9, ఫిబ్రవరి 2021, మంగళవారం

మరవలేని మనిషి

 జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే.”

ఈ రోజు (9th Feb) మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు. ఈ రోజును మరచిపోకపోవడమే ఆమెకు నేనిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని అనుకునేవాడిని.

‘చూసావా నువ్వు గుర్తు చేయకుండానే నేనెలా గుర్తుంచుకున్నానో’ అని చెప్పాలని వుంది. కానీ వినడానికి ఆవిడ లేదు.

నా ప్రతి పుట్టిన రోజుకూ నన్ను బలవంత పెట్టి ఇంటికి దగ్గరలో వున్న ఓ చిన్న గుడికి తీసుకుని వెళ్ళేది. (దూరంగా వుండే పెద్ద గుళ్ళకు  వెళ్ళడానికి  బద్దకిస్తాననే  సందేహంతో)

పెళ్ళయిన కొత్తల్లో  నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో పెరిగితే, ఇల్లూ వాకిలీ  పట్టని నాలాంటి మొగుడు దొరికాక,  దేవుడి అవసరం ఆమెకు బాగా పెరిగింది.

2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన  చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల  కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ .నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా  గుడికి  వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప  మిగిలిన విషయాలు  పట్టించుకోను.

గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి  కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.

ఇంటికి వచ్చేముందు జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న  మా రెండో అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి వెళ్ళిన గుర్తు.  ఆ తర్వాత పదంటే పది రోజులకే మాసివ్  హార్ట్ అటాక్ వచ్చి మా ఆవిడ మరణించడంతో ఆ  జ్ఞాపకాలన్నీ అలికినట్టు గజిబిజిగా అయిపోయాయి.       

ఈరోజు  నేను ఒక్కడినే వెళ్లి దేవుడి గుడిలో కాసేపు కూర్చుని వచ్చాను. శరీరాన్ని ఏదో కట్టడి చేసి భగవత్ సన్నిధానంలో కూర్చోవడమయితే కూర్చున్నా కానీ, మనసు నా స్వాధీనంలో వుండదు కదా!

చెత్త ఆలోచనలు చుట్టుముడుతూనే వుంటాయి.

“మా ఆవిడ చనిపోయి అప్పుడే  ఏడాదిన్నర అవుతోందా! అయినా ఇంకా ప్రాణాలతోనే వున్నాను అంటే నా గుండె గట్టిది అయినా అయివుండాలి. లేదా ఆమె మీద నా ప్రేమ వట్టిది అయినా అయివుండాలి”

ఎంతయినా మగవాడిని కదా! ఇదే నిజమై వుంటుంది.

(09-02-2021)

కింది ఫోటో: పెళ్ళికాని కొత్తలో మేమిద్దరం (1968)





 

2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

🙏🙏🙏🙏🙏

సూర్య చెప్పారు...

ఇహలోకపు నాటకంలో పాత్రల నటనవరకే ఈ బాంధవ్యాలన్నీ. తన పాత్ర పూర్తయ్యాక ఏ నటులైనా రంగస్థలం మీదనుంచి నిష్క్రమించాల్సిందే.