సూటిగా ..........సుతిమెత్తగా .......
(హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలలో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్)
గవర్నర్ నరసింహన్ గారికి కోపం వచ్చింది
అనుకున్నారు ఆ సాయంత్రం ఆయన సభకు వచ్చిన
సభికుల్లో చాలామంది. కానీ ఆయనకు వచ్చింది ‘ధర్మాగ్రహం’ అనడమే సబబుగా వుంటుంది.
గతవారం హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు
రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ ఆనాటి ముఖ్య అతిధి. సాధారణంగా
ఇటువంటి కార్యక్రమాల్లో గవర్నర్ ప్రసంగం సాంప్రదాయబద్ధంగా సాగడం రివాజు. ముందుగా
సిద్ధం చేసుకున్న ప్రసంగపాఠాన్ని చదవడం ఆనవాయితీ. ఎందుకో ఏమో కానీ నరసింహన్ గారు ఆ
రోజు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి తటాలున అప్పటికప్పుడు ఆశువుగా
చేసిన ఉపన్యాసంలో, ఆయన మనసులోని మాటలు బయటకు వచ్చాయి. తన సహజ సిద్ధ
మైన మృదు భాషణతోనే ఆయన ఉపన్యాసం ప్రారంభించి చెప్పాలనుకున్న లేదా చెప్పాల్సిన నాలుగు విషయాలు చల్లగా చెప్పేశారు.
ధాటీగా సాగిన గవర్నర్ ప్రసంగం నుంచి ఈనాటి మీడియా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో
వున్నాయి. నిజానికి ఈనాడు చాలామంది సాధారణ టీవీ వీక్షకుల్లో వున్న భావాలే అనర్ఘలంగా
సాగిన గవర్నర్ ప్రసంగంలో చోటుచేసుకున్నాయి.
మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తోంది అన్న సాకుతో
నియంత్రణకు పూనుకోవడం హేతుబద్ధం కాదు.
అలాగని స్వేచ్చకు సొంత భాష్యాలు చెప్పుకుంటూ ప్రతి అంశాన్ని సమర్ధించుకుంటూ పోవడం
కూడా సమంజసం కాదు. ఈ రెంటికీ నడుమ కనీ కనబడకుండా వున్న సన్నటి విభజన రేఖను గమనించి
నడుచుకుంటే మీడియా పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడేది కాదేమో!
నరసింహన్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి
అయిదేళ్ళు దాటిపోయింది. మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా
వచ్చిన నరసింహన్, దరిమిలా రాష్ట్ర విభజన అనంతరం పురుడు పోసుకున్న రెండు నవజాత
రాష్ట్రాలయిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లు రెంటికీ కూడా ఉమ్మడి గవర్నర్ గా పనిచేసే
అవకాశం రావడం ఆయన దక్షతకు అద్దం పడుతుంది. రాష్ట్ర విభజనకు ముందూ, ఆ తరువాతా కూడా
గవర్నర్ పాత్ర పోషించడంలో పలుమార్లు అనేక విమర్సలకు గురయ్యారు. విభజనకు పూర్వం
కొన్ని రాజకీయ పార్టీలు ఆయన వ్యవహార శైలిని అపార్ధం చేసుకుంటే, వేర్పాటు తరువాత
మరికొన్ని పార్టీలకు ఆయన పోకడలతో పొసక్కపోవడం అన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలో
అనేక సందర్భాలలో గవర్నర్ పాత్ర గురించీ, ఆయన వ్యక్తిగత నమ్మకాలు గురించీ అనేక
కధనాలు మీడియాలో వచ్చాయి. ప్రెస్ క్లబ్
కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం గమనించిన వారిని, ఇన్నేళ్ళుగా నరసింహన్ తనను మానసికంగా బాధపెట్టిన
అటువంటి అనేక అంశాలను మనసుకు పట్టించుకోవడమే కాకుండా గుర్తు పెట్టుకుని
వాటినన్నింటినీ సోదాహరణంగా ప్రస్తావించిన తీరు మరింత అబ్బురపరచింది. తన మనస్సులో
ఇంతకాలంగా సుళ్ళు తిరుగుతున్న భావోద్రేకాలను వెలువరించి, తన మనస్సును చల్లబరచుకునే
ఉద్దేశ్యంతో నాటి వేదికను ఆయన అనువుగా ఎంచుకున్నారేమో అని కూడా అనిపించింది.
పత్రికా స్వేచ్చను గురించి చర్చించడం వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. గవర్నర్ తన
ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఆత్మశోధనకు ఉపకరించేలా వున్నాయన్న అభిప్రాయంతోనే ఈ
వారం ఈ అంశాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.
చేయి బార్లా చాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది.
అయితే ఆ చేతి కొన పక్కవాడి ముక్కును తాకనంతవరకే ఆ స్వేచ్చ అనేది ఓ ఇంగ్లీష్ నానుడి.
బహుశా గవర్నర్ విషయంలో మీడియా స్వేచ్ఛ ఆ హద్దును
దాటివుంటుంది. ఆయన తన ప్రసంగంలో అనేక వ్యక్తిగత అనుభవాలను ప్రస్తావించడానికి అదే కారణం అయివుంటుంది.
నరసింహన్ గారి సోదరుడు ఓ ఐ.ఏ.యస్. అధికారి. అసోం
రాష్ట్రంలో పనిచేస్తూ ఉల్ఫా ఉగ్రవాద దాడులకు గురై మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని
తీసుకురావడానికి నరసింహన్ విమానాశ్రయానికి వెళ్ళారు. అదో విషాద సందర్భం. ఆ సమయంలో
ఒక విలేకరి ఆయన్ని అడిగిన ప్రశ్న- ’కైసా లగ్తా హై’ (ఎలా అనిపిస్తోంది?).
‘ఓ పక్క సోదరుడి నిర్జీవ శరీరం. నిండు విషాదంలో వున్న నన్ను, సమయం సందర్భం
చూసుకోకుండా అడగాల్సిన ప్రశ్నా అది?’ అనేది నరసింహన్ గారు పాత్రికేయ లోకానికి
సంధించిన ప్రశ్న.
గవర్నర్ ఉదహరించిన మరో ఉదంతం. ఒక పత్రికా విలేకరి
గవర్నర్ ని కలిసి ఇంటర్వ్యూ చేసి తన పత్రికలో ఓ చక్కటి వ్యాసం రాసాడు. అంతా బాగానే
రాసి ‘గవర్నర్ భార్య శ్రీమతి విమలా నరసింహన్ బయట ఊళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రతి
సందర్భంలో గవర్నర్ విమానాశ్రయానికి వెళ్లి తీసుకు రావడం అంత అవసరమా’ అన్న రీతిలో ఓ
వ్యంగ బాణం ఒదిలాడు. ఇది నరసింహన్ గారి మనస్సును యెంత బాధ పెట్టిందంటే, ‘నేను
వెళ్ళేది ‘నా’ భార్యకోసమే కదా!’ అనేశారు. ‘ఇతరులకోసం కాదుకదా ‘ అనే వ్యంగం అందులో
దాగుంది. సుతిమెత్తగా అంటించడం అంటే ఇదే! భార్యా భర్తల నడుమ అనురాగం అర్ధం అయిన
విలేకరి అయితే పరిహాసానికి కూడా ఇలాటి ప్రస్తావన చేయడని నాటి సమావేశానికి హాజరయిన
ఓ సీనియర్ విలేకరి వ్యాఖ్యానించాడు.
కలం బలం గురించి నెపోలియన్, మహాత్మా గాంధి
సూక్తులను కూడా గవర్నర్ ఉదహరించారు. ‘పత్రికలకు వున్నబలం తక్కువ కాదు. మీడియాను
ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ప్రజాస్వామ్య సౌధంలోని మిగిలిన స్తంభాలు స్థిరంగా ఉండేలా
మీడియా కాపు కాస్తుండాలి’ అనే రీతిలో గవర్నర్ హిత బోధ సాగింది.
ఇటీవల మీడియాలో పెచ్చరిల్లుతున్న ‘బ్రేకింగ్
న్యూస్’ ధోరణిని కూడా గవర్నర్ తప్పుపట్టారు. ప్రతి అంశాన్ని సంచలనం చేసి రేటింగులు
పెంచుకునే సంస్కృతికి స్వస్తి చెప్పాలని కూడా ఆయన సూచించారు. ‘ఉరి వేసుకుంటున్న
వ్యక్తి ఏ చేత్తో ఉరితాడు తగిలించుకుంటున్నాడు’ అని విజువల్స్ తో వర్ణించడం
కాకుండా అతడిని కాపాడడానికి చేతనయిన సాయం చేయడం ధర్మమని అన్నారు.
‘ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తి నెత్తురోడుతూ
చావుబతుకుల నడుమ కొట్లాడుతుంటాడు. అతడ్ని కాపాడడం యెట్లా అన్నది ఆలోచించకుండా ఆ
సన్నివేశాన్ని యధాతధంగా చిత్రించి వీక్షకులకు యెంత త్వరగా చూపగలమనే ధోరణిలో మీడియా
ఆలోచించడం దురదృష్టకరం. ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించే మీడియా వారిని కూడా నేరంలో
భాగస్వాములను చేయాలి అనేంత తీవ్రంగా గవర్నర్ స్పందించారంటే మీడియా యాజమాన్యాలు
తక్షణం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అగత్యం
కనబడుతోంది.
సంచలన వార్తలు కొన్ని క్షణాలే బాగుంటాయి.
