(Published in SURYA daily on 06-12-2019, Friday)
రేడియో విలేకరిగా ఆ స్థానాన్ని నా అంతగా దుర్వినియోగం చేసిన వాళ్ళు మరొకరు వుండరు అనేది నా నమ్మకం. ఎవరు ఏది అడిగినా అదేదో నా చేతిలో పని అయినట్టు, ఆ పనిచేయాల్సిన వాళ్లకు చెప్పి చేయించేవాడిని. అయితే నా ఈ తత్వం నాకు రేడియోలో మంచి పేరు తీసుకురావడమే ఆశ్చర్యం.
ఒకసారి ప్రసార భారతి సీఈవో (రేడియో, దూరదర్శన్ లకు కలిపి ఇదే అత్యున్నతమైన పోస్టు) శ్రీ కేజ్రీవాల్ అధికారిక సమావేశాల్లో పాల్గొనడం కోసం హైదరాబాదు వచ్చారు. ఆయన రెండు రోజులు వుండే నిమిత్తం వస్తే జరూరుగా ఢిల్లీ రావాలని పైనుంచి కబురు వచ్చింది. ఆయన రిజర్వ్ చేసుకున్న విమానం టిక్కెట్టు మర్నాటికి. కానీ సాయంత్రమే వెళ్ళాలి. ఆ రోజుల్లో ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి విమానం ఒక్కటే దిక్కు. ప్రైవేటు విమానాలు లేవు.
మా స్టేషన్ డైరెక్టర్ నన్ను పిలిపించారు. విషయం చెప్పారు. ‘నో ప్రాబ్లం’ అని ఆ ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దమనిషిని బేగంపేట ఎయిర్ పోర్టుకి తీసుకువెళ్ళాను. ఆ రోజుల్లో నా గుర్తింపుకార్డు ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా పనికి వచ్చేది. అప్పటికే బోర్డింగు పాసులు ఇచ్చేశారు. ఎయిర్ పోర్ట్ అధికారికి విషయం చెప్పి ‘ఏమైనా సాయం చేయగలరా’ అని అడిగాను. ‘మీరు వెళ్లి ఎవరిదైనా బోర్డింగు పాసు తీసుకువస్తే ప్రయత్నం చేస్తాను’ అన్నాడు. వెంటనే వెళ్లి వీ.ఐ.పీ. లాంజ్ లో వెయిట్ చేస్తున్న వారెవ్వరని పరికించి చూసాను. బాగా పరిచయం, చనువు వున్న ఓ ఎంపీ దగ్గరికి వెళ్లి, ‘ఈరోజే ఢిల్లీ వెళ్ళాలా, రేపు వెళ్ళినా పరవాలేదా’ అని అడిగాను. ఆయన నవ్వి ‘ఈ రాత్రి అక్కడికి పోయి చేసేదేమీ లేద’న్నాడు. వెంటనే ఆయన బోర్డింగు పాసు తీసుకుని మా సీయీవోకు ఇచ్చాను. ‘పదండి పోదాం’ అంటూ టార్మాక్ మీద ఆగివున్న విమానం ఎక్కించాను. నేను కూడా విమానం మెట్లెక్కుతుంటే ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ‘మీరు కూడా ఢిల్లీ వస్తున్నారా!’ అని. నేను నవ్వేసి బై బై చెప్పేసి బయటకు వచ్చాను. సీఈవో విమానం ఎక్కారన్న విషయం తెలుసుకుని బయట వెయిట్ చేస్తున్న మా అధికారులు చాల సంతోష పడ్డారు.
తర్వాత నా పేర స్టేషన్ డైరెక్టర్ కు ఒక ఉత్తరం వచ్చింది.
‘హైదారాబాదు ఎయిర్ పోర్టులో మీరు చేసిన మిరకిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా కూడా జరుగుతుందా అనే ఆలోచన నుంచి ఇప్పటికీ బయటపడ లేకుండా వున్నాను’
దుర్వినియోగం అంటారో, వినియోగం అంటారో తెలియదు కానీ ప్రతి పాత్రికేయుడూ ఎప్పుడో ఒకసారి కొన్ని పనులు ఇలాంటివి (రైలు టిక్కెట్లు, విమానం టిక్కెట్లు చివరి క్షణంలో కన్ఫర్మ్ చేయించడం వగయిరా) వృత్తిరీత్యా చేయక తప్పదు. బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.
ముందు టెలిఫోన్ సంగతి. రేడియోలో చేరినప్పుడు మా ఇంట్లో ఫోను వుండేది కాదు. ఢిల్లీ, విజయవాడలకు వార్త ఇవ్వాలంటే మేముంటున్న చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న టెలిఫోన్ (తంతి కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో, లేదా అశోక్ నగర్ లో ఉన్న జ్వాలా ఇంటికో వెళ్ళాలి. (ఆయనకీ ఈ సౌకర్యం లేదు కాని వాళ్ళ బావగారి (మా మేనల్లుడు డాక్టర్ రంగారావు) ఫోను అక్కడ వుండేది. రేడియో వాళ్ళు నాతొ మాట్లాడాలని అనుకుంటే ఆయనకు ఫోన్ చేసేవాళ్ళు. పాపం ఆయన కూడా అపరాత్రి అర్ధరాత్రి అనుకోకుండా స్కూటర్ వేసుకుని మా ఇంటికి వచ్చి సమాచారం చెప్పేవాడు.
