‘మాదీ బందరు, మీదీ బందరు’ ‘మాదీ తెనాలి, మీదీ తెనాలి’ అని కొన్ని సినిమాల్లో హాస్య పాత్రలతో అనిపించడం అందరికీ గుర్తే.
కానీ సొంతవూరుపట్ల మమకారం అలాంటిది. దాంట్లో తప్పు పట్టడానికి కానీ, ఎద్దేవా చేయడానికి కానీ కారణం కనిపించదు.
రేడియోలో నా సహోద్యోగి, కీర్తిశేషులు డి. వెంకట్రామయ్య గారి ద్వారా వెనిగళ్ళ వెంకటరత్నం గారు నాకు పరిచయం. పెద్ద ఉద్యోగాలు చేసిన తర్వాత, హాయిగా సాహితీ మిత్రులతో కాలక్షేపం చేయడం ఆయన హాబీ.
ఆయనలో మంచి స్నేహితుడిని చూసాను కానీ ఆయన కలం విదిలిస్తే చక్కటి రచనలు చేయగల దిట్ట అని ఆలస్యంగా తెలిసింది.
1983 లో నోబెల్ పురస్కార గ్రహీత నార్మన్ బోర్లోగ్ తో అయన చేసిన ఇంటర్వ్యూ ఆంధ్రప్రభ దినపత్రికలో అచ్చయింది.
ఆయనే, ఆ వెంకట రత్నం గారే ‘ ఆంధ్రా ప్యారిస్ తెనాలి’ అనే పుస్తకానికి రచయిత.
అలనాటి అందాల నటి కాంచనమాలతో మొదలెట్టి తెనాలికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అనేకమంది జీవన చిత్రాలను సరళమైన శైలిలో ఆయన ఇందులో పొందుపరిచారు.
తెనాలికి ఆంధ్రా ప్యారిస్ అనే పేరు రావడానికి కారణం అదొక అందాల నగరమని కాదు, అందాల భామలకు ప్రసిద్ధి అని కూడా కాదు. కొత్త కొత్త ఫ్యాషన్లకు, సరి కొత్త ఆలోచనలకు ప్యారిస్ పెట్టింది పేరు. అక్కడి కవులు, రచయితలు కొత్త రీతిలో రచనలు చేసేవాళ్ళు. చిత్రకారులు కొత్త పోకడలతో చిత్రాలు గీసే వాళ్ళు. అలాగే తెనాలిలో కూడా ఇలాంటి వాతావరణమే వెల్లివిరుస్తుండేది.
మధ్యలో మూడు కాలువలు ప్రవహిస్తూ వుండడం కూడా ప్యారిస్ తో తెనాలిని ముడి పెట్టడానికి కారణమని వెంకట రత్నం గారి భావన.
తెనాలి గురించి ఆయన చెప్పిన మరో విశేషం.
1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి రైల్వే స్టేషన్ ను తగులబెట్టారు. పోలీసు కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు మరణించారు. ఈ వార్తను బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేసాయి. బ్రిటిష్ పాలకులు రెచ్చిపోయి ఎందర్నో అరెస్టు చేసారు. తెనాలి ప్రజలపై రెండు లక్షల రూపాయల అపరాధ పన్ను విధించారు. ఆ పోరాట ప్రదేశాన్ని ‘రణరంగ్ చౌక్’ గా నామకరణం చేసి, అమరుల స్మృతి చిహ్నంగా ఏడు స్తూపాలు నిర్మించారు. 1959లో వాటిని నాటి తెనాలి మునిసిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య గారి ఆధ్వర్యంలో ఏ.ఐ.సి.సి. అధ్యక్షులు శ్రీ కామరాజ నాడార్ ఆవిష్కరించారు. ఈ స్మారక చిహ్నం చిత్రాన్నే ఈ పుస్తకం కవర్ పేజీగా రూపొందించడం హర్షణీయం.
తెనాలి పట్ల అంతటి ప్రేమాభిమానాలు కలిగిన వెనిగళ్ళ వెంకటరత్నం గారు ఈ రోజు హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారని వాసిరెడ్డి నవీన్ గారి ద్వారా తెలిసింది.
కింది ఫోటో: ఒక సాయంత్రం వెనిగళ్ళ వెంకట రత్నం గారు, సుప్రసిద్ధ పాత్రికేయ మిత్రుడు శ్రీ సోమశేఖర్, తెలంగాణా మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస రెడ్డి గారు, మా ఇంటికి వచ్చారు. అప్పటి ఫోటో.
#Tenali
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి