21, నవంబర్ 2024, గురువారం

అమెరికా మీద బాంబు పడింది – భండారు శ్రీనివాస రావు

 ఈ బాంబు ధాటికి ఆ అగ్రదేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాలు  అతలాకుతలం అయ్యాయి. వీటిల్లో మా పెద్దవాడు నివసిస్తున్న వాషింగ్ టన్ స్టేట్ లోని సియాటిల్ కూడా వుంది. ఈ బాంబు కారణంగా ఆ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ  విచ్చిన్నం అయింది.  గత మూడు నాలుగు రోజులుగా   మా వాళ్ళు కరెంటు లేకుండానే కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే నేను కంగారు పడతాను అని దాచిపెట్టారు. బాంబుకి కరెంటుకి సంబంధం ఏమిటంటారా? బాంబు అనేది సియాటిల్ తో పాటు అమెరికాలోని అనేక  పశ్చిమ తీర ప్రాంత నగరాలను దెబ్బతీసిన తుపాను (STORM) పేరు.

పౌరజీవనం సాఫీగా సాగాలి అంటే ఈరోజుల్లో కరెంటు కావాలి. అది లేకుండా అక్కడ కాలూ చేయీ ఆడదు. వెళ్లి ఏదైనా దూరం పోయి కరెంటు ఉన్న హోటల్లో వుండాలి అంటే హోటళ్ళన్నీ నిండి పోయాయి. సియాటిల్ వాతావరణం రోజురోజుకు చల్లబడి ఇళ్ళల్లో హీటర్లు పెట్టుకోవాల్సిన అవసరం పెరిగే కాలం ఇది.  హీటర్ పెట్టుకోవాలంటే కరెంటు కావాలి. ఇంట్లో స్వెట్టర్లు కోట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి. సెల్ ఫోన్లు కంప్యూటర్లు చార్జ్ చేసుకోవాలంటే కరెంటు కావాలి. అంచేత కరెంటు సరఫరా వున్న సుదూర ప్రాంతాలలోని కాఫీ బార్లలో చార్జ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.  అయితే కారు బయటకు తీయాలి అంటే గరాజ్ షట్టర్ ఆటోమేటిక్. తీయాలన్నా, మూయాలన్నా కరెంటు లేదు. అంచేత కష్టపడి మాన్యువల్ పద్దతిలో గరాజ్ షట్టర్ తెరచి కారు బయటకు తీసుకోవాలి.

విషయం  తెలిసి వాట్సప్ లో ఎలా వున్నారు అని మెసేజ్ పెడితే నిన్న ఫోన్ చేసి చాలాసేపు నిబ్బరంగా  మాట్లాడాడు. ఫోన్ చార్జ్ అయిపోతుందేమో అంటే పర్వాలేదు, బయట స్టార్ బక్స్ వంటి  చోట్ల కూర్చుని చార్జ్ చేసుకుంటూ ఆఫీసు వర్క్ కూడా అటెండ్ అవుతున్నామని చెప్పాడు. మరి మీ మీడియా వార్తలు చూస్తుంటే భయం వేసేలా వున్నాయి అని అంటే, భయపెట్టడమే వాళ్ళ పని అని జవాబు. మరో బాంబు పడబోతోందని రాస్తున్నారు అంటే, మీకు తెలియదు నాన్నా!  2005లో అమ్మా మీరు సియాటిల్  వచ్చి వెళ్ళిన తర్వాత, 2006-2007 లో ఇలాగే ఇంతకంటే పెద్ద బాంబు పడింది, అప్పుడు ఏకంగా వారం రోజులు కరెంటు లేదు అన్నాడు.   

ప్రతి విషయాన్ని తేలిగ్గా  తీసుకోగలిగే తత్వం ఈ తరానికి బాగా వున్నట్టు వుంది. ఇక్కడ మా ఇంట్లో  వాటర్ ప్యూరిఫయర్  కేండిల్స్ మార్చాల్సి వస్తే, కంపెనీ వాడు గంట లేట్ చేస్తే వాళ్ళమీద విరుచుకుపడేంత కోపం తన్నుకు వచ్చింది.

మరి అక్కడ నాలుగు రోజులుగా కరెంటు లేదు, మరికొన్ని రోజులు వచ్చే అవకాశం లేదు అని తెలిసినా చాలా కూల్ గా ఎలా ఉంటున్నారని నాకనిపించింది.

తిట్టడానికి అక్కడ కూడా ప్రభుత్వాలు వున్నాయి మరి.

పైగా వాట్సప్ లో నాకు ఒక ఫోటో పంపాడు, ఒక కామెంటు జోడించి.  

అదే ఇది.

“It is dark, but there is always light”

(రెండు కేండిల్స్ నడుమ మా ఆవిడ ఫోటో)



(21-11-2024)   

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 12 ) - భండారు శ్రీనివాసరావు

 ఆరుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి.  ఇంకా ఒక్క ఆడపిల్ల పెళ్ళికి వుంది.

ఈ నేపధ్యంలో నేను పుట్టాను, మా అమ్మానాన్నల పదకొండో సంతానంగా. పిల్లలు పుట్టగానే వాళ్ళు పుట్టిన తేదీ, ఘడియ, నక్షత్రం వగైరా వివరాలు ఒక పుస్తకంలో రాసిపెట్టేవారు. ఆ వివరాలను బట్టి నేను పుట్టింది వ్యయ నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి బుధవారం. స్కూల్లో వేసినప్పుడు ఉజ్జాయింపుగా పుట్టిన తేదీ  వేయడం వల్ల అసలు  పుట్టిన తేదీకంటే   ఏడాది తక్కువగా వేశారు. ఎప్పుడో పాతికేళ్ళ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగంలో చేరతానని వాళ్లకు మాత్రం ఏం తెలుసు. అంచేత ఆఫీసు రికార్డుల ప్రకారం అరవై ఏళ్ళు రాగానే,  ఏడాది ముందుగానే,  నువ్వు ఇంతవరకు చేసింది చాలు, ఇంటికి పోయి పోచికోలు కబుర్లు రాసుకుంటూ కాలక్షేపం చేయమని పంపేశారు. అంతవరకూ ఉద్యోగంలో చేసింది అదే కనుక రిటైర్ అయిన తర్వాత కూడా నాకు పెద్ద  తేడా తెలియలేదు. కాకపొతే అప్పుడు పోచికోలు కబుర్లు, ఇప్పుడు ఊసుపోక  రాతలు.  అప్పుడూ ఆడుతూ పాడుతూనే ఉద్య్దోగం  చేశాను. ఇప్పుడూ అదే కదా! కాకపోతే ఆర్ధికంగా ఒక చిన్న, చిన్న ఏమిటి లెండి, పెద్ద నష్టం  జరిగింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని విధంగా, ఉద్యోగులు కలలో కూడా ఊహించని విధంగా జీతాల స్కేళ్ళు బాగా  పెంచుతూ వేతన సవరణ చేసింది. నేను రిటైర్ అయిన మరుసటి రోజునుంచే అంటే, 2005 డిసెంబరు ముప్పయి ఒకటి సాయంత్రం అయిదుగంటలకు రిటైర్ అయితే పన్నెండు గంటల తర్వాత జీతాల పెంపు, 2006 జనవరి ఒకటో తేదీనుంచి  అమల్లోకి వచ్చింది. వయసు తక్కువ వేసిన విషయంలో కోర్టుకు పొమ్మని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే కొందరు సలహా చెప్పారు. నా అర్హతకు ఇదే చాలు అనుకుని ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా, గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా, మనం చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు, బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు. ఎంత ప్రాప్తం వుంటే అంత అని పెద్దపెద్ద కబుర్లు చెప్పేవాడిని.  అయాం ఎ బిగ్ జీరో అన్నది ఇందుకే.

అంతకు ముందు 1975 లో  నేను రేడియో ఉద్యోగంలో చేరిన కొత్తల్లో కూడా ఇలాగే జరిగింది. ఏడాది తిరగకుండానే పే కమిషన్, మూడో కమిషన్ అనుకుంటా  సిఫారసులు అమలు చేశారు. పే కమిషన్, పే  స్కేలు, గ్రేడు, డియే అనే మాటలు వినడం మొదటిసారి. నేను అప్పటిదాకా చేసింది ప్రైవేటు కొలువు. పే కమిషన్ సిఫారసులు అమలు చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. నా గ్రేడుకు, రావాల్సిన గ్రేడుకు అప్పట్లో తేడా పాతిక రూపాయలు మాత్రమే. దీనికోసం ప్లీడర్ల చుట్టూ తిరిగి డబ్బులు తగలేసుకోవడం దండగ అని నా అభిప్రాయం. (ఆ  పాతిక రూపాయల తేడా కాస్తా రిటైర్ అయ్యే నాటికి వేల రూపాయలకు పెరిగింది. పెన్షన్ లో  పెద్ద ప్రభావం చూపింది)

తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణా రావు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.

లాయరు గారు నా కేసు గురించి సాకల్యంగా తెలుసుకున్న తర్వాత ఒక మాట చెప్పారు.

“మీ కేసులో బలం వుంది, కానీ ఈ కేసును కడకంటా తీసుకువచ్చే శక్తి మీలో లేదని అనుకుంటున్నాను” అన్నాడా లాయరు గారు.

అనుకుంటాం కానీ ప్లీడర్లలో, వైద్యుల్లో అందరూ పీడించేవాళ్లే వుండరు. ఈయన కూడా అలాంటి అరుదైన వాడే అనిపించింది.

అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతాబోధ కూడా చేశారు.

“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తే కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే, వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”

వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీలేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.

తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.

కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.

‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు” అనేవారు మా పెద్దన్నయ్య.  

అదృష్టవశాత్తు ఈ రెండూ నాకు  అనుభవంలోకి రాలేదు.

 

మా అమ్మగారు వెంకట్రావమ్మ గారిది మొదటి నుంచి కష్ట జీవితమే. ఆమె కడుపున పుట్టిన వారందరూ పెరిగి పెద్దయి  కడుపులో చల్ల కదలకుండా పిల్లాపాపలతో హాయిగా  జీవితాలను గడుపుతున్నారు. కొమ్మలు రెమ్మలు వేసి విస్తరించిన భండారు కుటుంబం అనే మహా వటవృక్షానికి ఆమె తల్లి వేరు.  ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907  నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్నతనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని  చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్రరావు కష్టపడి చదువుకుని   ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి  గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.

మా నాన్నగారు రాఘవరావుకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికిఅప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని, మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికిఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు, అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన  సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోటసొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాదని తీర్మానించుకున్న మా తాతగార్లు, రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్నగారితో మా అమ్మగారి పెళ్లి. ఈనాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.

అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మదాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగాఏడుగురు ఆడపిల్లలూనలుగురు మగపిల్లలు కలిగారామెకు.

కొడుకులుకోడళ్ళుకూతుళ్ళుఅల్లుళ్ళుమనుమలుమనుమరాళ్ళుముని మనుమలుముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన  పూర్ణ జీవితం గడిపింది.

పొతే, నా చిన్నతనంలో  మా నాన్న జబ్బుతో మంచంలో వున్నప్పుడు మా అక్కయ్యలు, బావలు చూడడానికి వస్తుండేవాళ్ళు. నాకప్పుడు అయిదారేళ్ళు వుంటాయేమో. లేదా ఇంకా తక్కువ కావచ్చు. మా అమ్మకు నా గురించి భయం పట్టుకుంది. ఈ పల్లెటూళ్ళో వుంటే ఎందుకు పనికి రాకుండా పోతానేమో అని.

మా మూడో అక్కయ్య సరస్వతిని చేతులు పట్టుకుని అడిగిందట. వీడిని నీతో తీసుకువెళ్ళు. మీ పిల్లలతో పాటు (అప్పటికి ఆమెకు ఒక మగపిల్లవాడు సాయిబాబు, ఒక ఆడపిల్ల సత్యవతి) పెంచి చదువు చెప్పించు. ఇక్కడే వుంటే కొరగాకుండా పోతాడు అని. 

మా బావగారిని కూడా అడగకుండా మా అక్కయ్య నన్ను వెంటబెట్టుకుని బెజవాడ తీసుకు వెళ్ళింది. అదే నేను మొదటిసారి బస్సు చూడడం. ఎక్కడం.

ఆ ప్రయాణమే నా భావి జీవితాన్ని నిర్ధారించింది.

కింది ఫోటో:

మా అమ్మగారు భండారు వెంకట్రావమ్మ గారు



 

(ఇంకా వుంది)

20, నవంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 11 ) - భండారు శ్రీనివాసరావు

 ‘ఏమైనా సరే శర్మ గారూ. మా వాడికి ఆ రాఘవయ్య గారి అమ్మాయి సంబంధమే ఖాయం చేసుకురాండి’ అని కరాకండిగా చెప్పేదట రంగమ్మ గారు. మా ఊరికి మూడు కోసుల దూరంలో ఉన్న పెనుగంచిప్రోలు గ్రామం కరణం కొమరగిరి వెంకట అప్పారావు గారి తల్లి రంగమ్మ గారు. ఒక్కడే కొడుకు. కొండంత ఆస్తిని, ఒక్కగానొక్క పిల్లవాడిని  వదిలిపెట్టి,  భర్త చాలా చిన్నతనంలోనే పోయాడు. ఆమే పిల్లాడిని పెంచి పెద్దచేసింది. తన కుటుంబం చిన్నదే అయినా భర్త తరపు అనేక కుటుంబాలకు అండగా నిలిచింది. మడీ, తడీ జాస్తి.  అయినా మనసు వెన్న. ఆవిడకి మా కుటుంబంలో అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని తాపత్రయం. మూడో అమ్మాయిని మిలిటరీ పేరు చెప్పి మా నాన్న ఇవ్వను అని మొహం మీదే చెప్పినా, తన  కోడల్ని ఆ కుటుంబం నుంచే తీసుకురావాలని ఆవిడ మొండి పట్టు పట్టింది. కేసులు తేలిపోయాయి కనుక సంబంధం వద్దు అనడానికి మునుపటిలా మా నాన్నకు కారణం కనపడక సరే అన్నాడు. వూరికి  కరణం కాబట్టి, కంభంపాడు నుంచి తాలూకా కేంద్రం నందిగామ వెళ్ళాలి అన్నా, బెజవాడలో కాపురం ఉంటున్న మూడో కుమార్తెను చూడాలి అన్నా పెనుగంచిప్రోలు మీదుగానే వెళ్ళాలి. పొరుగూరు సంబంధం. కూతురు దగ్గరలోనే వుంటుంది. ఇత్యాది కారణాలు కూడా నాన్న సరే అనడం వెనుక వున్నాయి. ఆ విధంగా మా అన్నపూర్ణక్కయ్య వివాహం  దాపునే ఉన్న పెనుగంచిప్రోలు కరణం అప్పారావు గారితో జరిగిపోయింది. మా అక్కయ్య లంకంత ఇంటిలో కోడలిగా అడుగు పెట్టింది.  చిన్న చిన్న ఇత్తడి గంటలతో, మేలైన కలపతో  అందంగా చెక్కిన  ఇంటి ప్రధాన ద్వారం ఓ ప్రధాన ఆకర్షణ. ఇంటి గోడలు ఎంత మందంగా ఉండేవి అంటే ఆ ఇంటికి కరెంటు పెట్టించినప్పుడు ఆ గోడలకు రంధ్రాలు పెట్టలేక పనివాళ్లు చేతులు ఎత్తేశారు. అంత పటిష్టంగా నిర్మించిన మేడ అది.

పేరుకు ఇల్లు కానీ నిజానికి అదొక పిల్లల హాస్టల్. హైస్కూలు ఉన్న ఊరు కావడంతో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోని చుట్టపక్కాల పిల్లలు చాలామంది అక్కడే వుండి చదువుకునే వారు. మా అన్నయ్యలు ఇద్దరు కూడా అక్కడనే  హైస్కూలు చదువు పూర్తి చేశారు. కులాల పట్టింపు లేని ఇల్లు కావడంతో అన్ని కులాలకు చెందిన బీదవారికి కూడా ఆ ఇల్లు అండగా మారింది. మిలిటరీలో కొంతకాలం పనిచేసి వచ్చిన మా బావగారు పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లారు. ఏటా దసరా నవరాత్రులు చాలా నిష్టగా, ఘనంగా చేసేవారు. పాడిపంటలకు లోటులేని కుటుంబం కావడంతో, మా అక్కగారి ఆధ్వర్యంలో ఆ ఇల్లు ఆమె పేరుకు తగ్గట్టే  అన్నపూర్ణ సత్రంగా మారింది.

చిన్నప్పటి నుంచి ఆమెకు నేనంటే చెప్పలేనంత ఆపేక్ష. బెజవాడలో చదువుకుంటున్నప్పుడు సెలవులకు మా ఊరు వెళ్ళాలి అంటే పెనుగంచిప్రోలులో బస్సు దిగి వెళ్ళాలి. మా అక్కయ్య ఇంట్లో భోజనం చేసిన తర్వాతనే మా ఊరి బాట పట్టేవాడిని. దబ్బకాయంత వెన్నముద్ద, ఆవకాయ, గడ్డ పెరుగుతో మా అక్కయ్య పెట్టే భోజనం అమృత సమానంగా వుండేది.  ఆదరణ ముందు పుట్టి తర్వాత అన్నపూర్ణక్కయ్య పుట్టిందేమో అన్నట్టుగా వుండేది ఆమె అభిమానం. ఈ విషయంలో ఆమెకు స్వపర బేధం లేదు. ఆ పుణ్యం ఊరికే పోలేదు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. పెద్దవాడు శ్రీరామచంద్రమూర్తి  వాళ్ళ నాన్న గారి మాదిరిగానే ఆధ్యాత్మిక మార్గం. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకులో సుదీర్ఘ కాలం పనిచేశాడు. అతడి భార్య కరుణ, అత్తగారి మాదిరిగానే అన్నపూర్ణ. రెండో వాడు గోపాలకృష్ణమూర్తి మద్రాసు ఐఐటి.  ఎల్. అండ్.టి. కంపెనీలో చాలా పెద్ద హోదాలో వివిధ దేశాల్లో పనిచేసి హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డాడు. భార్య లక్ష్మిది కూడా ఇటువంటి విషయాల్లో  పెద్దమనసు. మిగిలిన పిల్లలు తమ తలితండ్రుల మంచితనాన్ని పుణికిపుచ్చుకున్నారు.  ఆ ఇంట్లో వుండి చదువుకుని, తర్వాత జీవితంలో పైకి వచ్చి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కుదురుకున్నవారు కూడా అన్నపూర్ణక్కయ్యకు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడే వాళ్ళు.

ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ చదువుకుని వుంటే చాలా సులభంగా ఐ ఎ ఎస్ కాగలిగిన తెలివితేటలు కలిగిన మనిషి. పత్రికలు, పుస్తకాలు చదవడం ఆమెకు హాబీ. చదివిన వాటిని గుర్తు పెట్టుకుని సందర్భోచితంగా సంభాషణల్లో వాడేది. ఒక పల్లెటూర్లో పుట్టి, మరో పల్లెటూర్లో పెరిగిన మనిషి అనేక పుస్తకాలు రాసింది. తాను దర్శించిన పుణ్య క్షేత్రాలను గురించి, పెనుగంచిప్రోలులో ప్రసిద్ధి చెందిన తిరుపతమ్మ దేవత క్షేత్ర మహిమ గురించి, మా అమ్మగారు చనిపోయినప్పుడు మా కుటుంబంలో ముప్పయిమందిమి కలిసి కాశీ వెళ్లి అక్కడే అంత్య విధులను నిర్వర్తించిన తీరు గురించి రాసిన పుస్తకాలు రచయిత్రిగా ఆమెకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టాయి. హైదరాబాదు  రేడియోకి కూడా అనేక ప్రోగ్రాములు చేసేది. ఈ కార్యక్రమాలను ఆరోజుల్లో పర్యవేక్షించిన నా గురు పుత్రిక పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అమ్మాయి, పుట్టపర్తి పద్మినీదేవి  మా అక్కయ్య రాసే శైలి, వాచికం నచ్చి తగిన ప్రోత్సాహం ఇచ్చేవారు. నేను అక్కడే పనిచేసేవాడిని కానీ బయట తిరిగే ఉద్యోగం కాబట్టి ఆమె స్వయంగా రేడియో స్టేషన్ కు వెళ్లి రికార్డింగు అదీ పూర్తి చేసుకునేది.  అక్కడ పనిచేసే ఇతర రేడియో సిబ్బందితో కూడా చాలా కలుపుగోలుగా మాట్లాడుతూ వుండేది. తర్వాత వాళ్ళ మాటల ద్వారానే నాకు తెలిసేది ఆమె సంపాదించుకున్న మంచి పేరు గురించి.          

మొత్తం మీద అరకొర ఆర్ధిక పరిస్థితుల్లో కూడా మా నాన్న తన చేతులమీదుగానే అయిదుగురు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళికి  వున్నారు. మగపిల్లలు చిన్నవాళ్లు. తన వాటాకు వచ్చిన నూట యాభయ్ ఎకరాల్లో ఒక్క సెంటు అమ్మకుండా నెట్టుకు వచ్చాడు.  ఆడపిల్లలకు మాత్రం కలిగిన సంబంధాలే చేశాడు. మా అక్కయ్యలు సంపన్న కుటుంబాల్లో అడుగు పెట్టడం, మా కుంగిన ఆర్ధిక పరిస్థితుల్లో మిగిలిన ఇద్దరు అక్కయ్యల పెళ్లిళ్లకు, మగపిల్లల చదువులకు బాగా అక్కరకు వచ్చింది.

ఆరో అక్కయ్యది పేరుకు  తగ్గట్టే ప్రేమ వివాహం. మా కుటుంబంలో మొట్టమొదటి ప్రేమ వివాహం. మా బావగారిది వరంగల్ జిల్లా మానుకోట (మహబూబా బాద్) దగ్గర ఈదుల పూసపల్లి. దేశ ముఖ్ లు. వందల ఎకరాల ఆస్తిపరులు. చాలా సింపుల్ గా మా వూర్లో జరిగిన  పెద్దన్నయ్య పెళ్ళిలో మా వదిన తరపు చుట్టంగా ఆయన వచ్చి, మా ప్రేమక్కయ్యను చూసి, తొలి చూపు ప్రేమ అంటారే, అలాంటి ప్రేమలో పడి, అటువారిని, ఇటువారిని ఒప్పించి మొత్తం మీద తాను కోరుకున్న విధంగా మా అక్కయ్యను పెళ్ళాడాడు. ఆ పెళ్లి కూడా  తాటాకు పందిరి కింద నిరాడంబరంగా జరిగిన వివాహమే.

మా బావ గారు వాళ్లది పెద్ద కుటుంబం. గొప్ప కుటుంబం కూడా. ప్రేమక్కయ్యది చాలా అణకువగా వుండే స్వభావం. మంచి మనసు. అందర్నీ చాలా ఆదరంగా చూసేది. మెట్టినింటిలో అంతా ఆమెను దొరసాని అని పిలిచేవాళ్ళు. ఈ పిలుపు ఆమెకు కొత్తగానూ, కొంత ఇబ్బందిగాను వుండేది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ కనిపెట్టి, కలుపుగోలుగా వ్యవహరించే  చూసే ఆమె స్వభావం అక్కడి వారికి ఆశ్చర్యకరంగా వుండేది. ఆ రోజుల్లో రైళ్ళలో మూడు తరగతులు ఉండేవి. మొదటి తరగతికి, మూడో తరగతికి నడుమ మరో తరగతి వుండేది. మా బావగారు మానుకోట నుంచి ఎప్పుడు ఖమ్మం వచ్చినా అదే తరగతిలో ప్రయాణం చేసేవారు. ఆయన వెంట హమేషా వుండే మనిషి, పక్కనే  మూడో తరగతి బోగీలో ఉండేవాడు. డోర్నకల్ స్టేషన్ లో రైలు ఆగినప్పుడు కప్పూ సాసర్ లో కాఫీ తెచ్చి ఇచ్చేవాడు. మొదట్లో మా అక్కయ్యకు ఈ తతంగం అంతా విడ్డూరంగా అనిపించేది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. జయ, మణి (ఫేస్ బుక్ రచయిత్రి,), ఫణి (చిత్రకారుడు రాంపా భార్య). ఒక మొగ పిల్లవాడు శ్రవణ్. మా అక్కయ్య పుట్టింటికి ఎప్పుడు వచ్చినా ఆగా అనే పనివాడు ఆమె వెంట వచ్చేవాడు. నా మేనల్లుడు శ్రవణ్ కు అతడు బాడీగార్డు. నీడలా పిల్లాడి వెంటనే ఉండేవాడు. ఆడుకునే చోట ఏమాత్రం తడి నేల కనిపించినా శ్రవణ్ కాలు కింద పెట్టేవాడు కాదు, అంత శుభ్రం. పిల్లి శుభ్రం అంటారే, అలా అన్నమాట.   వెంటనే, వెంట వున్న  ఆగా,  పిల్లాడిని ఎత్తుకుని దాన్ని దాటించేవాడు. మా శ్రవణ్ బాల్యం అంత అపురూపంగా గడిచింది. ఎంతో అబ్బరంగా పెరిగాడు. ఇంత గారాబంగా పెరిగినా కూడా జమీన్ దారీ అహంకారం అతడ్ని అంటుకోలేదు. చక్కటి వర్చస్సు. నా మేనళ్ళులలో అందగాడనే పేరు. మంచిగా చదువుకుని, ప్రభుత్వ బీమా సంస్థలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద స్థాయిలో పదవీ విరమణ చేశాడు. అమ్మాయికి మంచి సంబంధం చేశాడు. ఒక్కగానొక్క  పిల్లాడు. బీ టెక్ చేశాడు. సినిమా రంగంలో స్థిరపడాలని అభిలాష. ఆ దిశగా చాలా కృషి చేశాడు. అమెరికా చాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండిపోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. అతడి దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా,  డీజే టిల్లు పెద్ద హిట్టయింది.

డీ.జే. టిల్లు! ఇదేం! పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే. విమల్ మొదటి చిత్రం  డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.   అన్నట్టు నాది  పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవతరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది. 

జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు  మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన కుర్ర బృందానికి అభినందనలు.

పొతే, ఈ సినిమాలో హీరోగా వేసిన సిద్దూతో మరో బాదరాయణ సంబంధం. అతగాడు ఒకానొక రోజుల్లో నా రేడియో సహోద్యోగి శారదగారి అబ్బాయి. సినిమా విజయవంతం అయిన పుత్రోత్సాహంతో ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకీ విషయం తెలిసింది. సినిమా నిర్మాణ సమయంలో తరచూ తమ ఇంటికి వచ్చి వెడుతుండే కుర్ర డైరెక్టర్  విమల్  నా మేనల్లుడి కుమారుడు అని నేను చెప్పేదాకా ఆమెకు తెలియదు.  

చిన్నప్పుడు వాళ్ళ నాన్న శ్రవణ్ కు కూడా సినిమాల్లో నటించాలి అనే అనే ధ్యాస వుండేది.   ఆ వ్యామోహంలో పడి, చాలా చిన్న వయసులో  ఒకసారి ఇంట్లో చెప్పకుండా రైలెక్కి మద్రాసు వెళ్ళిపోయాడు.
1971 నాటి వృత్తాంతం అది. ఆ మహా నగరంలో దిక్కుతోచక తిరుగుతూ  కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం, తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం  అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంధ్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము. మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. కళా దర్శకుడు రామలింగేశ్వరరావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు,  ఆంధ్రజ్యోతిలో ఫోటో చూసి, కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని పాటించాడు. అందరం గర్వపడేలా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. కృష్ణగారు తన పట్ల చూపిన అభిమానానికి గుర్తుగా కొడుకుకు 'విమల్ కృష్ణ అని, కుమార్తెకు 'రమ్యకృష్ణ'  అని పేర్లు పెట్టుకున్నాడు. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న కృష్ణ దంపతులు,  శ్రవణ్ కుటుంబాన్ని హైదరాబాదులోని  తమ ఇంటికి ఆహ్వానించి యోగక్షేమాలను ఆరా తీయడంతో దశాబ్దాల కిందటి శ్రవణ్ సినిమా కధకు శుభం కార్డు పడింది.

