20, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన – మూడో భాగం


కాశీ సమారాధన – మూడో భాగం
చూస్తుండగానే మూడో ఆదివారం తోసుకువచ్చింది. కాస్త వెనక్కి వెళ్లి తొంభయ్యో  దశకంలో మా అక్కయ్య శ్రీమతి అన్నపూర్ణ రాసిన ‘అమ్మ’ పుస్తకంలో ఉదహరించిన కొన్ని కాశీ యాత్ర ముచ్చట్లు మననం చేసుకుందాం.
“అమ్మ అపర క్రియలు కాశీలో చేయాలన్న నిర్ణయం యే అదృశ్య శక్తో మాచేత చేయించింది. అంతేకాదు, మాకంటే ముందుగా ఎవరో వెళ్లి అన్ని ఏర్పాట్లు ఆ శక్తే చేసింది అన్నట్టుగా అంత  సాఫీగా, హాయిగా మా యాత్ర సాగింది.” అని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు ఈ పుస్తకం తొలి పలుకుల్లో పేర్కొన్నారు. అవి అక్షర సత్యాలు.
పోతే అన్నపూర్ణక్కయ్య  తన కధనంలో కాశీయాత్రకు ప్రోద్భల పరచిన విషయాల పూర్వాపరాలను కూడా స్పృశించారు.
“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907  నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని  చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని   ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి  గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన  సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన  పూర్ణ జీవితం గడిపింది.
1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది.  ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది.  చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది.  మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
 “మూడో రోజు ఉదయం, ఆస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. భారతి మొగుడు పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి  గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది.” (20-05-2012)                               

కామెంట్‌లు లేవు: