15, నవంబర్ 2011, మంగళవారం

రాజకీయ నీరజాక్షులు - భండారు శ్రీనివాసరావు


 వార్త – వ్యాఖ్య

“........తను నిర్దోషినని నమ్ముతున్నట్టయితే  సీ.బీ.ఐ. దర్యాప్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి.”
“........ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తుకు సహకరించి అగ్ని పునీతుడిలా బయట పడాలి”
“........కోర్టు ఆదేశాల ప్రకారం జరిగే దర్యాప్తు. రాజకీయకక్షతో చేస్తున్నారన్న అనుమానాలు నిరాధారం”
నిన్నా ఇవ్వాళా వినబడుతున్న ఈ మాటలన్నీ ఈ మధ్యనే ఎక్కడో  విన్నట్టుంది కదూ. ఎవరో ఒకరు అన్నట్టుంది కదూ.
ఇదే రాజకీయం అంటే. ఈ రాజకీయ నీరజాక్షులు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. రాగానే మాటకు మాట అప్పజెప్పి ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పు వారిది కాదు కదా. అంతకు ముందు ‘ఈ ఆట’ మొదలుపెట్టినవారికి కూడా ఇందులో  కొంత భాగముంటుంది కదా.
అందుకే అన్నారు ఒకరిపై వేలెత్తి చూపితే నాలుగువేళ్ళు మనవైపు చూస్తుంటాయని. కాకపొతే, ఇది తెలియని అజ్ఞానులెవరూ లేరు. తెలియనట్టు వుంటారంతే. (15-11-2011)    

6, నవంబర్ 2011, ఆదివారం



మితిమీరిన మీడియా ఉత్సాహం




(సత్యం రామలింగరాజు ఆర్ధిక నేరాల ఆరోపణల ఉచ్చులో చిక్కుకుని అరెస్ట్ అయినప్పుడు – ఆ నాటి సత్యం సామ్రాజ్యానికి ‘షేర్ల’ రూపంలో పెట్టుబడులు పెట్టి ఆ తరవాత గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో - ఆరోజుల్లో నేను  రాసిన ఒక ఆర్టికిల్  ని  – రాజు గారికి బెయిల్ దొరికి ఇంటికి చేరుకున్నారన్న సంగతి తెలిసి  దాన్ని మళ్ళీ  పోస్ట్ చేస్తున్నాను. రాజు గారికీ నాకూ ఏవిధమయిన వ్యక్తిగత పరిచయం లేదన్న విషయం గమనంలో వుంచుకోవాల్సిందిగా మనవి – భండారు శ్రీనివాసరావు - 06-11-2011-)









నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!                     -శ్రీశ్రీ


ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.  శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు,  సమృద్ధిజీవులు, మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.



ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి,  నిరంతర శ్రమతో,  నిర్విరామ కృషితో,  మొక్కవోని పట్టుదలతో-  ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న సువిశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి.


సత్యమేరా జీవితం - సత్యమేరా శాశ్వితం
 `సత్యమైట్లు' గా -  సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. నేటికది  చెదిరిన స్వప్నం.

ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ -  రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో చిక్కుకుపోయి మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.


ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది.


 `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది.
అదే  జరిగింది కూడా.



 


 ఇక వాటాదారులు విషయం అంటారా!
 మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.

సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.
 అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.

-భండారు శ్రీనివాసరావు - జనవరి 2009

NOTE:All the images in the blog are copy righted to the respective owners

2, నవంబర్ 2011, బుధవారం

కాశ్మీర్ జోక్




కాశ్మీర్ జోక్
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత  పౌరాణిక ఇతిహాసంలోని  ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో  సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార  వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“ అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు  వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు (02-11-2011) 

31, అక్టోబర్ 2011, సోమవారం

ఏడు పక్కన ఎన్ని సున్నాలు?


ఏడు పక్కన ఎన్ని సున్నాలు?

నిన్న మొన్నటి వరకు అదొక నిద్రాణమయిన పల్లె.
ఉత్తరప్రదేశ్ లోని  భగ్ పత్ జిల్లాలో సున్హేడా వంటి అనేక గ్రామాలున్నాయి. కానీ ఈ పల్లెకి ఒక్కదానికే ఉన్నట్టుండి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఒక పసికందు కారణమంటే ఆశ్చర్యమే. ఈ వ్యాసం రాసే సమ యానికి ఇంకా ఆ శిశువు పుట్టనే లేదు. సున్హేడా గ్రామంలో సచిన్, పింకీ పావర్ అనే పుణ్య దంపతులకు ఈ అపురూపమయిన బిడ్డ జన్మించబోతోంది. వాళ్లకి ఈ ఏడాది జనవరి ఎనిమిదో తేదీన వివాహమయింది. పెళ్ళయిన నెల రోజులకే పింకీ నెల తప్పింది. స్తానిక ప్రాధమిక వైద్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్లు తనకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే కాకుండా ఆమెకు పట్టబోయే అదృష్టం గురించి కూడా ఆవిడ చెవిన వేశారు. అంతేకాదు లండన్ నుంచి కూడా యూ ఎన్ అధికారులు ఫోన్ చేసి పింకీకి పుట్టబోయే శిశువు ప్రపంచ జనాభాను ఏడువందల బిలియన్ మార్క్ ను దాటించే అపురూప శిశువు కానున్న విషయాన్ని ధృవ పరిచారు. బిడ్డకు పెట్టబోయే పేరు గురించి కూడా వాళ్లు అడిగి తెలుసుకున్నారని పింకీ మురిసి పోతూ నలుగురికీ చెప్పింది.
జనాభా విషయంలో రెండో స్తానంలో వున్న మన దేశానికి ఆ జనాభాకు సంబంధించే మరో  అపూర్వ గౌరవం దక్కబోతోందన్న మాట. అదేమిటంటే -  యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ లెక్క ప్రకారం ప్రపంచ జనాభా ఈ రోజు నుంచి ఏడు బిలియన్ మార్క్ దాటబోతోందట. ఈ రికార్డ్ దక్కడానికి కారణమయిన  బిడ్డ ఆ వూళ్ళో పుట్టబోతోందట. అదీ ఆడ శిశువు కావడం ఆకాశంలో సగం అని కీర్తి గడించిన ఆడంగులందరికీ గర్వకారణం.  అలా అని,  సీ ఎన్ ఎన్ – ఐ బి ఎన్ మీడియా తన వార్తాకధనాల ద్వారా ఊదరగొడుతోంది.


 ఏడు బిలియన్లు అంటే ఏడువందల కోట్లు. ఏడు పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఈ సంఖ్య వస్తుందన్నది ఆ ఫండ్ వాళ్లనే అడగాలి. పనిలో పనిగా మరో ప్రశ్న కూడా అడగాలి. ఏ లెక్క ప్రకారం లెక్కలు వేసి ఆ శిశువు పలానా  వూళ్ళో పలానా మహిళకు పుట్టబోతున్నట్టు తేల్చారన్నది తేల్చి చెప్పమని కూడా  అడగాలి.
అయితే ఈ ప్రశ్నకు జవాబుగా వాళ్లు చాంతాడంత గణాంకాలు ఉదహరిస్తున్నారు. భారత దేశంలో ప్రతి నిమిషానికి అక్షరాలా యాభయ్ ఒక్కమంది శిశువులు జన్మిస్తున్నారట. మళ్ళీ ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే నిమిషానికి పదకొండుమంది పిల్లలు పుడుతున్నారట. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనాల ప్రకారం పుట్టబోయే ఆ ఏడు వందల కోట్ల ఒకటో బిడ్డ ఉత్తర ప్రదేశ్ లోని సున్హేడా గ్రామంలో పలానా తేదీన భూమిపై పడబోతున్నట్టు మీడియా కోడై కూస్తోంది.
“ఇదంతా బొత్తిగా ఉత్తిదే. మన దేశంలో చాలా గ్రామాలకు సరయిన రహదారులే లేవు. ఏ వూళ్ళో ఎప్పుడూ ఎంతమంది పిల్లలు పుడుతున్నారో లెక్కలు తీయడానికి అవకాశాలే లేవు. అలాటిది ఏడువందల కోట్ల ఒకటో శిశువు పలానా రోజు పలానా వూళ్ళో పలానా వారికి పలానా సమయానికి  పుట్టబోతున్నదని చెబితే నమ్మడానికి చెవులో పువ్వులు పెట్టుకోలేద”ని  కొట్టిపారేసే ‘డౌటేహ’ మనస్కులు కూడా  లేకపోనూ లేదు.
ఏదిఏమయినా ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడానికి చాలా కష్ట పడాలి. అంత సీను మనకెలాగూ లేదు. అందుకని కష్టపడకుండా మన వాళ్లకి మాత్రమే చేతయిన పద్దతిలో లభిస్తున్న ఈ గౌరవాన్ని ఎందుకు కాదనాలి? కాబట్టి అందరం కలసి ఆ అపూర్వ శిశువుకు ఆహ్వానం పలుకుదాం.
మేరా భారత్ మహాన్!
ఇప్పుడే అందిన వార్త (బ్రేకింగ్ న్యూస్ అనాలా!)
సందేహాస్పదులు అన్నంతా అయింది.
ఈ రోజు, అంటే  అక్టోబర్ ముప్పయ్ ఒకటో తేదీన ఏడువందల కోట్ల ఒకటో బిడ్డ పుట్టింది. కాకపొతే ఉత్తర ప్రదేశ్ లోని మరో వూళ్ళో. (ఎందుకయినా మంచిది 'అట' అని చేరిస్తే మంచిదేమో!) ఆ రికార్డ్ శిశువు పేరు నర్గీస్ 'అట' 
కాదు కాదంటోంది మరో ఛానల్. ఫిలిప్పీన్స్ లో ఈ శిశువు జన్మించిందని ఘంటాపదంగా చెబుతోంది. ఎవరెన్ని రకాలుగా చెబుతున్నా ఒక విషయం మాత్రం ఒకే విధంగా చెబుతున్నారు. రోజూ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాయి కదా ఈ చానళ్ళు. అందుకే కాబోలు 'రెండు చోట్లా పుట్టింది ఆడపిల్లే!'  
31-10-2011           
Statistics show that 51 babies are born every minute in India and of these 11 babies are born in Uttar Pradesh AFP

గాడిద తెలివి


గాడిద తెలివి



అనగనగా ఓ గాడిద. తన యజమాని దగ్గర ఏళ్లతరబడి  గాడిద చాకిరి చేసి చేసి కొన్నేళ్లకు ముసలిదయిపోయింది. అది  బాగా వున్నన్నాళ్ళు  దానితో అడ్డమయిన చాకిరీ చేయించుకున్న యజమాని, గాడిద  ముసలిది కాగానే దాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు. అసలు గాడిదలంటేనే జనాలకు చులకన. ఇక పని చేయలేని, పనికి పనికిరాని గాడిదలను కనుక్కునేదెవరు?

రోజులు బాగాలేని ఆ గాడిద ఓ రోజు ఇంటి దగ్గరలోని  పాడుబడ్డ బావిలో పడిపోయింది.  దానితో పని లేదనుకున్న ఆ గాడిద యజమానికి   దాన్ని  బావిలోనుంచి  పైకి లాగి కాపాడడం అన్నది  డబ్బు దండగ వ్యవహారం  అనిపించింది. పెద్దగా ఆలోచించకుండానే అతడికి ఉభాయతారకమయిన ఉపాయం తట్టింది. పాడుపడ్డ ఆ బావిని  పూడ్చాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ వస్తున్నా ఆ పని ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.  ఇప్పడా బావిని మట్టితో పూడ్చేస్తే  ఆ పని  పూర్తిచేసినట్టూ  అవుతుంది. దానితో పాటే  ఆ ముసలి గాడిదను కూడా  అందులో పూడ్చిపెట్టినట్టూ  అవుతుంది.  అలా ఆలోచించి  అతగాడు ఆ పని మొదలు పెట్టాడు. పైనుంచి కూలీలు తట్టలతో మట్టిని  తన మీద పోస్తున్నప్పుడు కానీ బావిలో చిక్కుకుపోయిన  గాడిదకు అసలు  విషయం   అర్ధం కాలేదు. తను ఎట్లాగో  పనులకు పనికిరాదు. అందువల్ల బావిని పూడ్చే నెపంతో యజమాని తనను వొదుల్చుకోవాలని చూస్తున్నాడు. చావు ముంచుకు రాబోతున్న విషయం అర్ధం చేసుకున్న  గాడిద మరణ  భయంతో  గట్టిగా  వోండ్ర పెట్టసాగింది. అయితే, తనది కేవలం  అరణ్య రోదన అన్న విషయం కూడా దానికి త్వరలోనే బోధపడింది. ఇక తనకు చావు తప్పదు అని నిర్ణయించుకున్న తరవాత   ఆ  గాడిదకు వున్నట్టుండి చావు  తెలివి పుట్టుకొచ్చింది. తట్టల కొద్దీ  మట్టి  పైనుంచి తన మీద పడ్డప్పుడల్లా  గాడిద వొళ్ళు దులుపుకుంటూ కింద పేరుకుపోతున్న మట్టి కుప్పల మీదకు యెగిరి దూకడం మొదలు పెట్టింది.  కూలీలు పోస్తున్న మట్టితో ఆ పాడుపడ్డ బావి నిండిపోసాగింది. మట్టి మీద పడ్డ ప్రతిసారి దాన్ని దులుపుకుంటూ మట్టి కుప్పల మీదకు దూకుతూ  పైకిరావడం ఆ గాడిదకు అంత శ్రమ అనిపించలేదు. పైనుంచి  ఇదంతా  చూస్తున్న యజమానికి ముందు జరుగుతున్నదేమిటో  అర్ధం కాలేదు. అతడికి  అర్ధం అయ్యేటప్పటికల్లా ఆ గాడిద పైకే వచ్చేసింది. బతికి బయట పడ్డ గాడిద బతుకు జీవుడా అని ‘కొరగాని యజమాని  కొలువుకు’  ఓ దండం పెట్టి  తన దారి తాను  చూసుకుంది.
నీతి: తెలివి మనుషుల సొత్తు కాదు. అడ్డగాడిదలకు కూడా తెలివితేటలుంటాయి. (30-10-2011)


NOTE: Courtesy owner of the image used in this blog. 

25, అక్టోబర్ 2011, మంగళవారం

మహాభారత యుద్ధం కవుల కల్పనా? - భండారు శ్రీనివాసరావు

మహాభారత యుద్ధం కవుల కల్పనా? - భండారు శ్రీనివాసరావు  



తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!

కురుక్షేత్ర రణక్షేత్రంలో  మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధ సారం ఎరిగించిన తరువాత ఎరుకన బడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం  ఇదే.
ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన మహా యుద్ధంలో విజయం సాధించిన  యుధిష్టురు
డికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక  అక్షౌహిణుల  సైన్యం నిహతమయింది.  శవాల గుట్టల నడుమ గెలిచిన పక్షాన  బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే  యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు.అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని  పక్షంలో మిగిలింది  కేవలం ఏడుగురు మాత్రమే. అటు కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది  నలుగురే నలుగురు.  అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన  విశ్వకేతు.  ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురు సార్వభౌముడు   దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ  ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల  యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన  ఏడు అక్షౌహిణుల పాండవ దండుకు   సైన్యాధ్యక్షుడు  పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా,  ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.
         
ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక మహా సంగ్రామాలలో దేనిలో కూడా ఈ స్తాయిలో మానవ హననం జరిగిన దాఖలాలు లేవు. అయినా కానీ, వీటి  జాబితాలో మహాభారత యుద్ధానికి చోటు దొరకకపోవడానికి కారణం ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషించే  క్రమంలో రూపుదిద్దుకున్నదే ఈ వ్యాసం.

ప్రధమ ప్రపంచ సంగ్రామం , ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. కానీ మహాభారత యుద్ధం అలా కాదు. కురుక్షేత్రం రణక్షేత్రంగా భారత యుద్ధం  ఒక్కచోటనే  ఏకధాటిగా పద్దెనిమిది దినాలు సాగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న ఏ ఒక్క రాజు కూడా తిరిగి తన దేశాన్ని చేరలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా మళ్ళీ  ఇంటికి వెళ్ళలేదు. రణరంగంలో మరణించిన వారందరి కర్మకాండలు యుద్ధభూమిలోనే జరిపిన దాఖలాలు వున్నాయి. భర్తలు వీర మరణం పొందిన కారణంగా వైధవ్యం పొందిన రాణులందరికి హస్తినాపురంలోనే ఆశ్రయం కల్పించారు. అంటే ఏ ఒక్కరు తమ దేశం చేరుకోలేదని అర్ధం.  యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.
సాధారణంగా చక్రవర్తులు  ఇలాటి మహాయుద్ధాలు తలపెట్టినప్పుడు తమకు కప్పం కట్టే సామంత రాజులను, ఇతర మిత్ర దేశాల అధినేతలను సాయం అర్ధించడం పరిపాటి. ఆ సందర్భాలలో సామంతరాజులు, మిత్రదేశాల మహారాజులు చక్రవర్తి కోరికమేరకు అతడు సాగించ బోయే యుద్ధంలో పాల్గొనడానికి తమ  యావత్తు సైన్యాన్ని  వెంటతీసుకుని యుద్ధం జరిగే దూర ప్రాంతాలకు వెడతారు. తమ చక్రవర్తి  విజయం సాధిస్తే సరేసరి. లేకపోతే తమ రాజ్యాలకు తిరిగి రావడమన్న పరిస్తితి సాధారణంగా తలెత్తదు. 
ఆ పరిస్థితుల్లో ఆయా సామంత రాజుల రాజ్యాల్లో ఏమి జరుగుతుంది ? ఎన్నాళ్ళు గడిచినా  యుద్ధానికి వెళ్ళిన రాజు ఆచూకీ లేదు. అతడి సైన్యం జాడ లేదు. ఎన్నేళ్ళు గడిచినా వారిని గురించిన సమాచారం లేదు.   తిరిగి వస్తారో రారో తెలియదు.
కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధాన్నే తీసుకుందాము. కౌరవ పాండవ పక్షాల తరపున అనేకమంది సామంత రాజులు, మిత్ర దేశాల వారు, వారి సమస్త సైన్యాలు పద్దెనిమిది రోజులపాటు జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. అరివీర భయంకరంగా సాగిన ఈ మహా సంగ్రామంలో లక్షలాది సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో రాజులు, సైనికులు  పాల్గొన్న ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యేనాటికి బతికి బట్ట కట్టిన వారి సంఖ్య ఇరువైపులా కలిపి అక్షరాలా పన్నెండుమంది అంటే  ఓ పట్టాన నమ్మడం కష్టమే. కానీ జరిగిందదే.

