31, జులై 2018, మంగళవారం

ఓ పాము కధ – భండారు శ్రీనివాసరావు


“ముందు మీ గోల ఆపి నేచేప్పేది కాస్త వింటారా”
ఇన్నాళ్ళుగా కస్సూబుస్సులు లేకుండా తమ మధ్యనే ఉంటున్న ఆ నాగుపాము పడగవిప్పి, నోరు తెరిచి రెండు నాలుకలతో అలా అనగానే యావన్మందీ నిశ్చేష్టులయ్యారు.
“నేను ఇన్నాళ్ళు పుట్టల్లో, గుట్టల్లో తిరుగుతూ నోటికి అందిన పురుగూపుట్రా తింటూ హాయిగా శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ జెర్రి గొడ్డుతో వెర్రిస్నేహం చేసి, దాని మాయ మాటల్లో పడి ఇదిగో ఈ ఊరు చేరుకొని ఒక ఇంటి చూరుపై తల దాచుకున్నాను. ఆ రాత్రి వాళ్ళింట్లో పిల్లాడు పెద్దవాళ్ళు నిద్రపోయిన తరువాత లేచి ‘జంతు ప్రపంచం’ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. అందులో ఒక పాము కనిపించింది. ఎవరో ఓ తెల్ల పిల్లాడు ఆ నల్లతాచును ఎంచక్కా తన  చేతిలో పట్టుకుని ఆడిస్తున్న దృశ్యం కంట పడింది. అది చూసి  నాకూ కన్ను కుట్టింది. ఒక్క సారయినా అలా తెరపై కనిపిస్తే జన్మధన్యం అనికూడా అనిపించింది.  కొన్నాళ్ళు ‘కాటు’ వేసే బుద్ధి మానుకుంటే ఇలా ఎంచక్కా టీవీలలో చూపెడతారు అనిపించి మర్నాడు తెల్లారగానే ఈ కొత్త అవతారం ఎత్తాను. ముందు నన్ను చూసి జనం భయపడ్డా, వారిలోని భక్తిప్రపత్తులు నన్ను ఒడ్డున పడేశాయి. ప్రాణ భయం లేదని తేలిపోయింది కాబట్టి కొన్నాళ్ళు ఉపాసం వుంటే ఏం పోయిందని నేనూ ఇదే బాగుందని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టే టీవీ వాళ్ళు రంగప్రవేశం చేసారు. ఆ హాలీవుడ్ పాముకు బుల్లితెరకు ఎక్కడానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ భాగ్యం వెంటనే వెతుక్కుంటూ వచ్చింది. నాలాగే ఆ టీవీ వాళ్ళూ ఇక్కడే మకాం వేసి ఉదయం నుంచి రాత్రి దాకా అలసట లేకుండా లైవ్ టెలికాస్టులు మొదలెట్టారు. వాళ్ళు రాగానే వూళ్ళో వాళ్లకు పూనకాలు పూనాయి. ‘ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్ధరాత్రి వేళకు అందరికీ పుట్టింది’ అన్నట్టు పూనకాలు, పూజలూ పెరిగిపోయి నాకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. మధ్యలో జంతు ప్రేమికులూ, జీవ కారుణ్య సంఘాల వాళ్ళు వచ్చేసి ‘నాకేదో జరిగి పోతోంది, తమ ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నా ప్రాణాన్ని కాపాడతాం’ అంటూ వాదించడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న తమ ఊరుకు ఇంత వైభోగం తెచ్చిన ఈ పామును వూరు దాటించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ అప్పటికప్పుడు నాకు భక్తులు అయిపోయినవాళ్ళు, కొత్తగా  వచ్చిన వాళ్ళతో గిల్లీ కజ్జాకు దిగారు. పోలీసులు, అధికారులూ సరేసరి. ఈ మూడువారాల పూజలకే నాకు మతిపోతోంది. మరి తిరుపతి దేవుడు అర్ధరాత్రి దాకా ఈ తాకిడి ఎలా తట్టుకుంటున్నాడో ఏమిటో!
‘మీ అందరికీ చెప్పేది ఏమిటంటే నేను వచ్చిన పని అయిపొయింది. టీవీల్లో కనబడీ కనబడీ నాకే చిర్రెత్తుతోంది. ఈ విషయంలో ఊళ్లోవాళ్లకు  ఉన్న టీవీ కాపీనం కూడా తీరి పోయుంటుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన పూజా ఫలం ఏమో తెలియదు కానీ నాకూ కొంత మహత్తు వంట్లోకి వచ్చింది. కావున, కాబట్టి నేను ఇంతటితో ఈ కధ ముగించి అంతర్ధానం అయిపోతున్నాను. మళ్ళీ అడవిలోకి వెళ్లి దొరికిన కప్పనో, చిప్పనో  తిని కడుపు నింపుకుంటాను. మీరు కూడా మీ లగేజి సర్దుకుని ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్!’
పాము అలా చెప్పి మాయం అయిపోగానే అప్పటిదాకా  శిలలమాదిరిగా అయిపోయిన జనం మళ్ళీ తెలివిలోకి వచ్చారు.
వున్నట్టుండి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఒకడు గట్టిగా అరిచాడు.
‘ఈ పాము నోరు తెరవడంతో నా తెలివికాస్తా  తెల్లారి పోయింది. పాము మాట్లాడుతున్న షాట్ తీయడం మరచిపోయాను’
అతడు ఆ టీవీ కెమెరామన్.
ట్యాగ్ లైన్ : మూఢనమ్మకాలు విశ్వసించరాదు, ప్రచారం చేసుకోవచ్చు.       

27, జులై 2018, శుక్రవారం

Idly story - A funny story in Telugu- ఇడ్లీ కథ

25, జులై 2018, బుధవారం

దేవుడిని నమ్మేవారితో నమ్మనివారికి పేచీలు ఎందుకు? – భండారు శ్రీనివాసరావు


నిజానికి ఈ పేచీలు కొత్త విషయం ఏం కాదు, చార్వాకుడి కాలం నుంచి చూస్తున్న తతంగమే.
దేవుడ్ని నమ్మని ఈ చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత ఇలా అనేక పేర్లు వున్నాయి ఈ శాఖకు.
లోకాయతఅంటే ప్రజల తత్వశాస్త్రం అనీ, ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వ శాస్త్రాల  లాగా ఒక మూల పురుషుడు లేడు. సామాన్య ప్రజల్లో కొన్ని అనుమానాలు వుంటాయి. ఉదాహరణకు భగవంతుడికి పెట్టే ప్రసాదం ఆయన ఎప్పుడన్నా తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, ఈ లోకాయతులు ఆనాటి ఆధ్యాత్మిక వాదుల తిరస్కరణకు గురయ్యారు. నమ్మకానికీ,అపనమ్మకానికీ ఇది అనాదిగా జరుగుతున్న సంఘర్షణే ఇది. ఈ లోకాయతులు దేవుడ్ని నమ్మరు. ఆత్మను, పునర్జన్మలను విశ్వసించరు. ఒక రకంగా అది వారి నమ్మకం. 
ఈనాటి చర్చల్లో ఒక కులానికి సంబంధించిన అనవసర ప్రస్తావనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తోంది. లోకాయత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన చార్వాకుడు ఒక బ్రాహ్మణుడు. మరో చిత్రం ఏమిటంటే చార్వాక వధకు పూనుకున్నవారు కూడా బ్రాహ్మణులే.
మహాభారతంలోని శాంతిపర్వంలో ఈ చార్వాక వధ గురించిన ప్రస్తావన వుంది.
కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలాదిమంది బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి జమవుతారు. వారితో కలిసివచ్చిన చార్వాకుడు ధర్మజుడితో వాగ్వాదానికి దిగుతాడు. యుద్హంలో అనేకమంది బంధు మిత్రుల మరణానికి నువ్వే కారకుడివి. ఇంత చేసి నీవు సాధించింది ఏమిటి? నువ్వు బతికి ఉండడానికి వీల్లేదుఅంటూ గద్దిస్తున్న చార్వాకుడిని చూసి ధర్మరాజు ఖిన్నుడై బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరుణంలో తెప్పరిల్లిన మిగిలిన బ్రాహ్మణులు, చార్వాకుడు తమ ప్రతినిధి కాదని ధర్మరాజుకు నచ్చచెప్పి, ఆ కోపంలో చార్వాకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి అతడిని వధిస్తారు. చార్వాకుడు యుధిష్ఠిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
అలా చార్వాకుడి నుంచి ఈ నాటి దాకా పురాణాలను అధిక్షేపించిన అనేకమంది మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. అయినా వాటిపట్ల ప్రజల మనస్సుల్లో ఉన్న భక్తి శ్రద్ధలు ఏమీ చెరిగిపోలేదు. 
ఒక్క మనదేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఇలా దేవుడ్ని నమ్మిన వారికీ, నమ్మని వారికీ ఇలాటి సంఘర్షణలు జరుగుతూ వస్తూనే వున్నాయి. దేవుడనేది ఒక నమ్మకం. అలా నమ్మేవారి నమ్మకాన్ని శంకించాల్సిన పనిలేదు. దేవుడ్ని నమ్మకపోవడం కూడా ఒక నమ్మకమే. ఎవరి నమ్మకం వారిది. నమ్మకం మూఢనమ్మకంగా మారనంతవరకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
ఒక సినిమా నటుడ్ని గురించి ఒకింత నిరసనగా మాట్లాడితేనే తట్టుకోలేని అభిమానుల నడుమ జీవిస్తున్నాం. మరి కోట్లాదిమంది అనునిత్యం దేవుడిగా పూజించే పురాణ పురుషులను గురించి ఎగతాళిగా మాట్లాడితే ......
రాముడు దేవుడు కాదని మీ నమ్మకమైతే దాన్ని నమ్మేవారితో పంచుకోండి. దేవుడిని నమ్మేవారితో మీకు పేచీలు ఎందుకు
(ఇటీవల  హెచ్ ఎం టీవీ ఈ అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో నాకు సమయం లభించినప్పుడు చెప్పిన కొన్ని విషయాలు)

24, జులై 2018, మంగళవారం

గుర్రం ఎగరావచ్చు.... భండారు శ్రీనివాసరావు


కొన్నేళ్ళ క్రితం ఒక వారపత్రిక వాళ్ళు నేను రాసిన మాస్కో అనుభవాల కూర్పు,  ‘మార్పు చూసిన కళ్ళు’ రచనని సీరియల్ గా వేస్తామని చెప్పి, ప్రచురణ మొదలయ్యే తేదీని కూడా నిర్ణయించి సరిగ్గా ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారు.  వాళ్ళు నాకు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, ఈ రచన ఇంతకుముందే నా బ్లాగులో వచ్చినందువల్ల, తమ పత్రిక నియమనిబంధనల ప్రకారం ప్రచురించ లేకపోతున్నామని. నేనూ ఒకప్పుడు పత్రికల్లో పనిచేసిన వాడినే కనుక, నియమాలకు కట్టుబడి మాట్లాడకుండా లేచి వచ్చేశాను.
ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు సాంఘిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని ‘ఎత్తిపోసి’ మరీ ప్రచురిస్తున్నారు. ట్వీట్ల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా అవి పతాక శీర్షికలలో దర్శనమిస్తున్నాయి.
కాలం తెచ్చే మార్పులముందు ఏ నియమాలూ, నిబంధనలూ నిలబడలేవేమో!   

20, జులై 2018, శుక్రవారం

అవిశ్వాసాలు, అంతర్నాటకాలు – భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN ANDHRAPRABHA DAILY TODAY, 20-07-18)

“ధర్మము ధర్మమటంచు వితండ వితర్కములాడదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు.....” అంటాడు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరామచంద్రుడు, తనకు ధర్మం గురించి చెప్పబోయిన ఆంజనేయుడితో. యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణకు తావుండదన్న ధర్మసూక్ష్మం ఇందులో దాగుంది.

భారత పార్లమెంటు సాక్షిగా ఈరోజు పాలక ప్రతిపక్షాల నడుమ సాగనున్న ‘నీదా నాదా పైచేయి’ క్రీడలో అడుగడుగునా ఇది ప్రతిఫలించబోతోంది.

సరే! సభలో బలాబలాలను బట్టి ఈ తీర్మానాలు ఎటుతిరిగీ నెగ్గవన్న సంగతి ముందే తెలుసు కనుక ఫలితంపై ఎవ్వరికీ ఆసక్తి లేదు, ముగింపు ముందే తెలిసిన సస్పెన్స్ సినిమా చూస్తున్న ప్రేక్షకులమాదిరిగా.

పొతే చర్చ సందర్భంగా ఉభయ పక్షాల నడుమ సాగే వాగ్యుద్ధంలో సాగే వాదోపవాదాలు సభామర్యాదలను నిలబెట్టే రీతిలో ఉంటాయాఅంటే అనుమానమే. కాకపొతే, ముందే చెప్పినట్టు, కదనరంగంలో ధర్మాధర్మాల ప్రసక్తికి తావుండదు. అక్కడ విజయమే ప్రధానం. నిజానికి అవిశ్వాస తీర్మానం విషయంలో జయాపజయాల ఊసే లేదు. ఎందుకంటే, ఇదంతా కేవలం ఎవరికివారు తమదే పైచేయి అనిపించుకోవాలనే కార్యక్రమం మాత్రమే.

చర్చ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. రావాలి కూడా. జనం కూడా అదే కోరుకుంటున్నారు. కేంద్రంలోని సర్కారు వారు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత చేశాము, అంత చేశాము’ అంటున్నారు. రాష్ట్రంలోని ఏలినవారు ‘అంతా ఉట్టిదే, కేంద్రం చేసింది ఏమీలేదు’ అని కొట్టి పారేస్తున్నారు.

నిజానికి ‘అసలు నిజం’ ఈ రెంటి నడుమా వుండి వుంటుంది. ‘రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు వర్గాలు ఆ నిజాన్ని నొక్కిపెట్టి, తమకు అనుకూలమైనదే పైకి చెబుతున్నారు’ అనే సందేహం ప్రజల్లో లేకపోలేదు. ఈ చర్చ సందర్భంగా అయినా అవేమిటో బయటకి వస్తే ప్రజలను అయోమయంలో నుంచి బయట పడేసిన పుణ్యం ఈ పార్టీలకి దక్కుతుంది. ఎందుకంటే, బయట మాదిరిగా పార్లమెంటులో అల్లాటప్పాగా ప్రకటనలు చేయడానికి వీలుండదు కదా!

కేంద్ర ప్రభుత్వం గురించి తెలుగు దేశం పార్టీ నాయకులు ఇన్నాళ్ళుగా అనేక ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. సమయం సందర్భం కూడా చూసుకోకుండా అవకాశం దొరికినప్పుడల్లా వాటిని వల్లె వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాటినన్నింటినీ సమర్ధవంతంగా సభ దృష్టికి తీసుకు రావడానికి వారికిదొక సదవకాశం. అలాగే వాటిని తిప్పికొట్టడానికీ, ఏవైనా సందేహాలు వుంటే వాటిని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పార్లమెంటును మించిన వేదిక మరోటి వుండదు. అయితే, ఇటీవలి కాలంలో సభ జరిగే తీరుతెన్నులు పరిశీలిస్తున్న వారికి ఇది జరిగే పనేనా అనిపిస్తోంది.

నిజానికి ఈ అవిశ్వాస తీర్మానాన్ని లెక్క చేయాల్సిన పరిస్తితి పాలక పక్షం బీజేపీకి లేదు. సంఖ్యాబలం పుష్కలంగా వున్నప్పుడు ఖాతరు చేయాల్సిన అవసరమూ లేదు, అగత్యమూ లేదు. అయినా ఉభయ పక్షాలకు ఎందుకింత పట్టుదల అంటే ఒకటే కారణం. ఒకసారి అవిశ్వాస తీర్మానం పెడితే మళ్ళీ ఆరు మాసాల దాకా పెట్టేందుకు వీలులేదు. అది పాలక పక్షం కోణం. అయినా సరే, రాజ్యాంగపరంగా తనకున్న ఈ వెసులుబాటును టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడే వాడేసుకుంటున్నాయి. కారణం, వాట్కి ఉన్న రాజకీయ అనివార్యత.

ప్రజలు, ప్రజాసమస్యలు అని రాజకీయులు ఊదర కొడుతుంటారు కానీ ఆ మాటల్లో వారికీ నమ్మకం లేదు, వినేవారికి అంతకంటే లేదు. ఇవెప్పుడో రాజకీయ పార్టీలకి ఊతపదాలుగా మారిపోయాయి. ఉపన్యాసాలవరకే పరిమితమైపోయాయి.

వాస్తవానికి, వారికి కానీ, వారి పార్టీలకి కానీ రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.

ఉపశృతి: ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం అంటారు. ఎందుకో ఇది వినడానికే విడ్డూరంగా వుంటుంది. ప్రతిపక్షానికి పాలకపక్షంపై అవిశ్వాసం, అపనమ్మకం వుండక ప్రేమ ఎందుకు వుంటుంది. ఈ రెండూ ఒకదానిని మరొకటి విశ్వసించవు. విశ్వాసంలోకి తీసుకోవు.

నిజానికి, ప్రభుత్వంపై, పాలకులపై విశ్వాసం వుండాల్సింది వారిని ఓటేసి అధికారం అప్పగించిన ప్రజలకు. ఆ విశ్వాసానికి తూట్లు పడకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వాధినేతల ప్రధమ కర్తవ్యమ్. ప్రతిపక్షంపై కాదు, ఈ విషయంపై పాలకులు నిరంతరం ఓ కన్నేసి ఉంచాలి.



రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

Image may contain: text

17, జులై 2018, మంగళవారం

మహా సంప్రోక్షణ


దేవాలయాల్లో సంప్రోక్షణ జరపడం అనేది సాంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే. నిజానికి గుళ్ళల్లో ఈ కార్యక్రమం ప్రతి రోజూ జరుగుతుంది. ఏడాదికోసారి చేసే సంప్రోక్షణలలో మొత్తం గుడిని శుభ్రం చేస్తారు. ఇక మహా సంప్రోక్షణ అంటే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ సమయంలో మూల విరాట్టును ఆవాహన చేసి ఆ మూల మూర్తిలోని లోని దైవిక మహత్తును, దైవ శక్తిని గర్భగుడికి ఆవలగా  ఏర్పాటు చేసిన మరో మూర్తిలోకి ప్రవేశపెడతారు. సంప్రోక్షణ కార్యక్రమం యావత్తు పూర్తయిన తరువాత మళ్ళీ మూల విరాట్టులోకి ఆవాహన చేస్తారు.
నాకు ఈ విషయాలు చెప్పిన ఒక పూజారి గారికి వైఖానస సాంప్రదాయాల పట్ల అవగాహన వుందో లేదో తెలియదు. మామూలుగా అనుమాన నివృత్తి కోసం అడిగినప్పుడు ఆ పండితుడు చెప్పిన వివరాలు ఇవి.
దీనికీ ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న వివాదానికీ సంబంధం లేదు.

12, జులై 2018, గురువారం

పేరు కోసం – భండారు శ్రీనివాసరావు


ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.
కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో  గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆరోజు మావాడి నుంచి నేర్చుకున్నాను.
ఆరోజు గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసివున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే  నాకు వాటిలో కనిపించింది.
టీవీలో సినిమా వస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’ బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను  భద్రాద్రి రాముడికి చేయించిన నగలు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.  
ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ.
పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ తమకు దక్కాలంటే తమకు దక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడుతున్న తాపత్రయం నేపధ్యంలో చూస్తే వీటికి ఉన్న సంబంధం బోధపడుతుంది.
ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు నిజానికి ఆయా పాలక పార్టీలది కాదు, పన్నులు కడుతున్న ప్రజలది.
ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని  నిలదీయకుండా  జాగ్రత్త పడడం మంచిదేమో!   

11, జులై 2018, బుధవారం

పత్రికల్లో పేరు చూసుకోవాలనే దశ దాటి పోయాను - భండారు శ్రీనివాసరావు


చాలా కాలం క్రితం నేను రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ (నా మాస్కో అనుభవాలపై పుస్తకం) ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరిగింది. అప్పటి తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు ఆవిష్కరించారు. పత్రికా సంపాదకులు కూడా కొందరు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒకతను వచ్చి పలానా పత్రిక విలేకరిని అని పరిచయం చేసుకున్నాడు. రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను కవర్ చేయడానికి విలేకరుల బృందం తరపున వచ్చాననీ, ఫొటోకు అయితే ఇంత, వార్తకు అయితే ఇంత అని ఏదో చెప్పబోయాడు. నేను మిమ్మల్ని రమ్మని పిలిచానా అని అడిగాను. ‘లేదు, ‘మేమే నగరంలో నేడు’ అని పత్రికల్లో వచ్చే సమాచారం తెలుసుకుని వస్తాము’ అన్నాడు. అప్పుడతనితో చెప్పాను.
‘చూడు బాబూ, నేనూ ఇదే వృత్తిలో నాలుగు దశాబ్దాలు పనిచేసాను. నా పేరు పత్రికలో చూసుకోవాలనే దశ దాటిపోయాను. ఇక నీ ఇష్టం’ అని వచ్చేశాను.


మర్నాడు ‘తల్లి’ పత్రికలు చదివాను కానీ ‘పిల్ల’ పత్రికల వైపే చూడలేదు.

ఎంతమంది చదువుతారు? – భండారు శ్రీనివాసరావు


లక్ష సర్క్యులేషన్ వున్న పత్రికలో మన వ్యాసం అచ్చవుతే ఆ లక్షమందీ దాన్ని చదువుతారు అనుకోవడం ఓ భ్రమ. కాకపొతే ఎక్కువమంది  కళ్ళల్లో పడే అవకాశం ఎక్కువ. కాదనను.
ప్రేమలేఖను ఎంతమంది చదువుతారు చెప్పండి. ప్రేయసి ఒక్కరు చదివితే చాలని మురిసిపోతాడు ప్రియుడు.
నలుగురూ చదవాలనే ఏ రచయిత అయినా కోరుకుంటాడు. అయితే ఆ ‘నలుగురు’ లక్షమంది కావచ్చు, ‘నలుగురే’ కావచ్చు.
అందుకే నేను రాసేది ప్రతిదీ ఇటువంటి సాంఘిక మాధ్యమాలలోనే పోస్ట్ చేస్తాను.
నాకిదో ‘తుత్తి’

7, జులై 2018, శనివారం

అధికారం నోరు మూయిస్తుంది


సోవియట్ యూనియన్ లో స్టాలిన్  అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు చిక్కినప్పుడల్లా స్టాలిన్ విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. స్టాలిన్  ఏం చెప్పినా  పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.
స్టాలిన్ తదనంతరం కృశ్చెవ్ సోవియట్ కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన  తర్వాత ఆయన స్టాలిన్ ను పదేపదే  విమర్శించే తీరు కృశ్చెవ్ అనుయాయులకు విచిత్రంగా తోచేది. స్టాలిన్ జీవించి వున్న కాలంలో ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ, ఆయన  ఏమి చెప్పినా గొర్రెలా  తల ఊపే కృశ్చెవ్ ఇతడేనా అనే అనుమానం వారిని తొలుస్తుండేది. ‘ఆ రోజునే ఇలా ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇప్పుడెందుకు ఇలా దుయ్యబడుతున్నారు’ అని అడగాలని వారికి  వున్నా పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు. ఒకరోజు  కృశ్చెవ్ ని ఒక యువ నాయకుడు ధైర్యం చేసి మనసులో మాట అడిగేశాడు. కృశ్చెవ్ నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు ఈరోజు నా ముందు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా! ప్రతిదానికి తందానా అంటున్నారా లేదా! ఆరోజుల్లో నేనూ అదేపని  చేశాను’
ఇది ఒక జోక్ కావచ్చు. కేంద్రీకృత అధికార రాజకీయాలకు అద్దం పడుతుంది.
రోజూ టీవీ చర్చల్లో “మీరు ఆరోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు నిలదీస్తున్నారు” అని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటూ వుంటే ఎందుకో ఏమో  ఈ జోకు జ్ఞాపకం వస్తుంటుంది.