మూన్నెళ్ల విదేశీ ప్రవాసం - హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్లాగుపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడూ రాసినా అవసరార్ధమే. ఎవరయినా పత్రికలవాళ్ళు అడిగినప్పుడు రాసినవే బ్లాగులో పెడుతూ వచ్చాను.
ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన ‘ఆకాశవాణి’ వార్తలు చదువుతున్నది " కూడా నిజానికి మాగాయ సరుకే. అంటే, లోగడ ఎప్పుడో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులకోసం రాసుకున్న ప్రసంగ వ్యాసం నుంచి తీసుకున్న 'ఎత్తిపోతల పధకం' అన్నమాట.
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది - అని బ్లాగులో రాయగానే అనూహ్య స్పందన వచ్చింది. రేడియో మీద జనాలకువున్న అవ్యాజ ఆదరణ చూసి దానికి కొనసాగింపుగా మరికొన్ని వివరాలు అందిస్తే బాగుంటుందనిపించింది.
తెలుగు రేడియో న్యూస్ రీడర్లు గురించిన కొంత సమాచారం.
న్యూ ఢిల్లీ నుంచి – కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్ప కాలం), గోపరాజు లక్ష్మి.
ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.
పెద్దవిశేషమేమిటంటే మహాకవి శ్రీ శ్రీ సయితం కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు అనౌన్స్సర్ల సంఘం ఇటీవల వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యెక సంచికలో పేర్కొన్నారు.
నిర్వహణ కారణాల రీత్యా న్యూ ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు, గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి
విజయవాడ కేంద్రం నుంచి – జ్యోత్స్నాదేవి (తరువాత హైదరాబాదుకు మారారు), ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు ఈ ముగ్గురు పర్మనెంట్ న్యూస్ రీడర్లు. అప్పుడప్పుడు చదివినవారిలో రెంటాల కల్పన, ఓంకార్, సాధన వున్నారు.హైదరాబాద్ లో కాజువల్ న్యూస్ రీడర్ గా వున్న జీడిగుంట నాగేశ్వర రావు ప్రతివారం బస్సులో విజయవాడ వెళ్లి ఆదివారం ఉదయం వార్తలు చదివేవారు.
హైదరాబాదు నుంచి – నళినీమోహన్, డి.రాధాకృష్ణారావు, మాడపాటి సత్యవతి, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు (అప్పుడప్పుడు – అసలు న్యూస్ రీడర్లు లభ్యం కాని రోజుల్లో అవసరార్థం – వార్తలు చదవాల్సి వచ్చేది. అలాగే అయిదేళ్ళు రేడియో మాస్కో- మాస్కో నుంచి తెలుగు వార్తలు)
నాకంటే ముందు కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు రేడియో మాస్కోలో పనిచేశారు. లిదా స్పిర్నోవా, విక్టర్ అనే తెలుగు తెలిసిన రష్యన్లు కూడా వార్తలు చదివేవారు. ఆ రోజుల్లో రాదుగ (విదేశీ భాషల రష్యన్ ప్రచురణ సంస్త) లో పనిచేసే ఆర్వీయార్ (ప్రముఖ రచయిత, రాళ్ళబండి వెంకటేశ్వరరావు) అప్పుడప్పుడు వార్తలు చదివేవారు)
పోతే, హైదరాబాద్ విషయానికి వస్తే -
రెగ్యులర్ న్యూస్ రీడర్లు కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన వార్తలు చదివిన వారు, ఇంకా చదువుతున్నవారు వున్నారు. సీనియర్ జర్నలిస్ట్, ఆంద్ర ప్రభ మాజీ సంపాదకులు, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కొద్దికాలం చదివారు. అలాగే, ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు- రేడియోలో చేరక పూర్వం అతి కొద్దికాలం వార్తలు చదివారు)
కాజువల్ న్యూస్ రీడర్లలో మరికొందరు – పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి, పార్వతీ ప్రసాద్, వేదగిరి రాంబాబు, చంద్రమోహన్ (ప్రముఖ క్రీడా విశ్లేషకులు, ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధరబాబు వ్యక్తిగత కార్యదర్శి), కృష్ణమోహన్ ( పెళ్లి పత్రిక సంపాదకులు), జె. చెన్నయ్య, (ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన పౌర సంబంధ అధికారి), షర్ఫుద్దీన్, రామ్మోహన్ నాయుడు, జొన్నలగడ్డ రాధాకృష్ణ, ప్రసాదరెడ్డి, అయాచితుల రవికిషోర్ (ఆంద్ర జ్యోతి), పొణంగి బాల భాస్కర్, చుండూరి వెంకట రంగారావు, వెంపటి కామేశ్వరరావు, సీహెచ్ రామఫణి
(లబ్ధ ప్రతిష్టులు, తమ స్వరంతో రేడియో వార్తలకు జీవం పోసిన తెలుగు న్యూస్ రీడర్లలో ఎవరయినా ఈ జాబితాలో కనిపించకపోతే, నూటికి నూరుపాళ్ళు ఆ తప్పు - నాదే – భండారు శ్రీనివాసరావు)