14, మే 2012, సోమవారం

దేవుడా జాగ్రత్త!


దేవుడా జాగ్రత్త! 

హే భగవాన్!

మమ్మల్ని క్షమించు.నీ ముందు మోకరిల్లి మేము రోజూ చేసే ప్రార్ధన ఒకటి. కానీ అనుదినం మేము చేస్తున్న పనులు వేరు.

ప్రతి రోజు ప్రార్ధన సమయంలో ‘దేవుడి మాటలంటూ’ నువ్వు చెప్పే వాటన్నిటినీ బుద్ధిగా వల్లె వేస్తాం.

అడుగు జరగగానే వాటిని నీ గుడి వాకిటి లోనే  మరచిపోతాం.

ఆడపిల్లల్ని గురించి పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం. కానీ, వారిని తల్లి గర్భంలో  
వుండగానే మట్టుబెట్టే ప్రయత్నం చేస్తాం.

 పైకి మాత్రం ఆడపిల్ల కావాలో మగపిల్లవాడు కావాలో తేల్చుకునే  హక్కువుందంటూ  లెక్కలు చెబుతాం. 

పిల్లల్ని క్రమశిక్షణలో పెంచం. పైపెచ్చు  వాళ్లను చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలతో పెంచుతున్నామని చెప్పుకుని గర్వపడతాం.

అధికారం అందితే చాలు, ఇక దాన్ని అవధులు లేకుండా  దుర్వినియోగం చేస్తాం. దానికి రాజకీయం అని ముద్దు పేరు పెట్టుకుంటాం.

పరాయి సొమ్ము పాముతో సమానమని సుద్దులు చెబుతాం. కానీ పరుల సొమ్ముకు ఇట్టే  ఆశపడతాం.  అవకాశం దొరికినా దొరక్కపోయినా దొరకపుచ్చుకుని మరీ పక్క వారి డబ్బులు, ఆస్తీ కాజేయాలని చూస్తాం. అందుకు పధకాలు వేస్తాం. ధనం సంపాదించడం ముఖ్యం కాని దాన్ని యెలా సంపాదించావన్నది ముఖ్యం కాదని సిద్ధాంతాలు లేవదీస్తాం.
 
సభ్యసమాజంలో సభ్యతగా మెలగాలని అందరికీ సూక్తులు బోధిస్తాం. వీలు చిక్కిందంటే చాలు నీలి చిత్రాలు చూడాలని మనసు పడతాం. రాతల్లో, రచనల్లో నీతులు కుమ్మరిస్తాం. సమయం దొరికిందంటే చాలు, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి మాదిరిగా ఆ నీతుల చుట్టూ గీతలు గీసిఅసలు రూపాలతో పాపాలు చేస్తాం. అసభ్య చిత్రాలతో,అడ్డమయిన  రాతలతో సమాజాన్ని కలుషితం చేస్తాం. ఈ ఘనకార్యానికి భావప్రకటనా స్వేచ్ఛ అని ఘనమయిన పేరు పెట్టుకుంటాం.
 

తాతల తండ్రులనుంచి వారసత్వంగా మా చేతికందిన విలువలను కాలరాచేస్తాం. పాతతరం భావాలు పాతరవేసి కొత్తతరాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆర్భాటాలు పోతూ,  
మానసిక పరిణతికి ఈ మార్పును కొలమానంగా పేర్కొంటాం.

అందుకే  ఓ భగవాన్.

ఓ విషయం తెలుసుకో. మాకు నిన్ను మెప్పించడం తెలుసు. వరాలు కోరుకోవడం తెలుసు. వాటిని  నీ నుంచి పొందడం తెలుసు. ఈఠక్కుఠమార విద్యలన్నింటిలో మేము పెద్ద పెద్ద పట్టాలే పుచ్చుకున్నాం. కానీ నీకిచ్చే మాటలను నిలుపుకోవడం మాత్రం తెలియదు. తెలియదని కాదు, తెలియనట్టు వుంటాం. అది తెలుసుకో ముందు.

చేసేవన్నీ చేసేసి అవన్నీ నీమీదకు తోసేసే తెలివితేటలు మాకు నువ్వే ఇచ్చావన్న సంగతి మాత్రం మరచిపోకు.

మమ్మల్నో కంట కనిపెట్టి చూడు.

మా మనుషుల తరహా చూస్తుంటే వాళ్ళల్లో ఒకడినయిన నాకే భయం వేస్తోంది. అందుకే సమయం చూసి నీకీ విషయాలు చెవిలో వేస్తున్నాను.

మా మాదిరిగానే నువ్వుకూడా నీ సృష్టినీ, నీ సంతానాన్ని  గాలికి  వొదిలేస్తే, మమ్మల్ని కనిపెట్టిచూడడానికి నువ్వున్నట్టు నీకెవ్వరూ లేరు. అది గుర్తుంచుకో. అప్పుడు – ‘ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగేఅంటూ  మరో అవతారం ఎత్తినా  ఎలాటి ఫలితం వుండదు.
ఎందుకంటే, మేం మానవులం. సామాన్యులం కాదు.

తస్మాత్ జాగ్రతః 


(14-05-2012)

కామెంట్‌లు లేవు: