30, డిసెంబర్ 2015, బుధవారం

2015


సూటిగా............సుతిమెత్తగా........... భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN"SURYA" TELUGU DAILY ON 31-12-2015, THURSDAY)

2015లో ఇది ఆఖరి రోజుకావొచ్చేమో కానీ ఇదే చివరాఖరి రోజు కాదు.
అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  ఈ ఏడాది సెలవు తీసుకుంటోంది. కొత్త ఏడాది సరికొత్త ఆశలతో గుమ్మంలో నిలబడి వుంది.


గతంలోకి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్న ఏడాదిని విహంగ వీక్షణం చేస్తే –
కోటి ఆశలతో జనాలు గద్దె ఎక్కించిన మోడీ సర్కారు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘం రూపురేఖలు మార్చి ‘నీతి అయోగ్’ పేరుతొ ఏర్పరచిన కొత్త వ్యవస్థ అమల్లోకి రావడంతో ఈ కొత్త ఏడాది మొదలయింది. అంతకుముందు 2014 వ సంవత్సరం  మోడీకి అందించిన అపూర్వ విజయాలు  2015 లో ఆవిరి అయిపోయాయి. ఏడాది మొదట్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాల రూపంలో ఎదురయిన ఎదురు గాలులు, ఏడాది మధ్యలో జరిగిన బీహారు ఎన్నికల నాటికి ప్రచండ రూపం ధరించాయి. ఘన విజయాలను మూటగట్టుకున్న ఒడిలోకే ఏడాది తిరక్కముందే ఘోర పరాజయాలు వచ్చి చేరాయి. దీన్ని రాజకీయాల్లో ప్రజలు ప్రదర్శించే చమత్కారం అనుకోవాలేమో!
ప్రధాన మంత్రి మోడీ ఏడాది కాలంలో జరిపిన అనేక విదేశీ పర్యటనలు బయట దేశాల్లో ప్రశంసలను  వెల్లువెత్తిస్తే, స్వదేశంలో అనేక వర్గాలనుంచి ఆయనపై  విమర్శల జడివానలు కురిపించాయి. ఏడాది చివర్లో జరిపిన చివరాఖరు పర్యటనలో మోడీ విసిరిన  వ్యూహాస్త్రం విమర్శకుల నోళ్లకు తాళం వేయించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగొస్తూ, మార్గమధ్యంలో అనుకోని విధంగా  లాహోరులో దిగి పాక్ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు స్వయంగా తెలిపిన తీరు అంతర్జాతీయంగా మోడీకి  మంచి  పేరు తెచ్చిపెట్టింది. కాకపొతే కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కారు వంట గ్యాసు సబ్సిడీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని  ప్రజలు ఎంతవరకు జీర్ణించుకుంటారనేది నూతన సంవత్సరంలో తేలుతుంది.
‘కలలు కంటూ వుండండి, వాటిని నిజం చేసుకోండి’ అని భారత యువతకు ఉద్బోధించిన  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2015 జులైలో కన్నుమూయడం   ప్రజలకు తీరని వ్యధ. అబ్దుల్ కలాం  స్పూర్తితో మొదలయిన భారత అంతరిక్ష పరిశోధనలు ఒక మైలు రాయిని అదే ఏడాది చేరుకోవడం అనేది ఆయన స్మృతికి ఒక ఘన నివాళి.             
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, కొత్తగా ఏర్పడ్డ  రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది పరిస్తితులు కొంత కుదుట పడుతున్నట్టే అనిపిస్తోంది.
ఉమ్మడి రాజధానిలో వుండడానికి పదేళ్ళ వ్యవధానం వున్నాకూడా, సొంత రాష్ట్రానికి వెంటనే తరలివెళ్ళాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆలస్యంగా అయినా సరయిన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. నవజాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఒకచోటా, పాలకులు మరో చోటా వుండే  పరిస్తితి మంచి పాలనకు మంచిది కాదు. రాజధాని అమరావతి నిర్మాణానికి పునాది రాయి కూడా పడింది. కళ్ళు చెదిరే ఆధునిక రాజధాని ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఇక శుభస్య శీఘ్రం అనుకుంటూ అడుగు ముందుకు వేయడమే మంచి  పద్దతి.
గతిస్తున్న ఏడాది  ఆంద్ర ప్రదేశ్  ప్రజలకు  చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెడుతోంది. అట్టహాసంగా మొదలయిన గోదావరి పుష్కరాల్లో తొలినాడే చోటుచేసుకున్న అపశ్రుతి ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో యాత్రీకులు ప్రాణాలు పోగొట్టుకోవడం విషాద పరిణామం. హైదరాబాదులో బయటపడిన ‘నోటుకు ఓటు’,  బెజవాడలో జరిగిన కల్తీ మద్యం మరణాలు, వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారాలు చంద్రబాబు ప్రభుత్వానికి సమర్ధించుకోలేని సంగతులుగా మిగిలాయి. ప్రతిదానికీ ప్రతిపక్షాన్ని బాధ్యులుగా చేసి తమ బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం దీర్ఘకాలంలో సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఈ చేదు నిజాన్ని తెలుగుదేశం నాయకత్వం అర్ధం చేసుకోవాలి. గత ఇరవై మాసాల కాలంలో  ఎంతో చేశామని చెప్పుకుంటున్నా ఇంకా చేయాల్సింది  చాలావుంది, అవన్నీ  పూర్తి చేయడానికి తమకున్న వ్యవధానం చాలా తక్కువ అన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు సర్కారు యెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో కొత్త ఏడాదిలో అయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది. ఈ దిశగా కొత్త ఏడాదిలో తన వ్యూహాలకు చంద్రబాబు  కొత్త రూపం ఇవ్వాల్సి వుంటుంది.
ఇక జగన్ మోహన రెడ్డి. ఎదురు గాలుల్లోనే ఆయన పార్టీ తొలినుంచీ రాజకీయ పయనం సాగిస్తోంది. ఈ ఏడాదీ అలాగే సాగింది. సాధారణంగా అధికారం ఎటు వుంటే అటు మొగ్గుచూపే, అటే వాలిపోయే ఈనాటి రాజకీయ  వాతావరణంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. శాసన సభ్యులు కట్టు దాటకపోవడం ఒక్కటే ఆయనకు మిగిలిన ఊరట. ప్రధాన  ప్రతిపక్షంగా సమర్ధంగా వ్యవహరించలేకపోతున్నారనే అపప్రధ ఆయన మీద వుంది.  ఇది పోగొట్టుకోవడానికి వీలైన దిద్దుబాటు చర్యలు కొత్త ఏడాదిలో తీసుకోవడం అవసరం. 
పొతే, తెలంగాణా వ్యవహారం.
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. వరంగల్ ఉపఎన్నికలో సాధించిన అపూర్వ ఘన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసింది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్సలు పట్టించు కోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు. అందుకే పన్నెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం అన్నింటినీ కైవసం చేసుకోవాలని చేసిన ప్రయత్నం ఇందుకు అద్దం పడుతోంది.   టీఆర్ ఎస్  ఖాతాలో  ఆరు ఏకగ్రీవంగా పడగా, ఆరింటికి ఎన్నికలు జరిగాయి. వాటిల్లో రెండింటిని కాంగ్రెస్ ఎగరేసుకుపోవడం కొసమెరుపు. అయినా కానీ, పన్నెండు స్థానాల్లో పదింటిలో టీఆర్  ఎస్ సాధించిన గెలుపు , మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి లభించినవి రెండే అయినా ఆ పార్టీకి ఈ గెలుపు అయాచిత వరం. తెలంగాణా ఇచ్చింది కేంద్రంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమకు న్యాయం జరగలేదని బాధపడుతున్న టీ. కాంగ్రెస్ నాయకులకు ఈ విజయం ఎడారిలో ఒయాసిస్సు లాంటిది.
కాలం ఎలాటి మార్పులు తెస్తుంది అనడానికీ,  ఆ మార్పులు రావడానికి ఎంతో కాలం పట్టదు అన్న వాస్తవానికీ,  ఢిల్లీ, బీహారు, వరంగల్, మండలి ఎన్నికల ఫలితాలు మచ్చు తునకలు. 
2014 లో కనీవినీ ఎరుగని ఘన విజయం సాధించిన మోడీ  ఏడాది తిరక్కముందే జరిగిన ఢిల్లీ, బీహారు ఎన్నికల్లో అతి దారుణ పరాజయం చవిచూశారు. అలాగే  వరంగల్ ఉప ఎన్నికలో, అన్ని ప్రతిపక్షాలను మట్టికరిపించి  టీఆర్ ఎస్ ను  మురిపించిన ఘనాతిఘన విజయం, కొద్ది నెలలు గడవక ముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని రుచి చూసేలా చేసింది.
2015 అనుభవాల నుంచి రాజకీయ పార్టీలు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. లభించిన విజయం ఆఖరిది అనుకుని పనిచేయాలి. అప్పుడే మరో గెలుపు  తలవాకిట నిలుస్తుంది. పలకరించిన పరాజయం చిట్ట చివరిది అనుకుని తిరిగి కష్టపడాలి. అప్పుడే కొత్త విజయం తలుపు తడుతుంది.
365 ఖాళీ పేజీల 2016  కొత్త పుస్తకం  తయారుగా వుంది. మంచి వాక్యంతో మొదలు పెట్టమని కోరుతోంది.
ఉపశ్రుతి:
అయుత చండీయాగం అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియని వ్యవహారం. అలాంటి అపూర్వ యాగాన్ని, తెలంగాణా ముఖ్యమంత్రి  కేసీఆర్ అద్భుతంగా చేసి చూపించారు. నిజానికి ఒక  రకంగా   2015 సంవత్సరానికి ఇదే కొసమెరుపు. ‘ఈ యాగం విశ్వ శాంతికోసం’ అని కర్తలు చెప్పుకొచ్చారు. కాకతాళీయం కావచ్చుకాని, ప్రధానమంత్రి మోడీ ఆకస్మికంగా పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇది మొదటి అడుగని అందరూ అంటున్నారు. అదొక విషయం. పొతే, ఈ యాగం కేసీఆర్ కి వ్యక్తిగతంగా బాగా కలిసివచ్చిందని, హైదరాబాదులో స్థిరపడ్డ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి గృహిణుల్లో మునుపు ఆయనపట్ల వున్న ఒకింత వైమనస్య  వైఖరి ఇప్పుడు  సానుకూలంగా మారిపోయిందని, జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్న ఒక పెద్దమనిషి తన సొంత అనుభవం చెప్పుకొచ్చారు. యాగం జరిగినన్ని రోజులూ ఇళ్ళల్లో ఆడంగులు  టీవీలకి అతుక్కుపోయి చూస్తూ, ప్రతి  అంశాన్ని పరిశీలనగా గమనిస్తూ,   యాగదీక్షలో వున్న కేసీఆర్, అత్యంత  నిష్టగా, త్రికరణశుద్ధిగా క్రతువును నిర్వహించిన తీరును వేనోళ్ళ మెచ్చుకున్న వైనాన్ని  ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రతి పనికీ ఒక ఫలితం ఉన్నట్టే, ప్రతి యాగానికీ ఒక ప్రతిఫలం ఉంటుందేమో! (31-12-2015)

రచయిత ఈమెయిల్ : bhandarusr@gmail.com  మొబైల్:  98491 30595
NOTE: Courtesy Image Owner


5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"వాటిల్లో రెండింటిని కాంగ్రెస్ ఎగరేసుకుపోవడం కొసమెరుపు"

అసెంబ్లీ ఎన్నికలలో గెలుస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత బాగా డీలా పడింది. రానురాను వారికి తాము రెండో స్థానంలో అయినా ఉండగలమా లేదా అన్న బెంగ పట్టుకుంది. ప్రస్తుత నల్గొండ/పాలమూరు స్పూర్తి జీహెచ్యెమ్సీలొ కూడా చూపిస్తే ప్రధాన ప్రతిపక్షం హోదాకు ధోకా ఉండదు. దీనితో 2019 వ్యూహాలు మెరుగు పడుతాయి.

Zilebi చెప్పారు...



చండీ యాగం 'సెగ' భేషు !


యాగం జరిగినన్ని రోజులూ ఇళ్ళల్లో ఆండోళ్ళు టీవీలకి అతుక్కుపోయి చూస్తూ, ప్రతి అంశాన్ని పరిశీలనగా గమనిస్తూ, యాగదీక్షలో వున్న కేసీఆర్, అత్యంత నిష్టగా, త్రికరణశుద్ధిగా క్రతువును నిర్వహించిన తీరును వేనోళ్ళ మెచ్చుకున్నారు !

చీర్స్
జిలేబి

Jwala's Musings చెప్పారు...

"ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది"........ ఇది బహుశా పునరాలోచించుకోవాల్సిన వాక్యమేమో? ప్రజాస్వామ్యం ఇటీవల కాలంలో తెలంగాణలో బలపడినట్లు గతంలో ఎప్పుడూ జరుగలేదేమో!

నీహారిక చెప్పారు...

కే సీ ఆర్ గారికి సుగ్రీవుడి పోస్ట్ ఇచ్చారా ? అసలు విషయం మర్చిపోయి యజ్ఞ యాగాదుల్లో మునిగితేలుతున్నందుకా ? బ్రతుకమ్మ సంబరాలకు 10 కోట్లు, ఆయుత చండీ యాగానికి 100 కోట్లు ఎవరిఖాతాలో వేస్తారు ? నిజమే... ఒక నియంత ప్రజాస్వామ్యంలో ఇంతకంటే బాగా పనిచేయలేరు. ప్రజాస్వామ్యం ఇటీవల కాలంలో తెలంగాణలో బలపడినట్లు గతంలో ఎప్పుడూ జరుగలేదేమో!

నీహారిక చెప్పారు...

ప్రతి పనికీ ఒక ఫలితం ఉన్నట్టే, ప్రతి యాగానికీ ఒక ప్రతిఫలం ఉంటుందేమో!

యాగ కర్త కే సీ ఆర్ గారయినా ఫలం ప్రజలకే చెందుతుందని ప్రకటించారు కాబట్టి మనం ప్రతిఫలాన్ని ఆశించడంలో తప్పు లేదు. బీ జే పీ ప్రతినిధి రాం మాధవ్ గారు కోరిన "అఖండ్ భారత్" సిద్ధించుగాక !