మా కుటుంబంలో
ఇద్దరు ప్రసిద్దులయిన స్త్రీ మూర్తులు వున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే అచ్చమాంబ.
ఒకరు భండారు అచ్చమాంబ. రెండవవారు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. మొదటి ఆవిడ రెండో
అచ్చమాంబకు స్వయానా మేనత్త.
డాక్టర్
అచ్చమాంబ కొమర్రాజు లక్ష్మణరావుగారనే సుప్రసిద్ధ సాహితీవేత్త కుమార్తె. లక్ష్మణరావుగారు
భండారు అచ్చమాంబ గారి సోదరులు. వారిది కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెనుగంచిప్రోలు.
ఆకాలపు ఆచారాల దృష్ట్యా అచ్చమాంబ గారికి తలితండ్రులు చదువు చెప్పించలేదు. అయితే
ఎమ్మే వరకు చదివిన సోదరుడి పక్కనే వుండి సొంతంగా చదువు నేర్చుకుని అనేక భాషల్లో
పండితురాలు కాగలిగిన పట్టుదల అచ్చమాంబ గారిది. తెలుగులో మొదటి కధ రాసింది
భండారు అచ్చమాంబ అనే ప్రచారం ఒకటి వుంది. ఆవిడ మేనకోడలు డాక్టర్ కొమర్రాజు
అచ్చమాంబ బెజవాడలో పేరెన్నికగన్న వైద్యురాలు. విజయ టాకీసు ఎదురుగా ఉన్న రామచంద్రరావు
రోడ్డు ( ఆయన మా పెద్ద మేనమామ,
గొప్ప వకీలు) లో అచ్చమాంబ
గారి ఆసుపత్రి వుండేది. తెల్లగా పొడుగ్గా తెల్లటి చీరె కట్టుకుని హుందాగా చేతిలో
స్టెతస్కోప్ పట్టుకుని ఆస్పత్రిలో ప్రతి మంచం వద్దకు వెళ్లి రోగుల యోగక్షేమాలు
విచారిస్తూ వుండేది. నిజానికి అక్కడ వేరే రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరూ వుండేవారు
కాదు. అందరూ రేపోమాపో పండంటి బిడ్డను కనడానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణులే. పేరుకు
నర్సింగ్ హోం అయినా నిజానికి పురుళ్ల ఆసుపత్రి. ఆమె హస్తవాసి మంచిది అనే మంచి పేరు
వుండేది. మా బెజవాడ అక్కయ్య కానుపులన్నీ అచ్చమాంబ గారి ఆసుపత్రి లోనే. సాధారణంగా
ఆవిడ కాలు బయటపెట్టి ఇళ్లకు వెళ్లి చూసేది కాదు. కానీ మా బావగారు కూడా బెజవాడలో
సీనియర్ లాయర్. వారిద్దరి మధ్య గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం వుండేది. అంచేత మా
అక్కయ్య గారు కడుపుతో వున్నప్పుడు ఎప్పుడైనా అవసరం పడి కబురు చేస్తే ఇంటికి
వచ్చేవారు. ఆవిడ ఇంట్లోకి అడుగుపెట్టగానే, పాత సినిమాల్లో చూపించినట్టు, ఆమె చేతినుంచి
తోలు పటకా సంచిని మర్యాదగా అందుకుని ఆమెను
వెంటబెట్టుకుని రావడం మా పిల్లల డ్యూటీ. రాగానే డాక్టరుగారు ముందు చేతులను
శుభ్రంగా సబ్బుతో కడుక్కునేవారు. సంచీలోనుంచి ధర్మామీటరు తీసి మా అక్కయ్య నోట్లో
పెట్టి, కళ్ళజోడు కాసింత పైకి ఎత్తి పట్టి రీడింగ్ చూసేవారు. స్టెతస్కోప్ తో
ఏవో పరీక్షలు చేసే వారు. రెండు మూడు ప్రశ్నలు అడిగి చేతికి బీపీ మిషన్ తగిలించి
రబ్బరు తిత్తిని నొక్కుతూ మిషన్ లో పాదరసం పైకి కిందికి తిరగడం గమనించి సాలోచనగా
కాసేపు పరికించి చూసి సంచీ నుంచి ఓ చిన్న పుస్తకం తీసి అవసరమైన మందులు రాసి
ఇచ్చేవారు. ఎంతో అవసరం అనుకుంటే తప్ప ఇంజక్షన్ చేసేవారు కాదు. ఒకవేళ చేయాల్సివస్తే
పిల్లలం అందరం భయంతో ఆ గదిలోనుంచి పారిపోయేవాళ్ళం.
