26, ఆగస్టు 2015, బుధవారం

ఆ ఒక్కటీ తప్ప........ భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-08-2015, THURSDAY)
‘అటులయిన సావిత్రీ మరొక్క వరమ్ము కోరుకొమ్ము, అదియును నీ పతి ప్రాణమ్ము దక్క’ అనే యమధర్మరాజు డైలాగు ఒకటుంది ఒక తెలుగు సినిమాలో. ఆ మాదిరి సమాధానమే దొరికినట్టు అర్ధం అవుతోంది మొన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుమ జరిగిన భేటీలో. అలనాటి పురాణ కధలో సతీ సావిత్రి యముడ్ని తన కోరికల చిట్టాలతో తికమక పెట్టి, చివరికి పోయిన తన పతి ప్రాణాలతో సహా అన్నింటినీ సాధించుకుంటుంది. సరే! అది కధో, పురాణమో కాబట్టి సావిత్రి పట్టిన పట్టు విడవక తన పంతం నెగ్గించుకుని ఉండవచ్చు. కానీ ఈ కలికాలంలో ఇలాటి కధ ఇలానే సాగే వీలులేదు.  కాబట్టే, ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా అనేది ప్రధానాంశంగా ఎజెండాలో పెట్టుకుని,   ప్రధాని  మోడీతో భేటీ ముగిసిన తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘హోదా అనేది ఏవన్నా సంజీవనా ?’ అంటూ సమావేశం ఫలితాన్ని ఒక్క ముక్కలో తేల్చేశారు.


చంద్రబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా తనదయిన రీతిలో ఇదే భావం వ్యక్తం అయ్యేలా మాట్లాడి, మళ్ళీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కారు.  
నిజమే! చంద్రబాబు  అన్నట్టు కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నింటినీ కట్టగట్టి రాత్రికి రాత్రే పరిష్కరించే  దివ్యశక్తులు ఏవీ,  ‘ప్రత్యేక హోదా’కు లేని మాట వాస్తవమే. అందుకే హోదాతో పాటు పత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రత్యేక హోదా అయినా, ప్రత్యేక ప్యాకేజీ అయినా  ఏ రూపంలో అయినా,  వాటి  అవసరం రాజకీయంగా వున్నది ప్రధానంగా తెలుగు దేశం పార్టీకే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకే. రాష్ట్రాన్ని తాను  అనుకున్న రీతిలో తీర్చిదిద్దాలన్నా, ప్రజలకు  ఇచ్చిన మరి కొన్ని హామీలు మళ్ళీ ఎన్నికలనాటికన్నా నెరవేర్చాలన్నా ప్రత్యేక హోదాలు, ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక   ప్యాకేజీలు వంటి ఉపశమనాలు అత్యంత ఆవశ్యకం. ఈ వాస్తవం తెలిసిన మనిషి కనుకనే ఈ కోరికల నన్నింటినీ గుదిగుచ్చి ఓ చిట్టా తయారు చేసి మరీ ప్రధానమంత్రికి సమర్పించారు. ఆంద్ర ముఖ్యమంత్రి రాకలోని ఆంతర్యం తెలిసిన బీజేపీ నాయకత్వం కూడా ఆంద్రప్రదేశ్ విషయంలో తమకు ప్రత్యేక శ్రద్ధ వున్నట్టు కనిపించడానికి ఈ భేటీకి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. చంద్రబాబు చెప్పింది ప్రధానమంత్రి సావధానంగా విన్నారని ఆ తరువాత చంద్రబాబే స్వయంగా చెప్పారు. చెప్పింది వింటే  ఎవరికయినా  సగం సంతృప్తి ఇస్తుందన్నట్టు ఆయన మొహంలో ఆ తృప్తి కనిపించింది. అయితే దీనితో అందరూ సంతృప్తి చెందుతారా ?  మరి ఈ ‘హోదా’ విషయాన్ని మొట్టమొదట తెర మీదకు తీసుకు వచ్చి అదొక్కటే కొత్త రాష్ట్రపు ఇక్కట్ల నన్నింటినీ పరిహరింపగల ‘మంత్రదండం’  అని జనాల్లో లేనిపోని ఆశలు రేకెత్తించినదెవరు ? ఈ ప్రశ్నకు జవాబు తామే అని ఏ రాజకీయ పార్టీ ఎలాగూ అంగీకరించదు. అలా అని ఏడాది క్రితం జరిగిన విషయాలు జనం అంత త్వరగా మరిచిపోయే వీలు కూడా లేదు.
సరే! షరా మామూలుగానే అంశంతో సంబంధం వున్న రాజకీయ పార్టీలన్నీ ఎదుటివారిపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాయి  తప్ప ఏ ఒక్క పార్టీ కూడా తమకూ ఇందులో కొద్దో గొప్పో పాత్ర  ఉన్నదన్న వాస్తవాన్ని నిజాయితీగా  ఒప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ అంశం ఒక జటిల సమస్యగా రూపాంతరం చెందడానికి దోహదం చేసిన కారణాల్లో ఇది ప్రధానమైనది.
నూతన రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా దక్కకకుండా పోవడంలో పాత్ర అలావుంచి అసలు సీమాంధ్ర ప్రాంతంలో మెజారిటీ ప్రజల   అభీష్టానికి విరుద్ధంగా ఆ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న సందర్భంలో, అప్పుడే ఈ అంశాన్ని విభజన చట్టంలో చేర్చి వుంటే ఈ పరిస్తితి ఉత్పన్నం అయ్యేది కాదు అనే వాదన వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ కూర్చోబెట్టి ప్రజలు తమ తీర్పు చెప్పేశారు.  చేసిన తప్పుకు ఆ పార్టీ శిక్ష కూడా అనుభవిస్తోంది. కాబట్టి,  ఇక దాన్ని తప్పుపట్టి ప్రయోజనం లేదు.         
పొతే, వై.ఎస్.ఆర్.సీ.పీ. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశలు వమ్ముకావడానికి దోహదం చేసిన కారణాల్లో విభజన అంశం కూడా ఒకటి. మిగిలివున్న మూడున్నర సంవత్సరాల కాలం నిజానికి ఆ పార్టీకి పోరాట కాలమే. ఏ చిన్న అంశం దొరికినా, దొరకకున్నా దొరకబుచ్చుకుని వీధుల్లోకి రావాల్సిన రాజకీయ ఆవశ్యకత ఆ పార్టీకి వుంది. ఉనికి కాపాడుకోవడానికి ఆ స్థానంలో ఏ పార్టీ వున్నా అదే పని చేస్తుంది. ఈ ప్రత్యెక హోదా అనేది ఆ పార్టీకి అలా అందివచ్చిన అవకాశం. ‘ఆ పార్టీ చేసే ధర్నాలవల్ల ప్రత్యెక హోదా వస్తుందా? కేవలం ప్రజలకు అసౌకర్యం తప్ప’ అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదీ. నిజమే. ధర్నాలవల్ల, ఆందోళనల వల్ల, నిరసనల వల్ల రాజకీయ నిర్ణయాలు ప్రభావితం కావు. నిర్ణయం తీసుకునే అవకాశం వున్న  ఏ రాజకీయ పార్టీ అయినా దానివల్ల కొద్దో గొప్పో లబ్ది వుంటుంది అనే నమ్మకం చిక్కిన తరువాతనే అటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్నాలు, ఆందోళనలు ఒక భాగం.  అవి సహజం’  అని ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రబోధించే పార్టీలే అధికార పీఠం ఎక్కగానే, తగవు తగవంటూ  ఇటువంటి నీతి పాఠాలు వల్లె వేస్తూ వుండడం వల్ల జనసామాన్యంలో వాటికి విలువ తగ్గిపోతూ వుంది. 
