16, ఏప్రిల్ 2024, మంగళవారం

ఎవరీ సాయి పద్మగారు - భండారు శ్రీనివాసరావు

 రాత్రి పొద్దుపోయిన తర్వాత Sujatha Velpuri గారి పోస్టు చూశాను. అందులో ఒక వాక్యం నన్ను రాత్రంతా నిద్ర పోకుండా చేసింది. అదే ఇది.

“వెళ్ళిరండి పద్మా! నొప్పి, బాధ, మోసం, దుర్మార్గం లేని ప్రపంచంలోకి, వీల్ చైర్ విసిరేసి స్వేచ్ఛగా పరిగెత్తండి”

అప్పుడు మొదలయిన ఆలోచనలు రాత్రంతా నిద్ర లేకుండా చేసాయి.

ఎవరీ పద్మ? ఫేస్ బుక్ మొత్తం మితృలు పంచుకుంటున్న పద్మగారి జ్ఞాపకాలతో నిండిపోతోంది. ఎందుకు ఇలా అందరూ అర్ధరాత్రి వేళ మౌనంగా రోదిస్తున్నారు? ఒకళ్ళా ఇద్దరా వందలమంది ఆమె గురించి రాస్తూనే వున్నారు. నేను ఆవిడ గారి గురించి ఆలోచిస్తూనే వున్నాను.  నాకున్న రెండువేల పై చిలుకు మిత్ర బృందంలో ఈ సాయి పద్మ గారి పేరెందుకు లేదు? ఇంత గొప్ప మనిషి ఇంతకాలం నాకు తెలియకుండా ఎందుకు వుండిపోయారు. పద్మగారిని తెలిసిన వారు, కేవలం ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తెలుసుకున్న వారు, వారూ వీరని లేకుండా ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు అంటే ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అయి వుండాలి.

చివరికి ఆమె గురించి తెలుసుకునేసరికి దాదాపు తెల్లవారింది. అదీ పద్మగారు స్వయంగా రాసుకున్న ఒక పోస్టు ద్వారానే.  పద్మగారు రాసుకున్న అమ్మ కధల ద్వారానే.

నా కంటపడ్డ ఆ పోస్టులో పద్మగారు ఇలా రాసుకున్నారు.

దేవుడు అంత చక్కటి మొహం అందం ఇచ్చి ఇంత లోపం పెట్టడం ఎందుకు కనీసం ఒక కాలు అన్నా నడిచేందుకు వీలుగా ఉంటే బాగుండు.... నా మొదటి సారి ఆపరేషన్ అప్పుడు అనుకుంటా అమ్మ అమ్మమ్మతో అన్నమాటలు.. ఆపరేషన్ థియేటర్ బయట ఇంకా నాకు మత్తు వీడలేదు బహుశా ఆరు ఏడేళ్లు ఉంటాయేమో

ఆ కొంచెం అన్న అవకరం ఎందుకు ఉండాలి? ఏంటో అంటూ నిట్టూర్చిన అమ్మమ్మ మాటలు. సరే ఓహో నేను అందంగా ఉంటానా అని గొప్పగా ఫీల్ అయ్యాను రెండు కాళ్లు తొడల నుంచి పాదం చివర దాకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లతో ఉన్నా కూడా..

అది మార్చి నెల పదో తారీకు. నా పుట్టినరోజు నాడు కూడా ఒక ఆపరేషన్ చేయించారు. బహుశా నాకు గుర్తుండి అది మొదటి ఆపరేషన్.. అంతకు ముందు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్లు అలాంటివి పెద్దగా గుర్తు లేవు.

అప్పటికి రెండు పాదాలు పూర్తిగా వాలిపోయి ఉండేవి నడుము పట్టుకుని లేవదీస్తే పాదాలు మెలి పడిపోయేవి. టెండన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లాంటి సర్జరీ ఏదో చేశారు. ఎడమ కాలు ఫీమర్ బోన్ బోన్ కట్ చేసి పాదం వాలిపోకుండా ఏడు ముక్కలుగా పాదం చుట్టూ బోన్ కి జత చేశారంట.

డాక్టర్ కైలాస రావు గారు, డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు గారి నేతృత్వం లో విశాఖపట్నం అమెరికన్ హాస్పిటల్లో చేశారు.

తను పుట్టినరోజు కదా ఒక రెండు రోజులు ఆగొచ్చు కదా అని అమ్మ అన్నదని తర్వాత మళ్లీ డాక్టర్లు దొరకరు బోన్ ముదిరిపోతే పాదం మళ్ళీ హీల్ అవ్వదు అని నాన్నగారు పట్టుదలగా చేయించారు అని తర్వాత తెలిసింది.

ఆ సంవత్సరం సుమారు ఐదు నెలలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లతో మంచం మీదే ఉన్నాను. విశాఖపట్నం విజయనగరం ఇలాంటి ప్రదేశాల్లో పీక్ సమ్మర్ భయంకరంగా ఉంటుంది. సర్జరీ చేయించుకోవడానికి ఒకసారి మళ్లీ కుట్లు విప్పించుకోడానికి ఒకసారి అమెరికన్ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చేది. ఆ కట్లు కట్టించుకొని విపరీతమైన దురద, చమట నొప్పి బాధ ఎలా అనుభవించాను అన్నది ఈరోజున నాకు ఊహకి కూడా అందదు.

షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏది దొరికిన ఆ ప్లాస్టర్ లోకి నెమ్మదిగా దూర్పి గోక్కునేదాన్ని.అందుకని అమ్మ అమ్మమ్మ పిన్ని నాకు బలమైన ఆయుధాలు ఏవి దగ్గరలో ఉంచేవారు కాదు. ప్లాస్టిక్ స్కేలు, పళ్ళు ఊడిపోయిన దువ్వెన, గట్టిగా వున్న చీపురు పుల్లలు ఇవి నా ఆయుధాలు.

అప్పట్లో సూచర్స్ బొంత కుట్లు లాగా కుట్టేవారు. ఫీల్ అవ్వడానికి నెలలు పట్టేది మధ్యలో మనం ఇలా గోక్కోవడం వల్ల లేదా చెమట పట్టి అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయేవి. బోన్ ఇన్ఫెక్షన్స్, టిష్యూ ఇన్ఫెక్షన్స్ పరమ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఆర్థోపెడిక్ అంటేనే ఎంతకీ హీల్ అవ్వదు అని అర్థం అలాంటిది పాదం చుట్టూ బోన్స్ అమర్చి అన్ని కుట్లు వేస్తే నేను ఒక బొంతలా ఉండేదాన్ని.

సమ్మర్ స్నానం చేయకుండా ఉండలేను అని ఏడిస్తే అమ్మమ్మ కార్పెంటర్ నీ పిలిపించి ఒక కుర్చీ చేయించింది. దానికి మధ్యలో ఒక ప్లేట్ లా కట్ చేసి పెట్టుకొని తీసేటట్టు అదే స్నానానికి బాత్రూం కి.

తొడల దగ్గర నుండీ పాదం చివరి దాకా కట్లతొ స్నానం ఒక గోల గా ఉండేది. అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాబట్టి, కాస్త తడి తగిలినా మెత్తబడి పోయేది. అమ్మమ్మ చాలా తెలివిగా నా ఎత్తులకు పై ఎత్తులు వేసేది ఒక వడియాలు పెట్టుకునే పెద్ద ప్లాస్టిక్ కవర్ తెప్పించి దాన్ని చేసి పూర్తిగా తొడిగేది స్టిక్కర్ టేప్ లాగా దాన్ని ఫుల్ గా అతికించేది. ఏంటీ కష్టంగా ఉందా అని అడిగేది..అవును అమ్మమ్మా అంటే.. పర్లేదు అలవాటు అయిపోతుంది అనేది.

ఇదంతా దేనికి అంటే నీ పని మాత్రం నువ్వే చేసుకోవాలి అది ఎంత కష్టమైనా బయట నుంచి సహాయం మాత్రమే తీసుకో అనేది.

చాలా సర్జరీలు అయిపోయిన తర్వాత కుట్లు విప్పడం మాత్రం నాన్నగారు అమ్మ చేసేవారు. ఫలానా రోజు కుట్లు విప్పుతారంటే భయానికి నాకు జ్వరం వచ్చేది. దాని బాధ చూడలేను అదేదో మీరే చేసేయండి అని అమ్మ అనేది, అయినా తప్పకుండా బెటాడిన్ టించర్ పట్టుకొని నిల్చునేది.

ఈ సర్జరీలలో నాకు రిలీఫ్ వేసవి సెలవులకు వచ్చి మా కజిన్స్ అందరూ. వాళ్ళందరూ ఆడుకుంటుంటే డాబా మీద నేనా పక్కనే కూర్చునే దాన్ని. వాళ్లు నన్ను మోయలేక మా తమ్ముళ్లు గోపి బుజ్జి రెండు కాళ్లు ఇద్దరు మోసేవారు, మా అక్కలు వెనకాల నుంచి పట్టుకుని వాళ్లే స్త్రెచర్ లాగా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను మోసుకొని పోయేవారు. మా డాబా మధ్యలో మెట్లు ఉండేవి దాని చుట్టూ ఒక గూడు లాగా సిమెంట్ తో కట్టిన కట్టడం ఉండేది,పక్కనే పెద్ద సిమెంట్ నీళ్ల ట్యాంక్ ఉండేది. అక్కడ నీడగా ఉండేది. ఒక చాప వేసేసి నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. పక్కనే అమ్మమ్మ చేసిన జంతికలు చేగోడీలు. నా పని ఏంటంటే వాళ్ళు ఆడుకుంటుంటే పాయింట్స్ లెక్కపెట్టడం. ఎవరికైనా ఆడడం బోర్ కొడితే వాళ్ళు వచ్చి నాతో బ్యాంకాట గాని చైనీస్ చక్కర్ గానీ ఆడేవారు. వాళ్ళ ఆడుకుంటుంటే నేను అలా చూస్తూ కూర్చోవడం నాకు అప్పుడప్పుడు తిక్క వచ్చేసేది. ఒకసారి అమ్మమ్మ తో నేను డాబా మీదకి వెళ్ళను అంటే.. ఒకసారి కుట్లు అల్లికలు మరోసారి పుస్తకాలు. శివరాత్రి నా పుట్టినరోజు చాలాసార్లు దగ్గరలో ఉండేవి ఒకసారి అపూర్వ సహస్ర శిరచ్చేద చింతామణి పుస్తకాలు అన్ని భాగాలు, మరో పుట్టినరోజు నాడు మొగలాయి చరిత్ర అన్ని భాగాలు చదివేసిన గుర్తు.

ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు మళ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టలో ఉన్నప్పుడు పొద్దున్నే నూనె రాసి కనీసం స్నానం కూడా చేయించలేకపోయాను ఏమిటో దీనికి కష్టం అంటూ అమ్మమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం అమ్మ మొహం తిప్పుకుంటూ వెళ్ళటం కూడా గుర్తు.

స్థలాలు కాలాలు మారుతాయి అన్నిటికంటే విచిత్రంగా మనుషులు మారుతారు వాళ్ల చుట్టూ ఆహాలు పంతాలు.. నార్శిసిజం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లాంటి ఎన్నో పేరుకుంటాయి.

అమ్మమ్మ అనేది నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే నీకు తగిలిన నొప్పులు బాధలు మంచి జ్ఞాపకాలుగా తలచుకొని నవ్వుకునేంత అని.

ఇందులో నవ్వుకోడానికి ఏముంది అమ్మమ్మ నా బొంద అనేదాన్ని..!

కానీ నిజమే.. ఇవాళ కుట్లు విప్పుతారు అంట అంటూ నిద్ర లేచాను. ఏదైనా చేసేయగలవు అనే అమ్మమ్మ, దీన్ని బంగాళా ఖాతంలో పడేసినా ఈదుకొని వచ్చేస్తుంది అనే తమ్ముడు, దాని మైండ్ బానే వుంది కదా శేషు బాధపడకు అనే నాన్నగారూ, మాట్లాడని మల్లె మొగ్గ మా అమ్మ ఎవరూ లేరు కుట్లు విప్పటానికి...!!

కొన్ని జ్వరాలు బావుంటాయి

ITS HARD TO TURN THE PAGE WHEN YOU KNOW SOMEONE WON'T BE IN THE NEXT CHAPTER, BUT THE STORY MUST GO ON.


(కీర్తిశేషులు సాయి పద్మ గారు)


 

దైన్యం తెలియని మనిషి, ధైర్యం ఒక్కటే తెలిసిన మనిషి పద్మగారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి?

 

(16-04-2024)

కామెంట్‌లు లేవు: