26, మార్చి 2011, శనివారం

ఎదగడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

ఎదగడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు


ఈనాటి ప్రపంచం యావత్తు కార్పోరేట్ లోకం చుట్టూ పరిభ్రమిస్తోంది. లోకం పోకడలూ, విలువలు అన్నీ కార్పోరేట్ ప్రపంచానికి అనుగుణంగానే మారిపోతున్నాయి.

‘ఎదగడానికెందుకురా తొందరా!’ అనే పాటలకు ఈ ప్రపంచంలో స్తానం లేదు. ఎదుగుదలకు అవకాశం లేని విలువలకు కూడా అందులో స్తానం లేదు. ఎంత త్వరగా ఎదగాలన్నదే కార్పోరేట్ జీవుల ఏకైక ధ్యేయం.

మారిపోతున్న ఈ విలువలు గురించి, వాటి ఆవశ్యకత గురించీ కార్పోరేట్ ప్రపంచాన్ని ఆపోసన పట్టిన ఓ పెద్దమనిషి ఇంగ్లీష్ లో ఓ వ్యాసం రాసేసి నెట్ లో పెట్టి చేతులు దులిపే సుకున్నాడు. ఆ వ్యాసం లోని భావం మాత్రం తీసుకుని తెలుగులోకి స్వేచ్చానువాదం చేయగా, ఇదిగో ఇలా వచ్చింది. వీలయితే చదవండి.అవసరమనుకుంటే ఎదగండి.

“విజయం అంటే మాటలు కాదు. చేతలతో కూడిన వ్యవహారం. గెలుపే ధ్యేయంగా పనిచేసేవాడు తనని తాను పెంచుకుని భూతద్దంలో పెద్దది చేసి చూపుకోగల సామర్ధ్యం కలిగివుండాలి. పనిచేసే సంస్త లోనే కాకుండా బయట కూడా అతగాడి గురించి నలుగురికీ తెలిసివుండాలి. సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు పైకి తెలియకుండా సుతారంగా ప్రచారం చేసుకోవాలి. ఇదంత సులభమేమీ కాదు. దీనికి ఎన్నో తెలివితేటలు కావాలి. పెద్ద పెద్ద కంపెనీలే తమ గురించి తాము ప్రచారం చేసుకుంటూ వుండడం మనం చూస్తున్నాం. అలాటప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ స్వీయ ప్రచార కార్యక్రమానికి సిద్ధపడే వుండాలి. పువ్వుమీద వాలిన భ్రమరం పువ్వుకు కూడా తెలియనంత సుకుమారంగా మధువును గ్రోలినట్టు ఈ ఆత్మస్తుతి,పరనింద తంతును నిర్వర్తించగలగాలి.

“నిన్ను గురించి నువ్వు ఎప్పడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే నమ్మేవారెవరూ వుండరు. నీ గురించి అబద్ధాలు చెప్పుకుంటే మాత్రం ఇంకా ఎంతో వుంది, కావాలనే తగ్గించి చెప్పు కుంటున్నారని అనుకుంటారు”.

ఇది పాతకాలం మాట. కార్పోరేట్ కాలంలో ఇది ఎంతమాత్రం చెల్లుబడి కాదు. ఎందుకంటె, ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం కలికానికి కూడా దొరికే కాలం కాదిది. అందుకని మనకి మనమే పీ.ఆర్.వో. లం అన్నమాట. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని నమ్మకంగా తెలిసినా సరే, మన గురించి మనమే చెప్పుకుని తీరాల్సిన రోజులివి. ఎదుటివాడు నమ్మినా నమ్మకపోయినా, మన అదృష్టం బాగుంటే ఎదుటివాడి పక్కవాడయినా మన మాటలు నమ్మే ఛాన్స్ వుంటుంది.”

ఆ కార్పోరేట్ గురు ఇంకా ఇలా సెలవిచ్చారు.

“మిమ్మల్ని మీరే ఒక ఉత్పాదక వస్తువుగా ఊహించు కోండి. మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోండి. మీరు పనిచేస్తున్న సంస్త లో గానీ, లేదా పనిచేయడానికి అవకాశంవున్న సంస్త లో గానీ నిర్ణయాత్మక పాత్ర పోషించే అధికారులకు మీ గురించి తెలిసే విధంగా ప్రయత్నాలు చేయండి. ఈ విషయంలో వెనుకబడేవాళ్ళు వెనుకనే వుండిపోతారు. ఈ సూత్రం హమేషా గుర్తుంచుకున్నవాళ్ళే ముందుకు పోగలుగుతారు. ఆ ఉన్నతాధికారులు తమ సంస్త లో ఏదయినా ముఖ్యమయిన ఉద్యోగాన్ని భర్తీ చేసే సమయంలో తటాలున మీరు గుర్తుకొచ్చే రీతిలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. లేని పక్షంలో మీరు ఎంత ప్రతిభావంతులన్నది లెక్కలోకి రాదు. వున్న చోటనే వుండి పోతారు. ఈ రకమయిన తెలివితేటలున్నవాళ్ళు మాత్రం సులువుగా మిమ్మల్ని దాటి నిచ్చెనలెక్కి కెరీర్ లో ఉన్నత స్తానాలకు ఎదిగిపోతారు. ఇప్పుడున్న కార్పోరేట్ సూత్రాల ప్రకారం ఇవన్నీ నీతిబాహ్యమయిన చర్యలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే వీటికి అందరి ఆమోదం వుంది. కాలమాన పరిస్తితులకు అనుగుణంగా మారడం ఈ నాటి నీతి. మారకపోతే, కెరీర్ లో కూడా మార్పు వుండదు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.

“మీ గురించి మీరే తెలియచేప్పుకోవడానికి కొన్ని పద్ధతులు వున్నాయి.