అనేక దేశాల రాజుల్ని, సైనికులను మూకుమ్మడిగా బలిగొన్న ఈ యుద్ధం ముగిసిన తరువాత ఆ యా దేశాలలో పరిస్థితులు ఏవిధంగా మారి వుంటాయి ? రాజులు  లేని ఆ రాజ్యాలలో స్తితిగతులు ఏవిధంగా తయారయివుంటాయి ? ఈ ప్రశ్నలకు జవాబులు వూహించడం కష్టమేమీ కాదు.
రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు. పైగా  కప్పం కట్టమని చక్రవర్తి తరపున  వొత్తిడి చేసేవారూ లేరు. అసలు చక్రవర్తే లేడు. లేడన్న విషయం కూడా  చాలాకాలం వరకు జనాలకు తెలియనే తెలియదు. అది వేరే విషయం. 
దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది. తాము ఎవ్వరికీ బానిసలం కామన్న ఎరుక వారికి కలుగుతుంది.
ఈ పరిణామాల ఫలితంగా ఆ చిన్ని చిన్ని  రాజ్యాల్లో పెను మార్పులు అనూహ్యంగా చోటుచేసుకుంటాయి. యుద్ధానికి వెళ్లి తిరిగి రాని రాజు స్తానంలో  రాజ్యాధికారం స్వీకరించిన కొత్త  రాజుకు కొత్త ఆలోచనలు ముప్పిరిగొనడం కూడా సహజం. రోజులు గడిచేకొద్దీ  తాను సర్వ స్వతంత్రుడిని అన్న భావన ఆ రాజులో  ప్రబలమవుతుంది. తరాలు గడిచేకొద్దీ నూతన తరం రాజుల  ఆలోచనలు మరింత మారుతాయి. తాతల కాలంలో తాము ఒక చక్రవర్తికి  సామంతులం అని గుర్తు చేసుకోవడం  కూడా వారికి  ఇష్టం వుండదు. పైపెచ్చు, అటువంటి చారిత్రిక  ఆధారాలు కనబడితే వాటిని ధ్వంసం చేయడానికి కూడా  వెనుకాడరు. పాత చరిత్రను సమాధి చేసి కొత్త సంస్కృతికి స్వీకారం చుడతారు. ఈ విధంగా చరిత్ర లోని వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతాయి.
మామూలుగా ఏదయినా యుద్ధం జరిగి అది ముగిసినప్పుడు రెండు రకాల పరిణామాలు చోటుచేసుకోవడానికి వీలుంది. కొన్ని సందర్భాలలో చాలాకాలం వరకు స్తబ్ధత నెలకొంటుంది. జరిగిన పరిణామాలను చూస్తూ ఏర్పడ్డ విభ్రమ  నుంచి తేరుకోవడానికి ఎంతో వ్యవధి అవసరమవుతుంది. మరికొన్ని సందర్భాలలో మార్పులు వూహాతీతంగా ప్రచండ వేగంతో చోటుచేసుకుంటాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగింది ఇదే.
కౌరవ పాండవ మిత్రదేశాలలో ముందు స్తబ్ధత నెలకొంది. సమాచారం అందక పోవడం వల్ల అలా జరిగివుంటుంది. రాజు లేడు. అతడి సైన్యం లేదు. జనాలకు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్తితి.
అయితే, కొద్ది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముందు చెప్పినట్టు పాత తరం స్తానంలో కొత్త తరం రంగ ప్రవేశం చేస్తుంది. ఆ తరం క్రమంగా మునుపెప్పుడో మహా భారత యుద్ధంలో పాల్గొన్న తమ  పూర్వీకుల జ్ఞాపకాలను తుడిచిపెట్టే పనిలో పడుతుంది. ఒకానొక  కాలంలో తాము వేరెవ్వరికో కట్టుబానిసలుగా బతికామన్న  చేదు నిజాన్ని నిలువులోతున పూడ్చిపెడుతుంది. ఈ  క్రమంలో అసలు చరిత్ర మరుగున పడుతుంది. పాత  చరిత్రకు కొత్త భాష్యం ఆవిష్కృతమవుతుంది.

యుద్ధాలు జరిగినప్పుడు భౌతిక నష్టాలు మాత్రమే ప్రస్పుటంగా కానవస్తాయి. ఏ యుద్ధం గురించి చెప్పాల్సి వచ్చినా ముందు దానివల్ల వాటిల్లిన ధన, ప్రాణ నష్టాలు గురించే పేర్కొనడం కద్దు. కాని కొన్ని యుద్ధాలవల్ల కలిగే కష్టనష్టాలను రానున్న తరాలు కూడా అనుభవిస్తాయి. హిరోషిమా, నాగసాకీ  ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. ఆనాటి ఆటంబాంబు పేలుడు కలిగించిన   అణు ధార్మిక ప్రభావం దుష్పరిణామాలను ఆ తరువాత అనేక తరాలు చవిచూడవలసి వచ్చింది. నిజానికి అప్పుడు వాడిన అణుబాంబులు ఇప్పటివాటితో పోలిస్తే నాసిరకమైనవనే చెప్పాలి. అల్పమయిన ఆ అణుబాంబులు మానవాళికి  కలిగించిన నష్టం మాత్రం అనల్పం.
ఈ ప్రస్తావన ఎందుకంటె -
మహాభారత యుద్ధంలో ఇరు పక్షాల  యోధులు అనేక మహిమాన్విత  అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. అవి విడుదలచేసిన అపారమైన శక్తి ప్రభావం  మానవాళిపై పడిందనుకోవాలి. బహుశా ఆ కారణంగానే మనుషులకు మాత్రమే వరంగా లభించిన మానసిక సున్నితత్వం  వారిలో అడుగంటి పోయిందని అనుకోవాలి. నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి.  కలియుగంలో తలెత్త నున్న   వైపరీత్యాలకు, వైకల్యాలకు అప్పుడే బీజం పడి వుండాలి.

మహాభారత యుద్దానంతరం  కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి.  దీనిని గురించిన ప్రసక్తి  కధాచరిత సాగరంలో కూడా వుంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని కలపిరార్ కాలంఅంటారు. చరిత్రకు అందని రాజులు పాలించిన కాలం అని అర్ధం. దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.    
మహాభారత యుద్ధంలో  చోళులు, పాండ్యులు పాల్గొన్నట్టు కొన్ని ప్రాచీన గ్రంధాలలో వుంది. చోళ రాజుల్లో ఒకరు మహా  భారత యుద్ధ  సమయంలో పాండవుల కోసం ఏర్పాటుచేసిన వంటశాల నిర్వహణ బాధ్యతలు చూసేవాడని ప్రతీతి. యుద్ధసమయంలో పాకశాలను నిర్వహించడం అంటే కేవలం వంటచేసే వాళ్లని అర్ధం కాదు. నిజానికి చోళ రాజు తన సైన్యంతో కురుక్షేత్రానికి వెళ్ళింది యుద్ధంలో పాండవులకు సాయపడానికి. అయితే యుద్ధ వ్యూహంలో భాగంగా కర్తవ్య విభజన చేసే సమయంలో చోళ రాజుకు వంట శాలను ఆజమాయిషీ చేసే  బాధ్యత మీద పడింది.
యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం ముగిసిన తరువాత ఆయా రాజ్యాలలో ప్రబలమయిన శక్తులుగా ఎదిగిన వారందరూ నిజానికి ఆ రాజ్యాలకు సాధికారిక, వంశానుగత  ప్రభువులు కాదు.  వారిలో చాలామంది దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పూర్వ చరిత్రను పూడ్చిపెట్టే  క్రమంలో వారు అనుసరించిన విధానాల ఫలితంగానే  మహాభారత యుద్ధ ప్రసక్తి  ప్రపంచ చరిత్రల్లో నమోదు కాకపోవడానికి  కారణమయివుంటుంది. కాకపొతే అనేక దేశాల చరిత్రల్లో ఒక గొప్ప యుద్ధం జరిగినట్టు మాత్రం పేర్కొన్నారు కానీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.

