రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ కార్డు తీసి ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మన కార్డు తీసి పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.
జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ
నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన
వారికి.
పుట్టి
కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ
నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం.
ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు,
వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.
పాతికేళ్ళు
వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే
వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.
హైదరాబాదులో
ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ పంచదార కోసం.
అందరిలాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక
తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి
పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా
తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన
ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని
స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి
వెళ్ళారు.
తరువాత
కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు
ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.
అమెరికా
వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై
ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న
ఉద్యోగం చలవే.
బ్యాంకు
కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ
ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్
కార్డు లేకపోతె బహుశా నాకు జీవితంలో బీపీ
రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా
డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే
తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.
ఆధార్
కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే
తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి
పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో decomposed dead body లాగా వుందని, ఇంటి నుంచి
కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.
విధిగా
తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు
వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు,
స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. ఈ మూడు కూడా
పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.
ఇక
వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత నలభయ్ ఆరేళ్లుగా.
దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు
కార్డు,
రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు
టిక్కెట్టు ధరతో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు
వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను.
వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే
కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు
అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే
ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.
పొతే, సగంధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే
పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.
మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు
కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది
దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది.
విచిత్రం ఏమిటంటే నేను సుదీర్ఘ కాలం పనిచేసిన రేడియో, దూరదర్సన్
లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను
తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా
జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.
రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు,
సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.
మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు
క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.
జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం
లేదు, ఎందుకంటే
అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ
అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని
దేశాలు తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు.
ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.