27, జులై 2011, బుధవారం

గ్యాస్ ట్రబుల్ - భండారు శ్రీనివాసరావు

 గ్యాస్ ట్రబుల్

  • ఎంతవారు కాని...........


(సరదాకు మాత్రమే సుమా)

24, జులై 2011, ఆదివారం

చదవడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

చదవడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

చదువుకునే రోజుల్లో ప్రతిఒక్కరికీ ఫస్ట్ క్లాస్ మీద ఆసక్తి ఫస్ట్ క్లాస్ గా వుంటుంది. బళ్ళో లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్లకు కూడా క్లాసులో ఫస్ట్ రావాలనే తాపత్రయం మాత్రం అపరిమితం. అయితే ఈ ఫస్ట్ క్లాస్ థియరీపై పరిశోధన చేసి ఒకాయన కనుక్కున్న సంగతులు మాత్రం వేరుగా వున్నాయి.

చదువులో ఫస్ట్ క్లాస్ సంపాదించే వాళ్ళలో చాలామంది టెక్నికల్ కోర్సుల్లో చేరి డాక్టర్లో ఇంజనీర్లో అవుతుంటారు.

ఇక సెకండ్ క్లాస్ స్టూడెంట్లు ఎంబీయే లాటి కోర్సులు ఏవో చేసి, ఐ.ఎ.ఎస్. లయిపోయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అయిన డాక్టర్లను, ఇంజినీర్లను ఆజమాయిషీ చేస్తుంటారు.

పోతే, థర్డ్ క్లాస్ స్టూడెంట్లు డింకీలు కొట్టికొట్టి అత్తెసరు మార్కులతో పాసయినామని అనిపించుకుని ఏ ఉద్యోగాలు దొరక్క రాజకీయాల్లో చేరి మంత్రులుగా మారి పైవాళ్ళందర్నీ తమ చెప్పుచేతల్లో వుంచుకుంటారు.

ఇక ఆఖరు రకం అంటే ఏ పరీక్షా పాసుకాకుండా చదువుకు ఆదిలోనే స్వస్తి చెప్పి అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళేమో అండర్ వరల్డ్ డాన్ లుగా అవతారం ఎత్తి పైఅందరిపై పెత్తనం చేస్తుంటారు.

కాబట్టి ఇది చదివినతరవాత ఏమనిపిస్తోంది ? చదవడానికెందుకురా తొందరా! అని పాడుకోవాలనిపిస్తోందా!

ఏదో సరదాకు రాసిందాన్ని సీరియస్ గా తీసుకుని చదువులు చెడగొట్టుకోవద్దు సుమా.
(24-07-2011)

23, జులై 2011, శనివారం

ఇగో అను నర గర్వభంగం కధ – భండారు శ్రీనివాసరావు

ఇగో అను నర గర్వభంగం కధ – భండారు శ్రీనివాసరావు




యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.

కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి యమభటులు వున్నప్పటికీ యముడు స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.

నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.

కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.

యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.

తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?

అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.

తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.

“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం ఆ విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా నా కళ్ళకు ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి చేసిన మహానుభావులు మీరు అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు సరిచేయలేకపోయారన్నది నా కర్ధం కావడం లేదు..........”

........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.

ఇంతలో ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున ముందుకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా చెప్పు” అన్నాడు.

యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు పలుకుతున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే ఇప్పుడు నీకీ చావు తప్పేది.”

(23-07-2011)





19, జులై 2011, మంగళవారం

మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు

మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు


కలియుగం నాలుగోపాదంలో ఒకానొక ధూర్తుడు, రౌరవాది మహా రాక్షస గణాలకు ఓ దేవ రహస్యం తెలియచేసాడట.


“వేరే ఆడదానితో అక్రమ సంబంధం వున్నట్టు భార్యకు తెలియనంత కాలం భర్తకు స్వర్గమే . తెలిసిన మరుక్షణం నుంచీ ప్రత్యక్ష నరకమే!” అన్నది దాని సారాంశం.