కింది ఫోటోలు :

అన్నపూర్ణక్కయ్య, అప్పారావు బావ దంపతులు, ప్రేమక్కయ్య, మధుసూదన రావు బావ దంపతులు, హీరో కృష్ణ దంపతులుతో శ్రవణ్ కుటుంబం












(ఇంకా వుంది)  

 

19, నవంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (10) - భండారు శ్రీనివాసరావు

 మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి)శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళులేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు, వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడుకు కరణీకం చేస్తున్న రోజుల్లో  మా ఇంటి ప్రధాన ద్వారాన్ని ఆనుకుని ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన దగ్గర పనిచేసే వెట్టివాళ్ళు ఇంట్లోకి రాకుండా ఆ చావిడిలోనే కూర్చొనే వారు. మా నాన్నగారి మరణానంతరం కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేయడం.  చేసి, వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయినరోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.

మా బాబాయ్ కుమారుడు సత్యమూర్తి  అన్నయ్య మా ఊరికి సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. మా గ్రామానికి ఆయనే మొదటి సర్పంచ్. తండ్రి లేని మా కుటుంబానికే కాకుండా ఊరంతటికీ పెద్ద అండగా ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు. రాజకీయాల్లో తిరిగినాహింసదౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు.   గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన మా పెద్దన్నయ్యను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి  హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులోఅప్పుడు మంత్రిగా ఉన్న కాకాని వెంకట రత్నం ఇంటికి వెళ్ళిపోయేవాడు. వూరికి తిరిగి వచ్చిన తరువాత ‘హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు తీసుకు రావడానికిరోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం చెందకపోతేమా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృతదేహాన్ని మోసే హక్కు  మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి,  మామూలుగా పాడె మీద కాకుండా బండి మీద ఆయన బౌతిక కాయాన్ని వుంచి, ఎడ్లు లేకుండా మనుషులే లాగుతూ   గ్రామంలో వీధివీధిలో తిప్పుతూ ఊరేగింపుగా  దాన్ని శ్మశానానికి చేర్చారు. మేమందరం నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాని అదేమిటో ఆరోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కానిచిన్నా పెద్దా అని కాని  లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు వేయడానికి తొక్కిసలాడారు. ‘మేమంతా ఆయన పిల్లలమేగాఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు లేదా’ అంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ  ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. ఆరోజు మొత్తం గ్రామంలో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే ‘ సత్యమూర్తి గారు ఉంటేనా ..’ అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది.

నేను చెబుతున్నది అరవై ఏళ్ల కిందటి విశేషాలు. సాంప్రదాయంతో పాటు ఆధునిక భావాలు  చెట్టాపట్టాలు వేసుకున్న కుటుంబం మాది అని చెప్పడానికి ఈ సంగతులు ఉదహరిస్తున్నాను.  

మా ఏడుగురు అక్కయ్యలు అందరూ శాంతమూర్తులు. వారిలో శారదక్కయ్య, ప్రేమక్కయ్య ఇద్దరూ పరమ శాంతమూర్తులు. పరమ అంటే పరమ.

శాంత స్వభావి శారదక్కయ్యను,  మేనరికం సంబంధం, మరో మూర్తీభవించిన శాంతమూర్తి, ఖమ్మం జిల్లా రెబ్బారం కాపురస్తులు కొలిపాక రామచంద్రరావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. మా బావగారికి ఎవరి మీద అయినా కోపం వుంది అంటే  అది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద మాత్రమే.      

1947 ఏప్రిల్ 11న మా బావగారు ఇతర సత్యాగ్రహులతో కలిసి రెబ్బవరం గ్రామంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన్ని అరెస్టుచేసి జైల్లో పెట్టారు. అదే సమయంలో మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారిని కూడా అరెస్టు చేశారు.  వాళ్ళిద్దరూ పద్నాలుగు మాసాల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. అక్కడ జైలులో వీరితోపాటు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు గారు కూడా ఉండేవారు.  జైలులో ఉన్నవారికి స్వాతంత్ర్య సంగ్రామనికి సంబంధించిన బయటి  విషయాలు పెద్దగా తెలిసేవి కావు.  జైలులో పనిచేస్తున్న ఒక అటెండర్ ఎవ్వరికీ తెలియకుండా ఒక వార్తా పత్రిక ముక్కను 1947 ఆగష్టు 15న రామచంద్రరావు బావగారికి అందించాడు. దాని ద్వారా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం ఆయనకి తెలిసింది.  ఆ పేపర్ ముక్కను  ఒక కర్రపుల్లకు అన్నం మెతుకులతో అంటించి, జైలు గోడ మీద నుంచి బురుజు మీదకు ఎక్కి, జెండాలా ఊపుతూ స్వాతంత్ర్యం వచ్చిన విషయాన్ని అందరికీ తెలియచేసారు. అది గమనించిన జైలు అధికారులు  మా బావగారిని 3 ఆడుగుల వెడల్పు, 6 ఆడుగుల పొడవు గల ఒక చిన్న గదిలో ఏకాంతంగా నిర్బందించారు.  రామచంద్రరావుగారు కనబడకపోయే సరికి,  జైలులోని సత్యాగ్రహులు ఆందోళన చేశారు. బావగారిని బయటకు తీసుకువచ్చి చూపెట్టిన తర్వాత కానీ వాళ్ళు శాంతించలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, జైలు నుంచి విడుదలై వచ్చిన  మా బావగారు ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో రెబ్బవరంలో ఐదు గదుల పాఠశాలను నిర్మించారు. అప్పటి తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు ఆ  పాఠశాలను ప్రారంభించారు. మా  బావగారు ఆ స్కూలుకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన శిలా విగ్రహాన్ని స్కూలు ఆవరణలో నెలకొల్పారు.

ఇద్దరు బావగార్లు స్వతంత్ర ఉద్యమ కాలంలో సత్యాగ్రహాలు చేసి జైలు పాలయ్యారు. వారు జైలుకు వెళ్ళినప్పుడు మా పెద్దక్కయ్య రాధ  డాక్టర్ రంగారావును కడుపుతో వుంది. పద్నాలుగు నెలలు జైల్లో ఉండడంతో మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు,  తన కన్న కొడుకును మొదటిసారి కళ్ళారా చూడడానికి ఎన్నో నెలలు పట్టింది.

1949 సెప్టెంబర్ ఆఖరి వారంలో మా  బావగారు జెయిలునుంచి విడుదల అయ్యారు.  హైదరాబాద్ స్టేట్, ఇండియన్ యూనియన్ లో విలీనం కావడంతో జైళ్లలో పెట్టిన స్వాతంత్ర్య సమరయోధులనందరినీ వొదిలిపెట్టారు.  మా ఊర్లో వుంటున్న భార్యా పిల్లల్ని చూడడానికి మా బావగారు  మూడు, నాలుగు మైళ్ల దూరంలోవున్న పెనుగంచిప్రోలులో బస్సు దిగి  కాలినడకన కంభంపాడు  చేరారు.

“అప్పటికి మా పెద్ద మేనల్లుడికి నడక వచ్చింది.  కొంతమంది పిల్లలతో కలిసి చేతుల్లో జాతీయ  జెండాలు పట్టుకుని జై హింద్’ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ మా బావగారికి  ఎదురెళ్ళారు. “అంతమంది పిల్లల్లో తనపిల్లవాడెవరన్నది ముందు ఆయనకు అర్ధం కాలేదు. అయితే వెంటనే తేరుకుని, కొడుకును గుర్తుపట్టి  చేతుల్లోకి తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.

ఆ అనుభూతి తన  గుండె గోడల నడుమ పదిలంగా వుండిపోయిన  మధుర మధుర  జ్ఞాపకం అని డాక్టర్ రంగారావు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు.

మా అక్కయ్యలు అందరూ అదృష్టవంతులే. వారిలో మా రెండో అక్కయ్య శారద, ఏడో అక్కయ్య భారతి పరమ అదృష్టవంతులు. ఈ అదృష్టం వారికి సంతానం రూపంలో లభించింది. పెద్ద తనంలో పిల్లలు వారిని పొత్తిళ్ళలో పాపాయిని చూసినంత జాగ్రత్తగా కనిపెట్టి చూసుకున్నారు.

మా కుటుంబంలో పిల్లలు, కవిత్వం అడక్కుండానే పుడతాయి. చిన్నాపెద్దా అంతా ఎంతో కొంత కలం తిరిగిన వాళ్ళే!

శారదక్కయ్య  రెండో కుమారుడు కొలిపాక రాంబాబు తలితండ్రుల గురించి ఇలా రాశాడు:

‘నాన్న పోయాడు

కొంగున కట్టిన

బ్రహ్మ ముడి విప్పేసి

 

‘నాన్న పోయాడు

మిగిల్చిన భాధ్యతల్ని

అమ్మ కొంగున ముడివేసి

 

‘అమ్మ కూడా పోయింది

ఇవన్నీ  వదిలేసి

అమ్మ కూడా పోయింది

ఇంటిని దుఃఖనది చేసి

 

‘నాన్న పోయినప్పుడు

అమ్మ ఒక సశేషం

అమ్మ కూడా  పోయినప్పుడు

బంధాలు నిశ్శేషం ..’

కింది ఫోటోలు : కొలిపాక రామచంద్ర రావు గారు, శారద,  స్వతంత్ర పోరాట సమయంలో ఇతర నాయకులతో కలిసి మా బావ గారు (కుడి వైపు నుంచి రెండో వ్యక్తి)







 

 

(ఇంకా వుంది)