20, జులై 2018, శుక్రవారం

అవిశ్వాసాలు, అంతర్నాటకాలు – భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN ANDHRAPRABHA DAILY TODAY, 20-07-18)

“ధర్మము ధర్మమటంచు వితండ వితర్కములాడదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు.....” అంటాడు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరామచంద్రుడు, తనకు ధర్మం గురించి చెప్పబోయిన ఆంజనేయుడితో. యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణకు తావుండదన్న ధర్మసూక్ష్మం ఇందులో దాగుంది.

భారత పార్లమెంటు సాక్షిగా ఈరోజు పాలక ప్రతిపక్షాల నడుమ సాగనున్న ‘నీదా నాదా పైచేయి’ క్రీడలో అడుగడుగునా ఇది ప్రతిఫలించబోతోంది.

సరే! సభలో బలాబలాలను బట్టి ఈ తీర్మానాలు ఎటుతిరిగీ నెగ్గవన్న సంగతి ముందే తెలుసు కనుక ఫలితంపై ఎవ్వరికీ ఆసక్తి లేదు, ముగింపు ముందే తెలిసిన సస్పెన్స్ సినిమా చూస్తున్న ప్రేక్షకులమాదిరిగా.

పొతే చర్చ సందర్భంగా ఉభయ పక్షాల నడుమ సాగే వాగ్యుద్ధంలో సాగే వాదోపవాదాలు సభామర్యాదలను నిలబెట్టే రీతిలో ఉంటాయాఅంటే అనుమానమే. కాకపొతే, ముందే చెప్పినట్టు, కదనరంగంలో ధర్మాధర్మాల ప్రసక్తికి తావుండదు. అక్కడ విజయమే ప్రధానం. నిజానికి అవిశ్వాస తీర్మానం విషయంలో జయాపజయాల ఊసే లేదు. ఎందుకంటే, ఇదంతా కేవలం ఎవరికివారు తమదే పైచేయి అనిపించుకోవాలనే కార్యక్రమం మాత్రమే.

చర్చ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. రావాలి కూడా. జనం కూడా అదే కోరుకుంటున్నారు. కేంద్రంలోని సర్కారు వారు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత చేశాము, అంత చేశాము’ అంటున్నారు. రాష్ట్రంలోని ఏలినవారు ‘అంతా ఉట్టిదే, కేంద్రం చేసింది ఏమీలేదు’ అని కొట్టి పారేస్తున్నారు.

నిజానికి ‘అసలు నిజం’ ఈ రెంటి నడుమా వుండి వుంటుంది. ‘రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు వర్గాలు ఆ నిజాన్ని నొక్కిపెట్టి, తమకు అనుకూలమైనదే పైకి చెబుతున్నారు’ అనే సందేహం ప్రజల్లో లేకపోలేదు. ఈ చర్చ సందర్భంగా అయినా అవేమిటో బయటకి వస్తే ప్రజలను అయోమయంలో నుంచి బయట పడేసిన పుణ్యం ఈ పార్టీలకి దక్కుతుంది. ఎందుకంటే, బయట మాదిరిగా పార్లమెంటులో అల్లాటప్పాగా ప్రకటనలు చేయడానికి వీలుండదు కదా!

కేంద్ర ప్రభుత్వం గురించి తెలుగు దేశం పార్టీ నాయకులు ఇన్నాళ్ళుగా అనేక ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. సమయం సందర్భం కూడా చూసుకోకుండా అవకాశం దొరికినప్పుడల్లా వాటిని వల్లె వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాటినన్నింటినీ సమర్ధవంతంగా సభ దృష్టికి తీసుకు రావడానికి వారికిదొక సదవకాశం. అలాగే వాటిని తిప్పికొట్టడానికీ, ఏవైనా సందేహాలు వుంటే వాటిని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పార్లమెంటును మించిన వేదిక మరోటి వుండదు. అయితే, ఇటీవలి కాలంలో సభ జరిగే తీరుతెన్నులు పరిశీలిస్తున్న వారికి ఇది జరిగే పనేనా అనిపిస్తోంది.

నిజానికి ఈ అవిశ్వాస తీర్మానాన్ని లెక్క చేయాల్సిన పరిస్తితి పాలక పక్షం బీజేపీకి లేదు. సంఖ్యాబలం పుష్కలంగా వున్నప్పుడు ఖాతరు చేయాల్సిన అవసరమూ లేదు, అగత్యమూ లేదు. అయినా ఉభయ పక్షాలకు ఎందుకింత పట్టుదల అంటే ఒకటే కారణం. ఒకసారి అవిశ్వాస తీర్మానం పెడితే మళ్ళీ ఆరు మాసాల దాకా పెట్టేందుకు వీలులేదు. అది పాలక పక్షం కోణం. అయినా సరే, రాజ్యాంగపరంగా తనకున్న ఈ వెసులుబాటును టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడే వాడేసుకుంటున్నాయి. కారణం, వాట్కి ఉన్న రాజకీయ అనివార్యత.

ప్రజలు, ప్రజాసమస్యలు అని రాజకీయులు ఊదర కొడుతుంటారు కానీ ఆ మాటల్లో వారికీ నమ్మకం లేదు, వినేవారికి అంతకంటే లేదు. ఇవెప్పుడో రాజకీయ పార్టీలకి ఊతపదాలుగా మారిపోయాయి. ఉపన్యాసాలవరకే పరిమితమైపోయాయి.

వాస్తవానికి, వారికి కానీ, వారి పార్టీలకి కానీ రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.

ఉపశృతి: ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం అంటారు. ఎందుకో ఇది వినడానికే విడ్డూరంగా వుంటుంది. ప్రతిపక్షానికి పాలకపక్షంపై అవిశ్వాసం, అపనమ్మకం వుండక ప్రేమ ఎందుకు వుంటుంది. ఈ రెండూ ఒకదానిని మరొకటి విశ్వసించవు. విశ్వాసంలోకి తీసుకోవు.

నిజానికి, ప్రభుత్వంపై, పాలకులపై విశ్వాసం వుండాల్సింది వారిని ఓటేసి అధికారం అప్పగించిన ప్రజలకు. ఆ విశ్వాసానికి తూట్లు పడకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వాధినేతల ప్రధమ కర్తవ్యమ్. ప్రతిపక్షంపై కాదు, ఈ విషయంపై పాలకులు నిరంతరం ఓ కన్నేసి ఉంచాలి.



రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

Image may contain: text

5 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఈ రోజు ప్రొద్దున్నే ఆంధ్రాకు హోదా ఇస్తే తెలంగాణాకూ ఇవ్వాల్సిందే అన్న వార్త చదివి....ఈ "వెధవ" మారడు అని నిర్ణయించేసుకున్నాను.
తెనాలి రామలింగడు చెప్పినట్లు ఇద్దరు వెధవలకీ తలకో వంద కొరడా దెబ్బలు వేస్తే గానీ బుద్ధి రాదేమో !

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అరెరె, అట్టెట్టా నీహారిక గారు? ఆంధ్రాకి ఏదిస్తే అది తెలంగాణాకి కూడా ఇవ్వాలె .. అన్న నినాదం వినలేదా? తమది వడ్డించిన విస్తరి అయినా, వెళ్ళగొట్టబడినవాడికి నిలువనీడ లేక పోయినా ... ఇంకా కూడా ... వాడికేదిస్తే అది నాక్కూడా కావాలి అనే మంకుపట్టు అన్నమాట.

Unknown చెప్పారు...

IT కారిడార్ రానందున కోస్తా కారిడార్ లో వాటా కూడా అడుగుతారు

Unknown చెప్పారు...

IT కారిడార్ రానందున కోస్తా కారిడార్ లో వాటా కూడా అడుగుతారు

సూర్య చెప్పారు...

ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం బీజేపీ కి లేదు.ఉంటే ఎప్పుడో ఇచ్చేది. ఇక టీడీపీ దీన్ని రాజకీయ ప్రయోజనాలకే వాడుకోవాలని చూసింది.మిగతా పార్టీలు ప్రేక్షక పాత్ర వహించాయి.