ఇవన్నీ అయిన
తర్వాత మేము పిలుచుకు వచ్చిన రిక్షా ఎక్కి ఆసుపత్రికి వెళ్ళిపోయే వారు. పోయే ముందు
మా బావగారితో ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. ఆమె ఆయనా తప్ప, ఇంట్లో మిగిలినవాళ్ళు
అందరూ గప్ చుప్.
మా బావగారి
ఇంట్లో, మా బంధువుల ఇళ్ళల్లో పురుళ్ళూ పుణ్యాలు అన్నీ ఆవిడ ఆసుపత్రిలోనే. ఆవిడ
పుణ్యమే!
ఇంట్లో అంతమంది
పిల్లలు వున్నా కూడా పెద్దగా ఆసుపత్రులతో పని పడేది కాదు. చిన్నా చితకా వాటికి
కస్తూరి మాత్రలు, అల్లం, జీలకర్ర, వాము రసాలతో సరిపుచ్చేవారు. కాకపొతే, మా పిల్లలు అందరిలో శాయిబాబుది కొంచెం బలహీనమైన శరీరం. సన్నగా పీలగా
వుండేవాడు.
శ్రీకాకుళం
జిల్లా టెక్కలిలో వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం అని ఒక ప్రసిద్ధ ఆయుర్వేద ఔషదాల సంస్థ
వారిని సంప్రదించి అక్కడి నుంచి మందులు తెప్పించి వాడేవారు. అలాగే బెజవాడలో
రామ్మోహన ఆయుర్వేద వైద్య శాలలో తయారైన మందులు వాడేవారు. అయితే ఏళ్ళు గడుస్తున్న
కొద్దీ ఈ మందులతో పని లేకుండా శాయిబాబు ఆరోగ్యం కుదుటపడింది. అతడి తెలివితేటలు
మాత్రం అమోఘం. సూర్యుడి కాంతి చంద్రుడి
మీద పడి ప్రతిఫలించినట్టు ఆయన పక్కన తిరిగి నేనూ కొంత చదువుల్లో బాగుపడ్డాను.
అయినా అది కొంత మేరకే. పెద్ద పెద్ద మార్కులు రాకపోయినా, అతడితో కలిసి చదువుకున్నన్నాళ్ళు
ఏ పరీక్షలో తప్పే భాగ్యం నాకు కలగలేదు.
మా బావగారు మా
ఇద్దర్నీ ముందు ఇంటికి నడక దూరంలోవున్న అరెండేల్ (అరండల్) సత్రంలో నడుస్తున్న మునిసిపల్
ప్రాధమిక పాఠశాలలో చేర్పించారు. ఆ సత్రం బ్రిటిష్ వాళ్ళ హయాములో నిర్మించి
వుంటారు. బాగా పాతది అయినా చాలా అందంగా చక్కగా కళాత్మకంగా వుండేది. దానికి వాడిన
కలప, చెక్కిన నగిషీలు అలాంటివి. సత్రం అంటే ఏమిటో తెలియని వయసులో ఆ
సత్రంలోని ఒక భాగంలో నడిచిన మునిసిపల్ స్కూల్లో కొన్ని తరగతులు చదివాము. ఆ
రోజుల్లోనే అప్పటి భారత ప్రభుత్వం, అంతవరకూ చెలామణీలో ఉన్న పాత నాణేలు, కాణి,
అర్ధణా, బేడ, అర్ధరూపాయి, రూపాయి స్థానంలో కొత్త డెసిమల్ పద్దతి ప్రవేశ
పెట్టింది. పైసా, అయిదు పైసలు, పది పైసలు, పాతిక పైసలు (పావలా), యాభయ్ పైసలు (అర్ధరూపాయి), నూరు పైసలు
(రూపాయి) ఇలా అన్నమాట. పైసా నాణెం తళతళా మెరిసే రాగి నాణెం. చూడ ముచ్చటగా వుండేది.
అది దగ్గర వుంటే చాలు మనం ఓ కింగ్ అనే
ఫీలింగ్. అది చేతిలో వుంటే వొలకబోసే ఆ
దర్జానే వేరు. కొత్తగా వచ్చింది కాబట్టి నయా పైసా అనేవాళ్ళు. పైసాకు కూడా విలువ వుండే రోజులు. పాతిక పైసల
వరకూ అన్నీ నికెల్ నాణేలు. అర్ధరూపాయి, రూపాయి సిల్వర్. అంటే వెండి కాదు.
తరువాత మా బడి
సీవీఆర్ హైస్కూలుకు మారింది. అది సిటీ సివిల్ కోర్టు భవనాలకు ఎదురుగా వుండేది. బెజవాడ
గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్
హైస్కూలు) భవనం, విశాలమైన ప్రాంగణంలో
వుండేది. నడిమధ్యలో రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు.
ప్రధాన భవనంలో మెట్లకింద,
తెల్లని పంచె, లాల్చీ కండువా ధరించిన సంస్కృతం
మాస్టారు గారి నోటివెంట 'రామః రామౌ, హే రామ హే రామౌ........' అంటూ మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి
పాఠాలు.
అలా ఆయన చదువుతుంటే, మేము ఒక పదిమందిమి కాబోలు సంస్కృతం
రెండో భాషగా తీసుకున్నవాళ్ళం,
శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె
వేస్తూ వుండేవాళ్ళం. ఇంగ్లీష్,
తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి
గదులు విడిగా ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం
చెప్పుకుంటూ మెట్ల కిందే నడిచేది. ఆ భాషకు ఇచ్చిన ప్రాముఖ్యం అది. అది
ఒకప్పటి జ్ఞాపకం.
వీవీఎస్ శర్మగారు
(ఫేస్ బుక్ పెద్దాయన ) బతికి వున్నప్పుడు సంస్కృతం భాష వైశిష్ట్యాన్ని గురించి ఇలా
రాసారు.
“ అందరికీ ఎస్వీ
రంగారావు, సావిత్రి నటించిన నలుపు తెలుపు మాయాబజార్ సినిమా గుర్తుండే
వుంటుంది. ఘటోత్కచుడి బృందానికి చిన్నమయ్య పాఠాలు చెబుతుంటాడు. లంబు, జంబు ఇత్యాది
శిష్యులకు చిన్నమయ్య మాటల్లో వినబడే శబ్దాలు గమనించండి. ‘ ఔ, జస్, అం, ఔట్, బిస్, భ్యాం, భ్యస్.
సంస్కృత శబ్దాలు రామః, రామౌ, రామా, రామేణ, రామాభ్యాం, రామై వలె ధ్వనిస్తాయి అని ఆయన రాసారు.
పొతే
అప్పుడెప్పుడో నెట్లో కానవచ్చిన ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ
పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా
తెలుగు అనువాదం నా సొంత బాణీలో :
ఒకానొకకాలంలో
సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా
పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస
దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం. అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన
లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది
నిజం. లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి
వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం
మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు
ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే
ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా
నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'
ఇక ఆ స్కూలు
హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే
విద్యార్ధులకు తమ చేతివేళ్ళపై గట్టి పట్టుచిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం
వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'
పాల్ మహాశయులు
అంతటితో ఆగలేది.ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు
నాలుకలో వుండే అన్నిభాగాలను ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు.
రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు
చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
తోక టపా: ఈ
ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునేవాళ్ళు విధిగా
ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి
గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.”
మంచి విషయాలు
విన్నట్టు వుంది కదూ!
కింది ఫోటోలు:
(ఇంకావుంది)
2 కామెంట్లు:
అటువంటి సంస్కృతాన్ని ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు (total కు, పర్సంటేజ్ కీ కలవడానికి) తెచ్చుకోవడానికి వాడుతున్నారు. ఇంటర్ పాసయిన తరువాత ఆ విద్యార్థికి ఆ సంస్కృతం ఏమీ గుర్తుండదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి