7, అక్టోబర్ 2012, ఆదివారం

అద్దంలో చందమామ ‘తెలంగాణ’



అద్దంలో చందమామ ‘తెలంగాణ’ భండారు శ్రీనివాసరావు 

“నెలాఖరులోగా తెలంగాణా వస్తుందనే మాటల్ని ఎనిమిదేళ్ళుగా వింటున్నా”  ఈ మాటలు అన్నది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సమైక్యవాద నాయకుడు కాదు. పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెడితే మరో మాట లేకుండా సమర్దిస్తామని మాట ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పూర్వాధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు.
‘దసరా పండుగ లోపే తెలంగాణా ఏర్పాటుపై ఖచ్చితమయిన ప్రకటన వస్తుంద’ని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖరరావు తనను కలుసుకున్న ఆ ప్రాంతపు ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులతో చెప్పారని భోగట్టా. విజయదశమి నాటికి విజయోత్సవాలకు అంతా సిద్ధంగా వుండాలని ఆయన పిలుపు ఇచ్చినట్టుకూడా సమాచారం. ‘ఈ నెల ముప్పయ్యో తేదీలోగా ప్రకటన రాకపోతే యుద్ధం ప్రకటిద్దామని, ఇందుకోసం అన్ని రకాలుగా సంసిద్ధమవుదామని కూడా ఆయనే అన్నట్టు  ఆ నాయకులే చెబుతున్నారు. ఇంత సందిగ్ధత వున్నప్పుడు దాన్ని మరింత పెంచేవిధంగా గులాబీ పార్టీ అధినేత ఇలాటి పరస్పర విరుద్ధ ప్రకటనలు యెందుకు చేస్తున్నట్టో తెలియక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
‘అనైక్యతతోనే తెలంగాణా ఆలశ్యం అవుతోంద’ని ప్రజాసంఘాలాల జేయేసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఈనెల పదహారున హైదరాబాదు వస్తున్న ప్రధాని మన్మోహన్  సింగుకు ‘తెలంగాణా రుచి’ చూపిస్తామని, తెలంగాణా మార్చ్ జోషులో వున్న  జేయేసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. తనకూ కేసీఆర్ కూ నడుమ విభేదాలు ఏమీ లేవని  ఆయన స్పష్టం చేస్తూనే,  గోరంతను కొండంత చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అంటే ఎంతో కొంత వున్నట్టే కదా అని విమర్శకులు భాష్యం చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము తెలంగాణాపై అధ్యయనం జరిపి నివేదిక ఇచ్చామని జస్టిస్ శ్రీకృష్ణ హఠాత్తుగా తెరపైకి వచ్చి చెప్పారు. రాజకీయ కారణాలవల్లే తెలంగాణా ఏర్పాటు సాధ్యం కావడం లేదని ఆయన చెప్పడాన్నిబట్టి చూస్తే సీమాంధ్ర నేతల లాబీయింగ్ వల్లే ‘వేర్పాటు’ ప్రతిపాదన  వెనక్కుపోతోందన్న అభిప్రాయం కలుగుతోంది. కుండబద్దలు కొట్టినట్టున్న జస్టిస్  శ్రీకృష్ణ  అభిప్రాయం తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు.
హైదరాబాదు లేని తెలంగాణాకయినా ‘సరే’  అని కేసీఆర్ అన్నట్టు వచ్చిన వార్త  టీఆర్ఎస్ శ్రేణులకు, ముఖ్యంగా  రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణాను మనసారా కోరుకుంటున్నవారికి ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం అని కేసీఆర్ మద్దతుదారులు అంటున్నారు.
ముఖ్యమంత్రిపై, అదీ తమ  సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రిపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు  లోకసభ స్పీకర్ కు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపు. ఇలాటి పరిణామాలు  ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. తెలంగాణా మార్చ్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు తమను అడ్డుకుని తమ హక్కులకు భంగం కలిగించారన్నది వారి అభియోగం.        
ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఎంపీల చిత్తశుద్ధి పట్ల తమకు నమ్మకం వుందని టీజేయేసీ, ప్రజాసంఘాల  నేతలు అనడం వారికి కొంత వూరట కలిగించే విషయం.  అయితే ప్రజల్లోనే  విశ్వాసం కలిగించలేకపోతున్నామని ఆ నేతలు పేర్కొనడం వింత కొస మెరుపు.
