15, ఫిబ్రవరి 2021, సోమవారం

ఎక్కడ ? ఎప్పుడు ?

 


కొంత కాలం గత కాలంలో కలిసిపోయిన తర్వాత, ఆ నాటి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ వుంటే కొంత సంతోషం అనిపిస్తుంది, కొంత తమాషాగా అనిపిస్తుంది.

ఈ ‘ఎక్కడ ఎప్పుడు’ ఇలాటి విషయాల్లో ఒకటి.
ఈ రెండు పదాలతో రేడియో మార్నింగ్ బులెటిన్ లో ఒక హెడ్ లైన్ వార్త తయారు అయ్యేది.

అర్ధరాత్రో అపరాత్రో మా ఇంట్లో ఫోన్ రింగయ్యేది. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. సెల్ కాలం కాదు.

ఫోను మంచం పక్కనే పెట్టుకునేవాడిని. మరీ అర్ధరాత్రి ఫోనయితే అవతల రైల్వే పీఆర్ఓ మైఖేల్. తెల్లవారుఝామున అయితే సీపీఆర్వో కృష్ణయ్య గారు. అదీ లెక్క.

ఫోను ఎత్తి ‘ఎక్కడ? ఎప్పుడు?’ అని అడిగేవాడిని.
వాళ్ళ నుంచి జవాబు తీసుకుని వెంటనే విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు లేదా శ్రీ ఏమ్వీఎస్ ప్రసాద్ గారికో ఫోను కలిపేవాడిని. ఎవరు డ్యూటీలో వుంటే వాళ్ళు నా ఫోన్ రిసీవ్ చేసుకుని ‘ఎప్పుడు? ఎక్కడ?’ అని అడిగేవారు. నేను క్లుప్తంగా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఓ వార్త రూపంలో రాసుకునే వారు. వాళ్ళిద్దరూ ఎంతటి సమర్ధులు అంటే కొన్ని క్షణాల్లో నేను చెప్పిన వార్తను విస్తరించి, మరికొన్ని నిమిషాల్లో ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తల బులెటిన్ లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చేవారు.

“ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ/ కొప్పుల సుబ్బారావు.

“దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక గూడ్స్ రైలు రాత్రి పట్టాలు తప్పింది. పలానా స్టేషన్ల నడుమ జరిగిన ఈ దుర్ఘటన కారణంగా పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగిందని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం మా హైదరాబాదు ప్రతినిధికి తెలియచేసారు. వివరాలు.....”

ఎక్కడో సికిందరాబాదు రైల్వే క్వార్తర్స్ లో పొద్దున్నే రేడియో పెట్టుకుని వార్తలు వింటున్న రైల్వే అధికారులు, ఎలాంటి పొరబాటు లేకుండా వార్త ప్రసారం అయిన సంగతి తెలుసుకుని ఊపిరి పీల్చుకునే వారు. చెప్పిన వార్త ఎలాంటి తభావతు లేకుండా వస్తుందని తెలుసు కనుక నేను ముసుగు తన్ని నిద్రపోయేవాడిని.

24 X 7 నిరంతర వార్తా చానళ్ళ ఆవిర్భావం తర్వాత ప్రసార సాధనాల్లో/ మాధ్యమాల్లో క్రమంగా రేడియో పాత్ర (అధికారుల దృష్టిలో) తగ్గుతూ వచ్చి ఈ ప్రాధాన్యతకు తెర పడింది.
(15-02-2021)

కామెంట్‌లు లేవు: