26, డిసెంబర్ 2015, శనివారం

విమానాన్ని దారి మళ్లించిన ప్రధాని మోడీ

(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-12-2015, SUNDAY)

సూటిగా....సుతిమెత్తగా....  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆ స్థాయిలో, ఆ హోదాలో  వున్న   వ్యక్తి ఏం చేసినా, ఏం మాట్లాడినా మీడియాకు అది ప్రధాన వార్తే అవుతుంది. ఆ వార్తను మరింత సంచలనాత్మకం చేసి దానికి అదనపు ఆకర్షణ కలగచేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు.
మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత అనేక విదేశీ యాత్రలు చేసారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సయితం అంత విస్తృతంగా విదేశాల్లో పర్యటించిన దాఖలా లేదు. మోడీ విదేశీ యాత్రలు గురించి సాంఘిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలు, వస్తున్న వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి.
‘స్వల్పకాలిక పర్యటనపై ప్రధాని  మోడీ భారత దేశానికి వస్తున్నారు’ వంటి అవహేళనలతో కూడిన వ్యాఖ్యలు సైతం  వినబడుతున్నాయి. ‘ అదేపనిగా విమానాల్లో విదేశీ ప్రయాణాలు చేస్తున్న ప్రధాని మోడీ, పార్లమెంటుకు వచ్చినప్పుడు కూడా సీటు బెల్టు కోసం వెతుక్కుంటున్నార’నే వరకు ఈ వ్యాఖ్యలు శృతిమించుతున్న మాట కూడా నిజం.
నిజానికి మోడీ విదేశీ పర్యటనలను గురించి ఇంత అతిశయోక్తిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పూర్వకాలం మాదిరిగా అంటీ ముట్టనట్టు, ‘నా కోడీ, నా కుంపటి వుంటే చాలు, ఎవరెటుపోయినా పరవాలేదను’కుంటూ  వ్యవహరించగల కాలం కాదిది. ప్రపంచీకరణ ప్రభావం విస్తృతంగా విశ్వ వ్యాప్తంగా  పరివ్యాప్తి చెందుతున్నప్పుడు ‘ఉలిపికట్టె’ చందంగా ఒంటరిగా గిరిగీసుకుని కూర్చోవడం కూడా కుదరని పని. నలుగురితో సత్సంబంధాలు పెంచుకోవడం అభివృద్ధికి దోహదం చేస్తుంది. వర్ధమాన దేశం అయిన మన దేశానికి ప్రత్యేకించి ఇది తప్పనిసరి. మరీ ముఖ్యంగా  ఇరుగుపొరుగు దేశాలతో  సత్సంబంధాలు పెంచుకోవడం అనేది మన అవసరం.
మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన రోజే ఈ దిశగా మొదటి అడుగు వేసిన సంగతి మరచిపోకూడదు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తో సహా ఇరుగుపొరుగు దేశాల అధినేతలు మోడీ ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
నిరుడు మే   26 వ తేదీన జరిగిన మోడీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలందరూ రావడం ఒక విశేషం. పాకీస్తాన్ ప్రధాన మంత్రితో  పాటు, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరీన్ ష్రామీన్, భూటాన్ ప్రధాని  షెరింగ్ తోల్గే, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్, మారిషస్ ప్రధాని నవీన్ రాం గులాం, నేపాల్ ప్రధాని సుషీల్ కోయిరాలా, శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే, టిబెట్ ప్రవాస ప్రభుత్వ  ప్రధాని తోబ్ సాగ్ సంగే వంటి ప్రముఖులు హాజరు కావడం చూసిన వారికి అద్యతన భావిలో భారతదేశంతో ఆయాదేశాల సంబంధాలు మరింత మెరుగుపడతాయని అనిపించింది.
అయితే గత ఇరవై మాసాల మోడీ పాలనలో ఈ రకమైన సుహృద్భావ సంకేతాలు ఆయా  దేశాల నుంచి వెలువడిన దాఖలా లేదు. మన దేశంతో వాటి సంబంధాలు ‘ఒక్క రోజు’ ముచ్చటే అనే విమర్శలు వెల్లువెత్తడానికి మాత్రమే పనికివచ్చాయి. ముఖ్యంగా మనకు కంటిలో నలుసుగా వుంటున్న పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగు పడకపోగా ఇటీవలి కాలంలో మరింత క్షీణిస్తూ వచ్చాయి. కయ్యానికి కాలు దువ్వే పాక్ ప్రవర్తనలో పెద్ద మార్పు ఏమీ చోటు చేసుకోలేదనే చెప్పాలి.


ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి మోడీ ఒక వింత ప్రయోగం చేసి చూపించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసారు. రష్యా పర్యటనకు వెళ్లి, ఆఫ్ఘనిస్థాన్లో అధికార పర్యటన పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి రావాల్సివున్న మోడీ, కాబూలు నుంచి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి ఫోను చేసారు. ఆ సమయంలోనే పాకీస్తాన్ వెళ్ళాలనే ఆలోచన మోడీ మదిలో మెదిలిందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  హఠాత్తుగా ఆయన ఆ  నిర్ణయం తీసుకోవడం, దాన్ని వెంటనే అమలుచేయడం చకచకా జరిగిపోయింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూలు నుంచి ఢిల్లీ బయలుదేరిన  ప్రధాని మోడీ ప్రత్యేక విమానం దిశ మార్చుకుని  పాకీస్తాన్ వైపు బయలుదేరింది. బహుశా ఆ విమానంలో వున్న అనేకమందికి ఈ విషయం తెలియకపోవచ్చు కూడా.  భారతీయ వాయుసేనకు చెందిన ఆ విమానం పాకిస్తాన్ లోని లాహోరు చేరుకునే సరికే ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధానికి స్వయంగా స్వా గతం చెప్పడానికి అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. మోడీ  బృందంలోని కొంతమందికి అక్కడికక్కడే  తాత్కాలిక వీసాలు మంజూరు చేసారు. మిగిలిన వారికి విమానాశ్రయంలోనే తగు వసతులు కల్పించి అక్కడే వుంచేసారు.
మోడీని వెంటబెట్టుకుని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్నతన నివాసానికి తీసుకువెళ్ళారు. ఇద్దరు దేశాధినేతలు ఈ విధంగా ఒకే హెలికాప్టర్ లో ప్రయాణించడం ఇదే తొలిసారి. షరీఫ్ నివాసంలో తన తల్లిని మోడీకి పరిచయం చేసారు. మోడీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు పాదాభివందనం చేసారు. అదే రోజు అక్కడ జరుగుతున్న  షరీఫ్ మనుమరాలి వివాహ వేడుకలకు కూడా మోడీ  హాజరయ్యారు. తేనీటి విందులో పాల్గొని, పాక్ ప్రధాని షరీఫ్ కు స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి నరేంద్ర మోడీ  ఢిల్లీ  తిరుగుప్రయాణమయ్యారు.
ముందస్తు సమాచారం లేకుండా పాకీస్తాన్ గడ్డపై మోడీ జరిపిన ఈ రెండున్నర గంటల పర్యటన  ఇరుదేశాల్లోని రాజకీయ  నాయకులను, ప్రత్యేకించి మీడియాను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఈ ఆకస్మిక పాక్ యాత్ర గురించి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరికీ తెలియదు.
‘నవాజ్ షరీఫ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయడానికి ఈరోజు ఆయన్ని లాహోరులో కలుసుకోబోతున్నాను’ అని మోడీ  ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ తరువాతనే  ఈ  పర్యటన   గురించి ప్రపంచానికి తెలిసింది.  
మోడీ ఆకస్మిక పర్యటన ఫై సహజంగానే సానుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. మోడీ పాక్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, మోడీది ఆకస్మిక పర్యటన కాదనీ, ముందుగానే ఏర్పాటు చేసుకున్నదే అని ఆరోపిస్తూ, అసలీ పర్యటన వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే కాని, దేశ ప్రయోజనాలకోసం కాదని విమర్శించింది. ఈ ఆరోపణలకు తగ్గట్టే, మోడీ పాకీస్తాన్ ప్రధాని నివాసానికి వెళ్ళినప్పుడు, జిందాల్ గ్రూపుకు చెందిన సజ్జన్ జిందాల్ అక్కడే వుండడం గమనార్హం. ముందుగా అనుకున్న పర్యటన కాని పక్షంలో షరీఫ్ మనుమరాలి వివాహ కానుకగా ఆమెకు సరిపోయే దుస్తులను  మోడీ ఎలా తీసుకువెళ్లగలుగుతారని కాంగ్రెస్ సందేహాత్మకుల డౌటేహం.
మోడీకి ముందు పదేళ్ళ పాటు దేశాన్ని పాలించిన  మన్ మోహన్ సింగ్  కు ఒక కోరిక వుండేది.
‘అమృత సర్ లో బ్రేక్ ఫాస్ట్, లాహోరులో మధ్యాన్న భోజనం, రాత్రి భోజనం కాబూల్ లో....ఇది నా స్వప్నం. మా పూర్వీకులు అలా జీవించారు, నా మనుమళ్ళూ అలా చేయాలన్నది నా కోరిక’ అని మన్ మోహన్ తరచూ  చెబుతుండేవారు. మోడీ ఆయన కలను సాకారం చేసి చూపించారు.

మోడీకి ముందు ముగ్గురు భారత ప్రధానులు, జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్ పాయ్   పాకీస్తాన్ లో అధికార పర్యటన జరిపారు. వాజ్ పాయ్ ఏకంగా ఢిల్లీ నుంచి లాహోరు వరకు బస్సులో ప్రయాణించారు.
        
సొంత విమానాన్ని మోడీ మాదిరిగా ఇలా దారిమల్లించిన ఘనత మరో భారత ప్రధాన మంత్రికి కూడా వుంది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్న  రోజుల్లో, విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తూ విమానాన్ని మాస్కో వైపు మళ్ళించారు. 
భారత, పాకీస్తాన్ ల నడుమ ఘర్షణాత్మక వాతావరణం ఉందన్నది రహస్యమేమీ కాదు. పారిస్ లో భూగోళ వాతావరణంపై ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ రెండు దేశాల ప్రధానమంత్రులు కలుసుకున్నారు.  మోడీ పర్యటన రెండు దేశాల నడుమ అలముకున్న అవాంఛిత వాతావరణాన్ని ఏమైనా మారుస్తుందేమో చూడాలి.
ఉపశృతి: సాంఘిక మాధ్యమాల్లో ఆయా సంఘటనలపై అప్పటికప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెలువడుతుంటాయి. కొంత అతిశయోక్తి అనిపించినా కొన్ని అతికినట్టు సరిపోతాయి. అలాంటిదే ఇది:
“విశ్వశాంతి కోసం కేసీఆర్ చేస్తున్న చండీయాగం సత్ఫలితాలను ఇవ్వడం మొదలయిందన్నమాట” 
(26-12-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com   మొబైల్: 98491 30595                         

      

6 కామెంట్‌లు:

Pavan చెప్పారు...

Last punch superu

N.V. SIVA RAMA KRISHNA చెప్పారు...

మోదికి పాలనా థ్యాస కంటే పాకులాట ప్రాపకం మీద మక్కువెక్కువ. ప్రపంచాన్ని చుట్టిన వీరుడుగా రాజకీయ చరిత్రలో పుటగా మిగిలిపోతాడు. మరి ఇంత వసుధైక కుటుంబం కోసం పాకులాడే మనిషికి సంసార మకుటంగా భావించే భార్య మీద భావుకత లోపం వెనుక శాపమేమిటో? ఆ ట్విట్టర్ కే తెలియాలి.

అజ్ఞాత చెప్పారు...

మోడీ అక్కడికి భారత్- పాకిస్తాన్ సమస్యలను చర్చించడానికి వెళ్ళినట్లులేదు. చర్చల పేరుతో షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన గారి మనవరాలి పెళ్ళి భోజనం తినడానికి వెళ్ళినట్టుంది.

నీహారిక చెప్పారు...

“విశ్వశాంతి కోసం కేసీఆర్ చేస్తున్న చండీయాగం సత్ఫలితాలను ఇవ్వడం మొదలయిందన్నమాట” !

శ్యామలీయం చెప్పారు...

భండారు వారూ.
(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-12-2015, SUNDAY) అని మీరు శీర్షీక క్రింద చెప్పారు కాబట్టి ఈ‌ సూచన చేస్తున్నాను. ఇలా చేస్తున్నందుకు దయచేసి అన్యధా భావించవద్దని విన్నపం.

మనం ఏదైనా ఒక సంస్థకు ప్రచురణకు పంపిన రచనను విడిగా బ్లాగుల్లో కాని ఇతరత్రా కాని ప్రచురించంలో తొందరపడ కూడదు. ఒక వేళ సదరు సంస్థవారు తిరస్కరిస్తే ఆ విషయం‌ స్పష్టం అయ్యాక మన యిష్టం. ఆ సంస్థవారు ప్రచురణ చేస్తున్న పక్షంలో వారు ప్రచురించే దాకా మనం ప్రచురించటం ఉచితం‌ కాదు. వారు ప్రచురించిన పిమ్మట, వారి అనుమతితో మనం విడిగా ప్రచురించుకొన వచ్చును. అలా కాని పక్షంలో ప్రచురణకు పరిశీలిస్తున్నా లేదా ప్రచురణకోసం వారు అచ్చుకు ఇచ్చినా మనం విడిగా ప్రచురించుకొనటం వలన ఇబ్బంది కలిగినట్లుగా వారు భావించే పరిస్థితి తప్పక ఉంటుంది. ముందుగా మనం‌ విడిగా ప్రచురించుకోవటం ఆ సంస్థ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండకపోవచ్చును కదా. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేనేమీ పత్రికారంగానికి చెందిన వ్యక్తిని కాను. అలాగే ఇతరత్రా ప్రచురణలకు సంబంధించిన విషయాలను తెలుసిన వ్యక్తిని కూడా కాను. నాకు తోచిన అభిప్రాయం మనవి చేసానంతే. మీకు ఈ‌ అభిప్రాయం నచ్చకపోతే‌ మన్నించండి.

అజ్ఞాత చెప్పారు...

అబ్బబ్బా ,

ఏదో నాలుగు క్లిప్పింగులు క్రిస్సుమస్సు నాడు వేసేసి తీరిగ్గా నిదుర పోదామనుకున్న మా మీ మీడియా వాళ్లకి తన విమానాన్ని తానే హైజాక్ చేసేసుకుని పాక్ వెళ్ళి మీడియా కి మోడీ ఇంత మసాలా కల్పించడం సుతరామూ బావోలేదండీ :)

జేకే

జిలేబి