కొన్నాళ్ళు అలా గడిచిన తరువాత ఫోను అవసరం గురించి టెలిఫోన్స్ జనరల్ మేనేజర్ తో (అప్పట్లో హోల్ మొత్తం ఇరవై మూడు జిల్లాలకు ఆయనే సర్వాధికారి) దృష్టికి తీసుకువెడితే ఆయన మారుమాట్లాడకుండా ఒకే ఒక్క రోజులో మా ఇంట్లో ఫోను పెట్టించారు. ఏరియా సబ్ డివిజినల్ మేనేజర్ స్వయంగా వచ్చి ఫస్ట్ కాల్ కనెక్ట్ చేసి మాట్లాడారు. ముందు నేను కోరుకున్న నెంబర్ 65758 ఇచ్చారు. మొదటి బిల్లు కూడా కట్టక మునుపే ఆ నెంబరు మీద మొహం మొత్తింది. 66066 కావాలంటే మళ్ళీ దానికి మార్చారు. టెలిఫోన్ డైరెక్టరీలో బోల్డ్ అక్షరాల్లో నా పేరు వేసేవారు. మేము మాస్కో వెళ్ళేంతవరకు అదే నెంబరు. అయిదేళ్ళ తర్వాత తిరిగొచ్చాను. మా అన్నయ్య ఇంట్లో ఉంటూ అద్దె ఇంటికోసం వెతుకులాట మొదలు పెట్టాము. ఎందుకో ఓ రోజు బేగం పేట ఎయిర్ పోర్టుకి వెడితే అక్కడ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రంగయ్య నాయుడు కలిసారు. ఎన్నాళ్ళయింది మాస్కో నుంచి వచ్చి అని అడిగారు. ఇంటి కోసం చూస్తున్నాను అని చెప్పాను. మర్నాడు మధ్యాన్నం రేడియోకి వెళ్ళే సరికి ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ డిపార్ట్ మెంటు వాళ్ళు కనిపించారు. ‘మీకు ఫోన్ శాంక్షన్ చేస్తూ రాత్రి ఢిల్లీ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఈ ఫారం పూర్తి చేసి, అడ్రసు వివరాలు ఇవ్వండి’ అన్నారు. ‘ఇల్లే ఇంకా దొరకలేదు ఫోను ఎక్కడ పెట్టుకోను’ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఇల్లు దొరికిన తర్వాత చెప్పండని వెళ్ళిపోయారు. పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఇల్లు తీసుకుని పాలు పొంగించక ముందే ఫోను, లాంగ్ కార్డుతో సహా ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు మళ్ళీ నెంబరు సమస్య. నేను అడిగిన 22011 ఇచ్చారు. ఇస్తూనే చెప్పారు. ఇలా వరస నెంబర్లతో కొంత ఇబ్బంది పడతారు జాగ్రత్త అని. అయినా నేను వినలేదు. మర్నాటి నుంచి రాంగ్ కాల్స్. పలానా వారు వున్నారా అంటే పరవాలేదు. “హిందూ స్మశానమా! రాత్రి మా బంధువు చనిపోయారు, దహనం చెయ్యాలి’ అని ఒకరు, “పోలీసు కంట్రోల్ రూమా” అని మరొకరు, “గ్యాస్ బుకింగా” అని ఇంకొకరు ... ఇలా కాల్స్ వచ్చేవి.
మరో సారి ఢిల్లీ నుంచి ఉత్తర భారతానికి చెందిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి వచ్చారు. నేను అడగగానే ఆయన ఏకంగా మా ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసే పదిమందికి అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో టెలిఫోన్లు మంజూరు చేసి చక్కా పోయారు. ఇప్పుడంటే టెలిఫోన్లు అడిగీ అడక్క ముందే దొరుకుతున్నాయి. ఒకానొక రోజుల్లో టెలిఫోన్ పెట్టించుకోవాలంటే ధరకాస్తు పెట్టుకుని ఏళ్ళతరబడి ఎదురు చూడాల్సిన పరిస్తితి వుండేది.
(ఇంకా వుంది)
3 కామెంట్లు:
// "టెలిఫోన్ (తంతి కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో" //
తంతి అంటే ... ఆ సౌకర్యం బాగా బతికిన రోజుల్లో ... టెలిగ్రాముల ఆఫీసండీ. బోర్డు మీద "తంతి తపాలా కార్యాలయం" అని ఉండేది కదా (Post & Telegraph Dept)
టెలిఫోన్ ఆఫీసును టెలిఫోన్ కార్యాలయం అనే అనేవారని గుర్తు.
@ విన్నకోట నరసింహా రావు గారు: అవునండీ. తంతి తపాలా కార్యాలయం. మా దగ్గర ఫోన్ చేసుకోవడానికి, టెలిగ్రాం ఇవ్వడానికీ ప్రత్యేకమైన కార్డులు ఉండేవి. ముందు డబ్బు కట్టాల్సిన పని వుండదు. అక్కడ టెలిఫోన్ సదుపాయం కూడా వుండేది
కామెంట్‌ను పోస్ట్ చేయండి