నేను జానకితో చనువుగా మసలుతున్న సంగతి తెలిసిన నా మిత్రుడు శంకరం- దేవరహస్యం పేరుతొ నాకీ హితబోధ చేసాడు. అయితే, జానకితో నేను సాగిస్తున్న వ్యవహారం గురించి మా ఆవిడకు తెలుసునని నాకు చాలాకాలం వరకూ తెలవదు. అయినా గుంభనగా వుండిపోయిందంటే శంకరం చెప్పిన సూత్రం అందరు భార్యలకు వర్తించదని అనుకోవాలి.

రోజులు గడుస్తున్నకొద్దీ జానకి నుంచి రోజురోజుకూ నామీద వొత్తిడి పెరిగిపోతోంది. ఇక ఆ పోరుపడలేక లాయరుతో మాట్లాడడం, ముగ్గురు పిల్లల తల్లి అని చూడకుండా మా ఆవిడకి విడాకుల నోటీసు ఇప్పించడం కూడా జరిగిపోయింది.

నోటీసు పంపిన రోజు నేను కావాలనే బారులో పీకలదాకా తాగి ఇంటికి బయలుదేరాను. జానకి పరిచయం అయిన తరవాత ఆలస్యంగా ఇంటికి చేరడం అన్నది అప్పటికే నాకు అలవాటుగా మారింది. ఆఫీసు నుంచి నేరుగా జానకి పనిచేసే చోటుకు వెళ్లడం, ఆమెను స్కూటర్ పై ఎక్కించుకుని వాళ్లింటికి వెళ్లి అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి చేరడం నాకు దినచర్యలో భాగమయిపోయింది. అదేమిటో, పెళ్ళాం పిల్లలున్న నేను ఇలా చేయడం తప్పని నాకు కానీ, జానకికి కానీ ఒక్కనాడూ అనిపించకపోవడం విచిత్రం.

మా ఆవిడ సీతతో నేను మాట్లాడాల్సిన తీరు గురించి జానకి నాకు ముందుగానే బాగా తర్పీదు ఇచ్చింది. ఇలాటి సందర్భాలలో ఇల్లాలు పెట్టుకునే కళ్ళనీళ్ళకు కరిగిపోకూడదని హితబోధ చేసింది. ముందు ముందు భార్యగా తననుంచి అందబోయే సుఖాలను మనసులో వుంచుకుని సీతతో కఠినంగా ప్రవర్తించమనీ దాదాపు ఆర్డర్ మాదిరిగానే చెప్పింది.

ఇంటికి వెళ్లేసరికి పరిస్తితి నేను అనుకున్నట్టుగా లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాను. పిల్లలు నిద్రపోతున్నట్టున్నారు. ఎప్పటిమాదిరిగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. భోజనం తిననని తెలిసి కూడా వడ్డించమంటారా అని అడిగింది . వద్దని సైగ చేసి నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

నేను పంపిన విడాకుల నోటీసు సీత అందుకున్న సంగతి ధ్రువపరచుకున్న తరువాతనే ఇంటికి వచ్చాను. అయినా ఇల్లు ప్రశాంతంగా వుంది. ఏడుస్తూ నానా యాగీ చేస్తుందనుకున్న ఇల్లాలు మామూలుగా వుండడం చూసి ఆశ్చర్యపోవడం నావంతయింది.

మా ఆవిడ భోజనం పెట్టింది. తిని చేతులు కడుగుకున్నతరవాత ఆమె చేయిపట్టుకున్నాను. నా కళ్ళల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా చేయి విడిపించుకుంది. ఆమె వంక చూడడానికి గిల్టీ గా అనిపించి తల దించుకున్నాను. ఏదో చెప్పాలని వుంది. ఎంతో చెప్పాలని వుంది. కానీ నోరు పెగలడం లేదు.మాట రావడం లేదు. ఆమె మెల్లగా లేచింది. మౌనంగా ప్లేటులో వడ్డించుకుంది. మాటా పలుకూ లేకుండా భోజనం అయిందనిపించింది. ఆమె కళ్ళల్లో నీరు వూరుతూ వుండడం నాకు కనిపిస్తూనే వుంది.

ఆమెనుంచి నాకు విడాకులు కావాలి. సీతను ఎలాగయినా వొప్పించి తీరాలి. కానీ మనసులోని ఈ మాటను చెప్పడం ఎలా? పక్కకు తిరిగి గొంతు సవరించుకున్నాను. మనసులోని భావాలను మాటల్లోకి మార్చి గోడతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆమెకు ఎరుక పరిచాను. చిత్రం ఏమిటంటే నా మాటలు వింటున్నప్పుడు, విన్నతరవాత కూడా ఆమె ఎలాటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా, విడాకులా?ఎందుకు? అని ముక్తసరిగా అడగడం నన్ను మరింత ఆశ్చర్యపరచింది. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలి? అందుకే విననట్టు నటించాను. దానితో అంతవరకూ బిగపట్టుకునివున్న ఆమె కోపం కట్టలు తెంచుకుంది.

‘నువ్వొక మగాడివేనా?’ – అంటూ ఒక్కసారిగా ఆమె అరవడంతో నిద్రపోతున్న పిల్లలు లేచారు. మా ఇద్దరి మధ్యా ఏదో జరిగిందని గ్రహించి ముగ్గురూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ రోదనలతో ఇల్లు మార్మోగింది.

ఆ రాత్రి మా మధ్య మాటలు సాగలేదు. రాత్రల్లా ఆమె రోదిస్తూనే వుంది. మా వివాహ బంధం ఇలా ఎందుకు తెగిపోయిందో తెలుసుకోవాలన్నది ఆమె తపనగా నాకు అర్ధం అయింది. కానీ, ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర వుంటేగా. తన మీద వున్న నా ప్రేమ ఇప్పడు జానకి వైపు మళ్లి౦దని ఎలాచెప్పను ?

విడాకుల ఒప్పంద పత్రంలో ఇల్లూ, కారూ, కంపెనీ ఇచ్చిన షేర్లలో మూడో వంతు ఆమె పేరిట, పిల్లల పేరిట రాసాను. ఇది కాక నెల నెలా కొంత మొత్తం చేతికందేలా ఏర్పాటు చేసాను. ఈ విషయంలో మిగిలిన మొగాళ్ళ కంటే నేనే నయమని నేననుకుంటున్నాను.

తెల తెల వారుతుండగా నేను ఆమె ముందు విడాకుల అంగీకార పత్రాన్ని వుంచాను. అది చూడగానే ఆమె కళ్ళు విస్పులింగాల్లా మారాయి. ఒప్పంద పత్రాన్ని ముక్కలు ముక్కలు గా చించి విసిరివేసేంతగా ఆమె కోపం తారాస్తాయికి చేరుకుంది.
పదేళ్లకు పైగా నాతో జీవితాన్ని పంచుకున్న సీత ఈ రోజు పరాయి వ్యక్తిలా మారిపోయింది.

ఇంతకాలం నా సమయాన్ని, ధనాన్ని, శక్తి యుక్తుల్ని ఈమె కోసమా వెచ్చించింది అని బాధపడ్డానే కాని ఆమె పడుతున్న క్షోభను పట్టించుకునే పరిస్తితిలో నేను లేను. ఎంత త్వరగా సీతను విడాకులకు ఒప్పించి ఆ చల్లని కబురు జానకికి చేరవేద్దామా అని అనుకుంటున్నానే కాని సీత మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని నేను ఏమాత్రం పట్టించుకునే పరిస్తితిలో లేను.

పైగా ఆమె రోదన నాకు స్వాంతన కలిగిస్తోంది. విడాకులకు ఒప్పుకుంటుందన్న ఆశను రగిలిస్తోంది. దానితో, సీతతో తెగతెంపులు చేసుకోవాలనే నా కోరిక మరింత బలపడసాగింది. ఎంత త్వరగా ఈమెని వొదుల్చుకుని జానకి చెంతకు చేరగలనా అన్నఆత్రుత నాలో పెరిగిపోసాగింది.

మర్నాడు కూడా ఇంటికి పొద్దు పోయే వచ్చాను. నిజానికి అది నా ఇల్లన్న అభిప్రాయం నానుంచి ఎప్పుడో తొలగిపోయింది.

సీత భోజనాల బల్ల వద్ద కూర్చుని ఏదో రాస్తోంది. నా రాక గమనించి ప్లేట్లు సదరబోయింది. కానీ, అన్నం తినడానికి మనస్కరించక నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. అప్పటికే పగలంతా జానకి సమక్షంలో గడిపివచ్చాను. అలసటతో వొల్లెరుగని నిద్ర పట్టింది.

తెల్లవారు ఝామున మెలకువ వచ్చి చూస్తే ఇంకా ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే రాస్తూ కనిపించింది. ఆమెను పట్టించుకోనట్టుగా పక్కకు తిరిగి నిద్రపోయాను.

ఉదయం నేను లేచేసరికల్లా సీత తయారయివుంది.

“విడాకులు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు.” ఆమె నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలతో నోట్లో పంచదార పోసినట్టు ఫీలయ్యాను. నెత్తిమీది బరువు సగం దిగిపోయింది.

“ మీ ఇల్లూ, కారూ, ఆ డబ్బూ కూడా నాకక్కరలేదు.” సీత కంఠం నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో మారు మోగింది.

“అయితే ఒక కండిషన్. దానికి ఒప్పుకుంటే విడాకుల అంగీకారపత్రం పై సంతకం చేయడానికి నేను సిద్ధం.”

ఆ షరతు ఏమిటో వినడానికి నా చెవులు వెంటనే నిక్కబొడుచుకున్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.

“నాకొక నెల వ్యవధానం కావాలి. ఆ నెల రోజులు ఇష్టం వున్నా లేకపోయినా మీరు నాతో, పిల్లలతో మామూలుగా మునపటి మాదిరిగా గడపాలి.”

ఇందుకు ఆమె చూపించిన కారణాలు కూడా ఆక్షేపించదగినవిగా లేవు. పెద్ద పిల్లాడి పరీక్షలు నెలరోజుల్లో అయిపోతాయి. ఈ విడాకుల వ్యవహారం అతడి చదువును చెడగొట్టడం ఆమెకు ఇష్టం లేదు.

నెల అంటే ఎంత ముప్పయి రోజులు.

ఇట్టే గడిచిపోతాయి. దీన్ని కాదనుకుని విడాకులకోసం ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం కంటే నెల రోజుల ‘బలవంతపు కాపురమే’ నయమన్న నిర్ధారణకు వెంటనే వచ్చాను. ఈ షరతుకు జానకి కూడా సులభంగా వొప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది.

‘మరో సంగతి” సీత స్వరం లో చిన్న మార్పు.

“ఇది షరతు కాదు. ఇన్నేళ్ళు మీతో కాపురం చేసిన భార్యగా ఓ కోరిక కోరుతున్నాను. మన్నిస్తే అదృష్టవంతురాలినని అనుకుంటాను.”

ఆ స్వరంలోని మృదుత్వం నన్ను కరిగించింది. వరాలిచ్చే దేవుడి ఫోజులో సరే! అన్నాను.

ఆమె కోరిన ఆ కోరిక విన్న తరువాత – విడాకుల షాక్ లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నదేమో అన్న అనుమానం కలిగింది. కానీ, జానకితో నా రెండో పెళ్లి త్వరగా జరగాలంటే ఇలాటి ఒకటి రెండు కోర్కెలు ఒప్పుకోక తప్పదు.

నేను మర్నాడు వెళ్లి సీత పెట్టిన షరతులు గురించీ, ఆమె  అడిగిన కోరిక గురించి జానకితో చెప్పాను. ఆమె ఒక్క పెట్టున నవ్వి సీతను ఓ పిచ్చిదానికింద జమకట్టి సరిపుచ్చుకుంది. అన్నీ సవ్యంగా జరుగుతూ వుండడంతో ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాను.

సీతకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వొచ్చినప్పటినుంచి ఆమెతో ఎడమొగం పెడమొగమే. పడక గదులే వేరయిపోయాయి. ముద్దుముచ్చట్ల సంగతి దేవుడెరుగు ఆమెతో మాట్లాడడానికే నాకు మనస్కరించేది కాదు. ఇప్పుడు మళ్ళీ సీతకు ఇచ్చిన మాట ప్రకారం ‘తొలి రాత్రి’ సన్నివేశాన్ని రిపీట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనకూ కొంత ఇబ్బందికరం గానే వున్నట్టు అనిపించింది. కాకపొతే, ఇంట్లో సన్నిహితంగా మసలుతున్న మమ్మల్ని చూస్తూ మా పిల్లలు మాత్రం ఎంతో సంతోషపడ్డారు. చాలా రోజుల తరువాత మళ్ళీ మేము మా పడక గదిలోకి వెళ్లడం చూసి మా పెద్ద పిల్లవాడు వెనుకనుంచి చప్పట్లు కొట్టాడు. మనసు మూలల్లో ఏదో కదిలిన ఫీలింగ్. మంచం మీదకు చేరగానే సీత కళ్ళు మూసుకుని నెమ్మదిగా అంది. “దయచేసి మన విడాకులు గురించి పిల్లలతో అనకండి.”

పైకి తల వూపాను కాని మళ్ళీ ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. పదేళ్లనాటి చీరెను భద్రంగా  దాచి ఆ రాత్రి కట్టుకోవడం చూసి తల దించుకున్నాను.

మర్నాడు నా స్కూటర్ మీదనే సీతను తన ఆఫీసులో దింపాను. దారిపొడుగునా భుజం మీద తల వాల్చి మాట్లాడుతూనే వుంది. నా నడుం చుట్టూ బిగించి పట్టుకున్న చేతిని దిగేదాకా వొదలలేదు. నేను నా ఆఫీసుకు వెళ్ళిపోయాను.

సీతకిచ్చిన మాట ప్రకారం వెనుకటి రోజుల్లోలాగా సాయంత్రం తన ఆఫీసుకుకు వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాను. మా ఇద్దర్నీ మునుపటిలా చూడడం కోసమే అన్నట్టు పిల్లలందరూ గుమ్మం ముందరే కనబడ్డారు.

రెండో రోజు మా ఇద్దరి నడుమా మరికొంత సాన్నిహిత్యం పెరిగినట్టనిపించింది. స్కూటర్ మీద వెడుతున్నప్పుడు తను నాకు మరింత హత్తుకుని కూర్చుంది. ఆమె నుంచి వెలువడుతున్న పల్చటి పరిమళం నా మెడను దాటుకుని నెమ్మదిగా వ్యాపిస్తోంది. సీతను అంత దగ్గరగా చూసిన జ్ఞాపకం ఈ మధ్య లేదు. పెళ్ళయిన కొత్త రోజులు మనసులో మెదిలాయి. స్కూటర్ దిగి ఆఫీసులోకి వెడుతున్నప్పుడు కాకతాళీయంగా ఆమె వైపు చూసాను. గంభీరతతో కూడిన మందహాసం మేళవించి నాకు చెయ్యి వూపి వీడుకోలు పలికింది. ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ అనుభవంలోకి వచ్చిన  సన్నివేశం.

నాలుగో రోజున నేనే చేయి అందించి ఆమెను స్కూటర్ పై కూర్చోపెట్టుకున్నాను. నాకు భార్యగా వుంటూ, నా పిల్లలకు తల్లిగా వుంటూ మరోపక్క ఉద్యోగం చేస్తూ ఇంటి పనీ, బయట పనీ సంభాలించుకుంటూ ఇన్నేళ్ళు చాకిరీ చేసిన మనిషి ఈమేకదా అనిపించింది. ఎప్పుడన్నా, ఏనాడన్నా తన గురించి పట్టించుకున్నానా అని ఒక్క క్షణం చివుక్కుమనిపించింది.

రోజులు మారుతున్న కొద్దీ సీతను గురించి నా అభిప్రాయాలు కొద్ది కొద్దిగా మారుతుండడం గమనించాను. అదేమిటో కానీ ఇవేవీ జానకికి చెప్పాలనిపించలేదు.

క్రమంగా ఇంట్లో నేను గడిపే సమయం పెరుగుతూ వస్తున్న సంగతి నేను గమనించనే లేదు. పిల్లలతో ముచ్చట్లు, పెద్ద పిల్లవాడి పరీక్షలు గురించి ఆరా తీయడం వీటన్నిటితో మళ్ళీ ఇంటి పెద్ద పాత్రలో వొదిగిపోయాను. ఓ రోజు ఏకాంతం దొరికినప్పుడు పెళ్ళికిముందు నేను రాసిన ప్రేమలేఖలు చూపించింది. నా ఉత్తరాలను పదేళ్లుగా తాను పదిలంగా దాచుకున్న తీరు నన్ను నివ్వెరపరచింది. తను రాసినవి నేను ఏం చేసానని అడగలేదు. అడిగివుంటే ఏం జవాబు చెప్పాలా అని కొద్ది సేపు మధన పడ్డ మాట వాస్తవం.

వారం రోజులు గడిచాయో లేదో పిల్లవాడి పరీక్షల పేరుతొ నేను పదిరోజులు సెలవుపెట్టాను. ఈ సంగతి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కాని తను కూడా లాంగ్ లీవ్ పెట్టింది. అందరం కలసి ఇంట్లో చాలాసేపు గడపడం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మొదలయింది.

ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.

శ్మశాన నిశ్శబ్దానికి అలవాటుపడ్డ ఇంటిని మాటలు, ముచ్చట్లు, నవ్వులు మళ్ళీ మనుషులు తిరిగే ‘నివాసం’ గా మార్చాయి. తెలియకుండానే చోటుచేసుకుంటున్న మార్పులన్నీ నన్ను కొత్త మనిషిగా మార్చడం తెలియకుండానే జరిగిపోతోంది.

పాత సంగతులు గుర్తుకొస్తున్నాయి. కొత్త విషయాలు మరపున పడుతున్నాయి.

జీవితం పాత బాటలో కొత్త పరుగు తీస్తోంది. సీతతో కాపురం సరికొత్త మధురిమను అందిస్తోంది.

ఒక్క నెల రోజుల్లో ఇది సాధ్యమా అంటే సాధ్యమే అనిపిస్తోంది.

సీత పెట్టిన గడువు పూర్తవుతున్న విషయం నాకు గుర్తుకు రాలేదు. చిత్రం ఏమిటంటే, గత కొద్ది రోజులుగా ఒక్క రోజు కూడా జానకి గుర్తుకు రాలేదు.

ఓ రోజు సీత తను సంతకం చేసిన విడాకుల అంగీకార పత్రాన్ని నాకు అందించింది. అప్పుడు కానీ నెల రోజుల గడువు పూర్తయిన విషయం నాకు తట్టలేదు.

కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ఆమె అందించిన కాగితాలను తీసుకున్నాను. అవే చేతులతో ఆమెను పొదివి పట్టుకున్నాను. నా గుండెలపై తల ఆన్చి మౌనంగా రోదిస్తున్న సీతకు తన వీపును చుట్టుకున్న నాచేతులు ఏం చేస్తున్నాయో తెలిసే వీలు లేదు.

ఇక జీవితంలో సీతను విడిచి పెట్టేది లేదు అన్న నా దృఢ నిశ్చయానికి అనుగుణంగా నా చేతులు అంతే బలంగా మా విడాకుల పత్రాన్ని నలిపి నాశనం చేస్తున్నాయి.

(కలిసివున్నప్పుడు విడి విడిగా మసిలే భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. సన్నిహితంగా మెలగడం ద్వారా విడిపోవాలనే కోరిక దూరం చేసుకోవచ్చన్నదే ఈ కధలో నీతి. విడిపోవాలనుకున్న దంపతులు ఈ కధలో లాగా తిరిగి ఒకటవడం సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు.)

(19-07-2011)

వెర్రి మొహాన్ని చూడాలని వుందా ? – భండారు శ్రీనివాసరావు

వెర్రి మొహాన్ని చూడాలని వుందా ? – భండారు శ్రీనివాసరావు


చూడాలని వుంటే ఈ నాలుగు ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి.

యక్ష ప్రశ్నలు కాదు కాబట్టి ప్రయత్నించి చూస్తేపోయేదేమీ వుండదు.

సమాధానం మాత్రం వెంటనే చెప్పాలి సుమా. ఆలోచిస్తూ పోతే కుదరదు.

ఇదిగో! ఇదే మొదటి ప్రశ్న.

మీరో పరుగు పందెంలో పాల్గొంటున్నారు..

రెండో స్తానంలో వున్న ప్రత్యర్ధిని మీరు దాటిపోయారు.

అప్పుడు పందెంలో మీరే స్తానంలో వున్నట్టు?

అవును! అదే అనుకున్నాను.

మొదటి స్తానం చేరుకున్నట్టు జవాబు చెబుతారని.

అయితే ఆ జవాబు పూర్తిగా తప్పు.

పందెంలో రెండో స్తానంలో వున్న వ్యక్తిని దాటిపోయారంటే అతడి స్తానంలో మీరు చేరినట్టు. అంటే ఈ ప్రశ్నకు సరయిన సమాధానం రెండో స్తానం అన్నమాట.

ఇప్పుడిక రెండో ప్రశ్న

ఈ పరుగు పందెంలో మీరు చిట్టచివరవున్న ప్రత్యర్ధిని దాటారనుకుందాం.

అప్పుడు మీరు ఏ స్తానంలో వున్నట్టు.

దీనికి మీ సమాధానం పందెంలో చివరివాడికంటే ముందున్నట్టు. అవునా!

అయితే మాత్రం మళ్ళీ పప్పులో కాలేసినట్టే.

ఎందుకని మీరు అడగక్కరలేదు. నేను చెప్పక్కరలేదు.

వరుసలో ‘చిట్ట చివరివాడి’ని దాటిపోవడం అన్నది ఎవరికయినా అసాధ్యం కనుక.

పోతే ముచ్చటగా మూడో ప్రశ్న.

కాకపొతే, చాలా చిక్కు ప్రశ్న – నోటితోనే టక్కున జవాబు చెప్పాలి. పెన్నూ కాగితం తీసుకుని లెక్కలు వేసుకుంటూ కూచుంటామంటే కుదరదు.

ముందు వెయ్యి అంకె తీసుకోండి. దానికి నలభయ్ కలపండి. మళ్ళీ మరో వెయ్యి కలపండి.తరవాత ముప్పై, ఇంకో వెయ్యి, ఆ తర్వాత ఇరవై, మరో వెయ్యి, ఇంకో పదీ ఇలా కలుపుతూ పోండి. ఇప్పుడు చెప్పండి. అన్నీ కూడితే ఎంత వచ్చింది?

అయిదువేలా ! కాదు.

ఈ ప్రశ్నకు సరయిన సమాధానం 4100 సుమా! నమ్మకపోతే కాలిక్యులేటర్ తీసుకుని లెక్కవేయండి.


అయ్యో! ఒక్క ప్రశ్నకు జవాబు తట్ట లేదని బాధపడకండి.

ఇంకో ప్రశ్న అలాగే మిగిలుందిగా!

అదే ఇది.

సీగాన పెసూనాంబ (శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు ముళ్ళపూడి బుడుగు పెట్టిన ముద్దుపేరు) తండ్రికి అయిదుగురు ఆడపిల్లలు.

అందులో ఒకరి పేరు సుబ్బలక్ష్మి

మరో అమ్మాయి వెంకట లక్ష్మి

ఇంకో అమ్మాయి మహాలక్ష్మి

నాలుగో అమ్మాయి పేరు విజయలక్ష్మి

ఐదో అమ్మాయి పేరేమిటి? ఆదిలక్ష్మి అనుకుంటున్నారా?

కాదు. మన సీగాన పెసూనాంబ.

నాలుగూ అయిపోయాయి. ఏ ఒక్కదానికీ మీ దగ్గర ఆన్సర్ లేదు.

బాధ పడకండి.

ఈ ప్రశ్నలు నన్నడిగినా నేను వేసేది కూడా ఆ వెర్రి మొహమే!



(19-07-2011)

18, జులై 2011, సోమవారం

బుడుగు (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)

బుడుగు (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)  
-భండారు శ్రీనివాసరావు




(ఇంగ్లీషులో TINTUMON అని మరో బుడుగ్గాయ్ వున్నాట్ట. వాడి గురించిన ఇంగ్లీష్ జోకులు ఈ మధ్య ఎవరో పంపితే వాటిని   అచ్చ తెలుగులో అనువదిస్తే యెలా వుంటుందన్న ఆలోచనకు అక్షర రూపమే ఇది.- అచ్చంగా ఇది నా సొంతం కాదని బ్లాగు గుద్ది మరీ మనవి చేసుకుంటున్నాను.- భండారు శ్రీనివాసరావు)




“ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?”


“నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.”


“అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?”


“యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.”



బుడుగుని తీసుకుని వాళ్ల నాన్న ఆరోజు జూ పార్క్ కు వెళ్లాడు. బోనులో వున్న పులిని చూపించి అది ఎంత భయంకరమయిన జంతువో కొడుక్కుచెప్పసాగాడు.ఓ కంటితో పులిని చూస్తూ ఓ చెవితో తండ్రి చెబుతున్నది వింటున్న బుడుగు వున్నట్టుండి ఇలా అడిగాడు. “పులి అమాంతం బయటకు వచ్చి నిన్ను తినేసింధనుకో. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను యే బస్సు ఎక్కాలి?”



బుడుగు స్కూలుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు. బుడుగును పిలిచి ఏదయినా స్లోగన్ రాయమన్నారు. బుడుగు రాసిన స్లోగన్ ఇలా వుంది.


“ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి”



బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది.


“ఏమిటిది ? ఇది స్కూలనుకున్నారా!మీ ఇల్లనుకున్నారా! వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు.


బుడుగు లేచి అన్నాడు.


“సరే!ముందు మీరు మొదలు పెట్టండి”



బుడుగుతో టీచరు చెప్పింది.


“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”


బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.


“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.



మెడిసిన్ చదువుతున్న సీగాన పెసూనాంబ అనే రెండు జెళ్ళ సీతను వాళ్ళింటి కొచ్చిన ప్రొఫెసర్ అడిగాడు.


“ఎటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏమిటి” అని.


పక్కనున్న బుడుగు వెంటనే జవాబు చెప్పాడు.


“జంబలకడి పంబ”


ప్రొఫెసర్ అర్ధం కాలేదన్నాడు.


“మీరడిగింది నాకూ అంతే”-బుడుగు జవాబు.

(18-07-2011)

16, జులై 2011, శనివారం

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది.

ఆ రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా, ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు అమ్మ ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.

ఓ రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.

మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. “రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.”

అప్పుడు నాన్న చెప్పిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

“భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై పేరు నెయ్యి  రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!”

నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.

“ ఒరేయ్ నాన్నా”

నాన్న నన్ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలుస్తాడు.

“అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే బాగా అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!

“ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో.

“జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు. మనం ఇష్టపడ్డ మనుషులే మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం. నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.

“ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలే పది కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.

“మళ్ళీ చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.

“నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను ఆ భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. ఆ చెడ్డ విషయాల సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.”

ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:

జీవితంలో మీరు కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు కోరుకునే వ్యక్తులను మీ మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే ఇతరులతో మీ సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది.
 (16-07-2011)