“ఇవ్వాళ పేపరు చదివిన తరువాత కేసీఆర్ పట్ల నాకున్న
దురభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయాయి”
హైదరాబాదులో
సెటిలయిన ఒక తెలుగు మిత్రుడు ఓరోజు పొద్దున్నే ఫోను చేసి చెప్పిన మాట ఇది.
ఆయన
ఇంకా ఇలా అన్నారు.
“ఉద్యమం
రోజుల్లో ఒక పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు విని జీర్ణించుకోలేనంత కోపం
పెంచుకున్న వాళ్ళలో నేనూ ఒకడ్ని. అయితేనేం పాలకుడిగా కేసీఆర్ కు నేను నూటికి
నూటపది మార్కులు వేస్తాను. ఉగాది రోజు ఆయన చెప్పిన మాటలు పత్రికలో చదువుతుంటే
పంచాంగ శ్రవణం మాదిరిగా శ్రవణపేయంగా వున్నాయి. ‘అధికారం తలకెక్కొద్దు. పదవులతో
మిడిసిపడవద్దు. మంచి, మర్యాద ముఖ్యం. పోస్టుల్లోకి రాగానే మారిపోవద్దు. అదివరకు
ఎలా వున్నారో అలాగే వుండండి.’ అని పార్టీవారికి చెప్పడం నాకెంతో నచ్చింది. అంతేనా
! గుళ్ళ విషయంలో అనవసర జోక్యం పెట్టుకోవద్దని సొంత పార్టీ శాసన సభ్యుడినే
బహిరంగంగా హెచ్చరించిన తీరు చూసి నేను మురిసిపోయాను.
“నీకు
సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా గుళ్ళ తెర్వుకు పోతడా!
చేయడానికి పనిలేనట్టు గుళ్ళ ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు. యాదగిరి గుట్ట
అభివృద్ధి మొత్తం చిన జీయరు స్వామికి అప్పగించా! ఖతమైపోయింది. అన్నీ ఆయనే
చూసుకుంటుండు.”
“ఎంత
లక్షణమైన మాటలు చెప్పారు ముఖ్యమంత్రి. పాలకుడు అంటే ఇల్లా వుండాలి. ఒకానొక రోజుల్లో ఆయన్ని ద్వేషించినందుకు ఇప్పుడు
సిగ్గుపడుతున్నాను” అన్నాడు గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు.
సరే!
తెలంగాణలో సెటిలయిన ఆ ఆంధ్ర మితృడి అభిప్రాయం ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా అలాగే
వుంది. మార్పులేదు.
కానీ
అసలు సిసలు తెలంగాణా బిడ్డలు కూడా అలాగే అనుకుంటున్నారా!
దీనికి
సమాధానం అన్వేషించేందుకే ఈ ప్రయత్నం.
ఏళ్ళ
తరబడి తెలంగాణా ప్రజలు కలలుకన్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయి నాలుగేళ్ళు.
ఆ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బాధ్యతలు చేపట్టి కూడా నాలుగేళ్ళు.
కోటి ఆశలు, కోటి అనుమానాల
నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించింది. నిజమే. తెలంగాణ
కోరుకున్నవారు కోటి ఆశలు పెట్టుకున్నారు.
కోరుకోనివారు కోటి అనుమానాలు
పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల
సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం
జరిగిపోయింది. నీటి మీద రాత
కాకుండా రాతి మీద గీత మాదిరిగా తెలంగాణా అనేది ఇప్పుడు ఒక
చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న
ఓ వాస్తవం.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో తెలియదు కాని
బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది
బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం
లేదు.
ఆయన మదిలో మెదిలిన ఆలోచనలకు అంతే లేదు. ఇంత చిన్న మనిషి అన్నన్ని
పెద్ద ఆలోచనలు ఎలా చేస్తున్నారా అనే విస్మయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు కేసీఆర్
వాటిని గురించి చెబుతుంటే.
వాటిల్లో ప్రధానమైనది రైతులకు పెట్టుబడి సాయం. నిజానికి ఎవరూ చేయని
ఆలోచన ఇది. దాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ముందు భూముల రికార్డులను ప్రక్షాళన
చేసి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏడాదికి
ఎకరానికి, రెండు కిస్తీల్లో కలిపి ఎనిమిది వేల రూపాయలు, అదీ మళ్ళీ తిరిగి
ఇవ్వాల్సిన అవసరం లేని ఆర్ధిక సాయం. ఇంతకంటే రైతులకు కావాల్సింది ఏముంటుంది? దీనికి తోడు
వారికీ, రైతు కూలీలకు బీమా పధకాలు. ఆ బీమా ప్రీమియం మొత్తాలను చెల్లించే బాధ్యత
ప్రభుత్వానిదే అంటున్నారు. ఎన్నికల మీద కన్నేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తుగడలకు
పూనుకుందని ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శిస్తూనే మరో పక్క తాము అధికారంలోకి వస్తే పంట
పెట్టుబడి సాయం పధకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేస్తామని ప్రకటనలు
చేస్తున్నారు.
రైతులనే కాదు, తెలంగాణా సమాజంలో వున్న అన్ని వర్గాలను, ఆఖరికి
కులాలను కూడా వదిలి పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చయ్యే అనేక
పధకాలను ప్రవేశపెట్టింది. వాటిని ఓటు బ్యాంకు పధకాలని ఎద్దేవా చేయవచ్చు కానీ
ప్రభుత్వం తలపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు
మాత్రం దేశంలో అందరి దృష్టిని
ఆకర్షిస్తున్నాయి. వాటిని పూర్తిచేయడానికి ఉపయోగిస్తున్న ఇంజినీరింగ్ కౌశలాన్ని
చూసి నిపుణులు దిగ్భ్రమ చెందుతున్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వని పక్షంలో
ప్రజలను ఈసారి ఓట్లు అడిగేదే లేదని గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు ఆ మాటల్ని
తేలిగ్గా తీసుకున్న చాలామంది ఇప్పుడు ఆ ప్రాజెక్టు అమలు జరుగుతున్న వేగాన్ని
గమనించి ఆశ్చర్యపోతున్నారు.
అలాగే మరో అపూర్వ పధకం పేద ప్రజలకు రెండు గదుల ఇళ్ళ నిర్మాణ పధకం.
నివేశన స్థలం, పూరి పాక, పక్కా ఇల్లు ఇలా కాలానుగుణంగా రూపాలు
మార్చుకుంటూ వస్తున్న పేదవారి ఇల్లు,
ముఖ్యమంత్రి
కేసీఆర్ పుణ్యమా అని సంపన్నులు సయితం అసూయపడేరీతిలో రెండు పడక గదుల గృహంగా
రూపాంతరం చెందింది. ఎన్నో ఏళ్ళుగా అమలవుతున్న ఈ పధకాన్ని గమనిస్తూ వస్తున్న నా
బోంట్లకు కేసీఆర్ రెండు గదుల ఇంటి పధకం
అపూర్వం, విప్లవాత్మకం అనిపించింది. కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు. నేను చూసిన
దానికే ఇది అక్షర రూపం.
అది
మార్గశిర మాసం, కృష్ణ పక్షం, దశమి, శుక్రవారం.
తెలంగాణలో
కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు సామూహిక
గృహప్రవేశాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వర్ణ శోభిత తెలంగాణాను
కళ్ళముందు నిలిపాయి.
విలేకరిగా
ఉత్సాహం కొద్దీ నేను కూడా ముహూర్త
సమయానికి ఎర్రవల్లి వెళ్లాను. ఈరోజుల్లో ప్రభుత్వ
కార్యక్రమాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి
పాల్గొనే సభలు, సమావేశాలు అంటే ఆ హంగూ, ఆ ఆర్భాటమే వేరు. నిజానికి డబల్ బెడ్ రూమ్
పధకం కేసీఆర్ ప్రాధాన్యతా పధకాల్లో ఒకటి. అయినా సభ చాలా చాలా నిరాడంబరంగా
జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు ఏవీ లేవు. లోగడ కొత్త జిల్లాల
ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇంతే. హడావిడి తక్కువ. బహుశా ఇది కేసీఆర్ స్పెషాలిటీ
కాబోలు. రెండు గదుల ఇళ్ళతో పునర్నిర్మించిన
నరసన్నపేట గ్రామంలో నాలుగు వీధులు కాలినడకన ఆయన కలయ తిరిగారు.
ఇళ్ళల్లోకి వెళ్లి అక్కడివారిని పలకరించారు. ఇల్లంటే ఇలా వుండాలి అని కలిగిన వాళ్ళు కూడా అబ్బురపడేలా ఆ గృహాలకు రూపకల్పన చేసారు. ఇక వూరి సంగతి చెప్పక్కర
లేదు. వీధులకు ఇరువైపులా ఒకే నమూనా కలిగిన ఇళ్ళు. సిమెంటు రోడ్లు, మురికి నీరు
పోయేలా రోడ్లపక్కన కాలువలు, పచ్చని మొక్కలు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు,
ఇంకుడు గుంటలు, ఇంటర్ నెట్ సేవలు, కళ్యాణ మండపం ఒకటేమిటి ఒక వూరికి ఉండాల్సిన
సౌకర్యాలు సమస్తం ఈ ఊళ్లకు అమర్చి పెట్టారు. కొంతకాలం క్రితం ఇదే ఊళ్లలో పాత
ఇళ్ళను పడగొడుతున్నప్పుడు, ‘ఇదంతా జరిగేదేనా’ అని నిరాశతో నోళ్ళు నొక్కుకున్నవాళ్ళ నోళ్ళు, కళ్ళెదుట
జరిగిన ఈ గ్రామ పునర్నిర్మాణాన్నిచూసిన తరువాత మూతబడి వుంటాయి.
వందల
మంది పేదల కళ్ళల్లో ఆనందం నింపిన కేసీఆర్ నిజంగా ధన్యజీవి. ప్రజలు అప్పగించిన
అధికారాన్ని, తిరిగి ఆ ప్రజల మేలుకే ఉపయోగించడం ఎలాగన్నది ఆయన చేసి చూపెట్టారు.
ఆరోజు నాకు కలిగిన అభిప్రాయం అది.
కానీ, గత ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఈ రెండు గదుల ఇళ్ళ పధకం ప్రారంభించినప్పుడు
ఉన్న వేగం వడీ ఇప్పుడు తగ్గిపోయాయనే భావం ప్రజల్లో వుంది. కేసీఆర్ కి రాజకీయంగా,
బడుగు జనులకు ప్రయోజనకరంగా వుండే బహుళార్ధ సాధకమైన ఈ పధకం పూర్తిగా అమలుచేయగలిగితే బంగారు తెలంగాణాకు
మెరుగులు దిద్దినట్టు అవుతుంది.
అయితే, బంగారు తెలంగాణా సాధన
కోసం ఆయన నిశ్శబ్దంగా, నిరవధికంగా చేస్తున్న ప్రయత్నాలకన్నా పార్టీని,
ప్రభుత్వాన్ని
స్తిరంగా, బలంగా ఉంచడానికి రాజకీయంగా
ఆయన అమలుచేస్తున్న
వ్యూహ ప్రతివ్యూహాలే జనాలకు, ప్రత్యేకించి మీడియాకు కొట్టవచ్చినట్టు కానవస్తున్నాయి. రాజకీయ
నాయకులకి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులకి ఇవన్నీ తప్పనిసరే. కాదనము.
కాకపొతే, ఇవే ప్రముఖంగా కనబడి, అసలు కనబడాల్సిన ఇతర అభివృద్ధి అంశాలు నేపధ్యంలోకి వెళ్ళిపోవడం
దీర్ఘకాలంలో ఏ పార్టీకి అంత మేలు చేసే విషయం కాదు.
చూస్తుండగానే
నాలుగేళ్ల పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చేసినవి చాలా వున్నా, చరిత్రలో
నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన
అయిదేళ్ళ సమయంలో మిగిలివున్న వ్యవధానం ఒక్క ఏడాది మాత్రమే. ఈ చివరి
ఏడాది కూడా ఎన్నికల నామ సంవత్సరమే.
మొదటి
రెండు మూడేళ్ళు అచేతనంగా వున్న ప్రతిపక్షాలు ఎన్నికల ఘడియ ఏడాదికి చేరువ కావడంతో
స్వరాలు పెంచుతున్నాయి. అది సహజం కూడా. ‘చెప్పినదేమిటి, చేస్తున్నదేమిటి’ అని
కొన్ని ప్రజాసంఘాలు సర్కారును నిలదీస్తున్నాయి. ఈ నేపద్యంలోనే కొత్త రాజకీయ
సమీకరణలకు శ్రీకారం చుడుతున్నారు.
ప్రతిపక్షాలు
రాజకీయంగా చేసే ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన అవసరం పాలక పక్షానికి లేకపోవచ్చు.
ప్రజాసంఘాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అగత్యం లేదని అనుకోవచ్చు.
అయితే
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం వున్నది ఒక్కరికే.
అది ప్రజలకు.
తమను
నమ్మి పాలనా పగ్గాలు అప్పగించిన ఆ ప్రజలకు
ఏ ప్రభుత్వం అయినా జవాబుదారీగా ఉండక తప్పదు.
(EOM)