18, ఏప్రిల్ 2024, గురువారం

విన్ విజన్ – భండారు శ్రీనివాసరావు

 “ ఆల్ ఓకే! ఇక రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడండి” అంటున్నారు డాక్టర్ శ్రీ లక్ష్మి.

డాక్టర్ శ్రీ లక్ష్మి గారి ప్రత్యేకత ఏమిటంటే, సర్జరీ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు, కబుర్లు చెబుతున్నారో సర్జరీ చేస్తున్నారో తెలవనంతగా. అంతమాటకారి.

అయిదేళ్ళ క్రితం ఒక కన్ను. ఇప్పుడు మళ్ళీ రెండో కన్ను. నా  రెండు కళ్ళకు కేటరాక్ట్ ఆపరేషన్ చేసింది ఆవిడే.  మొదటిసారి చేసినప్పుడు అనుమానం వచ్చింది, అసలు సర్జరీ చేసినట్టే లేదు. అదే అడిగాను. ఈసారి మరీ ముదరబెట్టుకుని వచ్చారు, అంచేత అలా అనిపించివుంటుంది అన్నది డాక్టరు గారి జవాబు.

ఈ కేటరాక్ట్ ఆపరేషన్ తో ఉన్న సులువు ఏమిటంటే పదిహేను, ఇరవై నిమిషాల్లో పూర్ర్తవుతుంది. చేసిన చోట ఎలాంటి నొప్పి వుండదు, కంటి వరకు ఎనస్తీషియా ఇస్తారు కాబట్టి. దాని ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఎలాంటి నొప్పి అనిపించలేదు. అసలు చిక్కల్లా మూడు రకాల కంటి చుక్కల్ని రోజుకు ఆరుసార్లు, నాలుగు సార్లు, మూడు సార్లు చొప్పున నెల రోజులు టైం టేబుల్ ప్రకారం వేసుకోవాలి. ఇదొక చికాకైన, తప్పనిసరి  వ్యవహారం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ పరీక్ష చేసి కంటి పవర్ కు తగిన కంటి అద్దాలను సిఫారసు చేస్తారు. ఆ కళ్ళజోడు తగిలించుకుని డాక్టరుగారు చెప్పినట్టు రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి అన్నమాట.

ఆసుపత్రిలోకి ప్రవేశించగానే నిలువెత్తు వినాయకుడి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. డాక్టర్ శ్రీలక్ష్మి కూడా లోనికి రాగానే ఆ విఘ్ననాయకుడికి    చేతులు జోడించి నమస్కరించిన తర్వాతనే  తన విధులు మొదలు పెట్టడం గమనించాము. రిసెప్షన్ లో వున్న వ్యక్తికి మనం వచ్చిన పని లేదా అప్పాయింట్ మెంట్ గురించి చెప్పగానే ఒక సహాయకురాలు వచ్చి మనల్ని మొదటి అంతస్తుకి తీసుకువెళ్లి అక్కడి రిసెప్షన్ హాలులో కూర్చోబెడతారు. ఈలోగా మరో సహాయకురాలు వేడి వేడి కాఫీ, తేనీటి పానీయాలతో మర్యాదలు చేస్తారు. మనం వచ్చింది కంటి పరీక్షలకా, లేక పెళ్లి రిసెప్షన్ కా అని ఆశ్చర్యపోయేలోగా మరో సహాయకురాలు వివరాలు కనుక్కుని సంబంధిత విభాగానికి తీసుకు వెడతారు. అయితే ఇవన్నీ రిజిస్ట్రేషన్ చార్జీ వగైరాలు చెల్లించిన తరువాతనే అనుకోండి. ఇక్కడ నాకు విశేషంగా అనిపించింది ఏమిటంటే ఈ పనులన్నీ ఆడపిల్లలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా హోస్టెస్ ల మాదిరిగా వారి కట్టూ బొట్టూ, మాటా మన్ననా ఒకే తీరున కుదుమట్టంగా వుంది. వారి పేర్లు కూడా ఆసుపత్రివారే పెట్టారేమో అన్నట్టుగా ఒకే రకంగా వున్నాయి. నాకు గుర్తున్నంత వరకు, వారిలో కొందరి పేర్లు: సంతోషిణి, సంగీత, శ్రీలత, అనిత, కవిత, నిఖిత, నవనీత. (మరునాడు  చెకప్/ రివ్యు కోసం పోయినప్పుడు  వారు వస్త్రధారణలో భాగంగా పెట్టుకున్న చిన్ని నేమ్ ప్లేట్ల మీది ఈ పేర్లు చూశాను. ఇవి  చదవగలిగాను. అంటే ఆపరేషన్ సక్సెస్ అయినట్టే కదా!)

కనుపాపలు పెద్దవి కావడానికి కంటిలో చుక్కలు వేసే కార్యక్రమంతో ఓ గంట కాలక్షేపం అవుతుంది. ఆ తరువాత వరుసగా అనేక విభాగాలు తిప్పుతారు. కంటి వైద్యంలో ఇన్ని అధునాతన పరికరాలు రంగప్రవేశం చేసాయనే సంగతి ఈ టూరు వల్ల మనకు    బోధపడుతుంది. ఒక్కొక్క పరికరం లక్షల ఖరీదు చేస్తుంది అని వాటిని చూడగానే తెలిసిపోతుంది. పరవాలేదు, మనం మంచి ఆసుపత్రికే వచ్చాము అనే ఎరుక కూడా కలుగుతుంది.

అసలు ఆపరేషన్ చేసే డాక్టర్ శ్రీ లక్ష్మి గారిని కలిసే లోగా ఈ పరీక్షల తతంగం పూర్తయి,  ఫలితాలు అన్నీ డిజిటల్ రూపంలో   అక్కడికి చేరిపోతాయి. వాటిని ఆకళింపు చేసుకున్న డాక్టరు గారు, పలానా రోజు, పలానా టైముకు రండి అంటారు. సరే అని పలానా రోజున పలానా టైముకు వెడతాము. పలానా రోజునే చేస్తారు కానీ, పలానా టైముకే జరగాలని లేదు. మరేదైనా జరూరు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందు నిర్ణయించిన షెడ్యూలు మారే అవకాశం వుంది. నాకు అర్ధం అయింది ఏమిటంటే  ఈ కేటరాక్ట్ ఆపరేషన్ అనేది ఇటువంటి పెద్ద ఆసుపత్రులలో అతి సులువుగా చేసే అతి చిన్న సర్జరీ. అంచేత, వారి  ప్రాధాన్యతాక్రమంలో ఇది చిట్ట చివరిది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నాకూ అలానే అనిపించింది. 


(డాక్టర్ శ్రీలక్ష్మి)

           

తోకటపా:

హైదరాబాదు బేగంపేట గ్రీన్ లాండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ విన్ విజన్ కంటి ఆసుపత్రిని 2015 నవంబరులో శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు ప్రారంభించారు. మొదలు పెట్టడమే కార్పొరేట్ హంగులతో, అధునాతన చికిత్సా పరికరాలతో ఆవిర్భవించిన ఈ కంటి ఆసుపత్రి ఇప్పుడు మరిన్ని హంగులను సమకూర్చుకుంది. అంచేత అక్కడి వైద్యం నాణ్యతకు తగ్గట్టుగానే బిల్లులు చురుక్కుమనిపిస్తాయి. అయితే మంచి బీమా కంపెనీ నుంచి ఆరోగ్య పాలసీ వున్నవారు దర్జాగా అందులోకి అడుగు పెట్టి అంతకంటే దర్జాగా చికిత్స పూర్తిచేసుకుని బయట పడవచ్చు. రోబోటిక్ సర్జరీ వంటి అధునాతన విధానాలతో కూడా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కాకపొతే డాక్టర్ శ్రీ లక్ష్మి గారి హస్తవాసి పట్ల నాకు గురి. అందుకే ఆమె చేతితో చేసే శస్త్రచికిత్సను ఎంచుకున్నాను.

అసలు తోక, అసలు టపా:

నాకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా కార్డు (CGHS) ఉన్నప్పటికీ చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ భీమా అంటే అదోరకమైన చిన్నచూపు అనే అపోహ వుంది. అంచేత మా చిన్నకోడలు, నిషా  తాను పనిచేసే పెద్ద కార్పొరేట్ కంపెనీ హెల్త్  ఇన్సురెన్స్  కార్డు మీద ఈ ఆపరేషన్ చేయించింది. దాంతో Cashless treatment with no questions asked.

దరిమిలా కలిగిన సందేహం.

మరి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పట్ల  ఈ ‘చూపుల్లో’ తేడాను ఏ కంటిడాక్టరు  సరిచేయాలి చెప్మా!

16-04-2024

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

CGHS సౌకర్యం ఉన్నవారి పట్ల చిన్న చూపు అపోహ కాదు. నిజం. దానికి కారణం కూడా ఉంది. ప్రభుత్వ వారు ఆసుపత్రుల వారికి చెల్లించే రేట్లు చాలా ఏళ్లుగా పాతవే ఉన్నాయి. ఇటీవలే కొంచెం సవరించి పెంచారు.అయితే ఆ రేట్లకు ఒప్పుకొని కూడా చాలా ఆసుపత్రులు cghs వారికి చాలా వరకు సరైన సేవలు ఇవ్వడం లేదు. కొన్ని ఆసుపత్రులలో పేరున్న సీనియర్ డాక్టర్లు కార్డు ఉన్నవారికి చికిత్స చేయరు.
అసలు పేరున్న కొన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు cghs స్కీములోనే లేరు.

ఈ పరిస్థితి మారడం కష్టం.

Anil ఆట్లూరి చెప్పారు...

కుదుమట్టంగా. ఏ ప్రాంతంలో వాడుతున్నారో ఈ padaM?

అజ్ఞాత చెప్పారు...

మేనిఫెస్టో విడుదల లోనే అసహజ పొత్తు బండారం బైట పడింది. బీజేపీ నాయకుడు ప్రణాళిక ప్రతిని తాకడానికి కూడా నిరాకరించారు. బాబు పవన్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ ప్రణాళికతో
ఇచ్చిన హామీలకు బీజెపీ కి దూరం అని అనుకోవాలి.

ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాల ను తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు ఆ పథకాల పేరుమార్చి ఇంకా పెంచుతాము అని చెబితే నమ్మేదెలా ? నిధులు ఎలా వస్తాయి. మరి మేధావి జేపీ గారు ఏమంటారు ?

పార్టీలు అమలు చేయ వీలులేని హామీలు ఇవ్వకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది.