13, మే 2024, సోమవారం

నిమేషకాలంలో పూర్తయిన పౌరధర్మం పాటింపు - భండారు శ్రీనివాసరావు

 


ఈరోజు ఉదయం పోలింగు ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి టీవీలు ఓటర్ల ఉత్సాహం గురించి కధనాలు ప్రారంభించాయి. పోలింగు కేంద్రాల ముందు  బారులు తీరిన ఓటర్లు, కిలోమీటర్ల మేర క్యూలు అంటూ  బుల్లి తెరలపై స్క్రోలింగులు బారులు తీరడం మొదలెట్టాయి. తయారై వెళ్ళబోయేవాడిని కాస్తా వాటిని చూసి  ఆగిపోయాను. మధ్యాన్నం వరకు సేం టు సేం స్క్రోలింగులు. మార్పు లేకుండా, అక్షరం పొల్లుపోకుండా. బయలుదేరడం, మళ్ళీ ఆగిపోవడం. ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత,  ఓ వాటర్ బాటిల్ చేత  పట్టుకుని నడకకు ఎక్కువా, ఆటోకి తక్కువా అయిన పోలింగు కేంద్రానికి మధ్యాన్నం మూడు గంటలకి  మా కోడలు, నేనూ  వెళ్ళాము. దారిలో ఇరుపక్కల  దుకాణాలు అన్నీ మూసి వున్నాయి.  పెద్ద క్యూలు ఉంటాయని అనుకుని పొతే, పోలింగు కేంద్రం ఉన్న ప్రాంతం అంతా నిర్మానుష్యంగా వుంది. ఒక పోలీసు, ఇద్దరు మహిళా సిబ్బంది కనబడ్డారు. మొబైల్ ఉందా అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఆ బాటిల్ అక్కడ పెట్టి అల్లా వెళ్ళండి, అన్నారు.  నన్ను చూసిన పోలింగు సిబ్బంది అమ్మయ్య ఎట్టకేలకు ఒకడు వచ్చాడు అని గుసగుసలాడుకున్నట్టు అనిపించింది. తలకిందుల సంతకం ఒకటి చేయించుకుని, ఎడమ చేతి చూపుడు వేలు మీద సిరా మరక అంటించి, పోయి ఓటు వేయండి అన్నారు. పోలింగు ఛాంబరులో పొడవాటి ఈవీఎం లు రెండు కనిపించాయి. ఇంతమంది పోటీలో వుంటే,  ఇదేమిటి ఇక్కడ  పరిస్థితి ఇలా వుంది అనుకున్నా. భారత పౌరుడిగా నా ప్రధమ కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని బయట పడ్డాను. మొత్తం ప్రక్రియ అంతా నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తయింది. ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్టు,  నా ఒక్కడి కోసమే ఈ కేంద్రం ఏర్పాటు చేశారేమో అనే భావన కలిగింది. పక్కనే కొంచెం దూరంలో ఉన్న మరో కేంద్రంలో ఓటువేసి వచ్చిన మా కోడలు అప్పటికే కారు దగ్గర  నాకోసం ఎదురు చూస్తోంది. అంటే అక్కడ పరిస్థితి కూడా డిటో అన్నమాట.   ఇంటికి వచ్చి టీవీ పెడితే మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో వేసిన  అవే స్క్రోలింగులు, అక్షరం పొల్లుపోకుండా,  బారులు తీరిన ఓటర్లు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాపత్రయపడుతున్న ఓటర్లు అంటూ టీవీలు ఊదరకొడుతున్నాయి. ఎందుకిలా ఓటర్లని నిరుత్సాహపరుస్తున్నారో తెలియదు.  

తర్వాత గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటే, మన ఓటువున్నది సికిందరాబాదు. హైదరాబాదు నగరంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఓటు హక్కు గురించి ఇతరులకి చెప్పేవాళ్ళ శాతం మరీ  ఎక్కువ.  కానీ, ఓటు వేసే వాళ్ళ శాతం మాత్రం  అతి తక్కువ. ఇంకా  నయం. ఈరోజు పగటిపూట ఐ పి ఎల్ మ్యాచ్ లేదు. అందుకే ఈ మాత్రం అయినా.

ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదులో  ప్రధాన కార్యాలయాలు వుండే ప్రధాన టీవీ చానళ్ళ లోనే ఈ హడావిడి అంతా. ఇదంతా ఏపీ ఎన్నికలు గురించి అనుకోవాలేమో!

ఇతి వార్తాః !

(13-05-2024)           

3 కామెంట్‌లు:

Chiru Dreams చెప్పారు...

Simple. ఓటెయ్యడానికి అంతా అంధ్రాకి వెళ్ళారు.

అజ్ఞాత చెప్పారు...

20-25% స్వంత ఊళ్లకు వెళ్ళారు. ఆధార్ బేస్డ్ ఆన్ లైన్ ఓటింగ్ పెడితే బాగుంటుంది. Simultaneous voting for mla and mp is better. Voter fatigue is also one reason. Seven phases is too much. 2-3 phases is ok.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ తలకిందుల సంతకం ఒకటి చేయించుకుని,” //

హ్హ హ్హ 🙂, నిజం. ఆ రిజిస్టర్ నా వైపు తిప్పండి, సంతకం చేస్తాను అని మనం అడిగినా కూడా ఇలాగే చేసెయ్యండి అంటూ మొండి జవాబు. ఇది గినా ఎన్నికల కమీషన్ వారి నిబంధనా లేక పోలింగ్ ఆఫీసర్ల సొంత కవిత్వమా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తంతు.