నిజానికి ఇది ప్రజల్లో మొలకెత్తిన
ప్రశ్న కాదు. ‘నన్నెందుకు ఓడించారంటూ’ ఏకంగా చంద్రబాబు నాయుడే జనంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు.
‘ఓడించడానికి తానేం తప్పు చేశానో
తెలియడంలేదని’ గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నియోజకవర్గాల వారీ సమీక్షా
సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మధనపడ్డట్టు పత్రికలు రాశాయి.
‘సమీక్షించుకోవడానికి లోపం ఎక్కడ
జరిగిందో అంతుచిక్కడం లేదు. కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయాలో తెలియడం లేద’ని
చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ప్రజలకు కష్టం తెలియకుండా ఆ కష్టమేదో
నేనే పడ్డా. సంక్షేమ పథకాల్లో లోటు రానివ్వలేదు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి
నిర్మాణానికి శ్రీకారం చుట్టా. అనతి కాలంలోనే పట్టిసీమ పూర్తి చేశా. పోలవరం
ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నా. అయిదేళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్ట పడితే కేవలం ఇరవై మూడు సీట్లు రావడమేమిటో ఇప్పటికీ బోధపడడం లేదు. నేనేమైనా తప్పు చేశానా’ అని చంద్రబాబునాయుడు బాధ
పడ్డారు.
ఈ క్రమంలో, తన పార్టీకి ప్రజలిచ్చిన తీర్పు పట్ల
కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తీరుతెన్నులను తప్పుపట్టారు.
‘మనం ఇచ్చిన గోదావరి నీళ్ళు తాగారు.
ఓట్లేయడం మాత్రం మరచిపోయారు. పాలిచ్చే ఆవును వదిలిపెట్టి, తన్నే దున్నపోతును
పట్టుకొచ్చుకున్నారు’ అని ఎద్దేవా చేశారు.
చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఈ మాటలు
చెప్పినట్టు టీవీల్లో కనిపించింది కాబట్టి ఈ విమర్శలను తేలిగ్గా తీసుకోవాలని, ఏదో
మాటవరసకు, సరదాగా అన్నారని సరిపుచ్చుకోవచ్చు. కానీ నలభయ్ ఏళ్ళకు పైగా సుదీర్ఘ
రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అనాల్సిన మాటలేనా అని అనిపిస్తే కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే, సోషల్
మీడియాలో వివిధ పార్టీల అభిమానులు అత్యుత్సాహంతో, శృతిమించిన అభిమానంతో ఎదుటివారిపై
చేస్తున్న చౌకబారు వ్యాఖ్యలకు ఇవి తక్కువేమీ కాదు. ఇలాంటివి అభిమానులు మాట్లాడితే
అర్ధం చేసుకోవచ్చు. కానీ, కోపం రావాల్సిన
సందర్భాలలో సయితం అమితమైన ఓర్పును ప్రదర్శిస్తారనే మంచి పేరు చంద్రబాబునాయుడు
ఖాతాలో ఎప్పటినుంచో వుంది. అలాంటి ఆయన
నోటివెంట ఈ మాటలు రావడమే ఆశ్చర్యకరం. గతంలో
ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నకాలంలో అసెంబ్లీ
సమావేశాల్లో చోటు చేసుకున్న ఆవేశకావేశపూరిత సంభాషణలలో సయితం చంద్రబాబు ఏనాడు
కట్టుతప్పి వ్యవహరించిన దాఖలా లేదు. ఏ పరిస్తితుల్లో కూడా సంయమనం కోల్పోలేదు. ఈ విషయాలు గుర్తున్నవాళ్లకే కాకుండా, గతంలో ఆయన అధికారంలో
వున్నప్పుడు, అధికారానికి దూరమైనప్పుడు కూడా ఆయన వ్యవహారశైలి ఇలాగే వుండేది. ఆ కోణంలో గమనిస్తూ చంద్రబాబుకు అభిమానులుగా మారిన వారికి సైతం ఆయన ఉదహరించిన
ఈ పాడిఆవు, దున్నపోతు సామ్యం రుచించలేదని గట్టిగా
చెప్పవచ్చు. మంచో చెడో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వారి విజ్ఞతను ఎద్దేవా
చేయడం ప్రజాస్వామ్యవాదులు చేయాల్సిన పని కాదు.
తనమీద కక్ష పెంచుకుని డెబ్బయి శాతం
పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేశారని అంటూ అదే కక్షతో అమరావతిని చంపేస్తారా? ప్రపంచ
బ్యాంకు రుణాలను ఆపేస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహంగా ప్రశ్నించారు.
జగన్, కేసీఆర్ కలిసి వుంటే తనకు బాధ
లేదని, కానీ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చాలా బాధగా వుందని
చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు.
సరే! ఈ రకమైన విమర్శలతో, ఆరోపణలతో ఏకీవభించేవాళ్ళు
వుంటారు. విబేధించేవాళ్ళు వుంటారు. ఎందుకంటే అవి రాజకీయపరమైన ఆరోపణలు. ఏపార్టీ
వాళ్ళు ఆ పార్టీకి విధానానికి, విధేయతకు తగ్గట్టుగా వాటిని అన్వయించుకుంటారు. వాటిని
వాళ్ళ భాషలోనే వారి విజ్ఞతకు వదిలేద్దాం.
‘గతంలో నేను ప్రతిపక్ష నేతగా
వున్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు నా భద్రతను తగ్గించలేదు. ఈ ముఖ్యమంత్రి (జగన్ మోహన
రెడ్డి) మాత్రం తగ్గించారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు తాను అధికారంలో
వున్నప్పుడు చేసుంటే మీరెక్కడ (వైసీపీ అధినేతలు) వుండేవారు’ అని చంద్రబాబు ఆక్షేపించారు.
ఒక సీనియర్ నాయకుడికి, అందులో గతంలో
ఓసారి మావోయిస్టుల దాడికి గురయిన నేతకు తగిన భద్రత అవసరమే. అయితే, అది శృతిమించిన
స్థాయిలో వుంటే, ప్రజల మధ్యకు వెళ్లి స్వేచ్చగా మసిలేందుకు అదే భద్రత పెద్ద
అడ్డంకిగా మారుతుంది. మర తుపాకులు చేత ధరించి అనుక్షణం కాపలా వుండే భద్రతావలయం లేకుండా
చంద్రబాబు నాయుడు అమెరికాలో సంచరిస్తున్న ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
ఇలా ఆయన్ని చూసి దశాబ్దాలు గడిఛి పోయాయి. అమెరికాలో
ఎటువంటి భద్రతాఏర్పాట్లు లేకుండా చంద్రబాబు
నాయుడు అక్కడి వీధుల్లో, రోడ్డు పక్క
రెస్టారెంట్లలో హాయిగా కలయ తిరిగిన ఫోటోలు చూసినప్పుడు ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అనే
పాట జ్ఞాపకం వచ్చింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఆయన ఇలా స్వేచ్చగా తిరగడం చూసిన బాబు
అభిమానులు కూడా ముచ్చటపడ్డారు. కొత్తగా దొరికిన ఈ స్వేచ్చతో బహుశా ఆయనకు కూడా మంచి
ఉల్లాసం లభించి ఉండాలి. ప్రజలని తన నుంచి వేరుచేస్తున్న ఈ భద్రతా వలయాన్ని గురించి
ఆయన పునరాలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రజల మధ్య తిరగాల్సిన రోజులు
ముందున్నాయి. తమ మధ్య తిరిగే నాయకుడినే ప్రజలు తమలో తమలో ఒకడిగా పరిగణించే
రోజులివి. ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఇది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెలల
పదిహేను రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫలితాల
ప్రకటన తర్వాత తెలుగు దేశం పార్టీ అనేక అంతర్గత సమావేశాలు నిర్వహించి పరాజయ
కారణాలు గురించి సుదీర్ఘమైన సమీక్షలు జరిపింది. పైగా టీడీపీ పరాజయాన్ని
విశ్లేషిస్తూ వివిధ పత్రికల్లో సవివరమైన వ్యాసాలు వచ్చాయి. మీడియాలో విస్తృతంగా
చర్చలు కూడా జరిగాయి. సోషల్ మీడియాలో సీనియర్
జర్నలిస్టు కొల్లి అరవింద్, పాత తరం టీడీపీ నాయకుడు ‘సువేరా’ కలిసి ‘ఒక పరాజయం - వంద తప్పులు ’ అనే పేరుతొ సోషల్ మీడియాలో వరుస కధనాలు పోస్ట్
చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు అరవై అయిదు ఎపిసోడ్లు వెలువడ్డాయి. త్వరలో ఇవన్నీ
ఒక పుస్తక రూపంలోకి వచ్చే అవకాశాలున్నాయి. తప్పు ఎక్కడ జరిగింది అనే అన్వేషణ పక్కనబెట్టి
‘నేనేమి తప్పు చేసాను’ అనుకోవడంలోనే పొరబాటు చేస్తున్నారనిపిస్తోంది.
ఇన్నాళ్ళ తర్వాత కూడా ఓటమికి దారితీసిన
అంశాల విషయంలో సాక్షాత్తూ పార్టీ అధినాయకుడే ఇంతటి అస్పష్టతతో వుండడం నిజంగా
ఆశ్చర్యమే. రాజకీయాల్లో చంద్రబాబు అనుభవం తక్కువేమీ కాదు. జయాపజయాలు కొత్తవీ కావు.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే బాబు వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యాన్ని
కలిగించేవిగా వున్నాయి.
నిజానికి చంద్రబాబు చేసిన ఈ పరిశీలనలో
అర్ధం చేసుకోదగిన ఆవేదన వుంది. అర్ధం కాని ఆగ్రహం వుంది. అలాగే అర్ధంపర్ధం లేని ఆక్రోశం కూడా వుందనిపిస్తోంది.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధికి
చంద్రబాబు శాయశక్తులా కృషి చేసిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే, అభివృద్ధి,
సంక్షేమం చాటున ఆయన దృష్టికి రాని అనేక అంశాలు ప్రజల తీర్పును ప్రభావితం చేసి
ఉండవచ్చు. అన్నీ సమపాళ్ళలో వున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం అక్కరకు వస్తాయి. వేరే
అంశాలు వాటిని కప్పేసినప్పుడు మాత్రం అటువంటి విషయాలే ప్రజలను ముందుగా ఆకట్టుకుంటాయి.
అభివృద్ధి ఒక్కటే గట్టెక్కించే తరుణోపాయం అయిన పక్షంలో గతంలో కూడా ఆయనకు పరాజయ
అనుభవాలు మిగిలేవి కావు. ఆంధ్రప్రదేశ్
సమైక్యంగా వున్నప్పుడు ఆయన హయాములోనే హైదరాబాదు, మరీ ముఖ్యంగా జూబిలీ హిల్స్ వంటి
ప్రాంతాలు గుర్తుపట్టలేనంత అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ, ఆ ప్రాంతంలోనే అధికార
టీడీపీ అభ్యర్ధి కనీసం వార్డు కౌన్సిలర్ గా కూడా గెలవలేకపోయారు. అప్పుడు కూడా చంద్రబాబులో ఇదే
రకమైన నిర్వేదం ద్యోతకమైంది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్తితి.
2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను ఎందుకు
ఓడించారో అర్ధం కావడం లేదని ఆంధ్రప్రదేశ్
మాజీ ముఖ్యమంత్రి మధన పడుతున్నట్టు ఆయన మాటలు బట్టి అర్ధం చేసుకోవాలి. ఈ
ప్రశ్నకు జవాబు వెతుక్కోవాలంటే, 2014 లో అదే ప్రజలు
తనను ఎందుకు గెలిపించారో ముందు ఆయన విశ్లేషించుకోవాల్సివుంటుంది.
అప్పుడు అనేక విషయాలు చంద్రబాబుకు
కలిసివచ్చాయి. ఆయన ప్రభావమే ఎక్కువ అయినప్పటికీ, మోడీ, పవన్ ఇరువురూ ఆ ఎన్నికల్లో
అందించిన స్నేహ హస్తం పాత్రను కూడా తక్కువగా అంచనా వేయలేము. రాష్ట్ర విభజన జరిగిన
తీరు చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా, పదేళ్ళ
సుదీర్ఘ విరామం తర్వాత అదే అంశం మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేసింది.
విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం కావాలని అనుకున్న ప్రజలు ఆయనకు పట్టం
కట్టారు. అయినా ఆయన ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి కేవలం అయిదారు లక్షల ఓట్ల తేడాతోనే
అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయారు. అలా
అని ఆయన చేతులు ముడుచుకుని కూచోలేదు. అసెంబ్లీని వదిలి పారిపోయారని టీడీపీ
శ్రేణులు, ఇతర ప్రతిపక్షాల వాళ్ళూ ఎంతగా ఆక్షేపించినా జగన్ పట్టించుకోలేదు.
ప్రజల్ని నమ్ముకుని ప్రజల్లోనే వుండిపోయారు. ఆ పట్టుదలే ఆయన్ని ముందు ప్రజలకు,
తరువాత అధికార పీఠానికి దగ్గర చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది కూడా అదే.
ప్రజలని నమ్ముకోవాలి.
అలా నమ్ముకుంటారా? లేక తను ఇన్నాళ్ళుగా
నమ్ముతూ వచ్చిన మార్గాన్నే మళ్ళీ ఎంచుకుంటారా? ఆయన మాట్లాడుతున్న తరహా గమనిస్తుంటే
రెండోదే ఆయన ఆలోచనల్లో ఉన్నట్టుంది.
గతంలో రెండుసార్లు ఓటమిని చవిచూసిన
తర్వాత ఆయన ప్రజల దగ్గరకు వెళ్లి ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని పలుసార్లు
చెప్పుకున్నారు. ప్రజలు నమ్మి ఆయనకు పాలనాపగ్గాలు అప్పగించారు. కానీ ఆయన మారిన
దాఖలా తదుపరి పాలనలో కానరాలేదు. తన పాత మార్గంలోనే కొనసాగారు. ఫలితం తెలిసిందే.
ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబుకు సీట్లు
బాగా తగ్గిన మాట నిజమే కాని, ఆయనకు మద్దతుగా నిలిచిన ఓటర్ల శాతం గణనీయంగానే వుంది.
నలభయ్ శాతం ఓట్లు అంటే చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రజాదరణ వున్నట్టు. కానీ
ఒక్కోసారి మాట తీరు ప్రజల మనసులపై ప్రభావం చూపిస్తుందనే మాట మరవకూడదు. ఈ ఆవులు,
దున్నపోతుల వ్యవహారం అలాంటిదే.
చేసిన మంచి పనులను ప్రజలకు చేరవేయడానికి ప్రచారం అవసరమే. చేసినట్టు
కనబడడానికి ప్రచారం మీద మాత్రమే ఆధారపడితే ప్రజలు ఇట్టే పట్టేస్తారు. నేను ముందుగా
చెప్పినట్టు చంద్రబాబు చేసిన చాలా మంచి పనులను ఆయన ఏరికోరి చేసుకున్న ప్రచార
ఆర్భాటమే కప్పివేసింది.
‘నన్ను ఎందుకు ఓడించారు అని జనాలను అడగకుండా
ఈ ప్రశ్నను తనకు తానే వేసుకుని వుంటే చంద్రబాబుకే సరయిన సమాధానం దొరికి వుండేది. అయితే,
చిన్న పిల్లవాడు కూడా బదులు చెప్పగల ఈ ప్రశ్నకు జవాబు ఆయనకు తెలియదని ఎవరూ
అనుకోరు.
రాజకీయం చేయడంలో ఒక్కొక్క నాయకుడిది
ఒక్కో స్టయిల్. ఇది చంద్రబాబు స్టయిల్ అనుకోవాలి.