15, ఏప్రిల్ 2016, శుక్రవారం

ముందే కూసిన కోయిల


సూటిగా.....సుతిమెత్తగా..... 

1982 – 2001 - 2008 – 2014
తెలుగు జాతి ఆధునిక రాజకీయ  చరిత్రకు  సంబంధించి  ఈ సంవత్సరాలకు చాలా ప్రాధాన్యత వుంది. 1982, 2008, 2014 సంవత్సరాల్లో   తెలుగు సినీరంగ ప్రముఖులు మువ్వురు తెలుగునాట రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. పొతే, తెలుగుదేశం పార్టీని వీడి, 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతొ ఓ కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పుష్కర కాలానికి పైగా అలుపెరుగని ఉద్యమం సాగించి తెలంగాణా సాధించిన కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను  మలుపు తిప్పడమే కాదు రాష్ట్ర సరిహద్దులనే మార్చి కొత్త చరిత్రకు స్వీకారం చుట్టారు.
రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది నెలల్లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న ఘన చరిత్ర అలనాడు తెలుగు చలనచిత్ర సీమలో ధృవతారగా వెలిగిన శ్రీ నందమూరి తారక రామారావుది. 1982 మార్చి 21 వ తేదీన ఆనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'తెలుగుదేశం' పేరుతొ ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు నాటకీయ పక్కీలో ఒక ప్రకటన చేసి మొత్తం రాజకీయ వర్గాలను ఆశ్చర్య చకితులను చేసారు. అంతకుముందు  సినీ రంగానికి చెందిన జగ్గయ్య వంటి కళాకారులు ఎన్నికల్లో పోటీచేసినా  అది పరిమిత పరిధుల్లోనే జరిగింది. పొరుగున వున్న తమిళనాట మాదిరిగా సినీ రంగానికి చెందిన వారు రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసే సంప్రదాయం మన రాష్ట్రానికి అప్పటికి కొత్త. పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా  అధికార పగ్గాలు చేపట్టి దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీఆర్   ఒక రికార్డు నెలకొల్పారు. చాలా ఏళ్ళు గడిచిన అనంతరం  2008 లో మరో అగ్రనటుడు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి 'ప్రజారాజ్యం' పేరుతొ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  వరసగా అనేక సంవత్సరాలు తెలుగు చలనచిత్రసీమను వొంటి చేత్తో శాసించిన మెగా  స్టార్ చిరంజీవి  తన పార్టీని ఓ ప్రభంజనం మాదిరిగా జనంలోకి తెచ్చి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ప్రయత్నాలు అనుకున్న విధంగా  ఫలించక పోవడంతో పద్దెనిమిది సీట్లు, పద్దెనిమిది శాతం వోట్లతో అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు. తన మనస్తత్వానికి ఈ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సరిపడవని నిర్ధారణకు వచ్చారేమో తెలియదు కాని, పార్టీని స్థాపించిన మూడేళ్ళలోనే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుని  చేతులు దులుపుకున్నారు. దరిమిలా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఒక స్థాయి మంత్రి పదవితో సంతృప్తి పడి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నామమాత్రంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అన్నగారి ప్రజారాజ్యం పార్టీ  యువజన విభాగం అయిన యువరాజ్యం నాయకుడుగా, 2009 ఎన్నికల్లో  రాష్ట్రం నలుమూలలు తిరిగి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసి, కాంగ్రెస్ వారి పంచెలు వూడదీస్తాననే తీరులో, తనదైన బాణీలో,  ఆవేశపూరిత ప్రసంగాలు  చేసి, ఎన్నికల అనంతరం అన్నగారు పార్టీతో సహా ఆ కాంగ్రెస్ పంచనే చేరడం హరాయించుకోలేక  పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా, మౌనంగా వుండిపోయారు.


మళ్ళీ 2014 ఎన్నికలకు ముందు  హఠాత్తుగా రంగ ప్రవేశం చేసి ఆ ఏడాది మార్చిలో జనసేన పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి తన అభిమానులను అలరించారు. రాజకీయ ప్రత్యర్ధులను అదరగొట్టారు. అప్పటివరకు అన్నచాటు  తమ్ముడిగా పేరున్న పవన్, అదే  అన్నగారి పార్టీకి  వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ ముఖ్యంగా అయన కుటుంబంలోని వారికే ఎంతో  ఆశ్చర్యం కలిగించింది. పేరుకు  పార్టీ అయితే పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో ప్రకటన చేసి అభిమానులను ఉసూరుమనిపించారు. ఈలోగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.  రాష్ట్ర విభజన అంశం ఆయనకు బాగా కలిసివచ్చింది. జాతీయ రాజకీయాల్లో కొత్త మెరుపులు మెరిపిస్తున్న మోడీ ఆయనకు బాగా నచ్చారు.  పవన్ వంటి జనాదరణ వున్న సినీ హీరోల అవసరం మోడీకి లేదా ఆయన నాయకత్వం  వహిస్తున్న బీజేపీకి వున్న మాట కూడా కాదనలేనిది. ఆనాటి పరిస్తితులు అలాటివి. అది పవన్ కళ్యాణ్ కు మరింతగా కలిసివచ్చింది. మంచి డైరెక్టర్, చక్కని తారాగణం, గట్టి కధాబలం వున్న సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది అన్న సినీ సూత్రం వంటబట్టించుకున్న పవన్, తెలివిగా అడుగులు వేసి బీజేపీతో చేతులు కలిపారు. అంతే  కాదు, తాను కొత్తగా స్థాపించిన 'జనసేన' పార్టీని ఎన్నికలబరిలో దింపకుండా, సీట్లకోసం బేరసారాలు ఆడకుండా,  తాను కూడా పోటీ చేయకుండా ఒక కొత్త వ్యూహంతో మోడీ పార్టీకి ప్రచారం చేసిపెట్టారు. ఇది సినీ రంగంలో మామూలే. తాము వాడని షాంపూలకు , వేలేసి కూడా  తాకని సబ్బులకు, సినీ తారలు తమ ప్రకటనలతో లేని  గిరాకీ కలిగిస్తూ వుండడం కొత్తేమీ కాదు.   అదే వాణిజ్య సూత్రాన్ని పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక  ఎన్నికల్లో ప్రయోగించి,  అటు మోడీకి, మరోపక్క బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపికి ఫలితాలను ప్రభావితం చేసే రీతిలో  ప్రచారం చేసిపెట్టారు. పవన్ ఆవేశం, సమాజంపట్ల  ఆవేదన ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించడంతో  అభిమానులనే కాకుండా సాధారణ  జనాలను సయితం ఆకట్టుకోగలిగారు. ఫలితం గురించి వేరే చెప్పక్కర లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన విజయంతో మోడీ దృష్టిలో  పవన్ నిజంగా ఒక హీరో అయిపోయాడు. ప్రధానిగా తను చేయబోయే  ప్రమాణస్వీకారానికి రావాల్సిందని  మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడం దీనికి దృష్టాంతం.
సరే! ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఎవరికి వారు తమ పనుల్లో తీరికలేకుండా మునిగి పోయారు. వారు అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించిన  పవన్ కళ్యాణ్  మాత్రం అప్పుడప్పుడూ మీడియా తెరలపై కనిపిస్తూ తన ఉనికిని రుజువు చేసుకోవడం మినహా పెద్దగా  రాజకీయ కార్యకలాపాలు సాగించింది  లేదు. మళ్ళీ చలనచిత్రాలతో తీరిక లేకుండా వుంటూ, దొరికిన  తీరిక సమయాల్లో అమరావతి భూముల వ్యవహారం వంటి వివాదాంశాలలో తల దూరుస్తూ, రాజకీయ యవనికపై అప్పుడప్పుడూ మెరుస్తూ పార్ట్  టైం పొలిటీషియన్ మాదిరిగా  కాలక్షేప రాజకీయాలు నడుపుతున్నారన్న అపప్రధను మూటగట్టుకున్నారు.
ఈ కధ ఇలా సాగిపోతున్న నేపధ్యంలో....
మూడేళ్ళ తరువాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించి కొత్త రాజకీయ చర్చకు తెర లేపారు. రానున్న రోజుల్లో పవన్ పార్టీ జనసేన, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేయగలుగుతుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా తయారయింది. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధానం వున్న తరుణంలో పవన్ చేసిన ఈ ప్రకటన ఆయన సహజ శైలికి దగ్గరగా వున్నప్పటికీ, రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు ‘కోయిల ముందే కూసింది’ అనే భావన కలిగిస్తోంది. తెలంగాణా సంగతి  ఏమో కాని, పవన్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో వున్న మాట కాదనలేనిది. ఒంటరిగా పోటీ చేయడం అనే పవన్ నిర్ణయం  గత ఎన్నికల్లో మిత్ర పక్షాలుగా వున్న బీజేపీ, టీడీపీలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అన్నది కీలక అంశం. వచ్చే ఎన్నికల నాటికి   రాజకీయ సమీకరణాలు  కూడా  మారడం తధ్యం అన్న అభిప్రాయం కూడా నానాటికీ బలపడుతోంది.
ప్రస్తుతానికయితే దేశంలో మోడీ హవా బాగా సాగుతోంది. స్వయంగా ముందరి కాళ్ళకు తనకు తానుగా బంధాలు వేసుకోకపోతే చంద్రబాబు నాయుడికీ అంత ఇబ్బందికర పరిస్తితి ఏమీ కనబడడం లేదు. ప్రముఖ మీడియా సంస్థ ‘సీఎం ఎస్’  తాజాగా జరిపిన సర్వే కూడా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్తితులు ఏమీ లేవనే చెబుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో బాబుకు ప్రత్యామ్నాయం లేదంటూ ఆ సర్వేలో వెలువడిన ప్రజాభిప్రాయం టీడీపీ అధినేతకు ఊరట కలిగించే విషయమే. అయితే అదే సమయంలో  ఆ పార్టీ తన పని తీరు కొంత మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచించే హెచ్చరికలు కూడా  ఆ సర్వే ఫలితాల్లో  వెల్లడయ్యాయి. చంద్రబాబు పాలనపై ప్రజల అభిప్రాయం సానుకూలమా, ప్రతికూలమా అనే ప్రశ్నకు వచ్చిన జవాబుల నడుమ తేడా కేవలం రెండు శాతం మాత్రమే వుండడం గమనార్హం.  మరో మూడేళ్ళ తరువాత  సానుకూలత, ప్రతికూలతల్లో ఎంతో కొంత తేడా రావడం సహజం. ఆ తేడాపాళాలు ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం వుంటుంది.  అది అధికారాన్ని దూరం చేసేంత ప్రభుత్వ వ్యతిరేకతగా  మారుతుందా అన్నది  ఇప్పుడే ఊహించడం కష్టం. మరి, ఈ పరిస్తితుల్లో, అప్పుడప్పుడు  మెరిసి  మురిపించే పార్టీగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ కి కొత్తగా లభించే అవకాశాలు ఏపాటివి?
భవిష్యత్ ఎన్నికల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో పవన్ సాయం తీసుకోవడానికి బీజేపీకి ఎలాటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వొప్పుకోవాలే  కాని జనసేనను తమ పార్టీలో కలుపుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ముందస్తు చూపుతో 'కాంగ్రెస్ రహిత భారత దేశం' అనే స్వప్నాన్ని  సాకారం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా దక్షిణాదిన,   ప్రజాదరణ వున్న స్థానిక నాయకులను దగ్గరికి తీసుకునేందుకు పావులు కదుపుతున్న విషయం రహస్యమేమీ కాదు.  మోడీకి దగ్గరవాడు కావడం, రాజకీయాలకు కొత్తకావడం పవన్ కు ఈ విషయంలో అదనపు అర్హతలు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం లేని మాట నిజమే. అలాగే కొత్త పార్టీ దూసుకు పోవడానికి వీలైన రాజకీయ శూన్యత కూడా ఏమీ లేదు. టీడీపీ నిలదొక్కుకోవడానికి,  బీజేపీ కాలు కూడదీసుకోవడానికీ, మరో పక్క ప్రధాన ప్రతిపక్షం వైసీపీ  అదును చూసి అధికారంలోకి రావడానికీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. బలం పెంచుకోవడానికి, బలపడడానికి మాత్రమే కాకుండా ఎదుటి పక్షాన్ని బలహీనపరచి తద్వారా తాము బలం పుంజుకోవడానికి  ఆయా  పార్టీలు చేస్తున్న లోపాయికారీ ప్రయత్నాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి రాజకీయ సమీకరణలు ఇలాగే  వుండకపోవచ్చని కూడా అనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు ప్రత్యర్ధి పార్టీల నడుమ జయాపజయాలను నిర్ణయించిన ఓట్ల శాతం తక్కువ కాబట్టి ఆ మేరకు మించి బలం పెంచుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకి వుంది. ఈ దిశగా అడుగులు వేసేటప్పుడు మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు, పవన్ తన పార్టీని రంగప్రవేశం చేయించడం ద్వారా ఏదో ఒక మేరకు, కొందరికి నష్టం, మరికొందరికి లాభం చేకూరే అవకాశం వుంటుంది. ఆ ఎవరు, ఎవరన్నది అంత సులభంగా జవాబు చెప్పలేని ప్రశ్న. భవిష్యత్తులో  రాజకీయ పునరేకీకరణలపై  ఆ  సమాధానం  ఆధారపడి వుంటుంది. 
అయితే ఇక్కడ చిక్కుముడి ఎవరో కాదు.  పవన్ కల్యాణే.  పవనం అంటేనే గాలి. అది ఎటు  వీస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ మనసులో ఏముందో పవన్ కే తెలియదని హాస్యోక్తిగా చెప్పుకుంటారు.
ఎన్నికలకు ముందు అట్టహాసంగా పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయలేదు. పెట్టిన రెండేళ్లకు స్పందించి, మరో మూడేళ్ళ తరువాత ఎన్నికల్లో  పోటీ చేస్తానని ఇప్పుడు తాజాగా  మరో ప్రకటన చేసారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై అనడం మరో వింత.  రాజకీయాల్లో ఇవన్నీ కొత్త పుంతలు. ఆయనకి మాత్రమే ఇటువంటివి సాధ్యం. మరొకరెవరన్నా ఇటువంటి నిలకడ లేని ప్రకటనలు చేస్తుంటే అభాసుపాలయ్యే వారు. పవన్ కు వున్న అభిమానబలం ఆయన్ని విమర్శల బారినుంచి ఓ  రక్షరేకులా కాపాడుతోంది అనుకోవాలి. అయితే, ఈ సినీ అభిమానం అంతా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగేవరకే. తరువాత సాధించే విజయాలే, రాజకీయాల్లో  మాట చెల్లుబడి కావడానికి  గీటురాయిగా మారుతాయి.   
రాజకీయ విశ్లేషణలు చేసేవారికి కూడా పవన్ కళ్యాణ్ ఒక పజిల్. ఒక పట్టాన  కొరుకుడు పడేరకం కాదు,  అందుకే అయన ఏం చెయ్యబోతున్నారన్నది ఊహకు అందని విషయం.
రాజకీయాల్లో వున్న తమాషా ఏమిటంటే, ముందు ఊహించినట్టు ఎప్పుడూ  నడవవు.  అవి తిరిగే మలుపులు అంచనా వేయడం చాలా  కష్టం. వాటి లెక్కలే వేరు.

కొసమెరుపు:
'జనసేన' వెబ్ సైట్ చూసిన వారికి ప్రముఖంగా ఒక వాక్యం కనిపిస్తుంది.
"నేను రాజకీయవాదిని కాను - పవన్ కళ్యాణ్"
(ఇప్పుడు వుందో లేదో తెలవదు)   

(16-04-2016)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595






14, ఏప్రిల్ 2016, గురువారం

పిల్లలే నయం


మొన్నీమధ్య చుట్టాల ఇంట్లో ఫంక్షన్  కు వెళ్లాను. పిల్లలు అంతా ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నారు.
‘మా పవన్ పవరే వేరు. స్టెప్పు వేసాడంటే దిమ్మతిరిగిపోతుంది. మా హీరో తరవాతే ఎవరయినా.”
‘చెప్పొద్దు పవన్ సంగతి. సినిమా వస్తే హిట్టో ఫట్టో వెంటనే చెప్పలేము. అదే మా బన్నీని చూడు. చూడకుండానే చెప్పొచ్చు  వంద రోజుల బొమ్మని’
‘మీరిద్దరూ కాసేపు గొడవ ఆపుతారా. ఎప్పుడయినా మా హీరో ప్రభాస్  సినిమా  చూసారా. ఫైట్  అంటే మా వాడు చేసేది. మీ వాళ్ళు చేస్తుంటే విలనే గెలుస్తాడేమో అన్నట్టు నీరసంగా ఏడుస్తుంది’
‘సరేలే. బడాయి. ఫైట్ అంటే మీ హీరోకేం తెలుసు. ఒక్క చేత్తో పదిమందిని పడుకోబెట్టాలంటే మా ఎన్టీఆర్ కే సాధ్యం. వాళ్ళ తాతను కూడా మించి పోతున్నాడు తెలుసా’
‘ఇంకా నయం. ఆ మాట గట్టిగా అనకు . ఆ పెద్దాయనకు వున్న ఫాన్లు అప్పటినుంచి ఇప్పటికీ సాలిడ్ గా అలానే వున్నారు. విన్నారంటే చావగొట్టి చెవులు మూస్తారు”     
ఇలా చాలాసేపు వాళ్ళ వాగ్యుద్ధం సాగిపోయింది. ఎవరూ ఎవరి మాటా దూరనివ్వరు. వాళ్ళ అభిమాన హీరో మీద ఈగ వాలనివ్వరు.


సరే! సాయంత్రం పెద్దవాళ్ళందరూ ఒక టేబుల్ మీద చేరారు. ఒకడు చంద్రబాబు పక్షం. మరో డు  జగన్ మనిషి. ఇంకోడికి కేసీఆర్ అంటే ప్రాణం.  ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క  పార్టీ. అంతే అయితే పరవాలేదు. ఒకడికి  ఆంధ్రజ్యోతి ఇష్టం, సాక్షిని వేలేసి కూడా  ముట్టడు. ఇంకోడు టీ ఛానల్  తప్ప మరో టీవీ పెట్టనుగాక  పెట్టడు. మరొకడు సాక్షి పేపరు, టీవీ మినహా మిగిలినవన్నీ పనికిమాలినవి అని గాఢంగా నమ్మే రకం. పోనీలే, ఎవరి ఇష్టం వారిది అనుకోవడానికి వీల్లేకుండా సంభాషణ మొదలయింది. భయంకరంగా సాగిపోయింది.

చివరికి అనిపించింది ‘పిల్లలే నయం’ అని. 

NOTE: COURTESY IMAGE OWNER

13, ఏప్రిల్ 2016, బుధవారం

ఇదెక్కడి న్యాయం?


సూటిగా....సుతిమెత్తగా.........

తెలుగులో అప్పుని సంస్కృతంలో  ఋణం అంటారు. ఋ అనేది కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి, పలకడానికి తేలిగ్గా వుంటుంది కాబట్టి రుణం అనే అనుకుందాం. మనుషుల మధ్య సంబంధాలన్నీ రుణ సంబంధాలే అనడానికి ఆ భాషలో ఓ సూక్తి కూడా వుంది.
‘ఋణానానుబంధ రూపేన పశుపత్ని సుతాలయాః ఋణ క్షయే క్షయం యాంతికాతత్ర వరిదేవనా’
అంటే ఏమిటట? గొడ్డూగోదా, భార్యా బిడ్డలు, ఇళ్ళూవాకిళ్ళూ అన్నీ రుణానుబంధాలే అన్నది దాని తాత్పర్యం. ఒక్కసారి  ఆ రుణం తీరిందో ఇక మంత్రం వేసినట్టు ఈ బంధాలన్నీ ఒదిలి చక్కాపోతాయట.
మార్క్స్ మహాశయులు కూడా దాదాపు ఇదేవిధంగా వాక్రుచ్చినట్టు గుర్తు. మనుషులమధ్య సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఆయన సెలవిచ్చినట్టుగా మార్క్స్ అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు.
అంటే మరోసారి ఏమిటట? ఈ సమస్త ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతోందని, డబ్బుకు లోకం దాసోహం అని, డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడని ఎట్సెట్రా ఎట్సెట్రా సామెతలు, వాటిని అల్లుకుని సినిమా పాటలు. తీర్చలేని అప్పుకు పేరుకుపోయిన అసలు ఫాయిదాల్లా లెక్కలేనన్ని పుట్టుకు వచ్చాయి.
పూర్వం రుణత్రయం అని  మూడు రకాల అప్పుల పేర్లు చెప్పేవాళ్ళు.   దేవరుణం, పితృరుణం, మనుష్యరుణం. ఇవి కేవలం డబ్బుకు సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి తీర్చే పద్దతులు కూడా పూర్వీకులే చెప్పారు. యజ్ఞయాగాదులు, పూజలు, నైవేద్యాల  ద్వారా దేవరుణాన్ని, పితృదేవతలను సంతృప్తి పరచడం ద్వారా పితృరుణాన్ని, అతిధి సత్కార్యాల రూపంలో మనుష్యరుణాన్ని తీరుస్తూవుండాలి.
సనాతన సాంప్రదాయాలు నిష్టగా పాటించే ఇళ్ళల్లో వైశ్వదేవం చేసేవాళ్ళు. భోజనం చేయడానికి ముందు బలిహరణం అనే ప్రక్రియ వుంటుంది. దీని ఆంతర్యం చాలా గొప్పది. సమస్త భూత రాశులను, కోటానుకోట్ల జీవ రాశులను భోజనానికి ముందు, తర్వాత ఆపోసన, ఉత్తరాపోసనల ద్వారా తృప్తి  పరచడం ఇందులోని విశిష్టత.
ఇది ఒక్క మనదేశానికే పరిమితం కాదు. పాశ్చాత్య దేశాల్లో కూడా ఆచరించడం నేను కళ్ళారా చూశాను. గతంలో అమెరికా వెళ్ళినప్పుడు, సియాటిల్ లో  సుసాన్ దంపతుల ఆతిధ్యం స్వీకరించినప్పుడు నాకీ విషయం బోధపడింది.  భోజనం మొదలు పెట్టడానికి ముందు ఆ దంపతులు  సకల జనుల సంక్షేమం కోసం, తమలాగానే ప్రజలందరికీ మంచి  భోజనం దొరకాలని దేవుడ్ని కోరుతూ ప్రార్ధన చేయడం గమనించినప్పుడు మంచి అనేది అన్ని దేశాల్లో ఒకటిగానే వుంటుందని అనిపించింది.       
ఇప్పుడంటే రకరకాల బ్యాంకులు. రకరకాల అప్పులు. కొన్ని దీర్ఘ కాలికం. కొన్ని స్వల్పకాలికం. పరిశ్రమలకోసం, మాల్స్ కోసం, మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ కోసం ఇచ్చే అప్పులు కొన్నయితే,   కార్లు, టాక్సీలు, ఏసీ బస్సులు అన్నింటికీ బ్యాంకు అప్పులే. కూరగాయల దుకాణాలనుంచి పట్టు చీరెల షాపులవరకు అన్నీ అప్పులతో నడిచేవే. వెనుక ఆటోల వెనుక పలానా బ్యాంకు రుణ సహాయంతో అని పెద్ద అక్షరాలతో అప్పు డబ్బులతోనే రాయించే వాళ్ళు.  పెద్దవాళ్లకు ఇచ్చిన  అప్పులకు కూడా  అలారాయిస్తే వారిని  చిన్నబుచ్చినట్టు అవుతుందని పెద్దమనసు చేసుకున్నారేమో తెలవదు. 
ఓ యాభయ్ అరవయ్ ఏళ్ళక్రితం వూళ్ళో అప్పు పుట్టడం గగనంగా వుండేది. ఎవడికయినా పుట్టిందంటే అతడు పెట్టి పుట్టినట్టే లెక్క. పరపతి అంటేనే అప్పు పుట్టించగల సమర్ధత అని చెప్పుకునే వాళ్ళు. అలాగే అప్పు అంటే భయం వున్న రోజులవి. అప్పు వుంటే పక్కలో పామువున్నట్టే అని భావించేవాళ్ళు.  చనిపోయిన తర్వాత కూడా ఎవరికీ రుణాన పడిపోకూడదని, కొంత మొత్తాన్ని తమ అంత్యక్రియలకోసం తలగడలో దాచుకున్న పెద్దల గురించి నాకు తెలుసు.  తల తాకట్టు పెట్టయినా చేసిన అప్పు తీర్చాలనే పట్టుదలలు ఆ రోజుల్లో ఉండేవి. అల్లా అని అందరూ బుద్దిమంతుల్లా చేసిన అప్పులు అణాపైసలతో సహా తీర్చే వాళ్ళని కాదు. వాళ్ళల్లో కొందరు ‘బుడ్డిమంతులు’ తెచ్చుకున్న అప్పును ఆఖరి పైసా వరకు కల్లు దుకాణాలకు చెల్లు రాసేసి పెళ్ళాం పుస్తెలు అమ్మి అప్పులు తీర్చేవాళ్ళు కూడా  లేకపోలేదు.  చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళ సంసారాలు వీధిన పడేవి. వసూళ్ళకు వచ్చిన కాబూలీవాలాల విచిత్ర విన్యాసాలు గురించి కధలు కధలుగా చెప్పుకుని భయపడిపోయేవాళ్ళు.  భయపడుతూ బతుకుతుండేవాళ్ళు.     
పొద్దున్నే ఈ అప్పుల గొడవేమిటంటారా! దానికీ ఒక కారణం వుంది. 
బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో చదివిన తరువాత నాకే కాదు, చాలామంది మనసులో మెదిలిన ప్రశ్న’ ఇదెక్కడి న్యాయం?’
ఢిల్లీకి చెందిన ఒక స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగానే కాదు, ప్రస్తుత వ్యవస్థలో వున్న కొన్ని లోపాలను ఎత్తి చూపేవిగా కూడా వున్నాయి. 
2009 లో హడ్కో సంస్థ దాదాపు నలభయ్ వేల కోట్ల రుణాలను  రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలోని  ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ ఢిల్లీ కి చెందిన ఒక స్వచ్చంద సంస్థ కోర్టు గడప తొక్కింది.  ఈ విచారణ సందర్భంగా, కోర్టు  లాగిన తీగె, రుణాల ఎగవేత అనే  డొంకను కదిల్చింది. అదీ దీని నేపధ్యం.
న్యాయస్థానం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంకు స్పందించి అయిదువందల కోట్ల రూపాయల పైబడిన బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలను సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో అందచేసింది.
అది విప్పి చూసిన న్యాయమూర్తులకు కళ్ళు గిర్రున తిరిగాయి. ఈ  విషయం నిండు న్యాయస్థానంలో వారు చేసిన వ్యాఖ్యలే తెలుపుతున్నాయి.
‘ఆ సొమ్ము చూస్తె దిమ్మ తిరుగుతుంది’ ఇదీ సుప్రీం వ్యాఖ్య.
అంతటితో ఆగలేదు.
న్యాయస్థానం ఇంకా ఇలా అంది.
‘బ్యాంకులకు ఆయా వ్యక్తులు, సంస్థలు ఎగవేసిన మొత్తం లక్షల కోట్లల్లో వుంది.
‘పదిహేను, ఇరవై వేల రూపాయలు రుణం వసూళ్ళ కోసం రైతులను యాతన పెట్టే బ్యాంకులు వేలకోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు, తమ సంస్థలు ఖాయిలా పడ్డట్టు ప్రకటించి దర్జాగా తిరుగుతుంటారు. ఇదొక ద్వైదీభావం.’
ఈ వ్యా ఖ్యలు చేసిన సుప్రీం మరో మాట కూడా అంది.
‘ఆర్బీఐ నివేదిక ప్రకారం ఎగవేతల మొత్తం భారీగా వుంది. ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాలనే వాదనకు  ఈ భారీ మొత్తం బలం చేకూరుస్తోంది.’
ఇదెక్కడి  న్యాయం అని ప్రశ్నిస్తూ, ఈ వ్యాసం మొదలు పెట్టడానికి సరిగ్గా ఇక్కడ తిరిగిన మలుపే దోహదం చేసింది.
సుప్రీం అభిప్రాయంతో ఖంగు తిన్న ఆర్బీఐ న్యాయవాదులు మరో వితండ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఎగవేత దారుల పేర్లను బయట పెడితే, ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నది ఆ వాదనల సారాంశం.   రుణసమాచార సంస్థల నియంత్రణ చట్టం ప్రకారం సమాచార గోప్యత తప్పనిసరి అని కోర్టుకు తెలియచేసింది. తదుపరి విచారణను ఈ నెల 26 వ తేదీకి వాయిదా వేసింది.
సరే సుప్రీం తుది తీర్పు ఎలా వుండబోతున్నదో అన్న దానిపై చర్చ అనవసరం. కానీ,  సమసమాజం అంటూ మనందరం ఘనంగా చెప్పుకుంటున్న మన ఈ సమాజంలో న్యాయం, ధర్మం అందరికీ సమానంగా ఉంటున్నాయా అన్న ప్రశ్నను ఈ కేసు అందరి ముందూ ఉంచింది. 
ఎన్నో కేసుల గురించి వింటున్నాం. కొందరు బడాబాబులు ఏదో ఒక పేరు చెప్పి, ఆశ చూపి అమాయక ప్రజలు దాచుకున్న డబ్బును పెట్టుబడులుగా పెట్టుకుని కోట్లు పోగేసుకుని రాత్రి రాత్రి బోర్డులు తిప్పేస్తున్నారు. మరికొందరు బడాబాబులు రాజకీయ ఛద్మవేషాలు ధరించి ప్రజలు  బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును రుణాల రూపంలో ఎగవేసుకువెళ్ళడమే కాకుండా వాటిని పూర్తిగా ఎగవేస్తున్నారు. ఎటు  తిరిగీ వీరు దోచుకునే  సొమ్ము కష్టపడి చమటోడ్చి కూడబెట్టుకున్న ప్రజలదే కావడం ఇందులోని విషాదం.   
ఈ బ్యాంకుల పేర్లూ, ఈ బడాబాబుల పేర్లూ ఎవ్వరికీ తెలియనివి కావు.    కానీ వారి పేర్లు బయట పెట్టడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ కిందుమీదులవుతుందని చేస్తున్న వాదనే తలకిందులనిపిస్తోంది.  కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టి, సూటూ బూటూ వేసుకుని విమానాల్లో తిరుగుతూ, అప్పులు ఇచ్చిన బ్యాంకు అధికారులకే ఆ మొత్తాలతోనే విలాసవంతమైన విందులు ఇస్తూ, దేశ విదేశాల్లో షికార్లు చేస్తున్న వారిని తాకడానికి కూడా భయపడే మన వ్యవస్థను చూసినప్పుడు ఏదో తెలియని భయం కలుగుతోంది.
ఋణం తీర్చగానే బంధాలు పోతాయని పూర్వీకులు చెప్పారు. రుణాలు ఎగ్గొట్టి కూడా  బంధాలు నిలుపుకోవచ్చని  ఈ తరం చెబుతోంది. ఇదొక వైచిత్రి.
ఉపశ్రుతి: అసందర్భంగా అనిపించినా  ఒక సందర్భం  ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో   నేను  విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. జీతభత్యాల రీత్యా  చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే  తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు  కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో  ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం,  బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!
(13-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595             

