10, మే 2012, గురువారం

జగన్ తో అమీతుమీకి సిద్ధపడుతున్న అధిష్టానం


జగన్ తో అమీతుమీకి సిద్ధపడుతున్న అధిష్టానం
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వున్నట్టుండి పూర్తిగా మారిపోయింది.
వురుములతో కూడిన జల్లులు పడతాయనుకుంటే, పెను గాలులతో కుంభవృష్టి కురిసే సూచనలు కానవస్తున్నాయి.
ఈ నెల 28 వ తేదీన కోర్టుకు హాజరవ్వాలంటూ జగన్ ఆస్తుల కేసులో అనేకమందికి  సమన్లు జారీ అయిన నేపధ్యంలో,  వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తధ్యం అంటూ మొదలయిన  వూహాగానాలపై చర్చోపచర్చలు ఓ పక్క సాగుతుండగానే ఆయనకు సంబంధించిన మూడు ప్రధాన సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తూ  సీబీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాలక పక్షానికీ, అటు ప్రధాన ప్రతిపక్షానికీ పక్కలో బల్లెం మాదిరిగా తయారయిన సాక్షిదినపత్రిక, ‘సాక్షి టీవీల  మనుగడనే  ప్రశ్నార్ధకం చేసేలా వున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు, స్వాగతించేవారు రెండు వర్గాలుగా విడిపోయి అసలే సంక్షుభితంగా వున్న రాజకీయ వాతావరణాన్ని మరింత కల్లోలభరితంగా మార్చేసారు.
సీబీఐ నిర్ణయంవల్ల ప్రధానంగా ప్రభావితం అయ్యే జగన్ మోహన్ రెడ్డి దీన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా పత్రికా స్వేచ్చ పై జరిగిన దాడిగా ఆరోపించారు. సీబీఐ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆయనే కనుక ఆ ఆవేదనను ఓ మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ కొన్ని జర్నలిష్టుల సంఘాలు, వాటి నాయకులు, జర్నలిజంలో కాకలు తీరిన మరికొందరు పత్రికా రచయితలు సైతం సాక్షిసంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. పత్రికా స్వేచ్చను హరించే చర్యగా విమర్శించారు.  ఆ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిష్టులు, వారి కుటుంబాలనే కాకుండా వాటిపై పరోక్షంగా ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలను ఈ నిర్ణయం ఇబ్బందుల పాలు చేస్తుందని వారి అభిప్రాయం. మరికొందరు పత్రికారచయితలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ సంపాదన ద్వారా  కూడబెట్టుకున్న ధనంతో పత్రికలను నడపాలని చూడడం పత్రికావిలువలకు తగని పని అన్నది వారి వాదన. పై పెచ్చు బ్యాంకు ఖాతాల స్తంభనను వ్యతిరేకించేవారు ఆయననుంచి నెల మామూళ్ళు తీసుకుంటున్నారని ఆరోపించడం చూస్తే ఈ విషయంలో మీడియా యెలా విడిపోయి వ్యవహరిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, పత్రికా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థలు  కాబట్టి వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. అలాగే సీబీఐ చట్ట పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది కనుక  అందులోను తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. తప్పుపట్టాల్సింది ఏమన్నావుంటే అసలు ఈ మొత్తం  వ్యవహారం సాగిన తీరుతెన్నులనే!
న్యాయస్థానం ఆదేశాలమేరకు సీబీఐ ప్రారంభించిన రెండు కేసుల్లోను ఒకరకంగా కేంద్రబిందువు జగన్ మోహన రెడ్డే కావడం విశేషం. అక్రమ మైనింగు కేసులో ఎలాటి మచ్చపడకుండా దర్యాప్తును ఓ కొలిక్కి తేగలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ,  జగన్ ఆస్తుల కేసు విషయం వచ్చేసరికి  నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదన్న పేరును నిలుపుకోలేకపోయిందనే చెప్పాలి. దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్న అభిప్రాయం కలిగేలా కొన్నాళ్లు, విచారణ బాగా వూపందుకుంటోంది  అనే భావన కలిగేలా మరికొన్నాళ్ళు సీబీఐ వ్యవహార శైలి కనిపించింది. రాజకీయపరమైన వొత్తిళ్ల కారణంగా ఇలా జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం సర్వత్రా బలపడడానికి ఇది దోహదం చేసింది. దఫదఫాలుగా సీబీఐ చార్జ్ షీట్లు దాఖలు చేయడం అనుమానాలకు తావిచ్చేదిగా వుందని  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  గాదె వెంకటరెడ్డి కూడా అభిప్రాయ పడినట్టు మీడియాలో వచ్చింది. అలాగే,  జగన్ మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రితో అవగాహన కుదుర్చుకోవడం వల్లనే దర్యాప్తు మందగించిందని తెలుగుదేశం నాయకులు అనేకమంది ఆరోపించడం గమనిస్తే ఈ కేసును ప్రభావితం చేస్తున్నది ఆర్ధికపరమైన నేరం కాకుండా రాజకీయపరమైన వొత్తిళ్లన్న అభిప్రాయం సామాన్య జనంలో నాటుకుపోయింది.  ఇలా ఈ కేసుకు  రాజకీయ రంగు అంటుకోవడం వల్లనో యేమో అవినీతి సొమ్ముగురించి కొందరు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం జనాలను ఆకట్టుకోలేకపోయింది.  అందుకే  ఇటీవల వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ వరస విజయాలను కైవసం చేసుకోవడానికి  ప్రజల్లో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయమే  దోహదపడింది. జగన్ మోహన రెడ్డి అవినీతి గురించి తామెంతగా మొత్తుకుంటున్నా  జనం యెందుకు పట్టించుకోవడం లేదనే అసహనాన్ని కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయకులు కూడా పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరచడం గమనార్హం. జగన్ మోహన రెడ్డిని, ఆయన పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన ఇటువంటి  ‘పాశుపతాస్త్రం’ అంబులపొదిలో వుండికూడా  పాలక,  ప్రతిపక్ష నాయకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహాత్మక తప్పిదాల ఫలితంగా అంతటి  మహాశక్తివంతమైన అస్త్రం కూడా   నీరుకారిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. అవినీతి అన్నదాన్ని  ఒక అంశంగానే ప్రజలు స్వీకరించడానికి ఇచ్చగించని  స్తితి ఉత్పన్నం కావడానికి కొందరు పాలక, ప్రతిపక్ష నేతలు జగన్ పై అదేపనిగా చేసిన, చేస్తున్న  విమర్శలు, ఆరోపణలు చాలావరకు  ఉపకరించాయి. కాని, వారు మాత్రం ఈ వాస్తవాన్ని ఏమాత్రం  గమనించకుండా అవే ఆరోపణలను  అదే  పనిగా కొనసాగిస్తూనే  వున్నారు. ఇలా పదే పదే ఒకే రకమయిన ఆరోపణల దాడి చేస్తూ వుంటే,  జగన్ పట్లా ఆయన పార్టీ పట్లా జనం విముఖత పెంచుకుంటారని వారి ఆలోచన కావచ్చు. అయితే,  ఇలాటి ఆరోపణల కారణంగానే  ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ మకిలి అంటుకుంటోందన్న వాస్తవాన్ని వారు మరచిపోయారు. అసలు ఈ కేసుకు మూలం ఆర్ధిక పరమైన నేరం  అన్న భావనను  జనంలో కలిగించివుంటే, అందుకు తగ్గట్టుగా పాలక, ప్రతిపక్ష నేతలు ఎంతో కొంత సంయమనం పాటించి వ్యవహరించి వుంటే, ఉప ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడానికి అవకాశాలు తగ్గివుండేవి. తాము విడవకుండా ఎక్కుపెడుతున్న అస్త్రాలన్నీ అవతల ప్రత్యర్ధికి గట్టి కవచంలా మారుతున్నాయన్న నిజం ఇంకా ఆ పార్టీలకు బోధపడినట్టు లేదు. ‘లోపల అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’న్న నానుడి మాదిరిగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు వ్యవహరిస్తూ,  జగన్ మోహన రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోగల సత్తా, తెగువ ప్రదర్శించడంలో విఫలం అయ్యాయనే చెప్పాలి. వాటి ఆ బలహీనతలన్నీ వైరి పక్షానికి బలంగా, వరంగా మారాయి.
ఈ నేపధ్యంలో వచ్చిపడిన మినీ ఎన్నికల సంగ్రామాన్ని యెలా ఎదుర్కోవాలో తెలియని అయోమయ స్తితిలో పడిన అధికారపక్షం ఆరునూరయినాచేసి  కనీసం అయిదారు స్తానాలనయినా గెలుచుకుని పరువు కాపాడుకోవాలన్న తాపత్రయంలో పడిపోయింది. ఈ లక్ష్య సాధనలో రాష్ట్ర కాంగ్రెస్  నాయకుల శక్తి సామర్ధ్యాలపట్ల ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పార్టీ  అధిస్థానం ముందు జాగ్రత్తగా  తన దూతలను పంపి పడకేసిన పార్టీకి   కొంత చికిత్స జరపాలని చూసింది.  కానీ,  ఉపఎన్నికల ఫలితాలను గురించి అందుతున్న  వివిధ సర్వేల  వివరాలు ఢిల్లీ పెద్దలను కలవరపరుస్తున్నాయి. ఈ  పరిస్థితుల్లో  ఏమిచేసినా, తిమ్మిని బమ్మి చేసినా సరే, రానున్న ఉపఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అటుంచి అనేక చోట్ల  రెండో స్తానం కోసమో, మూడో స్తానం కోసమో పోటీ పడాల్సిన దుస్తితి దాపురించి  వుందన్న వాస్తవం వారికి  అర్ధం అయింది.
అందువల్లే, ఒక నిర్ధారణకు వచ్చిన అధిష్టానం  జగన్ మోహన రెడ్డి పట్ల అత్యంత కఠిన వైఖరి అవలంబించడానికే సిద్ధపడినట్టు కానవస్తోంది.  ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉపఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురయినా సరే జగన్ విషయంలో అమీతుమీ తెల్చుకోవడానికే సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ పై ముప్పేట దాడి చేసి, ఆయన ఆర్ధిక మూలాలనూ, ఆయన పార్టీకి దన్నుగా మారిన సాక్షి   మీడియా మూలాలనూ వేళ్ళతో సహా పెరికివేసే పధకానికి  పచ్చ జెండా వూపినట్టు తెలుస్తోంది. ఫలితమే రాష్ట్ర రాజకీయ చిత్రంలో చకచకా మారిపోతున్న పరిణామాలు.
బ్యాంకు ఖాతాల స్తంభన అంశాన్ని గోరంతలు కొండంతలు  చేసి చూపుతున్నారని కొందరు వాదిస్తున్నారు. నిజమే, కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాటం చేసే అవకాశం వున్న మాట నిజమే. జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించి ఇంకా అనేక వ్యాపార సంస్థలు వున్నాయి. వాటి జోలికి పోకుండా వీటి జోలికే ముందు యెందుకు వచ్చారన్న ప్రశ్నకు మాత్రమే సరయిన జవాబు దొరకడం లేదు.
ఇక్కడే పైకి కనిపించని రాజకీయ కోణం దాగివుందని జగన్ వర్గ ప్రతినిధులు చెబుతున్నారు. సాక్షి మీడియా పునాదులను బలహీనం చేయగలిగితే, రాజకీయంగా ఆయన స్వరాన్ని అదుపుచేయడం సాధ్య పడగలదని కాంగ్రెస్ పెద్దల ఆలోచన అన్నది వారి మనోగతం. కేవలం రాజకీయం మాత్రమే కాకుండా మరికొన్ని శక్తులు జగన్  మీడియాకు వ్యతిరేకంగా కంకణం కట్టుకున్నాయన్నది కూడా వారి ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే వుంది కాంగ్రెస్ నాయకుల ధోరణి. జగన్ సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన విషయంలో ప్రభుత్వానికి కానీ, ఏ ఇతర పార్టీలకు కానీ, ‘మీడియా’ సంస్థలకు కానీ  ఎలాటి ‘ప్రమేయం’ లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పష్టం చేశారు. ఇలాటి సందర్భాలలో ఈ విధమయిన ప్రకటనలు చేయడం  దేనికి సంకేతం అనుకోవాలి?
కోర్టును ఆశ్రయించడం ద్వారా సాక్షి యాజమాన్యం  దినవారీ ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను, సంస్థ  నిర్వహణ వ్యయాన్ని బ్యాంకులనుంచి పొందగల వెసులుబాటు వున్నప్పుడు ఇంత గగ్గోలు ఎందుకన్నది జగన్  ప్రత్యర్ధుల వాదన.
నిజమే, ఇలాటి సర్దుబాటు చేసుకోగల అవకాశం కోర్టు ద్వారా పొందవచ్చు. కానీ, సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ క్రమం తప్పకుండా వెలువడడానికీ, ప్రసారం చేయడానికీ ఇందువల్ల  వీలు పడుతుందేమో కానీ, పోగొట్టుకున్న విశ్వసనీయతను అటు  పాఠకుల నుంచీ, ఇటు  ప్రేక్షకులనుంచీ, ఆ మాటకు వస్తే, ప్రకటనకర్తలనుంచి తిరిగిపొందడం కష్టం. ఏ  మీడియా మనుగడకయినా ఇలాటి విశ్వాసం ఎంతో అవసరమన్నది మీడియా నిర్వాహకులందరికీ తెలిసిన విషయమే. ఈ కారణం వల్లే, అలాటి ఆయువు పట్టుపై దెబ్బతీయడం  ఖచ్చితంగా పత్రికా స్వేచ్చను హరించడమే అన్నవాదనకు బలం చేకూరుతోంది. ఇలా వాదించే వారందరూ జగన్ సొమ్ములో వాటా కోరుకునేవారని కానీ, ఆయన నుంచి ఏదోరకమైన లబ్ది  పొందుతున్నారని కాని  ముద్రవేయడం కూడా  సరికాదు. (10-05-2012)                   

8 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

జలయజ్ఞం పేరుతో రాజశేఖరాసురుడు చేసిన అవినీతి వల్ల మా ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రోజెక్ట్‌లు అర్థాంతరంగా ఆగిపోయి రైతులు ఇతర ప్రాంతాలకి కూలీలుగా ఎలా వలస వెళ్తున్నారో నాకు తెలుసు. జగన్‌గాడిని పూర్తిగా బొందలో పాతే రోజు రావాలి.

Alapati Ramesh Babu చెప్పారు...

రాజకీయపార్టీలకు కావలసింది ఓట్లు తప్ప ప్రజలసౌకర్యము కాదు. దేశము,కాంగ్రేస్,జగన్ పార్టీ వీళ్ళందరికి కావలసింది అధికారమే.బాబు కూడా ఇంతకన్నా ఎక్కువ అవినీతి చేసి చూపాడు.ఒకరి తరువాత ఒకరు ప్రజలను దోచుకున్నారు. కాకాపొతే తరువాత మాకు మాకు అని కుక్కల కొట్లాట.కాంగ్రేస్ ఎమో పొయింది అన్నరీతిలో డిసైడ్ అయి సకల అంకచండాలం చేస్తున్నారు.బాబు, జగన్ ఇద్దరు శీలం లేనివారే. ఇద్దరు ఒకరికొకరిని లం లం అని తిట్టుకొవటమే మనము చూస్తున్నాము.

Praveen Mandangi చెప్పారు...

జగన్ ముఖ్యమంత్రి అయితే అతను హైదరాబాద్ నిజాంలాగ రాష్ట్రాన్ని ప్రైవేట్ ఎస్టేట్‌లా మార్చుకుని నిజాం తన అనుచరులకి భూములని జాగీర్‌లుగా పంచినట్టు జగన్ కూడా తన అనుచరులకి రాష్ట్రాన్ని పంచిపెడతాడు.

అజ్ఞాత చెప్పారు...

జగన్ గాడు ఇన్ని వేల కోట్లు దోచింది కాళ్ళ ముందు కనబడుతున్న అర్థం కావడం లేదు కొంత మంది గొర్రెలకి. ఏం చేస్తే ఎక్కుతుంది ఈ మట్టి బుర్రలకి ఏమి చెప్తే ఎక్కుతుంది? ఇలా లక్షల కోట్లు దోచేవాడిని సపోర్ట్ చేయడం, తరువాత దేశం బాగు పడటం లేదని ఏడవటం.

Praveen Mandangi చెప్పారు...

గూగుల్ ప్లస్‌లో ఒక మహానుభవుడు ఏమన్నాడో తెలుసా? "జగన్ ఎంత తిన్నాడు అనేది ఎవరికి కావాలి? సాక్షి అకౌంట్‌లు బ్లాక్ చేస్తే సాక్షిలో పని చేసే ఉద్యోగులకి జీతాలు అందవు" అని.

Praveen Mandangi చెప్పారు...

నేను కొని చదివేది "వార్త" దిన పత్రిక. "సాక్షి" పేపర్ ఆన్లైన్‌లో మాత్రమే చదువుతుంటాను. రాజశేఖరరెడ్డి అవినీతి వల్ల కాంట్రాక్ట్ సంపాదించిన తోటపల్లి బేరేజ్ కాంట్రాక్టర్ బేరేజ్ పనులు పూర్తి చెయ్యకుండా అధికారుల సహాయంతో తన యంత్రాలని తీసుకుని ఎలా ఉడాయించాడో “వార్త” దిన పత్రికలో వ్రాసారు కానీ “సాక్షి” దిన పత్రికలో వ్రాయలేదు.

Praveen Mandangi చెప్పారు...

Studio N నుంచి 70 మందిని ఉద్యోగాల నుంచి పీకేసినప్పుడు ఈ సోకాల్డ్ పాత్రికేయ సంఘాలు ఆందోళనలు చెయ్యలేదు. ఎందుకంటే ఆ సంఘాల నాయకులు సీనియర్ జర్నలిస్ట్‌లు, వాళ్ళ ఉద్యోగాలు అంత తొందరగా పోవు కాబట్టి. ఇప్పుడు సాక్షి ఉద్యోగుల విషయంలో దొంగ కన్నీళ్ళు కారుస్తున్నారు. గతంలో నా కామెంట్లని వెంటనే పబ్లిష్ చేసిన రాము ఇప్పుడు నా కామెంట్లని పన్నెండు గంటల తరువాత అప్రూవ్ చేస్తున్నాడు. CBIవాళ్ళు ఫ్రీజ్ చెయ్యించినవి మూడు బ్యాంక్ అకౌంట్లే. జగన్‌కి మరో పంతొమ్మిది బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయని సాక్షి పత్రిక ఇడియే చెప్పుకున్నాడు. మూడు బ్యాంక్ అకౌంట్‌లు ఫ్రీజ్ అయినంతమాత్రాన సాక్షి ఉద్యోగుల ఉద్యోగాలు పోవు.

అజ్ఞాత చెప్పారు...

పల్నాటి గడ్డమీద పుట్టిన ఓ తెలుగు పౌరులారా...త్యాగాలకు వెనుకాడని పల్నాటి వీరులారా..
రండి కదలిరండి నీతిగా నీతికి ఓటేద్దాం ,అవినీతిని తరిమి కొడదాం...తెలుగుదేశాన్ని గెలిపించి ,రాష్ట్రాన్ని రక్షించుకుందాము . సైకిల్ గుర్తుకే వోట్ వేసి మాచర్ల TDP మెంబెర్ చిరుమామిళ్ళ మధు గారిని అఖండ మెజారిటీ తో గెలిపించాలని ..................................కోరుతూ మీ మాచర్ల TDP యువత

http://www.facebook.com/groups/macherlatdpyuvatha/