారు రాసిన కాశీ యాత్ర పుస్తకంలోనే. అది ఎన్నివందల సార్లు చదివిందీ నాకే గుర్తులేదు. ముఖ్యంగా శ్రీశైలం అడవిబాటలు, ఆనాటి హైదరాబాదు విశేషాలు చదువుతున్నప్పుడు అంత కష్టపడి యాత్ర చేసింది ఆ పుస్తకం చదివే మన అందరికోసం  అనిపించింది. అప్పటి సంగతులను కళ్ళకు కట్టినట్టు అందులో రాసిన విధానం ఎంతగానో ఆకట్టుకునే తీరుగా వుంది. ‘ఏదో తిరిగాము, తిన్నాము’ అన్నట్టుగా కాకుండా ఆ నాటి ఆచార వ్యవహారాలను, సాంఘిక స్తితిగతులను విడమరచి చెప్పడం ద్వారా యాత్రాకధనాలకు ఆయన ఒక విశిష్టతను ఆపాదించి పెట్టారు.
దరిమిలా మరో రెండు సార్లు కాశీ వెళ్లాను. మా బావగారు కౌటూరు కృష్ణ మూర్తి గారు చనిపోయినప్పుడు అస్తికలను  గంగలో కలపడానికి ఆయన పెద్ద కుమారుడు దుర్గాప్రసాదరావుతో పాటు నేను కూడా  తోడుగా కాశీ వెళ్లాను. 1993  శ్రావణ మాసంలో   మా అమ్మగారు వెంకట్రావమ్మగారు  పరమపదించినప్పుడు మరోసారి కాశీ వెళ్లాను. నిజం చెప్పాలంటే ఆ యాత్ర మా జీవితంలో నభూతో నభవిష్యతి. ఆమె చనిపోయిన రెండో రోజే  కర్మకాండ గురించిన చర్చల్లో మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు కాశీ ప్రసక్తి తేవడం, అందరం మరో మాట లేకుండా ఆయన మాటకు సరే అనడం, అమ్మ సంతానానికి చెందిన సుమారు ముప్పై మందిమి కాశీ బయలుదేరడం అంతా ఓ కలలా జరిగిపోయింది. అంతమందికి అంత తక్కువ వ్యవధిలో రైలు రిజర్వేషన్లు దొరకడం, పదహారేళ్లనుంచి పండు ముదిమిలో వున్నవారివరకు వెనుకంజ వేయకుండా కాశీ యాత్రకు సంసిద్ధులు కావడం, ఎలాటి ఇబ్బందీ ఎదురుకాకుండా అందరం కాశీ, ప్రయాగ, గయ మొదలయిన పుణ్య క్షేత్రాలను సందర్శించి మా అమ్మగారికి సంబంధించిన కర్మ కాండలను అన్నింటినీ సక్రమంగా పూర్తిచేసుకుని భద్రంగా ఇళ్లకు చేరడం, మొదటి మాసికాన్ని మా వూరు కంభంపాడులో మా మూడో అన్నయ్య, కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు గారు తన సంకల్ప బలంతో, అత్యల్ప స్వల్ప వ్యవధానంలో నిర్మించిన ‘అమ్మా నాన్నల గుడి’ వద్దే,  సమస్త వూరిజనం నడుమ, వివిధ ప్రాంతాలలోనె కాకుండా, అనేక రాష్ట్రాల్లో స్తిరపడ్డ అశేష బంధు జనం సమక్షంలో ‘ఒక పెళ్లి వేడుక’ మాదిరిగా నిర్వహించడం అంతా ‘అమ్మ’ చలవ వల్లే సాధ్యపడింది. ఆ సందర్భంలో మేనల్లుడు కౌటూరు దుర్గాప్రసాదరావు ప్రచురించిన ‘అమ్మ’ పుస్తకంలో చిన్నా పెద్దా అందరూ రాసిన సంస్మరణ కవితలు అబ్బుర పరిచేవిగా వున్నాయి. ఈ పుస్తకంలోనే మా ఐదో అక్కయ్య కొమరగిరి అన్నపూర్ణ ‘కాశీ యాత్రా విశేషాలను’ కళ్ళకు కట్టినట్టు రాసిన కధనాన్ని పొందుపరచడంతో ఆ పుస్తకానికి ఎక్కడలేని ఆదరణ లభించింది. అందుకే ఏ కొలమానాన్నిబట్టి చూసినా    ‘ధన్యజీవి’ మా అమ్మ.
ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత, మళ్ళీ -   ఆకాశవాణి పూర్వ సంచాలకులు వేమూరి విశ్వనాధ శాస్త్రి దంపతుల పూనికపై, వారి సారధ్యంలోనే కిందటి నెలలో నేనూ మా ఆవిడా ఇంకోసారి కాశీ యాత్ర చేసే అవకాశం లభించింది. కాకపొతే ఈ సారి కాశీతో పాటు, కలకత్తా, అయోధ్య, బైధ్యనాద్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించడం జరిగింది.
ఆ విశేషాలు తెలియచెప్పే ఉద్దేశ్యంతోనే – ఇదిగో ఈ ‘కాశీ సమారాధన.’   
(గమనిక – ఈ అంశంపై ఆసక్తి కలిగిన పాఠకుల సౌలభ్యం కోసం, ‘కాశీ సమారాధన’ తాజా భాగాలను ‘ప్రతి ఆదివారం’ పోస్ట్ చేస్తుంటాను.- భండారు శ్రీనివాసరావు)                                 