ఈ  సమరంలో  కౌరవ పాండవ సేనలతో పాటు వారి తరపున అనేకమంది రాజులు, సామంత రాజులు వీరోచితంగా పోరాడి వీరస్వర్గం అలంకరించారు. వారితో పాటు వారి సైన్యాలు కూడా ఈ యుద్ధంలో తమ శాయ శక్తులా పోరాడాయి. ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు. వందిమాగధులు సరే సరి. వీరికి యుద్ధంలో కత్తి పుచ్చుకుని పోరాటం చేయాల్సిన అవసరం వుండదు. వారి పనల్లా, ఏరోజుకారోజు సూర్యాస్తమయం తరువాత యుద్ధరంగం నుంచి అలసి సొలసి శిబిరాలకు  తిరిగొచ్చే   సైనిక దళాలను తమ  కళాకృతులతో ఉత్సాహ పరచడమే. యుద్ధంలో పాల్గొనే అవసరం లేనందువల్ల ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు. కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు.  వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు. పరాజిత సైన్యానికి చెందిన వారందరూ  ఆయుధాలతో సహా  విజేత పరమవుతారు.  అయితే ఈ విషయంలో  అస్త్ర శస్త్రాలలో అస్త్రాలకు మినహాయింపు వుంది. ఎందుకంటె  అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.
యుద్ధం ముగిసిన తరువాత ఒంటరిగా మిగిలిన కళా కారుల బృందాలు ఆదరించే నాధుడు లేకపోతే   తిరిగి ఇంటి మొగం పట్టకతప్పదు.కానీ  స్వదేశం చేరగలమనే  నమ్మకం లేని ప్రయాణం. తమను వెంట తీసుకుని యద్ధానికి వచ్చిన తమ రాజే  శాత్రవుల చేతిలో మరణించాడు. గమ్యం అగమ్యం. అందుకే తిరుగు ప్రయాణంలో  మార్గ మధ్యంలో ఏదయినా వసతి దొరకిన చోట ఆగిపోతారు. అక్కడి స్తానికులు ముక్కూ మొగం తెలియని వాళ్లు. అలాటిచోట  ఆశ్రయం సంపాదించాలంటే  వారికి తెలిసిన విద్య ఒక్కటే. తాము దూరప్రాంతంలో  చూసిన దానికి  తమ  కళారూపాలతో ఒక రూపం కల్పించి, దానిని రసవత్తరంగా  ప్రదర్శించి ప్రజల మెప్పు, తద్వారా వారి నుంచి తమకు కావాల్సిన  సాయాన్ని పొందడమే వారికి కనిపించిన దారి. అందులోను  తాము ప్రత్యక్ష సాక్షులుగా వున్నది ఏదో సాదా సీదా వ్యవహారానికి కాదాయె. అరివీర భయంకరంగా సాగిన మహాభారత యుద్ధాన్ని దాపున వుండి గమనించే అవకాశం దక్కిన వాళ్ళాయె.  ఈ ప్రదర్సనల వల్ల  లోక ప్రసిద్దులయిన  కురు వంశపు రాజులు  పరస్పరం తలపడ్డ  మహా సంగ్రామ  విశేషాలను నలుగురికీ తెలియచెప్పి తృణమో పణమో సంపాదించు కున్నట్టూ  వుంటుంది. అలాగే,  తమనీ, తమ  కుటుంబాలనీ  బహుకాలం పోషించిన ప్రభువుల రుణం తీర్చుకున్నట్టూ  వుంటుంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ బృందాలలోని
నాట్యకత్తెలు గజ్జె కట్టారు. కవులు, పండితులు  పాటలు  కట్టారు. విదూషకులు తమదయిన  ధోరణిలో చూసినదానికి హాస్యాన్ని జత కట్టారు.  సహజంగా కళాకారులు కాబట్టి తాము చూసిన దానిని వర్ణించే క్రమంలో కొంత నాటకీయత చోటుచేసుకోవడం సహజం.
నిజానికి  వీరిలో కొందరికి మహాభారత యుద్ధం ఎలా ముగిసిందో  తెలవదు. ఎవరు గెలిచారో తెలియదు. యుద్ధంలో తమ రాజు మరణించగానే , ఇక అక్కడ వుండి చేసేదేమీ లేదు కాబట్టి వారు యుద్ధభూమిని వొదిలి పెట్టి  ఇంటి మొగం పట్టిన వాళ్లు వీళ్ళు. 
మార్గమధ్యంలో తమని ఆదరించి ఆశ్రయం ఇచ్చేవారు తటస్తపడగానే - మహా భారత యుద్ధం జరిగింది మీకు తెలుసా ?’ అని సంభాషణ మొదలు పెట్టేవాళ్ళు. కానీ, అప్పటికి యుద్ధం ఇంకా  కొనసాగుతూనే  వున్న సంగతి వారికి తెలియదు. తమను వెంట తీసుకువచ్చిన రాజు యుద్ధంలో చనిపోయాడని మాత్రమే వారికి తెలుసు.  ఉదర పోషణ కోసం ఒక గొప్ప యుద్ధం ఎలా జరిగిందో వర్ణించి చెప్పేవారు. యుద్ధాలు, పోరాటాలు  మొదలయిన విషయాలు గురించి  తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో వుంటుంది. అదే నిరాశ్రయులయిన కళాకారులకు  భుక్తికి మార్గమయింది. జనాలను మరింతగా  ఆకర్షించడం కోసం తమకు తెలిసిన విషయాలకు రంగులు అద్దేవారు. ఆ విధంగా (ఆ నాటి భరత ఖండపు) దేశ దేశాల్లో మహాభారత యుద్ధానికి సంబంధించిన రకరకాల కధలు విభిన్న రూపాల్లో ప్రచారం లోకి వచ్చాయి. ఒక గొప్ప యుద్ధానికి సంబంధించిన సమాచారం రకరకాల రూపాల్లో  అన్ని ప్రాంతాలకు చేరిపోయింది. ప్రజలకు ఒక గొప్ప  సంగ్రామం జరిగిందని తెలుసు. అయితే, అది మహా భారత యుద్ధం అన్న వాస్తవం ఇతర దేశాలవారికి తెలవదు.
యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం -  యుద్ధం గురించి జానపద కళాకారులు ప్రాచుర్యంలోకి తెచ్చిన విభిన్న కధా రూపాలు -  ఆ యా దేశాల్లో అధికారంలోకి వచ్చిన నూతన తరం రాజులు తమ గతం గురించి అనుసరించిన నిరాసక్త విధానాలు -  ఇవన్నీ కలసి  వెరసి మహాభారత యుద్ధానికి చరిత్రలో సముచిత స్తానం లభించకపోవడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు.

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.
ప్రాచీన  సుమేరియన్ సంస్కృతిలో చాలా భాగం ఏడుపులు, రోదనల ప్రాతిపదికగా ఏర్పడిందని చెబుతారు. ఒక మహా యుద్ధంలో సైనికులయిన  భర్తలను కోల్పోయిన వీర పత్నులు  కన్నీటితో విలపించిన సన్నివేశాలే వారి ప్రాచీన రచనల్లో కానవస్తాయి.
వారి పురాతన  చరిత్రలో కూడా మహా భారతాన్ని పోలిన కధ వుంది.
ఒక నగరాన్ని నిర్మిస్తారు. జూదం జరుగుతుంది. మరో నగరాన్ని తగలబెడతారు. ఒక మహిళ అవమానానికి గురవుతుంది.   మహాభారతంలో  మాదిరిగా ఈ సన్నివేశాలన్నీ అదే  క్రమంలో జరగవు. కానీ అంశాలన్నీ ఏదోఒక విధంగా భారత కధను గుర్తుకు తెచ్చేవిగా వుంటాయి.
యుద్ధం ముగిసిన తరువాత భర్తలను కోల్పోయిన ఆడవారందరూ కలసి విలపించే అంశంతో సుమేరియన్ ప్రాచీన సాహిత్యం రూపుదిద్దుకుంది.
భారత యుద్ధంలో  రాజుల మరణానంతరం రాణులు విలపించే ఘట్టాన్ని గురించిన ప్రసక్తి మహాభారతంలో కూడా  వుంది. (వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం – Originally published in Tatwa Prakasha News Letter in English - రచయిత )   
(25-10-2011)

 




21, అక్టోబర్ 2011, శుక్రవారం

కలకంఠి కన్నీరు – భండారు శ్రీనివాసరావు

కలకంఠి కన్నీరు – భండారు శ్రీనివాసరావు



 
గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.

అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే అడిగాడు.

“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.

“అర్ధం కాలేదు. భారం అంటే?”

“నీకర్ధం కాదులే! ఇప్పడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ అంది తల్లి.

గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.

“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.

కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.

స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.

ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.

ఆమె ఇలా చెప్పింది.

“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.

“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.

“నవమాసాలు మోసి, ప్రాణాలనే పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.

“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న పిల్లలే పెరిగి పెద్దయిన తరువాత వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ తిరస్కారాలను భరించగల హృదయ వైశాల్యాన్ని వరంగా ఇచ్చాడు.

“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.

“ఇంట్లో ఏఒక్కరికి వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా రేయింబవళ్ళు సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.

“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.

“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి మరచిపోగల మనసును ఇచ్చాడు.

“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.

“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా వరంగా అనుగ్రహించాడు.

“కన్నీరు ఆడవారి సొంతం. తమకు అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి లేదు.

“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న వారి హృదయానికి ప్రధాన కవాటాలు వారి కంటిలోని ఈ కన్నీటి చుక్కలే.”

టీచరు చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.

కానీ, ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు. (21-10- 2011)