నిస్సహాయులను కాపాడగలిగితే ఆ సంతృప్తి చిరకాలం వుంటుందని హితవు పలికారు. ఈ సందర్భంలో
నరసింహన్ మృదువుగానే చాలా కటువైన సూచన చేసారు. మీడియాను కూడా సమాచార హక్కు చట్టం
పరిధిలోకి తీసుకురావాలన్నది ఆ సూచన.
‘ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి
వచ్చినప్పుడల్లా ‘ప్రధానికి ఇచ్చిన ముప్పయి అయిదు పేజీల నివేదికలో ఏముందో
చెప్పమంటారు’ అన్నారు గవర్నర్.
పేజీల సంఖ్య సయితం తెలిసిన వారికి అందులో ఏముందో తెలవదా అన్నది
నరసింహన్ గారి శ్లేష.
ఇక చివరాఖరుకు గవర్నర్, తన దేవాలయ సందర్సనలను వివాదాస్పదం చేయడానికి మీడియా ప్రయత్నిస్తోందని
అభియోగం మోపారు.
‘గవర్నర్ దేవాలయాలకు వెళ్ళడం తప్పుకాదు.
నిజానికది వార్తా కాదు’ అంటూ నరసింహన్ ఘంటాపధంగా చెప్పారు.
‘ఒక అధికారిగా, ఒక గవర్నర్ గా నేను చేసిన సేవలకు
గౌరవం ఇవ్వకపోయినా పరవాలేదు, కనీసం నా వయస్సును అయినా గౌరవించండి’ అనేది చివర్లో
నరసింహన్ మీడియాకు చేసిన విజ్ఞప్తి.
తోక టపా: గవర్నర్ ప్రసంగం అనంతరం ఆ
కార్యక్రమానికి హాజరయిన సీనియర్ జర్నలిష్టులు అనేకమంది గవర్నర్ లేవనెత్తిన పలు
అంశాలతో ఏకీవభించినట్టే వారి మాటల్లో అర్ధం అయింది. పలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సుదీర్ఘ
కాలం పాటు పనిచేస్తూ వస్తున్న వీ.జే.ఎం. దివాకర్ ఇలా చెప్పారు.
“నేనొక రోజు ప్రెస్ క్లబ్ సమీపంలో వున్న
హనుమంతుడి గుడికి వెళ్లాను. ఆ సమయంలో గవర్నర్ నరసింహన్ గుడిలో వున్నారు. లోపలకు
వెళ్ళడానికి సంకోచిస్తుంటే, బయట నిలబడి వున్న గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ‘పరవాలేదు,
లోపలకు వెళ్ళండి’ అన్నారు. సందేహిస్తూనే వెళ్లాను. ప్రదక్షిణం చేస్తుంటే నా
ముందున్న వ్యక్తిని చూసి నివ్వెర పోయాను. గవర్నర్ మామూలుగా అందరు భక్తుల మాదిరిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు.”
(02-12-2015)
NOTE: Courtsey Image Owner
4 కామెంట్లు:
వారి ప్రసంగ యు ట్యూబ్ వీడియో కూడా జత చేర్చి పెడితే టపా మరింత సొబగు గా ఉండును :)
జిలేబి
ఒక విలేఖరి, నటి సమంతా ని మీ వెంట మీ అమ్మానాన్న కూడా షూటింగ్ కి వస్తారా అని అడిగారట,ఉద్యోగినుల వెంట వాళ్ళ అమ్మానాన్న వస్తున్నారా ? నా వెంట ఎవరూ రానవసరం లేదు,అని తిరిగి సమాధానం ఇచ్చింది.ఎయిర్ పోర్టు దాకా వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళలేరా ? గవర్నర్ కి కూడా మన బ్లాగర్లలాగా పనేమీ ఉండదేమో ?
నరసింహన్ గారిది ముమ్మాటికీ ధర్మాగ్రహమే. క్రితం సంవత్సరం 20 మంది పైగా హైదరాబాద్ విద్యార్ధులు కులు-మనాలి దగ్గర బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంఘటన, అంతకుముందు (2013) కేదారనాథ్ వరదలు మీడియా వారి పనితీరుకి అద్దం పడతాయి. స్వీయనియంత్రణ సాకుతో ప్రభుత్వం వారి కంట్రోల్ రానివ్వకుండా విచ్చలవిడితనంగా తయారయినాయి టీవీ ఛానెళ్ళు. They have become a law unto themselves.
sir narasimhan sir is a sincere person with values. Once when i went to tirunilayam at himayat nagar, governor sir and his wife and mother in law came for prayers. they were very down to earth and the devotees were not disturbed at all.
governor / chief justice / judges visiting temples need not be a news item at all.
One thing. If any special flights were used for visiting temples, it is not acceptable.
కామెంట్‌ను పోస్ట్ చేయండి