“మీరు పనిచేసే సంస్త కు అవసరమయ్యే రెండు మూడు ప్రధానమయిన విషయాలను ముందు బాగా ఆకళింపు చేసుకోవాలి. వాటిని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. వీలుచిక్కిన ప్రతి సందర్భంలో ఏమాత్రం సంకోచించకుండా వాటిని గురించి మాట్లాడుతుండాలి. సందర్భం, అసందర్భం అని ఆలోచించ కూడదు. వాక్చాతుర్యంతో అందర్నీ కట్టిపడేయాలి. మనం చెబుతున్నదానిని అంతా నమ్ముతున్నారా లేదా అన్న సంశయం పెట్టుకోకూడదు. అయితే, ధారాళంగా ఒక విషయం గురించి చెప్పగలిగినప్పుడు ఆ మాటల ప్రభావం శ్రోతలపై కొంతకాలం వుంటుంది. విడిపోయిన తరువాత కూడా కొంతమంది వాటిని గురించే మాట్లాడుకుంటారు. మన గురించి వారి అవగాహన కొంత సానుకూలంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన పట్ల చులకన భావం వున్న వాళ్ళు కూడా పరోక్షంలో మన గురించి మాట్లాడేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సివుంటుంది.

“అలాగే, సీనియర్ మేనేజ్ మెంట్ వ్యక్తులతో సంభాషించే అవకాశం వచ్చినప్పుడు మీరు ఈ చిట్కాను మరింత ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ఉన్నతాధికారులు తలపెట్టే ప్రాజెక్ట్ లలో స్వచ్చందంగా పాలు పంచు కోవాలి. మీ పనిలో ఎంత చిన్న విజయం సాధించినా మొహమాటపడకుండా ఆ విషయం మొత్తం ప్రపంచానికి చాటిచెప్పుకోవాలి. ఇవన్నీ మీ వ్యక్తిత్వ శోభను మరింత పెంచుతాయి. మీ చుట్టూవున్న వారు మీ పట్ల ఆరాధనాభావం పెంచుకోవడానికి తోడ్పడతాయి.

“కెరీర్ గురించి అంతా మరచిపోయిన మాట ఒకటుంది. ‘జీవితంలో సరయిన సమయంలో సరయిన స్తానాన్నిఅందుకోగలగడాన్ని లోగడ కెరీర్ కు అర్ధం గా చెప్పుకునే వారు.

ఈ నాడు దీని అర్ధం పూర్తిగా మారిపోయింది. ‘సరయిన స్తానం ఏదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. దాన్ని సంపాదించుకునే పద్ధతులను స్వయంగా నిర్ణయించుకోవాలి. అందుకు అవసరమయ్యే అవకాశాలను కూడా సొంతంగా సృష్టించుకోవాలి.’

ఇప్పటికే మీరు ఇవన్నీ చేసివుంటే మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో వున్నట్టే లెక్క.

మాయ తివాచీ మీ చేతికి దొరికినట్టే. దాని మీద కూర్చోవడమే తరువాయి అదే మిమ్మల్ని మీరు కోరుకున్న శిఖరాలకు చేరుస్తుంది.”
(26-03-2011)

24, మార్చి 2011, గురువారం

మంచీ చెడు – భండారు శ్రీనివాసరావు

మంచీ చెడు – భండారు శ్రీనివాసరావు


“ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతః” అని రిగ్వేదం చెబుతోంది. అంటే అన్ని వైపులనుంచి ఉత్తమమైన భావాలు నాలో ప్రవేశించు గాక అని అర్ధం.

పరీక్ష జరిగే హాలు నిశ్శబ్దంగా వుంది. విద్యార్ధులందరూ జవాబులు రాసే క్రమంలో తలమునకలైవున్నారు.

పరీక్షరాసే వారిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వున్నారు. తరగతి మొత్తంలో చాలా తెలివిగల విద్యార్ధి. అతడి వెనుకనే మనీష్ కూర్చుని ప్రశ్నాపత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు. సహజంగా మందబుద్ధి అయిన మనీష్ కు ఆ పరీక్ష గట్టెక్కడం అన్నది ఒక పరీక్ష గా తయారయింది. అందుకే అతడు ఈ విషయంలో తన స్నేహితుడయిన విద్యాసాగర్ సాయం కోసం ఎదురుచూస్తూ బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈలోగా ఈశ్వరచంద్ర విద్యాసాగ ర్ జవాబులురాసే పని పూర్తయింది. రాసిన సమాధానాలను మరోమారు పరిశీలించుకునే పనిలో పడిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనీష్ మరో మారు ఈశ్వర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాడు. తన స్నేహితుడు కోరుతున్నదేమిటో ఈశ్వర్ కు సులువుగానే అర్ధం అయింది. కానీ ఈ విషయంలో స్నేహితుడికి సాయం చేయడానికి అతడికి మనస్కరించ లేదు. కానీ, దీనంగా అభ్యర్ధిస్తున్న స్నేహితుడి చూపులకు అతడి మనసు మెత్తపడింది. దాంతో అప్పటి వరకు తాను రాసిన సమాధాన పత్రాన్ని మనీష్ కు రహస్యంగా అందించాడు. ఇది ఎవరూ చూడలేదనుకున్నాడు కానీ, ఈశ్వర్ కాపీ అందిస్తూ వుండడం పరీక్ష హాలులో పర్యవేక్షణ చేస్తున్న ఉపాధ్యాయుడి కంటబడింది. అయ్యవారు ఆగ్రహంతో వూగిపోతూ ఈశ్వర్ ని పట్టుకుని కఠినంగా శిక్షించాడు. నలుగురిలో జరిగిన ఈ అవమానంతో స్వతహాగా అభిమానధనుడయిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎంతగానో కుంగిపోయాడు.

పరీక్ష పూర్తి కాగానే ఉపాధ్యాయుడు ఈశ్వర్ ని తన గదికి పిలిపించుకున్నాడు.

“చూడు. ఈశ్వర్. నువ్వు చాలా తెలివైన విద్యార్ధివి. బాగా చదువుకుని పైకి రావాల్సినవాడివి. నీలాటి తెలివయిన కుర్రవాడిని అలా శిక్షించినందుకు నాకెంతో బాధగా వుంది” అంటూ ఓదార్చే ప్రయత్నం చేసాడు.

స్నేహితుడికి సాయం చేయాలన్న సదుద్దేశ్యం తప్ప దగా చేయాలన్న అభిప్రాయం తనకు యే కోశానా లేదని విద్యాసాగర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

డానికి ఉపాధ్యాయుడు ఇలా జవాబు చెప్పారు.

“తప్పుచేసినవాడు పాపితో సమానం. కానీ తప్పుచేసేవాడికి సాయం చేసేవాడు కూడా వాడితో సమానమే. అందుకే, నిన్నుశిక్షించాల్సి వచ్చింది. నిజమే. నువ్వు మనీష్ కి సాయం చేయాలని అనుకున్నావు. కానీ అలా చేయడం ద్వారా అతడిలోని బద్ధకానికి కూడా సాయం చేస్తున్న సంగతి మరచిపోయావు. అల్లా ఎవరో ఒకరు నీలా సాయం చేస్తూ పోతుంటే, ముందు ముందు తోటివారి సాయం తీసుకోకుండా అతడికయేపనీ చేయలేడు”

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి మహా మేధావి స్వయంగా వెల్లడించిన ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఒకటుంది.

“మనం చేసే ప్రతి పని వల్ల వచ్చే ఫలితం మంచి చెడుల సమ్మిశ్రమం. ఇతరుల జీవితాలను మంచి వైపు నడిపించే దిశగా మనం చేసే పనుల ఫలితం వుండేలాగా చూసుకోవాలి. అటువంటి చక్కటి భావనలు అన్ని వైపులనుంచి మన మనస్సులో ప్రవేశించేలా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూవుండాలి.” (24-03-2011)













21, మార్చి 2011, సోమవారం

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు


నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.

‘ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికి - ఈ ఏడాది  మార్చి పద్దెనిమిది పండుగ రోజు లాటిది. ఏటా మార్చి నెల మూడో శుక్రవారాన్ని  అంతర్జాతీయ నిద్రా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..

అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి లోగో గా పెట్టుకునేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన నిద్రాదేవత మరొకరు దొరకడం దుర్లభం కూడా.

అయితే, ఈ నిద్ర తెరపీ అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి అని వీరు సలహాలు ఇస్తారు. నిద్ర పట్టడం లేదు బాబోయ్ అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.

“నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం మందే మందు అనుకునే వారు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.

హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే హెచ్ ఎం ఆర్ ఐ – 104 అనే ఒక సంస్త వుంది. 104 నెంబరుకు ఫోన్ చేస్తే అక్కడ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే డాక్టర్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తారు. రోజుకు దాదాపు యాభయ్ వేల మంది వైద్య సలహాలకోసం ఈ కాల్ సెంటర్ ను సంప్రదిస్తుంటారు. వీరికొచ్చే కాల్స్ లో చాలామంది ‘నిద్రపట్టడం లేదు ఏం చేయాలని అడిగేవారు వుంటున్నా’రట. బహుశా, రాత్రింబగళ్ళు సలహాలు దొరికే కేంద్రం కావడంవల్ల, అర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా సలహాలు ఇచ్చే వైద్యులు అందుబాటులోవుండడం వల్ల - నిద్రపట్టని వారిపాలిట ఈ కేంద్రం వరంగా మారి వుంటుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం నిద్రలేమితో అనారోగ్యాలబారిన పడుతున్నారని ఈ కేంద్రం సేకరించి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

హెచ్ ఎం ఆర్ ఐ 104 ఉచిత ఆరోగ్య వైద్య సలహా కేంద్రం విశ్లేషణ ప్రకారం యువతలోనే, ప్రధానంగా నగర ప్రాంతాలలోని యువతీ,యువకుల్లో ఈ నిద్రలేమితనం ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తుపై ఆందోళన, రకరకాల మానసిక వొత్తిళ్ళు ఇందుకు కారణగా అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో 92 శాతం మంది 16 నుంచి 40 ఏళ్ళ మధ్య వారేనని తేలింది. వీరిలో అధిక సంఖ్యాకులు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే వుండడం విశేషం. దాదాపు తొంభయ్ వేలమందికి పైగా వివిధ వయస్కుల వాళ్ళు ఈ కేంద్రానికి ఫోన్ చేసి నిద్ర సంబంధిత రుగ్మతల విముక్తికి సలహాలు తీసుకున్నారంటే ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి.

చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన నీలాకాశాన్ని పడక గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ మందు కొడితేనే కానీ నిద్రపట్టదు అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితే,  వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.

ముందే చెప్పినట్టు – పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి. (18-03-2011)

20, మార్చి 2011, ఆదివారం

కోతిచేష్ట – భండారు శ్రీనివాసరావు


కోతిచేష్ట – భండారు శ్రీనివాసరావు


విమానం కూలిపోయింది. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లతో సహా అందులో ప్రయాణిస్తున్నవారందరూ ఈ దుర్ఘటనలో మరణించారు, ఒక్క ఒక కోతి తప్ప. (విమానంలో కోతియేమిటంటే ఇక కధే లేదు)  


దాన్ని ఆసుపత్రిలో చేర్చారు. కాస్త కోలుకున్న తరవాత దుర్ఘటన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఆ కోతిని విచారించడం ప్రారంభించారు. ఈ కధలో కొత్తదనం ఏమిటంటే ఆ కోతికి మనిషి భాష తెలుసు.


దర్యాప్తు ఇలా సాగింది.


అధికారి: “విమానం బయలుదేరినదగ్గరినుంచి అన్ని విషయాలు చెప్పు. అసలేం జరిగింది.”


కోతి: “ఏముంది ఎయిర్ హోస్టెస్ నాకు పళ్ళూ బిస్కెట్లు పెట్టింది. అవి తింటూ కూర్చున్నాను.”


“నీ సంగతి సరే! మిగిలినవారు ఏం చేస్తున్నారు?”


“సీటు బెల్టులు పెట్టుకున్నారు. మందు కొడుతూ కూర్చున్నారు”


“పైలట్లు ఏం చేస్తున్నారు?


“ కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు”


“తరవాత?”