కాగా, పులి మీది పుట్ర మాదిరిగా, కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ అధినాయకుడు హైదరాబాదు వచ్చి చేసిన ప్రకటన తెలంగాణా వాదులను మరింత ఆందోళనకు గురిచేసింది. రాష్ట్ర విభజనకు ఓ పక్క మద్దతు ఇస్తూనే తెలంగాణాపై నిర్ణీత సమయంలో ప్రకటన వస్తుందని చెప్పడం కష్టమని టీ కాంగ్రెస్ నేతలతో అల్పాహార విందులో పాల్గొన్న అనంతరం విలేకరులతో చెప్పారు. పనిలో పనిగా తెలంగాణా రాష్ట్రీయ లోక్ దళ్ శాఖను ప్రారంభించారు. టీ.ఆర్.ఎస్. నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్న  ఎమ్మెల్సీ దిలీప్ పూనికపై ఈ శాఖ ఏర్పాటయింది. సాధారణంగా ఇలాటి రాష్ట్ర విభాగాలను ఏర్పాటుచేసినప్పుడు వాటిని పలానా పార్టీ రాష్ట్ర శాఖ అని వ్యవహరించడం కద్దు. కానీ ఆర్.ఎల్.డీ. రాష్ట్ర శాఖకు ముందు ‘తెలంగాణా’ పదాన్ని జత చేశారు. జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలకు ఆయా రాష్ట్రాల లేదా ప్రాంతాల పేర్లను జోడించడం జరగదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ యూపీలో అయినా ఏపీలో అయినా కాంగ్రెస్ పార్టీ అనే పిలుస్తారు. యూపీ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ అని వ్యవహరించరు.  మరిలా యెందుకు చేసారన్న దానికి స్పష్టత లేదు. ఒకవేళ ఆర్.ఎల్.డీ. కి టీ.ఆర్.ఎల్.డీ. రాష్ట్ర శాఖ అయిన పక్షంలో, జాతీయ పార్టీ గుర్తింపుకోసం అవసరమయ్యే వోట్లను రాబట్టుకోవడం మినహా ఆర్.ఎల్.డీ. కి తక్షణం రాజకీయంగా వొనగూడే ప్రయోజనం శూన్యం. ఈ పార్టీ వల్ల   తెలంగాణా వాదానికి అదనపు బలం చేకూరదు. పైగా కొత్త పార్టీ ఆవిర్భావం వల్ల వాదం కొంత బలహీనమయ్యే ప్రమాదం వుంటుంది. ఇప్పటికీ తెలంగాణా ఏర్పాటును బలంగా కోరుకుంటున్న పార్టీలకు కొదవ లేదు. తెలంగాణా వాదుల ఐక్యతకు భంగకరంగా పలురకాల వ్యాఖ్యానాలతో ఈ పార్టీల నాయకులు అయోమయాన్ని సృష్టిస్తూ వుండడం మినహా వీళ్ళు వాదానికి అనుకూలంగా వొరగబెడుతున్నది ఏమీ లేదు.        
తెలంగాణా విషయంలో  కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు  పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు కేసీఆర్  కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో పరోక్షంగా బయటకు వొదులుతున్న సంకేతాలను బట్టి ఓ మేరకు అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి ఢిల్లీ పెద్దలకు రాష్ట్రంలో వున్న పరిస్థితుల పట్ల అవగాహన లేదని అనుకోలేము. తెలంగాణాకు సంబంధించి సమస్త వివరాలతో శ్రీ కృష్ణ కమిటీ నివేదికే వారివద్ద  సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను  గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా.తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులతోనూ,  సీమాంధ్ర నాయకులతోను  ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకులు  అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. అలాగే కేసీఆర్ తన లాబీయింగులో భాగంగా ఇటీవల ఢిల్లీలో అనేకరోజులపాటు మకాం వేసి అనేకమంది కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు ఆయనే చెప్పారు. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది  సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారి లెక్కలు,డొక్కలు వేరే.  వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు.
ఢిల్లీలో అధినాయక ప్రతినిధులతో జరిగిన మంతనాల్లో చురుగ్గా పాల్గొన్న ఓ కాంగ్రెస్ నాయకుడు చెబుతున్న విషయాలు వినడానికి ఇంపుగా లేకపోయినా అక్కడ ఏం జరుగుతున్నదో ఓ అంచనాకు రావడానికి వీలుగావున్నాయి. తెలంగాణా నాయకులను వారు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ఇప్పటికిప్పుడు తెలంగాణా ప్రకటిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు లభించే అవకాశం వుందా? టీ.ఆర్.ఎస్. ని కాంగ్రెస్ లో  విలీనం చేసుకుని తెలంగాణా ప్రకటన చేస్తే  ఆ లబ్దితో బలపడే కేసీఆర్ మరో మమతా బెనర్జీగా మాదిరిగా మారి అధిష్టానానికి కంటిలో నలుసుగా తయారయ్యే అవకాశం యెంత అన్నది వారి మదిలో మెదులుతున్న మరో సందేహం.
నిజమే.  తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని  కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా  ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను  లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహకర్తల ఆలోచన కావచ్చు.
(07-10-2012)



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

:) ఏదేమైనా కానివ్వండి, దసరా సంబురాలు ఘనంగా జరగాల. 'తెలంగానా రుచులు' అప్పుడెప్పుడో సంబురాలలో తిన్నది. ఈ సందర్భంగా మిత్రులు కవి గోసోజీ కవిత
" రావాలి తెలంగాణ
ప్రతి ఏడాది మళ్ళీ మళ్ళీ "

జై తెలంగాన!
జై జై తెలంగాన!!