ఇక బీజేపీ. బీజేపీ అంటే ఇప్పుడు మోడీ. మోడీ అంటే బీజేపీ అనే తరహాలో ఆ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. మొత్తం వ్యవస్థను మారుస్తాను అనే నమ్మకాన్ని కలిగించి గద్దె ఎక్కిన రాజకీయ నాయకుడు ఆయన.  ఎన్నికలకు ముందు కొంతకాలం వరకు ప్రధాని అభ్యర్ధిగా తన పేరు ప్రతిపాదించడానికి కూడా సొంత పార్టీలోని కొన్ని శక్తులు అడ్డం పడ్డ సంగతి తెలియని వాడేమీ కాదు. వరుసగా పదేళ్ళు పాలించి స్కాముల ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నిర్వాకమో తెలియదు, ప్రజలు మార్పు కోరుకున్నారో తెలవదు, హరి యను రెండక్షరములు హరియించును పాతకములు అన్న చందంగా  మోడీ అనే రెండక్షరాలు, భారత రాజకీయ చరిత్రలో కనీ వినీ ఎరుగని అద్భుత విజయాన్ని ప్రజలు మోడీ నాయకత్వంలోని ఎండీయే కూటమికి కట్టబెట్టాయి.  సహజంగా ఎన్నికల్లో గెలుపోటములు దైవాధీనాలు. అందుకే ఎన్నికలకు ముందు మోడీ వ్యవహార శైలిని ఎన్నికల్లో అపూర్వ విజయం తరువాత ఆయన వ్యవహరిస్తున్న తీరుతో ముడిపెట్టడం కూడా పద్దతి కాదు.
అధికారంలోకి రావడానికి చెప్పే మాటలకి, అధికారం చేజిక్కించుకున్న తరువాత చేష్టలకి హస్తిమశకాంతరం తేడా ఉంటుందన్నది సర్వజన విదితమే. తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చేటప్పుడు మోడీ కేవలం నరేంద్ర మోడీ. తరువాత దేశం యావత్తు పట్టం కట్టిన ప్రధానమంత్రి. తేడా ఉండదా అంటే వుండి తీరుతుంది. ఎందుకంత తేడా అని తప్పు పట్టలేము. ఆరోజు అవసరానికి ఎన్నో చెబుతారు. అవన్నీ చేసి తీరాలని రూలేమీ లేదు. దేశ ప్రధాని పీఠం ఎక్కేంతవరకు ఆంధ్రప్రదేశ్  అనేది ఒక ముఖ్యమైన  రాష్ట్రం. ఆ పీఠం అధిష్టించిన తరువాత దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు  రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది.
అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ  రాజకీయ పార్టీలు చెప్పినవన్నీ చేసి వుంటే ఇప్పటికి మన భారత దేశం మొత్తం ప్రపంచంలో అగ్రగామిగా వుండేది. అలా అని మాట నిలబెట్టుకోలేకపోతే ఎల్లా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. దానికి సరయిన జవాబు ఓటు రూపంలో సిద్ధంగా వుంటుంది. నిజానికి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళ కాలంలో మనదేశ  ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతోంది రాజకీయ పార్టీలు కాదు, కేవలం ప్రజలే. ఆ భరోసా ఉన్నంతవరకు రాజకీయ పార్టీల హవా కేవలం మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకే.         
పొతే ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, లేదా ప్రత్యెక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం చేతిలోని వ్యవహారం. ఇవ్వడం వల్ల అధ్బుతాలు జరక్క పోవచ్చు. కానీ ప్రత్యెక హోదా అనేది ఒక భావోద్వేగ అంశంగా మారితే జరిగే పరిణామాలు  వేరుగా వుంటాయి. తెలంగాణా విషయంలో జరిగింది అదే. లక్షల కోట్ల ప్యాకేజీలు కూడా త్రాసులో వేసి తూస్తే తెలంగాణా అనే భావోద్వేగపు తులసి దళం పడగానే తేలిపోయాయి. ఇలాటి వాస్తవాలను రాజకీయ పార్టీలు అహరహం గుర్తుంచుకోవాలి.
అదీ వాటి బాగు కోసం కాదు, ప్రజల బాగోగుల కోసం. (26-08-2015)

రచయిత ఈ మెయిల్ :  bhandarusr@gmail.com   మొబైల్: 98491 30595                     

1 కామెంట్‌:

Narsimha Kammadanam చెప్పారు...

14వ ఆర్థిక సంఘం లా ... 15వ ఆర్థిక సంఘం ఏర్పడి ఆ సంఘం నివేదిక లో ఆ.ప్ర ప్రత్యేకానికి అర్హము అనేలా చ.బా.నా గారు కొన్ని చర్యలకి ఉపక్రమిస్తే బాగుంటుంది కానీ .... భవిష్యత్తులో బా.జా.పా పోటీ ఉండొద్దు అనేలా ప్రతి సారీ కేంద్రాన్ని నిందిస్తే రాజకీయం తప్ప ఏమి లాభం ఉండది!
(14 సంఘాలు అంటే 15 వ దానికి ఆస్కారం ఉంటుంది గదా అటు నుంచి ఆలోచించి ... రాష్ట్ర పరిస్థితి కడు దయనీయంగా ఉన్న విషయం ఆ సంఘం ముందు నిరూపించి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా కొన్ని చర్యలు అవసరమేమో).