చాలా రోజులు మా కొత్త కాపురం పి.డబ్ల్యు డి గ్రౌండ్స్ దగ్గరలో వున్న మా పెద్దన్నయ్య గారి ఇంట్లోనే సాగింది. అప్పటికి ఆయనకు నలుగురు చిన్నపిల్లలు. ఒక మగపిల్లవాడు రఘు, ముగ్గురు ఆడపిల్లలు రాణి, వేణి, వాణి. అదనంగా మేము ఇద్దరం. అయినా మా వదిన గారు, సరోజిని దేవి మా ఆవిడకు ఏపనీ చెప్పకుండా అన్నీ తానే చూసుకునేది. మా ఆవిడకు పిల్లలు అంటే ప్రాణం. దాంతో పిల్లలను కనిపెట్టి చూడడంలో ఆనందం వెతుక్కునేది.
ఆఫీసుకు
దగ్గరలో ఇంటి వేట మొదలు పెట్టగానే మా ఆవిడను మా స్వగ్రామం కంభంపాడు తీసుకు
వెళ్లాను. మా బామ్మ,
అమ్మ,
మూడో అన్నయ్య,
వదిన,
వారి పిల్లల వద్ద వదిలి నేను బెజవాడ వచ్చేశాను. పుట్టినప్పటి నుంచి మద్రాసు,
బెజవాడ,
బరంపురం తప్ప పల్లెటూరు ఎలా వుంటుందో తెలియని పెంపకం. పైగా అప్పటికి మా ఊళ్ళో సెప్టిక్ లెట్రిన్ పద్దతి లేదు.
ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు కలిసి చెంబులు తీసుకుని దగ్గరలో వున్న తుమ్మ చెట్ల
చాటుకు వెళ్ళేవాళ్ళు. పట్టణంలో పెరిగిన పిల్లకి ఇది ఎంత దుర్భరమో అన్న ఆలోచన నాకు
లేకపోగా,
మా పెద్ద వదినలు అలా సంవత్సరాల తరబడి పల్లెటూరు ఇంట్లో వుంటూ పెద్దలకు సేవ చేసిన
విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వుండేవాడిని అదో గొప్ప ఘన కార్యం అన్నట్టు. ప్రేమ త్యాగం
కోరుతుంది అనే మాటలు చాలా విన్నాను కానీ ఇంతటి సహనం ఇస్తుందని నాకప్పట్లో తెలియదు.
మద్రాసులో ఏదో గొప్ప జీవితం అనుభవించింది అని చెప్పను కానీ,
రోజూ మట్టితో అలికే ఇంట్లో వుండాల్సివస్తుందని పెళ్ళికి ముందు ఊహించి వుండదు. కానీ
ఈ విషయాలు గురించి నాకెన్నడూ ఉత్తరాలు రాయలేదు, కలిసినప్పుడు చెప్పలేదు. అన్ని ప్రశ్నలకు
ఒకే జవాబు. అయాం సూపర్. అయాం ఆల్ రైట్. ఈ నమ్మకం జీవితాంతం కొనసాగింది.
నా భార్య నిర్మల
చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అపోలో ఆస్పత్రిలో డాక్టర్ భార్గవ అపాయింట్ మెంట్.
'హౌఆర్యూ' డాక్టర్ ప్రశ్న.
'సూపర్' మా ఆవిడ జవాబు.
రిపోర్టులు చూసి
పరీక్ష చేసి, అంతా బాగుందంటూ డాక్టర్ భార్గవ
కొన్నిమందులు తగ్గించి మరో మూడు నెలలు ఆగి రమ్మన్నారు.
అయితే ఈసారి మా
ఆవిడే ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. సరే! అదో విషాద గాధ. నేను
చెప్పవచ్చేది, ఆమె పట్ల ఆమెకు
వున్న ఆత్మ విశ్వాసం గురించి. అదే నాకు వుండి వుంటే, జీవితం
చివరాఖర్లో బిగ్ జీరోని అయ్యేవాడిని కాదు,కనీసం ఒక చిన్న జీరోగా మిగిలిపోయేవాడిని.