“తరవాత ఏముంది ? ప్రయాణీకులందరూ ఫుల్లుగా మందు కొట్టి, ఎయిర్ హోస్టెస్ లు పెట్టింది తిని నిద్రలోకి జారుకున్నారు”


“మరి ఎయిర్ హోస్టెస్ లు ఏం చేస్తున్నారు?”


“ తీరిగ్గా కూర్చుని లిప్ స్టిక్ దిద్దుకుంటూ, మేకప్ సరిచేసుకుంటున్నారు.”


“పైలట్లు?”


“యధామాదిరి కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు.”


“అది సరే! ప్రమాదం జరగడానికి ముందు ఎవరేం చేస్తున్నారు ?”


“ఎయిర్ హోస్టెస్ లు పైలట్లకు ముద్దు పెడుతున్నారు.”


“మరి. పైలట్లు ?”


“ ఎయిర్ హోస్టెస్ లకు తిరిగి ముద్దు పెడుతున్నారు”


“నువ్వేం చేస్తున్నావు?”


“ఏం చేస్తాను. కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నాను.”


(నెట్ లో చక్కర్లుకొడుతున్న చిన్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)

19, మార్చి 2011, శనివారం

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు


రైల్లో అమెరికా ప్రయాణం

కొందరు తాము నవ్వుతూ ఇతరులను నవ్వించాలని చూస్తారు. మరికొందరు తాము మాత్రం నవ్వుతూ పక్కవారిని ఏడిపించాలని చూస్తారు. ఇంకొందరు తాము నవ్వరు. కానీ, తమ మాటలతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటారు. ఇదిగో ఈ కోవలోని వారే ఈనాటి నా వ్యాసుల వారు. అంటే వ్యాస మహర్షులు కాదు. ఈ వ్యాసానికి ప్రేరకులని కవి హృదయం. ఆయనే తురగా కృష్ణ మోహనరావుగారు. బోలెడంత ఘన కీర్తిని తన వెంటబెట్టుకుని, బోలెడు బోలెడు జ్ఞాపకాలను మనందరికీ వొదిలిపెట్టి స్వర్గానికి వెళ్లిపోయి రమారమి ముప్పయ్యారేళ్ళు అవుతోంది. ఈ రోజు పోతే రేపటికి మూడు అని తేలిగ్గా తీసుకునే రోజుల్లో – ఫిబ్రవరి పదో తేదీన (ఫిబ్రవరి 21 ఆయన జయంతి – అక్టోబర్ రెండో తేదీ వర్ధంతి. ఆరోజు కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవాన్ని కవర్ చేయడానికి వెళ్లి, తప్పిపోయిన రైలును అందుకోవడానికి రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో వెడుతూ నక్రేకల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించి ఎవరికీ అందనంత దూరాలకు వెళ్లి పోయారు) హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన ఆయన సంస్మరణ సభకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన ఆత్మీయులను చూస్తుంటే మంచి మనిషికీ, మంచి జ్ఞాపకాలకూ ఏనాటికీ మరణం లేదనిపించింది.


కృష్ణమోహనరావు గారు రేడియో మనిషి. ఆ మీడియాన్ని ఆయన ఆపోసన పట్టారు. ఈ ప్రజా మాధ్యమం పూర్తిగా సర్కారు చేతుల్లో వున్నప్పుడు ఆయన రేడియో కొలువుని అటు ఉద్యోగ ధర్మానికి మాట రాకుండా, ఇటు సామాజిక బాధ్యతకు లోటు రాకుండా నెగ్గుకొచ్చిన తీరును ఈ సమావేశంలో ఆనాటి ఆయన సహోద్యోగులు మరోసారి గుర్తు చేసుకున్నారు. అక్షరాలను అందమయిన చిత్రాలుగా గీస్తూ వాటితో వెన్నెట్లో, చీకట్లో సయితం సతతం ఆడుకునే  'రేడియో'  సుధామ - కృష్ణమోహన రావు గారితో రేడియో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటే, దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్ - జానకీరాణి గారి కుటుంబంతొ తన సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు.


ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును అందుకున్నది దూరదర్శన్ కరస్పాండెంటు ఈమని కృష్ణారావు. రేడియో జర్నలిజంలో తనకు అక్షరాభ్యాసం చేసింది తురగా కృష్ణ మోహనరావుగారే అని అప్పటి రోజులను మననం చేసుకుంటూ, విధి నిర్వహణలో తురగావారి అంకితభావమే తనకు మార్గదర్శిగా నిలుస్తూవచ్చిందని పేర్కొన్నారు. కాజువల్ సిబ్బందిని కూడా ‘నా సహోద్యోగి’ (మై కొలీగ్) అంటూ బయటవారికి పరిచయం చేసే ఔన్నత్యం కృష్ణమోహన రావుగారి రక్తంలో వుందన్నారు.


కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ ఐ .ఏ. ఎస్. అధికారి శ్రీ రమణాచారి మాట్లాడుతూ- ‘వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పుకాఫీ అనుకునే రోజుల్లో ఇంతమంది ఆత్మీయులు హాజరు కావడం కృష్ణమోహన రావు గారి గొప్పదనానికి అద్దంపడుతోంద’న్నారు.


కర్నాటక మాజీ గవర్నర్ శ్రీమతి వీ.ఎస్. రమాదేవి తమ ప్రసంగంలో వినిపించిన – కృష్ణమోహనరావు, జానకీ రాణిల ‘పెళ్ళికి ముందు ప్రేమ కధను’ శ్రోతలు ఆసక్తితో విన్నారు. ‘గుంభనగా, నిదానంగా వుండే కృష్ణమోహనరావు, చెంగు చెంగునా గంతులువేసే జానకీ రాణి- యాదగిరిగుట్టలో చేసుకున్న ప్రేమపెళ్లికి తానే ప్రత్యక్ష సాక్షిన’ని అంటూ వారి కుటుంబంతో తనకున్న చనువును కళ్ళు చెమర్చేలా చెప్పుకొచ్చారు. భర్త ప్రాణం కోసం యముడిని వెంటాడిన సతీ సావిత్రిలా – జానకీరాణి – ఇన్నేళ్ళ తరవాత కూడా భర్తను సజీవంగా వుంచే ఇలాటి కార్యక్రమాలను– పైపెచ్చు వొంట్లో బాగాలేకపోయినా లేని సత్తువను తెచ్చుకుని నిర్వహిస్తూ వుండడం చూస్తూ – ఒకనాటి సహోద్యోగిగా గర్వపడుతున్నానని చెప్పారు.


ఇలాటి సభల్లో వక్తలు దారితప్పి అనవసర ప్రసంగాలతో చీకాకు పెడతారన్న అపోహను తొలగించడానికా అన్నట్టు కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగిపోవడం కృష్ణ మోహనరావు గారి అభిమానులను మరింత అలరించింది. స్వతహాగా హాస్యప్రియుడయిన తురగా వారికి నిజమయిన శ్రద్ధాంజలి రీతిలో ప్రసిద్ధ రచయిత్రి  సోమరాజు సుశీలాదేవి – కధా ప్రసంగం పేరుతొ చదివిన కధ – సభా ప్రాంగణాన్ని నవ్వులతో కదిలించింది. అమెరికాలో వున్న పిల్లల దగ్గరకు ప్రయాణమై వెడుతున్నప్పుడు ఒక గృహిణికి  ఎదురయిన అనుభవాలను హాస్యంతో రంగరించి శ్రోతలను అలరించారు. కధలు రాయడంలో చేయి తిరిగిన సుశీలా దేవి గారు కధను చదివి వినిపించడంలో కూడా అందెవేసిన చేయి అనిపించారు. ఆరోజుల్లో అమెరికా వెళ్ళాలంటే రైల్లో మద్రాసు వెళ్లి అక్కడినుంచి విమానంలో ఆ దేశానికి వెళ్ళేవారు. అమెరికాకు రైల్లో బయలుదేరామంటూ ప్రారంభించి హాస్యం తొణికించారు.


తురగా దంపతుల ముద్దుల కుమార్తెలు ఉషారమణి (ఆకాశవాణి న్యూస్ రీడర్ ) శోభ, జర్నలిస్ట్ కేబీ లక్ష్మి  - ముగ్గురూ  కార్యక్రమాన్ని ముందునుంచి, వెనుకనుంచి దన్నుగా నిలబడి  విజయవంతంగా నిర్వహించారు.


ఇక, నాకు తెలిసి తురగా కృష్ణ మోహనరావు గారు ఒక అద్భుతమయిన హాస్య రచయిత. సునిశితమయిన వ్యంగ్యానికి ప్రతీక. ‘ప్రవీణ్’ పేరుతొ ఆంధ్ర పత్రిక వార పత్రికలో వారం వారం వారు రాసిన ‘రాజధాని కబుర్లు’ నా బోటి పాఠకులకు అక్షరామృతం. వారి అకాల మరణం తరవాత ఆయన  వొదిలి వెళ్ళిన రేడియో విలేకరి  ఉద్యోగంలో నేను ప్రవేశించడం కేవలం నా సుకృతం.(10-02-2011)









జపాన్ ఉపద్రవమే ఇక్కడ జరిగివుంటే? – భండారు శ్రీనివాసరావు

జపాన్ ఉపద్రవమే ఇక్కడ జరిగివుంటే? – భండారు శ్రీనివాసరావు


ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలలు చెలియలికట్టదాటి అంతెత్తున ఎగసిపడి మిన్నూ మన్నూ ఏకం చేస్తూ తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు –

ప్రకృతి ప్రకోపానికి గురయి, మానవ నిర్మిత కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు,

పొంగి పొరలిన సంద్రపు నీటిలో పెద్ద పెద్ద కార్లూ, విమానాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నప్పుడు-

ఈ వార్తా చిత్రాలనన్నింటినీ టీవీ తెరలపై చూస్తున్న ప్రతి ఒక్కరూ – జపాన్ లో జరిగిన ఘోరకలి ఇక్కడ జరిగుంటే ఏమయ్యేదని ఒక్క క్షణమయినా కలవరపాటుకు గురయివుంటారు.

‘యుగాంతం’ వంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ దృశ్యాలను తలదన్నే విధంగా ప్రకృతి ప్రదర్శించిన విలయతాండవం ముందు – మనిషి మరుగుజ్జుతనం మరోసారి ప్రపంచానికి వెల్లడయింది.

మూడింట రెండువంతులు నీరు ఆవరించివున్న ఈ భూమండలంలో – జపాన్ అనేది అనేకానేక చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దీవుల్లో – హోన్షూ, షికోకు, హూక్కై దో, క్యుషూ అనేవి ప్రధానమైనవి.

అయితే బయట ప్రపంచానికి తెలిసిన జపాన్ అంటే హోన్షూ నే. ఎందుకంటె, జపాన్ అనగానే అందరికీ తటాలున గుర్తొచ్చే టోకియో, ఒసాకా,నగాయో,క్యోటో నగరాలు హోన్షూ అనే ఈ ప్రధాన భూభాగం లోనే వున్నాయి. జపాన్ జనాభాలో అత్యధిక భాగం హోన్షూ లోనే నివసిస్తూవుండడం కూడా మరో కారణం. పైగా, దేశ ఆర్ధిక వ్యవస్తకు ఇది గుండెకాయ లాటిది. విస్తీర్ణం దృష్ట్యా పెద్దదే అయినా, ప్రపంచపఠంలో చూస్తే మాత్రం హోన్షూ దీవి ఒక అరటి పండు మాదిరిగా కనిపిస్తుంది. పసిపిక్ మహా సముద్రం మధ్య వున్న ఈ దీవి, యావత్ ప్రపంచంలో ఒక సంపన్నదేశంగా జపాన్ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఎలెక్ట్రానిక్, మోటారు పరిశ్రమలతో మొత్తం ప్రపంచ దేశాలలోనే పేరుపొందిన జపాన్ – సునామీలు, భూకంపాలకు కూడా పెట్టింది పేరు.

జపాన్ ఆర్ధిక,రాజకీయ,సాంఘికాభివృద్ధికి టోకియో నగరం నిర్వహించిన పాత్రను బట్టి, ఈ దేశం గురించి ఇతర దేశాల వారు అంచనాలు వేసుకుంటూ వుండడం కద్దు. అలాగే, అవసరం అయినదానికంటే ఎక్కువ ప్రచారం ప్రపంచ మీడియా జపాన్ కు ఇస్తూవస్తోంది. అందువల్లనే, ఇటీవలి ప్రకృతి భీభత్సంలో జరిగిన నష్టం గురించిన అంచనాలు కూడా ఆ కోవలోనే సాగాయని ఆ దేశానికి చెందిన నిపుణులు అంటున్నారు. దీనికి వారు చెప్పే కారణం ఇలాటి ఉపద్రవాలపట్ల ఆ దేశం సాధించిన సంసిద్ధత. ఈ విషయంలో జపాన్ కు సరితూగగల మరో దేశం ప్రపంచంలో లేదనడం అతిశయోక్తికాదు. ఎందుకంటె సునామీలు, భూకంపాలు ఈ దేశానికి కొత్తకాదు. అక్కడి ప్రజలు వాటితో సహజీవనం చేయాల్సిన పరిస్తితి. నిజానికి సునామీ, (త్సునామీ ) టైఫూన్ అనే పదాలు జపాన్ భాషకు చెందినవేనంటారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏమి చేయాలన్నది పైనుంచి కింద దాకా అన్ని స్తాయిల్లోని వారికి కరతలామలకం.

ప్రజలందరికీ ఈ విషయంలో చక్కని అవగాహన వుంటుంది. మిన్ను విరిగి మీద పడే సందర్భాలలో సయితం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను గురించి అతి తక్కువ స్తాయిలోని ఉద్యోగికి కూడా తెలిసివుంటుంది. ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో అక్కడి నిపుణులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తక్షణం స్పందించాల్సిన తీరు గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించుకున్నారు. మొన్నటి దుర్ఘటనలో జన నష్టం నివారణకు అది బాగా ఉపయోగపడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వారు అధునాతన కంప్యూటర్ వ్యవస్తను కూడా చక్కగా వాడుకుంటున్నారు.ఈ కోణం దృష్ట్యా ఆలోచిస్తే, ఆ దేశం నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తోంది.

భూకంపాలవంటి విపత్తులు ముంచుకొచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎలాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం వల్ల – ఒకరినుంచి ఆదేశాలు కానీ, సూచనలు కానీ అందుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ ఎవరికివారు పరిస్తితికి తగ్గట్టుగా వెంటనే స్పందించగలిగారని ఒక ప్రత్యక్ష సాక్షి కధనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకృతి  వైపరీత్యం గురించిన అనుమానం తలెత్తగానే ఎవరికి వారు ముందు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలనేది శిక్షణ లో నేర్పే తొలి పాఠం. ఆ జాగ్రత్త తీసుకున్న తరువాత ఆ సమాచారాన్ని ఇతరులకు తక్షణం తెలియచెప్పాలన్నది రెండో పాఠం. అదేసమయంలో తోటి వారి భద్రతకు ఏం చెయ్యాలని ఆలోచించాలి. మిన్నువిరిగి మీదపడే సందర్భాలలో సయితం ఇలా స్తితప్రజ్ఞతతో ఆలోచించగల నైపుణ్యాన్ని జనాలకు కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఉదాహరణకు ఒగాకీ నగరాన్ని తీసుకుందాము. అక్కడి జనాభా లక్షా యాభయ్ వేలు. ఇంగ్లీషు మాట్లాడే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుమని పాతికమంది కూడా వుండరు. అయినా ఇంగ్లీష్ అనువాదకుల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా వుంటుంది. విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికి ఈ రకమయిన సంసిద్ధత చాలా అవసరమని జపానీయులు నమ్ముతారు.

అలాగే, ఇంటర్ నెట్ ను ఇలాటి సందర్భాలలో వినియోగించుకుంటున్న తీరు కూడా అమోఘం. సాధారణంగా ఈ సదుపాయాన్ని వాడుకునే వారి సంఖ్య ఆ దేశంలో చాలా అధికం. విద్యార్ధి దశ నుంచే అక్కడి వారు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడి విద్యాసంస్తలు విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ప్రత్యేక పోర్టల్ ఉపయోగిస్తాయి. విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తరగతి షెడ్యూల్ సరి చూసుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని వెనువెంటనే తెలియచేయడానికి ఇది వారికి బాగా అక్కరకు వస్తోంది. ఈ పోర్టల్ లో ముందు కానవచ్చేదే ఎర్రటి పెద్ద అక్షరాలతో కూడిన హెచ్చరిక. ఈ రోజు తరగతిలో ఏ ఏ పాఠాలు బోధించబోతున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆతృతతతో పోర్టల్ తెరిచిన విద్యార్ధులకు ఆ దుర్ఘటన జరిగిన రోజు కనబడిన

హెచ్చరిక ఏమిటో తెలుసా? “తరగతి సంగతి మరచిపోండి. సునామీ విరుచుక పడబోతోంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొండి”

ఈ విధమయిన ఏర్పాట్లు అన్ని కార్యాలయాలలో, సంస్త లలో వుండే విధంగా ఆ దేశంలో అనేక చర్యలు తీసుకున్నారు. అందుకే, సెకన్ల వ్యవధిలోనే సమాచారం దేశంలోని నలుమూలలకు చేరిపోయింది. జనాలను గాభరా పెట్టేందుకు కాక అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో చేసిన ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చాయని అక్కడివారు చెబుతున్నారు.

పాట్రిక్ అనే సిస్టం ఇంజినీర్ తన అనుభవం గురించి చెప్పిన వివరాలు వింటే ‘యుద్ధ ప్రాతిపదిక’ అని తరచుగా వినబడే మాటకు అసలుసిసలు అర్ధం బోధపడుతుంది.

భూకంప ప్రకంపనలకు సంబంధించిన తొట్టతొలి సూచనను గమనించిన ఆ ఇంజినీర్ పంపిన సమాచారం రెండు సెకన్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటికి చేరిపోయింది. తూర్పు జపాన్ తీరానికి దగ్గరలో తీవ్రమయిన భూకంపం సంభవించిందన్న ప్రభుత్వ సమాచారం వేలమైళ్ళ దూరంలో వున్నవారికి సయితం చేరడానికి మరో రెండు సెకన్ల కంటే ఎక్కువ వ్యవధి పట్టలేదు. మరో రెండు సెకన్లలో భూకంపం సంభవించిన ప్రాంతాలతో టెలిఫోన్ సంబంధాలు తెగిపోయిన సమాచారం అందింది. అయితే, వెనువెంటనే రిమోట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించిన కబురు అందింది. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం తొంభయ్ సెకన్లు. మరోపక్క సహోద్యోగులు, ఇరుగుపొరుగువారి రక్షణ బాధ్యతను ఎవరికివారు స్వచ్చందంగా భుజాన వేసుకున్నారు. ఎవరు ఎక్కడ వున్నారు అన్న సమాచారాన్ని క్షణాల మీద తెప్పించుకుని వారిని అప్రమత్తం చేసారు.

ఇదేమాదిరి సన్నివేశాలు ఆ రోజు జపాన్ దేశమంతటా కానవచ్చాయంటే ఇలాటి సందర్భాలలో ఆ దేశ సంసిద్ధత ఎలావున్నదన్నది వూహించుకోవచ్చు.

ఆ ఇంజినీర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు.

“నేనున్న చోట ఆ రోజు భూమి కంపించడం మొదలయింది. బాగా గాలి వీస్తోంది కాబట్టి భవనం వూగుతోందని ముందు భ్రమ పడ్డాను. మా దేశం భూకంపాలకు నిలయం కనుక వాటిని తట్టుకునేలా భవనాలను నిర్మించుకోవడం ఇక్కడి పధ్ధతి. అందుకోసం ప్రచండమయిన గాలులు వీచినప్పుడు భవనాలు కదిలిపోయేలా వాటిని నిర్మిస్తారు.భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం వీలయినంత తగ్గించడానికి ఈ విధమయిన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నారు.

“ఆ రోజు నేను వున్న భవనం వూగిపోవడం మొదలుకాగానే, కిటికీ నుంచి బయటకు చూసాను. దాపున వున్న రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు బయటకు వస్తోంది. వున్నట్టుండి ఆ రైలుకు బ్రేకులు పడ్డాయి. కీచుమని శబ్దంచేస్తూ పట్టాలపై ఆగిపోయింది. బహుశా, భూకంపం గురించిన సమాచారం తెలిసినవారెవ్వరో రైలు డ్రయివర్ కు ఇంటర్నెట్ ద్వారా ఆ కబురు చేరవేసివుంటారు. అందువల్లనే

రైలును వెంటనే నిలిపివేసారు. ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రయాణీకులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తెలియచేసివుంటారు. అది వేరే విషయం. ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం.

“గంటకు నూట యాభయ్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న రైళ్ళు కూడా, ముందస్తు సమాచారం అందుకున్న కారణంగా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. వాటిల్లో వున్న ప్రయాణీకులందరూ క్షేమంగా వున్నారు. ఇలాటి ఏర్పాట్లు సమగ్రంగా వున్నందువల్ల ఎక్కడా రైళ్ళు పట్టాలు తప్పలేదు. సునామీ సమయంలో జపాన్ రైల్వే వ్యవస్థ పనిచేసిన తీరు అమోఘం. మొత్తం మీద హోన్షూదీవిలో ప్రతిచోటా ఇదే సీను. విమానాలు గాలిలో ఎగిరాయి. భవనాలు కూలకుండా నిలిచాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదు.

“ఒగాకీ నుంచి రైల్లో నగోవా వెడుతున్నప్పుడు అనేక కర్మాగారాలు కానవస్తాయి. వీటిల్లో చెప్పుకోదగింది బీరు తయారుచేసే ఓ కర్మాగారం. పైకి పెద్ద పెద్ద బీరు సీసాల మాదిరిగా కానవచ్చే ట్యాంకుల్లో విపరీతమయిన వొత్తిడి మధ్య బీరు నిలవచేస్తారు. ఈ ఫాక్టరీలలో ప్రమాదకరమయిన రసాయనాలు వుంటాయి. నిజానికి ట్రిగ్గర్ లేని దారుణమయిన ఆయుధాల వంటివి ఈ కర్మాగారాలు. కానీ, వీటిల్లో ఏ ఒక్కటీ పేలిపోలేదు. ఎందుకంటె,సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి వీలయిన వ్యవస్తలను జపాన్ సిద్ధంచేసి పెట్టుకుంది. సమయానికి ఆ వ్యవస్తలు అనుకున్నవిధంగా పనిచేశాయి. కనీవినీ ఎరుగని విపత్తు వాటిల్లినప్పుడుకూడా లక్షలాదిమంది ప్రాణాలు నిలబడ్డాయంటే, ముందే పకడ్బందీగా నిర్మించుకున్నఈ వ్యవస్తలన్నీ అనుకున్నవిధంగా పనిచేయడమే కారణం. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. నిజంగా వ్యవస్థ పనిచేసింది. ఇది మానవ నాగరిక సమాజం సాధించిన విజయం. జపాన్ లోని ప్రతి ఇంజినీరు ఈ విపత్కర సమయంలో తన దేశం కోసం, తన తోటివారికోసం కష్టించి పనిచేసాడు. అయితే, ఇది అప్పుడే గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్తితి. ఎందుకంటే జరగాల్సినంత స్తాయిలో దారుణం జరగకుండా నిరోధించగలిగినామన్న సంతోషం మాకెవరికీ మిగలలేదు. జరగకూడనిది జరిగిపోయింది. అనేకమంది మరణించారు. ఇంకా అనేకమంది జాడ తెలియడం లేదు. వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. మిగిలిన మేమందరం వారందరికీ బాసటగా నిలవాల్సిన తరుణం ఇది” అని ఆ ఇంజినీర్ తన భావాలను పంచుకున్నాడు.

అంత నిబ్బరంగా కర్తవ్యాలను నిర్వర్తించిన జపాన్ ప్రజలు సర్వదా అభినందనీయులు.

పోతే, పులిమీది పుట్రలా విరుచుకు పడిన అణు ప్రమాదం నుంచి కూడా సామాజిక బాధ్యతకు కట్టుబడిన వారి పౌర ధర్మమే వారిని కాపాడగలదని ఆశిద్దాం. (19-03-2011)

జపాన్ సునామీని కళ్ళారా చూడాలనుకుంటే ఈ కింది లింకు ను నొక్కండి. ఓ కారులో అమర్చిన ఆటోమాటిక్ వీడియో కెమెరా ఆ భీభత్సాన్ని కనులకు కట్టినట్టు చూపించింది. ఆ కారు యజమాని ఏమయినాడో ఆ సునామీకే ఎరుక. - రచయిత

http://www.wimp.com/japanesetsunami/



17, మార్చి 2011, గురువారం

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు


వియత్నాం వీరుడు హోచిమిన్ తన జ్ఞాపకాలలో ఇలా రాసుకున్నారు.


“నాకప్పుడు తొమ్మిదేళ్ళు. స్కూలు పరీక్ష తప్పాను. నాకొచ్చిన మార్కులు చూసుకుని ఎంతో బాధ పడ్డాను. జీవితం వృధా అనిపించింది. యావత్ ప్రపంచం నన్నో పనికిమాలినవాడిగా చూస్తున్న భావన కలిగింది. ఆ మానసిక వేదనతో వున్ననేను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. ఐతే, మా నాన్నగారు నామానసిక స్తితిని కనిపెట్టారు. తండ్రిగా దగ్గరకు తీసి లాలించారు. పరీక్ష పాసవడం ఒక్కటే జీవితంలో ప్రధానం కాదన్నారు. మా అమ్మ మరీను. ఎంతో ఆప్యాయంగా మృదువయిన మాటలతో నాకు సర్దిచెప్పింది. నా మనోవేదనను చేత్తో తీసివేసినట్టు మాయం చేయడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. మా కుటుంబానికి ఎల్లవేళలా దన్నుగావుండే మాఇంటి ఆధ్యాత్మిక గురువు గారు నాకు మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ఆ సమయంలో వారినుంచి నాకు లభించిన భరోసా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసిందనే అనుకున్నాను. అయినా, నాలో గూడుకట్టుకుపోయిన దైన్యం తొలగిపోలేదు. అధైర్యం మాసిపోలేదు. వారి మాటలతో, చేతలతో తెచ్చిపెట్టుకున్నకూసింత ధైర్యం కాస్తా మరునాటికే జావకారిపోయేది. నిరాశ ,నిస్పృహ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక ఓ రాత్రి ఇంటి నుంచి పారిపోయాను.


“అలా దిక్కుతోచకుండా తిరుగుతూ ఒక బౌద్ద ఆరామం చెంతకు చేరుకున్నాను. బౌద్ద బిక్షువు ఒకరు సుమధురంగా ఆలపిస్తున్న ప్రార్ధనా గీతం నా చెవిన పడింది. అతడు పాడుతూనే వున్నాడు. నేను వింటూనే వున్నాను.


“నీరు స్వచ్చంగా ఎలావుంటుంది? ఎందుకంటె అది నిరంతరం పారుతూనే వుంటుంది. అలా పారే నీటికి అడ్డంకులు వుండవా? వుంటేనేం నీటికి వున్న పారే గుణం ఆ అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. ఒక నీటి బొట్టు ఓ పెద్ద జలపాతంలా ఎలా మారుతుంది ? ఎందుకంటె దానికున్న పారే గుణమే దానికా శక్తి నిచ్చింది. ఆ జలపాతం ఒక వాగులా, ఆ వాగు ఓ నదిలా ఎలా రూపం మార్చుకుని సముద్రం లో కలుస్తుంది ? ఎందుకంటె ఒకే జవాబు. నీటికి వున్న పారే ఆ లక్షణమే దానికి కారణం.


అందుకని ఓ నా జీవితమా! ఎక్కడా ఆగిపోకు. నిరంతరం సాగిపోతూవుండు. పారుతూనేవుండు. అలా అలా సాగిపోతూనే వుండు.”


“ఆ గీతం వింటూ చాలాసేపు నన్ను నేను మరచిపోయాను. ఎంత గొప్ప భావం. ఎంత చక్కని సందేశం. చలనం లేని ప్రపంచం ఎంత నిరర్ధకం.


“ఆ బౌద్ద బిక్షువు ప్రార్ధన నాలో కొత్త మనిషిని తట్టిలేపింది. అంతే! అప్పటినుంచి నేను నిరంతరం పారే నీటిలా మారిపోయాను. నాటినుంచి ఇప్పటివరకు సదా ప్రవహిస్తూనే వున్నాను. ఎక్కడా ఆగిపోలేదు. అన్నిచోట్లకూ వెళ్ళ గలుగుతున్నాను. అందరినీ చేరగలుగుతున్నాను. ఎందుకంటె సతతం పారే నీటి గుణాన్ని నేను కూడా అలవరచుకున్నాను కనుక. కనుకే, ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతున్నాను.” అని తన స్మృతుల్లో రాసుకున్నారు- మహా నాయకుడు, అశేష జనాలకు పద నిర్దేశకుడు అయిన హోచిమిన్.






నీతి: విజయాన్ని చూసుకుని పొంగిపోవద్దు. అపజయంతో కుంగి పోవద్దు. ఎలాటి ప్రతికూల తలపుల ప్రభావం మనసుపై పడకుండా చూసుకోవాలి. మరో మంచి లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిక్కుగా సాగిపోవాలి. అడుగు ముందుకే పడాలి. ఆగిపోయామా ఇక జీవితం ఆగిపోయినట్టే. ఎందుకటే చలనం లేని జీవితం మృత్యువుతో సమానం. (17-03-2011)