5, మే 2012, శనివారం

వృత్తి రహస్యం


వృత్తి రహస్యం
కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబాల్ మధ్య సాపత్యం ఏమిటంటే వాళ్ళిద్దరూ ప్రతినెలా క్షౌరం చేయించుకోవడానికి ఒకే సెలూన్ కు వెడతారు.
కపిల్ సిబాల్ కిందటినెల వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే బార్బర్  కపిల్ ని అడిగాడు.
ప్రతిరోజూ పేపర్లో వస్తుంటుంది స్విస్ బ్యాంకు, బ్లాకుమనీ అంటూ, ఇంతకీ  ఏమిటండీ దీని గొడవఅని.
ఆ ప్రశ్నతో  కపిల్ సిబాల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు.
నువ్వు నాకు క్షౌరం చేస్తున్నావా లేక సీబీఐ మాదిరిగా ఎంక్వైరీ చేస్తున్నావా?’ అంటూ అతడిపై అంతెత్తున ఎగిరిపడ్డాడు.
దాంతో బార్బరు ఏమీ అనుకోకండి, వూరికే అడిగానుఅంటూ వెనక్కి తగ్గాడు.
మర్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు తలపని చేయించుకోవడం కోసం వస్తే అదే బార్బరు తారసపడ్డాడు.
కత్తెర,కత్తీ పట్టుకుని  ఓపక్క పని చేస్తూనే, మళ్ళీ నోరు జారి బెంగాలీ బాబు గారిని కూడా అదే ప్రశ్న వేసాడు స్విస్ బ్యాంకూ,బ్లాకుమనీ గట్రా మతలబేమిటని.
ప్రణబ్ ముందు కలవరపడ్డా తమాయించుకుని ఈ ప్రశ్న నన్నే యెందుకు అడుగుతున్నావనిదబాయించాడు.
ప్రణబ్ కు  కోపం వచ్చిన సంగతి  గమనించిన బార్బరు వెంటనే ఆర్ధిక మంత్రికి క్షమాపణలు చెప్పాడు. ‘ఏదో మాటవరసకు అడిగాను, దయచేసి మరచిపోండి, మన్నించండి అని వేడుకున్నాడు.
మరునాడు తెలవారుతూనే సీబీఐ బృందం  ఆ సెలూనుపై దాడిచేసి  కేంద్రమంత్రులను బ్లాకు మనీ గురించీ, స్విస్ బ్యాంకు గురించి ఆరా తీసిన బార్బరును అదుపులోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టింది.
నువ్వు రాం దేవ్ బాబా ఏజెంటువా?’
కాదు సార్! నాకే పాపం తెలియదు సార్
మరి అలాంటప్పుడు, క్షౌరం చేసేవాడివి ఆ పని చేయకుండా నీకు స్విస్ బ్యాంకు గురించీ, బ్లాకుమనీ గురించీ ఆరాలెందుకు?’
ఒక సంగతి చెప్పమంటారా సార్! అది మా వృత్తి రహస్యం. మాదగ్గరకు వచ్చే కాంగ్రెస్ 


మంత్రులను స్విస్ బ్యాంకు గురించి, బ్లాకు మనీ గురించి అడగ్గానే ఇక చూడండీ!  వాళ్ల 


వెంట్రుకలు  వున్నట్టుండి నిక్కబొడుచుకుంటాయి. అలాటి జుట్టు కత్తిరించడం సులభంగా


వుంటుంది. అందుకే అలా అడుగుతుంటాను.’ (05-05-2012)

3, మే 2012, గురువారం

కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?


కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?

(03-05-2012 సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

- మూడోసారి ఆశలు ఆవిరి కానున్నాయా?
- అధిష్ఠానం ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా?
- అసాధారణ సమస్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌
- దిగజారుస్తున్న అధిష్ఠానం ఒంటెత్తు పోకడలు
- మసకబారిన ప్రధాని ప్రతిష్ఠ
- పట్టి పీడిస్తున్న అవినీతి, కుంభకోణాలు
- మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన 


sonia-manmohan-అసలు కాంగ్రెస్‌ లో ఏం జరుగు తోంది? అధిష్ఠానం అన్నీ గమని స్తోంది అని తరచుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయ కులు చెబుతుండే మాటలు నిజం కాబో తున్నాయా? రాష్ట్ర కాంగ్రెస్‌ను పట్టి కుదు పుతున్న రుగ్మతలకు శాశ్వత పరిష్కారం దిశగా అధిష్ఠానం పావులు కదుపుతోందా? వరసగా రెండోసారి అధికారంలోకి రాగలిగామని మూడేళ్ల క్రితం మురిసి పోయిన అపురూప క్షణాలు గత కాలపు ముచ్చటగా మారిపోతున్న నేపథ్యంలో, 2012 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా పార్టీని గెలిపించుకుని, రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకున్న ఆశలు కాస్తా ఆవిరి అయిపోతున్నాయేమో అన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగిందా?

తాము కోరి ఎంపిక చేసుకొని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరి స్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవర పెడుతోందా?
డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్ఠానం ప్రయ త్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?

ఇంతకీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
ఏమీ జరగకుండా అంతా సజావుగా ఉన్నపక్షంలో ఢిల్లీలోని అధిష్ఠానం పనుపున ఇంతమంది దూతలు ఇన్ని సార్లు హైదరాబాదు చక్కర్లు యెందుకు కొడుతున్నట్టు? సవాలక్ష సమస్యలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టి ఉన్న సమయంలో ముఖ్యమంత్రీ, పీసీసీ అధ్యక్షుడు ఇన్నిన్ని పర్యాయాలు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్టు?
సమాధానాలు తెలియని అనేక ప్రశ్నలు. ఒక వేళ తెలిసినా పైకి చెప్పుకోలేని అనేక ఆశక్తతలు. వెరసి ఈనాటి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి.ఆటు పోట్లు, హెచ్చు తగ్గులు, ముఠా తగాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు- ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకయినా తప్పని తల నొప్పులే! కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు గమనిస్తుంటే ఆ పార్టీ అసాధారణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదన్న భావన కలుగుతోంది. ఏదో ఒక జబ్బుకయితే రోగనిర్ధారణ చేసి రోగ నిదానానికి ప్రయత్నం చేయవచ్చు.

ఒకదాని కొకటి పొసగని రుగ్మతలతో పడకేసిన కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడం మాట అటుంచి, పార్టీ తన కాళ్ళమీద తాను నిలబడేట్టు చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడే వ్యవహారంగా కానరావడం లేదు. అందుకే, అనేక విచికిత్సల అనంతరం అధిష్ఠానం కాయకల్ప చికిత్సకు పూనుకున్నట్టుంది. బాగా ముదిరిపోయిన వ్యాధి ఏ చికిత్సకూ లొంగదు అన్న అనుమానం ఓ పక్క వేధిస్తున్నా, ఇక తప్పని సరై తానే కల్పించుకుని పరిస్థితులను ఏదో ఒక మేరకయినా చక్కదిద్దాలన్న ఆలోచనకు వచ్చినట్టుంది. బహుశా దాని ఫలితమే కాబోలు, ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో అధిష్ఠాన నాయకులు జరుపుతున్న నిర్విరామ చర్చలు, మరో వైపు తర్జని చూపుతూ చేస్తున్న హెచ్చరికలు!

నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంతగా దిగజారి పోవడానికి ప్రధాన కారణం అధిష్ఠానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్‌ అస్తవ్యస్థ పరిస్థితికి సంబంధించి ముద్దాయి స్థానంలో ఉండాల్సిన అధిష్ఠానం తీర్పరి పీఠంపై ఉండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో ‘పేను పెత్తనం’ చేయాలనే ఆభిలాష అదనం.
తమది 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ నాయకులు, తమ పార్టీ చరిత్రలో కలిసిపోకుండా చూసుకోవాలంటే తమ వ్యవహారశైలిని మార్చుకుని తీరాలి. నిర్ణయాలు ఢిల్లీలో తీసుకున్నా స్థానికంగా తీసుకుంటున్న అభిప్రాయాన్ని కల్పించాలి.

ప్రతి చిన్న విషయానికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న అపప్రథ, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు, చీటికీ మాటికీ ముఖ్యమంత్రులను మారుస్తున్నారన్న ఆరోపణ నిజానికి యూపీఏ-1 హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన మాట వాస్తవమే. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల విషయంలో నాటి అధినేత్రి ఇందిరా గాంధీ అనుసరించిన వైఖరికి భిన్నంగా సోనియా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఆ రోజుల్లో ప్రబలింది. 2009 ఎన్నికల్లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా అధిష్ఠానం వ్యవహార శైలిలో వచ్చిన ఈ గుణాత్మక మార్పు దోహదం చేసిందని భావించేవారు అనేకమంది ఉన్నారు.

అయితే, కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ మరోసారి అధికార పీఠం ఎక్కిన తరువాత అధిష్ఠానం తన పద్ధతికి కొంత దూరం జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. మన్మోహన్‌ ప్రధానిగా మొదటి టరంలో సంపాదించుకున్న ప్రతిష్ఠ మసకబారడం మొదలయింది. లెక్కకు మిక్కిలి అవినీతి ఆరోపణలు, అనుదినం వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఎన్నికల్లో ఎదురీతలు, వీధికెక్కి సవాళ్లు విసురుతున్న మిత్రపక్షాలు, ఒకటేమిటి అనేకానేక సమస్యల అమావాస్యల నడుమ యూపీఏ -2 సంకీర్ణ ప్రభుత్వం నడి సంద్రంలో నావ మాదిరిగా కొట్టుమిట్టాడు తున్నది. న్యూక్లియర్‌ ఒప్పందం విషయంలో నాటి మిత్ర పక్షం సీపీఎం కు ధాటీగా బదులిచ్చి, మీ అవసరం మాకు లేదు అని దాష్ఠీకంగా జవాబు చెప్పగలిగిన కాంగ్రెస్‌ నాయకత్వం ఈనాడు మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన చేయాల్సిన దుస్థితి లో ఉంది.

వారు చెప్పిన వారిని మంత్రిపదవి నుంచి తొలగిం చడం, పలానా వారినే తీసుకోవాలి, పలానా శాఖ ఇవ్వాలి అంటే జీ హుజూర్‌ అంటూ తల ఆడించడం- ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతటి శోభ కలిగిస్తుందో ఆ పార్టీ పెద్దలే చెప్పాలి. ఢిల్లీ స్తాయిలో తన పరిస్థితే ఇలా పెట్టుకుని- రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకోవడం అవివేకమే అయినా తప్పని బాధ్యతగా నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి. లోపల అయ్యవారేం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్న చందంగా తయారయింది. కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె.

Copy of bandaruముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్థితి. బహుశా నిర్ణయం అయిపోయింది, అమలు చేయడమే ఆలశ్యం అనే వాళ్లు కూడా ఉన్నారు.రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళ వైద్యం తప్పదేమో! దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు. కాకపోతే, తొలగించే అంగాలు ఒకటా రెండా అన్నదే ప్రశ్న.