విజ్ఞప్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విజ్ఞప్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జూన్ 2015, మంగళవారం

విజ్ఞప్తి

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై అధినాయకుల సవాళ్లతో కూడిన ప్రకటనలు విన్నప్పుడు , వాటిపై టీవీల్లో  చర్చిస్తున్నప్పుడు చాలా బాధ వేస్తోంది. ఆ బాధ ఇప్పుడు భయంగా పరిణమిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రెండింటికీ సమర్ధత ప్రాతిపదికా తీసుకుని ఆయా రాష్ట్రాల ప్రజలు ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికారం అప్పగించారు.  కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  మొదట్లో ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం అందరి గుండెల్లో నిండింది. అది ఏడాది గడవక ముందే ఇలా ఆవిరి అయిపోతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. అయితే వారిని మెప్పించడానికి వారి అనుచరగణాలు అత్యుత్సాహంతో బుల్లితెర చర్చల్లో చేసే విపరీత వ్యాఖ్యానాలు  జనంలోకి చేరిపోయి వారు కూడా  రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. పడిన ముళ్లు, లేదా తగిలించుకున్న ముళ్లు  మరింత బిగిసిపోకముందే ఉభయ ప్రాంతాల నాయకులు కళ్ళు తెరవాలి.  వ్యవహారాలు చేయిదాటిపోనివ్వకూడదు. నిజానికి ఇది బాధ్యతతో కూడిన కర్తవ్యం.  రెండు ప్రాంతాలలో వాతావరణం తేలిక పడే విధంగా వారి అడుగులు పడాలి. పోరాటాలు రెండు రాజ్యాల మధ్య జరగడం చరిత్రలో చదివాము. రెండు రాష్ట్రాల మధ్య కాదు. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నాది ఇదే విజ్ఞప్తి.



(భండారు శ్రీనివాసరావు)

(NOTE:Courtesy Image Owner)