19, మార్చి 2023, ఆదివారం

శ్రమజీవికి ఎంత కష్టం! ఎంత కష్టం!! – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha today, 19-03-2023, SUNDAY)
ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.
కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకు వుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐమూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదులాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండగాలో వడగాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడోదానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన సైనికుల మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటిగంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.
ఈ లోగా మా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగర విస్తరణలు అభివృద్ధిలో భాగం. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు అభివృద్ధి సూచికల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదనకు అవకాశం ఉన్న వ్యాపారరంగం కావడంతో అవినీతిలో అభివృద్ధి కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. ఎన్ని నియమాలు, కఠినతర నిబంధనలు, చిత్తశుద్ధి కలిగిన అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ, అనుమతుల మంజూరీలో డబ్బులు చేతులు మారక తప్పని పరిస్థితే వుంది. రాత్రికి రాత్రే కోట్లకు పడగలు ఎత్తగల అవకాశాలు పుష్కలంగా ఉన్న రంగం కనుక రియల్టర్లు కొల్లలుగా పుట్టుకు వచ్చారు. అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే రంగం కావడం, పెట్టుబడికి మించి ఇబ్బడి ముబ్బడి లాభాల పంట పండించే వీలుసాళ్ళు అపారంగా వుండడం వంటి కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలసిల్లుతున్న మాట కూడా నిజం. పెద్ద మొత్తాల్లో ఆర్జనకు అవకాశాలు వుంటాయి కనుక ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా అదే స్థాయిలో వుండడం సహజం. పైగా రాజకీయుల వత్తాసు కారణంగా అక్రమ నిర్మాణాలు ఏ నగరంలో చూసినా పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ చక్కటి నగర శోభను మటుమాయం చేస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు స్వస్థలాలకు తిరిగి రావడానికి ఇచ్చగించకపోవడానికి గల కారణాల్లో ఇదొకటి. కాబట్టి అక్రమ భవన నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా సామాన్య ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. సందేహం లేదు.
ఈ సమస్య ఏ ఒక్క హైదరాబాదుకు లేక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కాదు. పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు విశ్వ నగరాలుగా మార్పు చెందడం అనేది పరిణామ క్రమంలో భాగం. అయితే ఇదంతా ఒక పద్దతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగినప్పుడే అది సరైన అభివృద్ధి అవుతుంది. ఇందుకోసమే ప్రతి పట్టణంలో ప్లానింగ్ విభాగాలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు జరిగేలా కనిపెట్టి చూడడం ఈ విభాగాల విధి. అయితే నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటికి ఏదో ఒక పేరుతొ నిర్మాణ అనుమతులు పొందడం సాధ్యం అయ్యే పరిస్థితులను అలాంటి రియల్టర్లు చక్కగా ఉపయోగించుకోవడంతో వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మాట కూడా వాస్తవం.
మరో పక్క, అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు తరచుగా వింటుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే, మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపిస్తుంటాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్ళను కట్టడానికి కనీసం ఏడాది, రెండేళ్లు అయినా పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వతంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా! ఆ మాత్రం భయం వారిలో కలిగించడం సర్కారు తలచుకుంటే సాధ్యం కాదా!
కొన్నేళ్ళ క్రితం, మీడియాలో స్క్రోలింగులు చకచకా పరుగులు తీసాయి.
హైదరాబాదు పొలిమేరల్లో మల్లంపేట చెరువులో అక్రమనిర్మాణాలు. ఏకంగా 260 ఖరీదైన విల్లాలు. రాత్రికి రాత్రే సాధ్యం అయ్యే నిర్మాణ వ్యవహారం కాదు. విషయం బయటకి పొక్కడంతో వాటిల్లో 120 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. మీడియా ఈ విషయాన్ని ఎత్తి చూపింది. వాటిని ఏం చేస్తారు. కూల్చేస్తారా! ఏం చేశారన్నవిషయంలో తర్వాత మీడియా కూడా పట్టించుకున్నట్టు లేదు. అందుకు సంబంధించిన ఎలాంటి వార్తా లేదు. స్వాధీనం చేసుకున్నారు సరే! వాటిని ఏం చేశారు? కూల్చివేతే తుది పరిష్కారమా! వాటిని కట్టడానికి అయిన వ్యయం, వాటిని నిర్మించడానికి వేలాదిమంది కార్మికులు అహోరాత్రులు పడిన శ్రమ బూడిద పాలేనా! ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా లెక్క వేస్తే ఆ నష్టాన్ని అంకెల్లో లెక్కపెట్టడం కుదిరే పనేనా! కట్టడానికి ముందే కట్టకుండా చర్యలు తీసుకునే విధానం వుంటే అసలు నిర్మాణాలను కూల్చే అవసరమే రాదు కదా!
ఆ స్థాయిలో భారీ నిర్మాణాలు పూర్తయ్యేవరకు అంతకాలం కళ్ళు మూసుకున్న వారిపై చర్యలు ఉండవా!
ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ ప్రశ్నలకు జవాబులు వుండవు.
అయితే, సిబ్బంది కొరత అనే సమాధానం మాత్రం సిద్ధంగా వుంటుంది.











(19-03-2023, SUNDAY)

కామెంట్‌లు లేవు: