8, మే 2024, బుధవారం

అర్ధరాత్రి జ్ఞానోదయం - భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో బ్లాకౌట్ అనే మాట వినపడేది. శత్రుదేశపు యుద్ధవిమానాలు ఆకాశవీధి నుంచి, కింద భూతలంపై తమ  లక్ష్యాలను గుర్తించకుండా ఆ రోజుల్లో అధికారులు, రాత్రివేళల్లో అనేక నగరాల్లో  బ్లాకౌట్ ప్రకటించి ప్రజలచేత స్వచ్చందంగా కరెంటు దీపాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వీధి దీపాలు వెలగకుండా చూసేవారు. ఆ యుద్ధసమయంలో ప్రజలనుంచి కూడా స్వచ్చంద సహకారం లభించేది. అత్యవసరంగా దీపాలు వాడాల్సిన పరిస్థితి వస్తే, ఆ వెలుగు బయటకి ప్రసరించకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసేవారు. అప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పని చేస్తుండేవాడిని. దేశం కోసం కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులని కష్టంగా భావించేవారు. సర్దుకుపోయేవారు.

అందరికీ సుపరిచితం అయిన దివి సీమ తుపానుకు ముందు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో   ఒక తుపాను వచ్చింది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ తుపాను సృష్టించిన భీభత్సం కారణంగా వందలాది గ్రామాల్లో రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి  ఇంతగా లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి చాలామందికి తెలియలేదు.

అప్పుడు వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే, వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆ రాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ, కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు, వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. అప్పటికి ఇప్పటిలా జంట రైలు మార్గాలు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి.  రైలు ప్రయాణీకులకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్కచచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్టకాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  తెలవదు.

నిన్న మళ్ళీ హైదరాబాదులో మేము ఉంటున్న ఎల్లారెడ్డిగూడా ప్రాంతంలో రాత్రి ఏడుగంటల సమయంలో కరెంటు పోయింది, భీకరంగా కురిసిన వర్షం కారణంగా. కరెంటు పోయినా ఊరు చల్లపడింది అదే పది వేలు అనుకున్నాం. ఇంట్లో ఇన్వర్టర్ కారణంగా చాలాసేపటి వరకు కరెంటు లేదన్న సంగతి తెలియలేదు. పుష్కర కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉన్నామన్న కసితో అది పగ తీర్చుకుని ఉండేదే. ఎందుకో ఏమో తెలియదు, రెండు రోజుల కిందటే మా కోడలు నిషా, ఎర్రటి ఎండలో బయట బాల్కనీలో వున్న ఇన్వర్టర్ లో  కొని తెచ్చిన డిస్టిల్ద్ వాటర్ నింపిన కారణంగా కలిగిన అల్ప సంతోషంతో అది పనిచేసిన ఫలితంగా మేము కొన్ని గంటలు సుఖపడిన మాట వాస్తవం. ఈ లోపున తెలివి తెరిపిన పడి, ఇన్వర్టర్ స్థాయి, స్థోమత గుర్తుకు వచ్చి,  ఉన్న మూడు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపేసి అందరం ముందు హాల్లో చేరి ఒక లైటు, ఒక ఫ్యానుతో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాము. ముందు వాకిలి తెరిస్తే చల్లటి గాలి వచ్చింది. దాంతో చంటి పిల్ల మా మనుమరాలు జీవిక భయపడకుండా లైటు ఒక్కటి వుంచి ఫ్యాను ఆపేసాము. రైస్ కుక్కర్  కరెంటుది కావడంతో అటక ఎక్కించిన ప్రేస్తీజ్ కుక్కరే దిక్కయింది. సరే ఏదో విధంగా భోజనాలు అయ్యాయి అనిపించాము. రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక్కసారి  వరండాలో లైట్లు వెలిగి ఆరిపోయాయి. ఇలా జరిగితే కరెంటు త్వరగా వస్తుందని సూతుడు శౌనకాది మునులతో చెప్పినట్టు చిన్నప్పుడు మా వూళ్ళో కరెంటు డిపార్ట్ మెంట్ హెల్పర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి, ఎవరి గదుల్లో వాళ్ళం ఇన్వర్టర్ తో నడిచే ఫ్యాన్లు వేసుకుని ధీమాగా పడుకున్నాము. ఓ రెండు గంటలు ఇన్వర్టర్ ముక్కుతూ మూలుగుతూ పనిచేసి సెలవు తీసుకుంది. అప్పటికి కరెంటు లేని జీవితం కొంత అలవాటయి అలాగే పడుకున్నాము. తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో హఠాత్తుగా  కరెంటోదయం అయింది. అదే సమయంలో జ్ఞానోదయం కూడా అయింది.

ఇంట్లో కరెంటు పోయినా మనం మన ఇంట్లోనే ఉన్నాము. కానీ ఆ కరెంటు వాళ్ళు ఇల్లు, సంసారాన్ని వదిలి, ఆ నిశీధిలో, వర్షంలో బద్దకించకుండా పనిచేయబట్టే కదా మనకు మూడు గంటలకో , నాలుగు గంటలకో కరెంటు వచ్చింది. ఈ స్పృహ కలగగానే అంతవరకూ వాళ్ళమీద పెంచుకున్న అసహనంతో పాటు, పడ్డ ఇబ్బందులు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.

ముందే చెప్పినట్టు సుఖదుఖాలు సాపేక్షాలు.



(08- 05-2024)     

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Well said. For that matter, when we are traveling in a train and reaching the destination means, there are so many people working in the background to make sure our journey is safe and on time. It equally applies to our economy. The country is running smoothly means, it is an effort of so many people :)