12, సెప్టెంబర్ 2018, బుధవారం

కాపురం చేసే కళ (కధానిక) - భండారు శ్రీనివాసరావు

డాక్టర్ చెబుతున్నది వింటుంటే నాకెందుకో పాత సంగతులు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. అది చూసి ఆయన మరోలా అనుకున్నాడు.
‘చూడమ్మా! నేను చెప్పేది కాస్త సీరియస్ గా తీసుకో, చెప్పింది చెయ్యి’
నేను తలూపాను. కానీ మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలని ఆపుకోలేక పోయాను. మా వాడు కార్లో ఇంటికి తీసుకువస్తున్నప్పుడు తోవ పొడుగునా అవే.
నేను కాపురానికి వచ్చి అరవై ఏళ్ళు అయింది. అత్తారింటికి పంపించేటప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.
“చూడమ్మా చిట్టీ! నువ్వు కాలు పెడుతోంది పెద్ద కుటుంబంలోకి. అత్తా, మామా మీ ఆయనే అయితే ఇంత చెప్పాల్సిన పని లేదు. కానీ మీ మెట్టింటి నిండా బావగార్లు, మరదులు, తోటి కోడళ్ళు. వాళ్ళది చూస్తే గంపెడు సంసారం. మనది చూస్తే గుప్పెడు. మాకు లేకలేక పుట్టింది నువ్వొక్క దానివే. కొడుకువయినా, కూతురివి అయినా ఒకటే అనుకుని గారాబంగా పెంచాము. అతి ముద్దు కారణంగా నీకన్నీ మగరాయుడి వేషాలు అబ్బాయి. మీ తాత బుద్ధులు వచ్చాయి. ఆయన కూడా నట్టింట్లో మడత మంచం మీద కూర్చుని విలాసంగా కాళ్ళు ఊపుతూ కబుర్లు చెప్పేవారు. నువ్వూ అంతే. కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా కాళ్ళు ఊపడం ఆపవు. అలవాటుగా ఇలాగే మీ అత్తగారింట్లో చేస్తే బాగుండదు. పైగా నా పెంపకాన్ని ఆడిపోసుకుంటారు. కాపురం చేసే కళ కాళ్ళు చెబుతాయంటారు. మా తల్లివి కదా! ఈ అమ్మ చెప్పే ఈ ఒక్క మాట వినమ్మా. ఇలా కాళ్ళు ఊపడం మానేసెయ్యి’
అమ్మకు మాట ఇవ్వకపోయినా, అమ్మ చెప్పిన మాట నా మనసులో అలాగే ముద్ర పడిపోయింది. ఎప్పుడో ఓసారి కధాచిత్ గా కాళ్లూపే అలవాటు అప్పుడప్పుడూ తొంగిచూసినా, మొత్తం మీద అది ఎవరి కంటాపడక ముందే సర్దుకునేదానిని. పిల్లలు పుట్టి, పెద్దవాళ్ళయ్యారు. అప్పటిదాకా ఇంట్లో పెద్దవాళ్ళుగా వున్నవాళ్ళు దాటిపోయి, ఇప్పుడు నేనే ఇంటికి పెద్ద దిక్కు అయ్యాను. కానీ, కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపే అలవాటును పూర్తిగా మానుకున్నాను.
ఇదిగో మళ్ళీ ఇన్నాల్టికి ఈ డాక్టర్ సలహా వింటుంటే నవ్వు రాక ఏం చేస్తుంది.
అప్పుడు అమ్మ వద్దన్నదాన్నే డాక్టర్ గారు ఇప్పుడు చెయ్యమంటున్నాడు.


కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా కాసేపు కాళ్ళూచేతులూ ఊపమంటున్నాడు. అలా చేయడం ఇప్పుడు నా వంటికి అవసరమట.

7 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

😂😂😂😂

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

😀😀
ఆరోగ్యం కోసమేనేమో తెలంగాణా ముఖ్యమంత్రి గారు తన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు కాళ్ళూపుతుంటారు 🙂?

సూర్య చెప్పారు...

కొంతమందికి మెదడు మోకాళ్లలో ఉంటుందట. అలాంటివారికి కూర్చున్నప్పుడు కాళ్ళు వాటంతట అవే ఊగుతూ ఉంటాయిట!!

శ్యామలీయం చెప్పారు...

మిత్రులు భండారు వారూ,
కథానిక బాగుంది. ఆమాట వేరే చెప్పాల్సిన పని లేదు కాని వేరే ఒక చిన్న మాట చెప్పాలి.
మీ టపాలోనూ (లోగడ మరొక టపాలోనూ) అనేకం బ్లాంక్ లైన్లు ఉన్నాయి. అవి రాకుండా కొద్దిగా జాగ్రతవహించటం బాగుంటుందని చెప్పటానికే ఈ చిరువ్యాఖ్య.

Pavan చెప్పారు...

కథానిక బాగుంది శ్రీనివాసరావు గారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ శ్యామలీయం : మీరు చెప్పింది కరక్టే. నేనూ గమనించాను. అయితే కొంత సాంకేతిక సహకారం అవసరం. నాకు రాయడం, పోస్ట్ చెయ్యడం వరకే తెలుసు. తరుణోపాయం కూడా చెబితే సంతోషం. ముందస్తు కృతజ్ఞతలు.

నీహారిక చెప్పారు...

పోస్ట్ వ్రాసిన తరువాత పబ్లిష్ బటన్ ప్రక్కనే ప్రివ్యూ బటన్ ఉంటుంది. అది చూసి సరిచేసి పబ్లిష్ చేయండి.