ఆంధ్రప్రదేశ్
కు ప్రత్యేక హోదా విషయంలో టీవీల్లో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు మునిమాపు వేళల్లో చిన్నపిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'ఊ' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'ఊ' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'ఊ' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'ఆ' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'ఆ' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని, ఆ కధ మాత్రం అలా అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'వై ఎస్ ఆర్ సీపీ వాళ్ళు
బందులు చేస్తే వస్తుందా?
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా? అమరావతిలో కూర్చుని ప్రెస్ వాళ్ళతో ఆగ్రహాలు, నిరసనలు వ్యక్తం చేస్తే వస్తుందా?‘కేంద్ర ప్రభుత్వానికి రాం రాం చెబితే వస్తుందా’
'రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తే వస్తుందా’
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో పడ్డ సూది ముసలమ్మ చేతికి
దొరికినప్పుడు'
ఉపశృతి
“ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
“భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళు ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముంది, ఈరోజు కడతావు, కలరు మాసిపొతే రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా
వుంటుంది. ఏమంటావ్!”