మా
మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు విషయాలను ఆకళింపు చేసుకుని, ఇంట్లో ఒక సెప్టిక్ లెట్రిన్
కట్టించాడు మూడు నెలల్లోనే. ఈలోగా ఆఫీసు దగ్గరలో పశువుల ఆసుపత్రి వీధిలో రాజగోపాలనిలయం
అనే మేడలో ఇంటి వెనుక ఒక చిన్న వాటా దొరికింది. రెండు గదులు. అందులో ఒకటి వంట గది. ఆ రెండూ
పక్కపక్కన వుండేవి కావు. ఎదురెదురుగా వున్న ఆ రెంటికి నడుమ ఖాళీ జాగా. రాములు
గారని బెంజ్ కంపెనీలో ఇంజినీరు. ఆ ఇల్లు మొత్తం అద్దెకు తీసుకుని అందులో రెండు
గదులు నా అభ్యర్ధనపై నెలకు అరవై రూపాయలకు
మాకు ఇచ్చారు. వేరే కరెంటు బిల్లు లేదు. నూట యాభయ్ రూపాయల జీతంలో అరవై రూపాయలు ఇంటి అద్దెకు పెట్టడం చూసి నా
వెనకాల నవ్వుకునేవారు. నా తరహా అల్లానే వుండేది. అలంకార్ ధియేటర్ లో రూపాయి తొంభయి
పైసల బాల్కాని టిక్కెట్టు కొని సినిమా చూసేవాళ్ళము, సినిమాకు వెళ్ళినప్పుడల్లా మమత
ఏసీ రెస్టారెంట్ లో భోజనం. అందరిండ్లలో హమాం సోప్ వాడితే, మా ఇంట్లో లక్స్ సుప్రీం. మిగిలిన
సహోద్యోగులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే నేను మాత్రం బెజవాడలో ఎక్కడికి
వెళ్ళినా సొంత కారులా ఓ గూడు రిక్షా. మేము బయటకు వచ్చినట్టు గేటు చప్పుడు కాగానే, వీధి మొదట్లో ఆపుకున్న గూడు రిక్షా
లాక్కుంటూ రాములు అనే రిక్షా మనిషి వచ్చేవాడు. మా అక్కయ్యల ఇళ్లకు వెళ్లి గంటలు
గంటలు వున్నా రాములు అలాగే మా కోసం అక్కడే వుండి పోయేవాడు. ఇంత ఇమ్మని బేరాలు
చేసేవాడు కాదు. ఇలాంటి విషయాల్లో నాది మా ఆవిడ కంటే పెద్దచేయి. ఎంతోకొంత ఎక్కువే ముట్టచెప్పేవాడిని.
ఈ ఖర్చులకు తగ్గ ఆదాయం ఎటూ లేదు కాబట్టి నాకు చేతనైన పని, చేతనైనంత అప్పులు చేయడం.
నిజానికి మా హనుమంతరావు బావ దగ్గర కాసేపు ఓపికగా నిలబడితే, ఏం మిస్టర్ ఏం కావాలి అని అడగడం, మా అక్కయ్య సిఫారసుతో డైరీలో
రాసుకుని డబ్బులు ఇవ్వడం జరిగేవి. అయితే ముందే చెప్పినట్టు నా తరహానే వేరు. అలా
అడగడానికి నామోషి. సబ్ ఎడిటర్ అంటే సబ్ కలెక్టర్ అనేంత బిల్డప్. దాంతో అప్పులు
పెరిగిపోవడం,
వాటిని తీర్చడానికి వేరే మార్గం లేకపోతే, మా ఆవిడే ఒక తరుణోపాయం చూపించింది.
ఇంటికి ఎవరైనా వచ్చి బాకీ డబ్బులు అడిగితే,
ప్రాణం పోయినట్టుగా విలవిలలాడేది. అందుకే, ఏమాత్రం సంకోచించకుండా ముక్కు పుడక, చేతి గాజులు ఏదో ఒకటి తీసి ఇచ్చేది. బెజవాడ వన్ టౌన్ లో నాలాంటి
వాళ్ళకోసం బంగారం కుదువ పెట్టుకుని డబ్బులు ఇచ్చే షావుకార్లు వున్నారు. అక్కడ
నిమిషాల్లో పని జరిగిపోయేది. అవసరం పడ్డప్పుడల్లా, దర్జాగా ఆస్థాన రిక్షావాడిని తీసుకుని వన్ టౌన్ వెళ్ళడం
ఒక అలవాటుగా మారింది. ఆ విధంగా మా ఆవిడ ఒంటిపై నగలకు కాళ్ళు వచ్చి ఒక్కొక్కటిగా
బయటకు తరలిపోయాయి. పల్లెత్తు మాట అనకుండా వాటిని తీసి ఇస్తుంటే, ఇంటి ఇల్లాలిగా అది తన బాధ్యత అనుకున్నానే కాని, నా బాధ్యతారాహిత్యం
అని ఏనాడు అనుకోలేదు.
ఇదంతా
చదివేవాళ్ళ దృష్టిలో నేనో పెద్ద విలన్ అనే అభిప్రాయం కలగొచ్చు. నాపట్ల ఇంతవరకూ
పెంచుకున్న సానుభూతి,
అభిమానం మంచులా కరిగిపోవచ్చు. అయినా సరే, కనీసం ఈ వయసులో అయినా చేసిన
తప్పులు ఒప్పుకోకుండా భేషజంగా జీవించాలని అనుకుంటే, నాలాంటి వారిని, మా ఆవిడ బాగా నమ్మే ఆ దేవుడు కూడా
క్షమించడు. అసలు ఈ వ్యాస పరంపర మొదలు పెట్టడానికి ఆవిడే ప్రధాన కారణం. జీవించి
వున్నప్పుడు,
ఎప్పుడూ ఆవిడకు కృతజ్ఞతలు చెప్పలేదు. మనసులో మాట చెప్పడానికి ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గం ఇది. ఇలా చెప్పకపోయినా,
ఎక్కడ వున్నా నన్ను మన్నిస్తూనే వుంటుంది. ఆమె క్షమాగుణం నాకు బాగా తెలుసు. అలా
అని ఆమెని గురించి ఈ రాతలు ఆపను. మనసు ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఇంతకు మించిన మార్గం లేదు.
సబ్
ఎడిటర్ ఉద్యోగంలో నైట్ డ్యూటీలు వుంటాయి. అర్ధరాత్రి ఇంటికి ఇంటికి తిరిగి వచ్చేవరకు
నాకోసం భోజనం చేయకుండా, నిద్ర పోకుండా అలాగే ఎదురు చూస్తూ వుండేది. నేను వచ్చే టైము
తెలుసు కనుక ఆ సరికి వేడివేడిగా అన్నం వండి పెట్టేది. ఇది నా ఒక్కడి విషయంలోనే
కాదు, ఇంటికి ఎవరు
వచ్చినా ఇదే తీరు. ఇదే తరహా.
చాలా కాలం కిందటి ముచ్చట.
ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం హైదరాబాదులో
ఓ స్టార్ హోటల్ కి వెళ్లాను. తిరిగొస్తుంటే జంధ్యాల, శంకరాభరణం
శంకరశాస్త్రిగా ప్రసిద్దులయిన సోమయాజులు గారు, ఒక
జిల్లా పోలీసు సూపరింటెండె౦ట్, (ఇప్పుడాయన అడిషినల్ డీజీ రాంక్ కాబోలు)
ఒక చోట కూర్చుని కాలక్షేపం చేస్తూ కనబడ్డారు. నన్ను చూసి రమ్మంటే వెళ్లాను. ఆ కబుర్లలో కాలం తెలియలేదు. బాగా
పొద్దుపోయింది. ఇక సర్వ్ చేసే టైం అయిపోయిందన్నాడు సర్వేశ్వరుడు. ‘మరి ఎలా’
అన్నాడు జంధ్యాల. ‘ఇలా’ అన్నాను నేను. పొలోమంటూ అందరం అర్ధరాత్రి దాటిన తర్వాత మా
ఇంటికి చేరాము. చేరి, మేము మిగిలిన మా పని పూర్తి చేస్తుంటే, మా ఆవిడ తన పని
పూర్తిచేసి అందరికీ వేడి వేడిగా వడ్డించింది. పెద్దాయన సోమయాజులుగారు భోజనం అయిన
తరువాత చేతులు కడుక్కుని, ‘అన్నదాతా సుఖీభవ’ అని మా ఆవిడను మనసారా దీవించారు.
సుఖపడ్డది ఏమో కానీ ఇన్నేళ్ళ జీవితంలో
ఇలాంటి దీవెనలు పుష్కలంగానే దొరికాయి మా ఆవిడకు.
అలాగే ఓ సాయంకాలక్షేప సమావేశంలో ఒకాయన కలిసారు. అమెరికాలో చాలా పెద్ద స్థాయిలో
వున్నారు. ‘నేను మీకు తెలవదు కానీ, ఆంటీ తెలుసు. నేను హైదరాబాద్ లో చదువుకునే రోజుల్లో అర్ధరాత్రివేళ మీ
మేనల్లుడు వెంకన్నతో కలిసి మీ ఇంటికి వచ్చేవాడిని. 'ఎక్కడ దొరక్కపోయినా మా అత్తయ్య ఇంట్లో భోజనం ఖచ్చితంగా వుంటుంది. లేకపోతే
నిమిషాల్లో వండి పెడుతుందని వాడు ధీమాగా చెప్పి మీ ఇంటికి తీసుకువచ్చే వాడు. ఆ
ఆప్యాయత ఎలా మరిచిపోగలం చెప్పండి. ఆంటీ ఎలా
వున్నారని' అడిగారు.
ఏం చెప్పాలో తోచలేదు.
కానీ నా కళ్ళల్లో తడి నాకు తెలుస్తూనే
వుంది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో.
పాతికేళ్ళప్పుడు, నలభై
ఏళ్ళప్పుడు, అరవై దాటినప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి
వస్తే వేడివేడిగా వడ్డించడానికి ఇల్లాలు వుండేది. డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో
ఇప్పుడు ఆవిడ పడిన కష్టం అర్థం అవుతోంది.
ఒక
ఆగస్టు నెల రాత్రి నేను బెజవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి హాట్ ప్యాక్ లో అన్నం వుంది.
ఆమె లేదు. తనకు రెండో కానుపు నొప్పులు వస్తుంటే, రెండేళ్ల పెద్ద పిల్లవాడు సందీప్
ని తమ పిల్లల దగ్గర వుంచి, ఇంటావిడ రమణి
గారు మా ఆవిడను రిక్షాలో బందరు రోడ్డులోని అమెరికన్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.
కింది
ఫోటో:
అపోలో డాక్టర్ భార్గవతో చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మా ఆవిడ
(ఇంకా
వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి