29, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (50) - భండారు శ్రీనివాసరావు

 


“స్టార్ట్ ఇమ్మీడియేట్లీ. నిర్మలఅంటూ నా కాబోయే ఆవిడ నుంచి వచ్చిన టెలిగ్రాం గురించి చెప్పుకుంటూ ఎటో వెళ్ళిపోయింది వ్రాత. టెలిగ్రాం అంటే ఆ మాత్రం ఆలస్యం కావాల్సిందే కానీ, అదేమిటో ఆరోజు మాత్రం ఠంచనుగా డెలివరీ చేశారు.  వెంటనే బయలు దేరండి అని అర్ధం అయింది. ఎందుకు బయలుదేరాలి అనేది అర్ధం కాక తల బద్దలు కొట్టుకుంటుంటే నా మేనల్లుళ్లు శాయిబాబు, రాజన్న నాకు దన్నుగా నిలబడ్డారు. (ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు) ముగ్గురం కలిసి బెజవాడ రైల్వే స్టేషన్ కు  వెళ్ళాము. మద్రాసు వెళ్ళే రైలు పలానా ప్లాట్ ఫారం మీద ఉందన్నారు. టిక్కెట్టు కొనుక్కుని రైలు ఎక్కాను. తెల్లారి మద్రాసు సేన్త్రం స్టేషన్ లో దిగాను. అప్పటికి టెలిఫోన్ సౌకర్యం వుంది కానీ, ఇద్దరి ఇళ్ళల్లో ఆ సదుపాయం లేదు. మద్రాసు చేరి వాళ్ళ ఇంటికి వెళ్ళే దాకా టెన్షన్ తప్పదు. పైగా నాకు కాబోయే అత్తగారిని, మామగారిని చూడడం అదే మొదటిసారి.  రైల్లో పడుకోవడానికి జాగాలేదు. ఆలోచనలతో నిద్ర లేదు.

చేరగానే మా ఆవిడ అంతకు ముందు ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం త్యాగరాయ నగర్లోని వెంకట్రామయ్య స్ట్రీట్ లోని వాళ్ళ ఇంటికి చేరాను. నన్ను చూసి నిర్మల నివ్వెర పోయింది. ఇక వాళ్ళ తలితండ్రుల సంగతి చెప్పక్కర లేదు. నన్ను బయటనే ఓకే కుర్చీలో కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళు తర్జనభర్జన పడుతున్నారు. ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అసలు అర్ధం కావడం లేదు. అర్ధం అయిన్దల్లా ఆ టెలిగ్రాం ఇచ్చింది మా ఆవిడ కాదని. ఆట పట్టించడానికి ఆమె స్నేహితురాలు ఇచ్చిందని.

నాకు మరో విషయం కూడా చూచాయగా అర్ధం అయింది. బహుశా నా జీవితంలో నా అంతట నేనుగా, క్షణాల మీద తీసుకున్న నిర్ణయం అదొక్కటే.

మా ఆవిడతో చెప్పాను. ‘బయలుదేరు, ఈ సాయంత్రం రైలుకు తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుని  బెజవాడ వెల్లిపోదాం. మీ వాళ్ళతో చెప్పిరా అన్నాను.

వాళ్ళ మీద పిడుగులా పడింది నా నిర్ణయం. ఒక్కగానొక్క పిల్ల. అలా ఎలా చేస్తాం పెళ్లి. పెళ్లి పెళ్ళిలా జరగాల్సిందే. అలా కుదరదు అన్నారు వాళ్ళ నాన్నగారు. అలాగే జరుగుతుంది. జరిగి తీరుతుంది. జరగకపోతే ఇక ఎప్పుడూ జరగదు. ఇది నా నిర్ణయం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీ అమ్మాయే అన్నాను  స్థిరంగా. మా ప్రేమ వివాహం ఇన్నేళ్ళు వాయిదా పడడానికి కూడా ఇదే కారణం.

ఏడుగురు అక్కయ్యలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు దాదాపు ఓ యాభయ్ పెళ్ళిళ్ళు చేసిన చూసిన కుటుంబం మాది. ఈ రోజుల్లో అంతా కాంట్రాక్ట్. ఒక్క తాళి కట్టడం, పెద్దవాళ్ల ఇళ్లకు వెళ్లి  స్వయంగా పెళ్లి పిలుపులు తప్పిస్తే , మిగిలిన పెళ్లి పనులన్నీ కాంట్రాక్టు పద్దతి మీదే జరుగుతున్నాయి. పెళ్లి వాళ్ళు మంచి వాళ్ళే అయినా ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళ వాళ్ళలో ఒక్కడు పేచీ పెడితే మొత్తం పెళ్లి ఆగిపోయే పరిస్థితులు కూడా వుండేవి ఆ రోజుల్లో. ఇవన్నీ చూసి, వినీ నేను పెళ్ళికి రాం రాం చెప్పుకున్నాను. పెళ్ళనేది ఇద్దరి మధ్య వ్యవహారం. పెళ్లి చేసుకునే ఆ ఇద్దరు తప్పితే మిగిలిన వాళ్ళు అందరూ మూడో మనిషి కిందికే వస్తారు అనేది అప్పట్లో నా అభిప్రాయం. పిల్లను ఇచ్చే ఏ పెద్దమనిషి మాత్రం అంత పెద్ద మనసు చేసుకుని పిల్లను వెళ్లి పెళ్లి చేసుకో పో అంటాడు. అందులోను మా మామగారికి మగపిల్లలు లేరు. ఒక్కగానొక్క ఆడపిల్ల. పైగా ఇటు చూస్తే  సరైన చదువు సంధ్యలే కాదు, ఒక మాదిరి ఉద్యోగం కూడా లేని వరుడు. మా పెళ్ళికి ప్రధానమైన అడ్డంకి ఇదే. ఆయన స్వంత ఊరు బందరు. పెనుమర్తి వారు. ఒకానొక రోజుల్లో పెద్ద ఆస్తిపరులు. కుటుంబంలో పెద్దవాడయిన ఆయన చాలా వ్యాపారాలు చేసి చాలా నష్టపోయారు. బెజవాడలో ఆయనకు సొంత ప్రెస్సు వుండేది. రైల్వే కాంట్రాక్టులు కూడా చేశారుట. గూడూరు దగ్గరో, నెల్లూరు దగ్గరో రైల్వే వంతెన కాంట్రాక్ట్ తీసుకుని సరైన పర్యవేక్షణ కొరవడడంతో పెద్ద ఎత్తున నష్టం వచ్చిందట, మద్రాసులో వున్న తమ్ముడు వద్దకు వెళ్లి పెట్రోలు బావుల తవ్వకానికి వాడే ఒక రకం మెటల్ ని ఆరబ్ దేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం మొదలు పెట్టారు. అమ్మాయిని ఆంధ్రా మెట్రిక్ పరీక్షలు రాయించడానికి బెజవాడ గవర్నర్ పేటలో ప్రఖ్యావారి ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకుని చదివిస్తున్నారు. ఆ పక్క వాటాలోనే  నేను. అంటే మా అన్నగారింట్లో. ఆ విధంగా అప్పుడు తాడూ బొంగరంలేని నా వంటి మనిషితో ప్రేమలో పడింది. ఆమె ఎందుకు పడింది అంటున్నాను అంటే ప్రేమల విషయంలో నేను అంత నిఖార్సయిన మనిషిని కాదు కాబట్టి. ఈ విషయాల్లో నాది సగటు మగవాడి మనస్తత్వమే.

ఈ పూర్వరంగంలో నా మద్రాసు ప్రయాణం.  

చివరికి మా ఆవిడ కూడా గట్టిగా పట్టుబట్టడంతో ఇక వాళ్లకి  సరే అనక తప్పలేదు. పెళ్ళొద్దు! పెళ్ళాం కావాలి అనే నా నినాదమే నెగ్గింది.

1971 డిసెంబరు 15 వ తేదీ   రాత్రి  మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారి పొడుగునా భోరున వాన. అట్లా ఇట్లా కాదుఉరుములుమెరుపులు,  పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ, 16 వ తేదీ  తెల్లారేలోపునే తిరుమల కొండపైకి  చేరాము.  గుడికి దగ్గరలో వున్నఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు.  మా ఆవిడ పిన్ని వసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె ఆ రోజు  పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానోప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భంసన్నివేశం అలాంటివి. పెట్టుడు ముహూర్తం. ఆరోజు అమావాస్య అనుకుంటాను. అరవ వాళ్ళకి మంచి రోజు అని సర్ది చెప్పుకోవడానికి పనికి వచ్చింది.  తొమ్మిదీ పది గంటల  నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి, మహాద్వారం ద్వారా వెళ్లి  బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి, వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు  టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.  “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా వెళ్లి  పెళ్లి చేసుకున్నావ’ని ఆ తండ్రిమా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.

రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత  16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము.  మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని  చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.

అట్టహాసంగా చేసుకునే పెళ్ళిళ్ళు చూసి చూసి, మొహం మొత్తి,  పెళ్ళొద్దు! పెళ్ళాం కావాలి! అనే నా మొండి పట్టుదల ఫలితం మా ఈ  పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా, బహుశా అదే ఆఖరిసారి  కావచ్చు.

మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో, నేను పనిచేస్తున్న ఆంద్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము.  నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నానుఅని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.

ఇంతకీ మాది ప్రేమ వివాహమా!  రాక్షస వివాహమా! గాంధర్వ వివాహమా! ఏదైతేనేం! ఆనాడు అంత కఠినంగా వ్యవహరించకుండా వుండి వుంటే  బాగుండేది అని ఆ తర్వాత  చాలా సార్లు అనిపించింది. ఏం లాభం. గతజల సేతుబంధనం.

మా పెళ్లి రోజుకు యాభయ్ ఏళ్ళు నిండాయి.  గోల్డెన్ జూబిలీ అంటారేమో! అదేమిటో చిత్రం.  మా ఆవిడకు బంగారం మీద వీసమెత్తు మోజులేదు. అందుకే కాబోలు, ఆ వేడుకకు  ముందే దాటిపోయింది.     

ఇలాంటి పెళ్లిళ్లకు దండలుఫోటోలు వుండవుజ్ఞాపకాలు తప్ప.

తోకటపా :

రెండేళ్ల క్రితం స్నేహితుడు సూర్యతో కలిసి తిరుపతి వెళ్లాను. ఎవరి సిఫారసు లేకుండా దైవ దర్శనం చేసుకుని రావాలని ముందే నిర్ణయం చేసుకుని వెళ్ళాము. ఈ ప్రయాణంలో నేను మరో ముఖ్యమైన పని పెట్టుకున్నాను. 1971 డిసెంబరు  16 వ తేదీన అంటే ఇంచుమించు యాభయ్ ఏళ్ల క్రితం మా పెళ్లి జరిగిన కాటేజీ ముందు ఒక ఫోటో దిగాలన్నది నాకు ఎన్నాళ్ళ బట్టో వున్న కోరిక. మా ఆవిడ జీవించి ఉన్నంత కాలం ఇది కుదరలేదు. కనీసం ఆవిడ పోయిన తర్వాత అయినా ఈ పని చేయాలని నా తలంపు. అలాగే ఆ కాటేజీ వెతుకుతూ వెళ్ళాము. అప్పటికి ఇప్పటికి ఆ కాటేజీల రూపు రేఖలు మారిపోయాయి. ఆ కాటేజీని రెండు భాగాలుగా అంటే పైనా కిందా రెండు యాత్రిక కుటుంబాలకు నామమాత్రపు రుసుము తీసుకుని అద్దెకు ఇచ్చేవారు అప్పట్లో. వంట చేసుకోవడానికి ఒక బండ రాయి  పరచిన ఎత్తైన అరుగు లాంటిది వుండేది. స్నానానికి నీళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలి. ఫ్యాను వున్న గుర్తు లేదు.  ఎందుకంటే మేము వెళ్ళింది శీతాకాలంలో. ఇప్పుడు మంచి రంగులు, హంగులతో కనిపించింది. మేము వెళ్ళినప్పుడు లోపల ఎవరో యాత్రీకులు వున్నారు. అంచేత బయట నిలబడి ఫోటోలు తీసుకుని వచ్చేశాము. అదే ఈ కింది ఫోటో.



(ఇంకావుంది)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య, ఇన్ని సంవత్సరాలకి మీరు మీ పెళ్లి వెనక ఉన్న కథ రాశారు .
మీ ఆవిడ తో పరిచయం ఎలా అనేది మీరు ఎప్పుడు రాయలేదు , పెళ్లి గురించి మాత్రం రాశారు . నేను కూడా ఒక సారి అడిగినట్టు గుర్తు .
ఏది ఏమైనా ఆ రోజుల్లో మీ తెగింపు కి మాత్రం హాట్స్ ఆఫ్ . Thank you.
:Venkat

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

నేను కూడా మీకు థాంక్స్ చెప్పాలి వెంకట్ గారు. ఇన్నాల్టికి మీరు అజ్ఞాతం వీడి పేరు రాసారు. సంతోషం