21, మార్చి 2023, మంగళవారం

నేర్చుకోవాల్సింది చాలావుంది

 నిజమే. డెబ్బయ్ ఏడేళ్ల వయస్సులో కూడా నేర్చుకోవాల్సింది చాలావుంది, అదీ నిత్య జీవితంలో తారసపడుతున్న  చాలామంది చిన్నవాళ్ల నుంచి. గౌతమ్ రావూరి (Goutam Ravuri) ని మొన్న  మొదటిసారి ప్రసాద్ ప్రీ వ్యూ ధియేటర్లో కలిసినప్పుడు ఈ విషయం నాకు మరోసారి ధృవపడింది.

ఆయన చదివిన చదువేమిటి, చేస్తున్న ఉద్యోగం ఏమిటి, రాస్తున్న రాతలేమిటి? ఏమిటో ఏమీ అర్ధం కాలేదు ముందు.

ఈనాటి తలితండ్రులు పిల్లల నుంచి కోరుకునే చదువే  చదివాడు. తలితండ్రులు ఆశించే చక్కటి కంప్యూటర్ కొలువు చేస్తున్నాడు. ఆ వయసు కుర్రాళ్ళు, పేరొందిన  ఎం ఎన్ సీలో ఉన్నతోద్యోగం చేస్తున్న పిల్లలు  క్లబ్బులు అంటారు, పబ్బులు అంటారు. కానీ ఈ కుర్రాడు, నా పిల్లల కంటే వయసులో చాలా చాలా చిన్నవాడు గౌతమ్ తరహానే వేరు. వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు కూడా నా లాగే జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చిన వారే. తండ్రీ కొడుకు ఇద్దరి పోలికలు ఒకటిగా వుండవచ్చు కానీ అభిరుచులు, హాబీలు  ఒకటిగా వుండడం చాలా అరుదు. వీరిద్దరి విషయంలో ఆ అరుదైన విషయం సాధ్య పడింది. సమయం దొరికింది అంటే చాలు వీరిద్దరూ కలిసి వెళ్ళేది బార్లకు కాదు, బలాదూరు తిరుగుళ్ళకు కాదు. మార్నింగ్ షో సినిమాలకి. అర్ధరాత్రి దాకా నైట్ డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ తెల్లవారడం తడవు మార్నింగ్ షోకి తయారవడం గౌతమ్ తల్లి గారి తల్లి మనసుకు అంతగా నచ్చక పోయినా, కుమారుడి, పెనిమిటి అభిరుచులకు అడ్డం చెప్పేవారు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సినిమాలో మంచి చెడులు క్షుణ్ణంగా చర్చించుకోవడం చూసి ముచ్చట పడేవారు. చూసే సినిమాల్లో సింహభాగం తెలుగు తెర కొదమసింహం చిరంజీవి సినిమాలే. వాటిని ఏ పరిస్థితిలోనూ మిస్సయ్యే అవకాశమే లేదు. చిరంజీవి సినిమాలన్నా, చిరంజీవి అన్నా ప్రాణం పెట్టే కోట్లాది మంది యువకుల్లో గౌతమ్ ముందు వరసలో వుంటారు. చూసిన చిరంజీవి సినిమా గురించి ఇంటికి వచ్చి సమీక్షించుకోవడం మాత్రమే కాదు ఆ భావాలను అక్షరీకరించి, కంప్యుటీకరించి సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గౌతమ్ కు హాబీ అనాలో, వ్యసనం అనాలో తెలియదు.  ఫేస్ బుక్ రాతల ద్వారా పరిచయం అయి, ముఖతః కలుసుకోకపోయినా, మొన్న రంగమార్తాండ ప్రీ వ్యూ లో కనపడి పరిచయం చేసుకున్నప్పుడు, నన్ను మన్ననగా పలకరించిన తీరు గమనించి అతడి వినయ సంపదకు విస్తుపోయాను. సినిమా అయిపోయిన తర్వాత అతడి కారులో నన్ను ఇంటి వద్ద దింపినప్పుడు , ఒక్క క్షణం అంటూ,  మరుక్షణం ఒక పుస్తకం నా చేతిలో పెట్టాడు. ముఖచిత్రం మీద పునాది రాళ్లు - రావూరి గౌతమ్ అని వుంది. నాకు పుస్తకం ఇస్తున్నట్టు దిగిన ఫోటో కాకుండా విడిగా ఇద్దరం వున్న ఫోటో అడిగి తీసుకున్నాడు. నేను అర్జంటుగా మరో పని మీద వెళ్ళాల్సి రావడం వల్ల, అతడిని ఇంట్లోకి పిలిచే మర్యాద చేయలేకపోయాను.

నిన్నకాక మొన్న పరిచయం అయిన వ్యక్తి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనే సందేహం ఎవరికయినా కలిగితే దానికి సమాధానమే ఈ పుస్తకం. ఈ విషయాలు అన్నీ అందులోనివే. అప్పటివరకు వృత్తి జీవితంలో తారసపడే అనేకమందిలో గౌతమ్ కూడా ఒకడు అనుకున్నా. చదివిన తర్వాత గౌతమ్ స్థాయి ఎలాటిది అనే సత్యం అవగతమైంది.

ఎదుగుతున్న వయసులో వివిధ దశల్లో చిరంజీవితో దిగిన ఫోటోలు చూస్తే బుగ్గల మీద గిల్లితే పాలుకారుతాయేమో అనిపించే నూనూగు మీసాల  నూత్న యవ్వనం నుంచి ప్రపంచాన్ని చదివిన అనుభవశాలిగా గంభీరంగా వుండే గౌతమ్ కనిపిస్తాడు. సినిమా పిచ్చి అంటే సినిమాల్లో నటించాలనే పిచ్చి కాదు, సినిమాలు అదేపనిగా చూసే పిచ్చితో పెరిగిన  పిల్లలు, నిజజీవితంలో దారితప్పుతారేమో అనే నా వంటి సందేహాత్మకుల కళ్ళు తెరిపిళ్ళు పడేలా సాగింది ఈ పుస్తకం.

చిరంజీవికి వీరాభిమాని అయినప్పటికీ, ఆయన సినిమాల గురించి రాసిన ఈ పుస్తకంలో ఎలాంటి శషభిషలు లేకుండా, అనవసర అభిమానపు ఛాయలు పడకుండా  సమీక్షలు చేయడం అనేది రచయితగా గౌతమ్ రావూరి పరిణతికి నిదర్శనం.

పుస్తకం చివర్లో :

“ఇది ఇంటర్వెల్....మరిన్ని చిరంజీవి సినిమాలతో ....పునాది రాళ్లు – 2- పేర మరో సంపుటి రాయాలన్నది నా ఆకాంక్ష అని ముగింపు ప్రకటన చేశారు.

ఈ పుస్తకం చదివిన ప్రతివారూ గౌతమ్ ఆకాంక్ష నెరవేరాలనే కోరుకుంటారు.

కుమారుడిని ఆదర్శంగా పెంచిన గౌతమ్ తలితండ్రులు పార్వతి గారు, ప్రసాద్ గారు ధన్యులు, ఆదర్సనీయులు.






(21-03-2023)            

కామెంట్‌లు లేవు: