8, సెప్టెంబర్ 2018, శనివారం

తప్పు చేయనివాడు లేడు, తప్పని చెప్పేవాడు లేడు

పూర్వం రాజులు శత్రురాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు ముందుగానే చతురంగ
బలాలను సమాయత్తం చేసుకునే వారు. యుద్ధ భేరీ మోగించడానికి మునుపే సమస్త
సంభారాలను సమకూర్చుకునే వారు. కోట ముట్టడికి గురైతే కొన్ని నెలలపాటు
అవసరం అయ్యే నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పెట్టుకునే వారు. ఏదైనా
అనుకోనిది జరిగి రాణీ వాసంతో సహా శత్రువుల చేతికి చిక్కకుండా బయటపడి
ప్రాణాలు దక్కించు కోవడానికి రహస్య సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునే
వారు. యుద్ధ రంగంలో పోరాడే సైనికుల కుటుంబాల ఆలనా పాలనా చూసేవారు.
యుద్ధంలో లభించేది విజయమో, వీర స్వర్గమో అనే ఫలితంతో నిమిత్తం లేకుండా
యుద్ధసన్నద్ధత ప్రదర్శించేవారు. అవసరమైతే మిత్ర రాజ్యాల సాయం
అర్ధించేవారు. విజయ లక్ష్మిని వరించడానికి అవసరం అనుకుంటే కొన్ని కుటిల
ప్రయత్నాలు చేసేవాళ్ళు. శత్రు శిబిరంలో చీలికలు కల్పించడం, వాళ్ళు
ఏమరుపాటున వున్నప్పుడు మెరుపుదాడి చేసి వారిని వధించి సింహాసనం స్వాధీనం
చేసుకోవడం ఇలా సాగేవి వారి ఆలోచనలు.
ఇదంతా పురాతన కాలం నాటి ముచ్చట్లు.
ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో జరిగే ఎన్నికల సమరాల్లో రాజకీయ పార్టీలు
సయితం అలనాటి రాజులు, చక్రవర్తుల మాదిరిగానే రకరకాల యుద్ధ తంత్రాలను
ప్రయోగిస్తున్నారు. విజయమే ప్రధానం అనుకున్నప్పుడు విలువల విషయం ఎవరికీ
పట్టదు. పదవే ప్రధానం, పవరే ముఖ్యం అనుకునే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ
మాత్రం విలువలు, సిద్ధాంతాలు, సూత్రాలు వల్లె వేసుకుంటూ బతికి బట్టకట్ట
కలుగుతుంది?
అందుకే ఆనాటి యుద్ధతంత్రాలే ఈనాడు రూపం మార్చుకుని, ఎత్తులు, పొత్తులు, జిత్తులుగా రకరకాల అనైతిక రాజకీయ
విన్యాసాలు చేస్తున్నాయి.ఇది తప్పు అని చెప్పగలవాడు లేడు, ఎందుకంటే అందరూ
అదే తప్పు చేస్తున్నారు కనుక.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పచ్చ మీడియా పైశాచికానికి అంతేలేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఆడో బపూన్ ఈడో బపూన్ లాగ ఆయ్యిందన్నట్టు

bonagiri చెప్పారు...

ప్రజలు చూస్తూ ఎందుకు ఉరుకోవాలి? అనైతికంగా పార్టీ మారిన అభ్యర్థులని ఓడిస్తే బుద్ధి వస్తుంది.