‘         

12, ఏప్రిల్ 2016, మంగళవారం

ప్రచారంలో కొత్త పుంత


థానే చిక్నో స్కార్పా అనే నోరు తిరగని పేరుగల ఈ బ్రెజిలియన్ పెద్దమనిషికి కళ్ళు తిరిగే ఆస్తిపాస్తులు వున్నాయి. ఖరీదయినా కార్లూ, విలాసవంతమయిన భవంతులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద కలిగిన ఈ అపర కుబేరుడు ఓ రోజు ఫేస్ బుక్  మాధ్యమంలో జనాలు ఉలిక్కిపడే కోరిక వెలిబుచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కారు అతడి దగ్గర వుంది.  మనసుపడి కొనుక్కున్న ఆ కారుని మిత్రులు, విలేకరుల సమక్షంలో ‘సమాధి’ చేయడం అన్నది అతడి సంకల్పం. అలా చేయడం వల్ల మరుజన్మలో కూడా అలాంటి వాహన యోగం మళ్ళీ పడుతుందన్నది అతగాడి నమ్మకం.



యెంత పోయేకాలం వచ్చినా ఇదేమి పోయ్యేకాలమని ఫేస్  బుక్  లో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నోళ్ళు నొక్కుకుంటూ కామెంట్లు పెట్టారు. అయినా స్కార్పా గారు వెనక్కి తగ్గలేదు. కారు సమాధికోసం తన ఇంటి పెరట్లో తవ్వుతున్న గొయ్యి ఫోటోలను పోస్ట్ చేసాడు కూడా.
ఆయన అనుకున్న రోజు వచ్చింది. కారు అంత్యక్రియలు చూడ్డానికి జనాలు, ఈ వింతను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి టీవీల వాళ్ళు అక్కడికి చేరారు. అంతా చూస్తుండగా స్కార్పా దొరవారి అనుచరులు సకల సమాధి లాంఛనాలతో ఆ ఖరీదయిన కారును గోతిలోకి దింపుతున్నారు. చూడవచ్చిన వారు కన్నీళ్లు ఉగ్గబట్టిన విస్పారిత నేత్రాలతో తిలకించడం మొదలు పెట్టారు.  ఆ సమయంలో, ఆ స్మశాన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ స్కార్పా గారి స్వరం  ఖంగున మోగింది.
‘ఆపండిక ఈ కార్యక్రమాన్ని, బయటకు  తీయండిక  గొయ్యిలోకి దించిన కారును’.
చూడవచ్చిన వాళ్ళు  నిశ్చేష్టులయ్యారు. కవర్ చేయడానికి వచ్చిన కెమెరాల వాళ్ళు చేష్టలుడిగి నిలబడ్డారు.
స్కార్పా గొంతు పెంచి ఇలా చెప్పాడు.
‘ఇది చాలా చాలా ఖరీదయిన కారు.  ఇది నేను ఎంతో డబ్బు పోసి కొనుక్కున్నాను. కానీ,  ఎలాంటి డబ్బూ డుబ్బూ లేకుండా దేవుడు మనల్ని పుట్టిస్తూనే ఇంతకంటే ఖరీదయిన వాటిని మనకు పుట్టిన రోజు కానుకగా మనకిచ్చాడు. మనిషి శరీరంలో వున్న ప్రతి అవయవం ఎంతో అపురూపమైనదే కాదు విలువ కట్టలేనంత విలువైనది. చనిపోయిన తరువాత వాటిని మనతో సమాధి చేయడానికి  ఇచ్చగిస్తామే వాటి అవసరం వున్న సాటివారికి దానం చేయడానికి మనసు రాదు. డబ్బుతో తప్ప ఏవిధంగాను విలువలేని ఈ కారును మాత్రం ఎవరికో ఒకరికి ఒదిలిపెట్టి వెళ్ళాలి. ఇదేవిధమైన దాతృత్వమో మీరే చెప్పండి.
‘మనుషులు ఒదిలి వెళ్ళాల్సింది ఈ ఖరీదయిన కార్లూ, విలాసవంతమైన భవనాలు కాదు. అవసరమైన వారికి కొత్త జీవితం ప్రసాదించే మన అవయవాలను. చేతయితే, మనసుంటే వాటిని దానం చెయ్యండి’
NOTE: Photo courtesy image owner     
        

      

11, ఏప్రిల్ 2016, సోమవారం

అపర పరమానందయ్య శిష్యుల కధ

అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.
ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్యమరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురుఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.
గురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే  అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై  అంతులేని అపనమ్మకం.
ఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.
గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.
ఆ శిష్యబృందానికి  ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షంలోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి  ఈ ప్రయాణమే  సరయిన తరుణం  అనుకున్నారు. తదనుగుణంగా ఎవరికి వారు పధక రచన చేసుకున్నారు.

ఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం  ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక  టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం  ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున  రైలు బోగీలో వున్న   టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి  వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.
సరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో  పుణే వెళ్ళాలనుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ఒకే టిక్కెట్టు’ అనే  ట్రిక్కుతోనే  ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.
టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో  ఒకడు టాయిలెట్ నుంచి  బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది  టీసీయే అని భ్రమపడి ఆనందయ్య  శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి   బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే ఉపయోగించి  టీసీ బారి  నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును  పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు.  
ఏమయితేనేంమొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.
ఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ  ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.
పరమానందయ్య  శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం  వచ్చాడు. పరమానందయ్య  శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే  రైలెక్కిన ఆనందయ్య శిష్యులు  టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి  దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు. ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్  ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.
అంటే నీతి ఏమిటంటే అనుసరణ  మంచిదే కావచ్చుకాని ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి. అప్పుడే అది రాణిస్తుంది.
మూడేళ్ళ క్రితం స్వేచ్చానువాదం చేసి పోస్ట్ చేసిన రచన ఇది. 

(19-05-2012)

9, ఏప్రిల్ 2016, శనివారం

అప్పడాల కర్ర – ఓ జ్ఞాపకం

వయస్సు మీరుతున్న రోజుల్లో మనిషికి  అత్యంత  రుచికరమైనది ఏమిటి అంటే నా సమాధానం – ఓ మంచి జ్ఞాపకం.
చాలా ఏళ్ళకిందట అంటే  రెండున్నర దశాబ్దాల క్రితం మాస్కోలో మా కాపురం సాగుతున్న రోజుల్లో  ఫిలిపెంకో దంపతులు పరిచయం అయ్యారు. అక్కడి కాలమాన పరిస్తితులకి కాస్త విరుద్ధంగా వుండడం  అనే ఒకే ఒక్క   కామన్ పాయింటు మమ్మల్ని దగ్గరకు తీసింది. అప్పటికి మాకు పెళ్ళయి ఇరవై ఏళ్ళు. అయినా నా భార్య నాతోనే కాపురం చేస్తూ వుండడం అనేది వాళ్ళకో వింత. పదహారేళ్ళకే పెళ్ళాడి, ఇరవై ఏళ్ళు వచ్చేసరికి  ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధంగా వున్న రేడియో మాస్కోలో నా సహచర ఉద్యోగిని  నటాషాకు మా ఆవిడ్ని చూస్తే ఓ అబ్బురం. అలాగే పెళ్ళయి పాతికేళ్ళయినా ఫిలిపెంకో దంపతులు విడాకుల గొడవలేకుండా కాపురం చేసుకోవడం మాకో విడ్డూరం.
సరే! మేము హైదరాబాదుకు  ఆల్  మకాం మార్చిన తరువాత కూడా మా రెండు కుటుంబాల నడుమ స్నేహం కొనసాగింది. ఆ దంపతులు మమ్మల్ని చూడడానికి హైదరాబాదు కూడా వచ్చారు. ఇంట్లో సౌకర్యంగా వుండదని హోటల్లో బస ఏర్పాటు చేయాలనే మా ప్రయత్నాన్ని వాళ్ళు తోసిరజన్నారు. ఇంత  దూరం వచ్చింది కలిసి వుండడానికి కానీ హోటల్లో గడపడానికి కాదు పొమ్మన్నారు. వినడానికి చిత్రంగా  తోచవచ్చు కానీ, ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి. వారికి తెలుగూ, ఇంగ్లీష్ రెండూ రావు. మాకు రష్యన్ ఒక ముక్క కూడా అర్ధం అయిచావదు. మా పిల్లలు ఇంట్లో ఉన్నంత సేపూ వాళ్ళే దుబాసీలు. స్కూలుకు వెళ్ళిన తరువాత మా సంభాషణ అంతా సైగలతోనే. మందూ, సిగరెట్లు ఈ రెండూ మాస్కోలో ఆడామగా తేడా లేకుండా అక్కడికి వారికీ నిత్యావసరాలు. అదేమీ చిత్రమో వీరిద్దరూ వాటికి దూరం.


ఒకరోజు భోజనాలు అయిన తరువాత మా ఆవిడ అరటి పండు ఒలిచి నాకు అందించడం పిలిపెంకో కళ్ళబడింది. వెంటనే వంటింట్లోకి వెళ్లి , అప్పడాల కర్ర పట్టుకొచ్చాడు. ‘అరటి పండు  కాదు దీంతో మీ ఆయన నెత్తి మీద మొత్తు’  అంటూ సైగలతోనే మా ఆవిడతో  చెప్పాడు. భార్య మొగుడికి అలా  అరటిపండు  ఒలిచి మరీ అందివ్వడం ఆయనగారికి నచ్చినట్టులేదు. ‘బాగా గారాబం చేస్తున్నావు మీ ఆయన్ని. ఏం చేతులు లేవా, ఒలుచుకు తినలేడా’ అంటూ ఆ సైగలతోనే మందలించాడు.
ఇక ఇంట్లో నవ్వులే నవ్వులు. వాటికి భాషతో అవసరం లేదు కదా!  

(బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో)      

నిదురపోరా తమ్ముడా!

సూటిగా ....సుతిమెత్తగా..... 

(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 09-04-2016, SUNDAY)

ఆదివారం రాజకీయాలకు సెలవు ఇస్తే బాగుంటుంది అన్న ఒక స్నేహితుడి సూచన మేరకు ఈ వారం కూడా దారి మళ్ళించాల్సివచ్చింది.

'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -



నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.
ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో, ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులుస్కూలు పిల్లలుఈడొచ్చిన పిల్లలుయువతీ యువకులుమధ్య వయస్కులువృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకామన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె‘ఎంత నిద్రపోతే అంత బలం’ అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకుని వుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరదరాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి ‘ఊర్మిళాదేవి నిద్ర’ పేరుతో ప్రసిద్ధి చెందిన లక్ష్మణులవారి  అర్ధాంగి  వుండనే వుంది. 
అయితే,  'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలిఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి  అని మాత్రమే  వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారురాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూరాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నిద్ర  నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమేమాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి. హితోపదేశం కూడా అదే చెబుతోంది.,” షడ్దోషో పురుషేణ:హాతవ్యాభూతిమిచ్చతా! నిద్రా తంద్రా భయం క్రోధం ఆలస్యం దీర్ఘ సూత్రతా” అని. అంటే ఏమిటి? మనిషికి తగవని చెప్పిన ఈ ఆరు దోషాల్లో నిద్ర కూడా వుంది. ఇక్కడ నిద్ర అంటే మాయాబజారులో కృష్ణుడు చెప్పిన    పెను నిద్ర అంటే అతినిద్ర. అది మంచిది కాదంటోంది హితోపదేశం. అదలా ఉంచితే...
నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదామనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూలేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని  వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులునిద్ర మాత్రలుమత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు  ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు పుష్కలంగా  వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే హెచ్ ఎం ఆర్ ఐ – 104 అనే ఒక సంస్త వుండేది. ఇప్పుడు నడుస్తున్నదో లేదో  తెలవదు. ఎందుకంటే ఇటువంటి స్వచ్చందసంస్థలు  ఆయా  ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి  నడవడమో, కుంటడమో  చేస్తుంటాయి. సర్కార్లు మారగానే  వీటి తలరాతలు మారిపోతుంటాయి. ఆ రాతలే కాదు, మీరు చూసేవుంటారు, ఒకప్పుడు 108  వాహనం మీ ద  రాజీవ్ గాంధీ బొమ్మ వుండేది. మరిప్పుడు అది ఉందా అంటే  లేదు. అలాగే  వెనుకటి పాలకుల  హయాములో  మాదిరిగా  ఈ అంబులెన్స్ పధకం ఆఘమేఘాల మాదిరిగా పరిగెత్తుతూ ఉందా అంటే కూడా జవాబు చెప్పలేని పరిస్తితి.
పొతే,  104 కాల్  సెంటర్  పధకం సుమంగళిగా వున్నరోజుల్లో, ఆ నెంబరుకు ఇరవై మూడు జిల్లాలలోని ఏ వూరి నుంచయినా ఫోన్ చేస్తే,  అక్కడ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే డాక్టర్లు, అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా సలహాలుసూచనలు ఇస్తుండేవారు. ఆ రోజుల్లో రోజుకు దాదాపు యాభయ్ వేల మంది వైద్య సలహాలకోసం ఈ నెంబరుకు ఫోన్లు చేస్తూ వుండేవాళ్ళని చెప్పుకుంటుండే వాళ్ళు. ఈ కాల్స్ లో చాలామంది ‘నిద్రపట్టడం లేదు ఏం చేయాలని అడిగేవాళ్ళు. బహుశారాత్రింబగళ్ళు సలహాలు దొరికే కేంద్రం కావడంవల్లఅర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా సలహాలు ఇచ్చే వైద్యులు అందుబాటులోవుండడం వల్ల,  నిద్రపట్టని వారిపాలిట ఈ కేంద్రం వరంగా మారి వుంటుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం నిద్రలేమితో అనారోగ్యాలబారిన పడుతున్నారని ఈ కేంద్రం సేకరించి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఆ గణాంకాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణ ప్రకారం యువతలో, అదీ  ప్రధానంగా నగర ప్రాంతాలలోని యువతీ,యువకుల్లో ఈ నిద్రలేమితనం ఎక్కువగా వున్నట్టు వెల్లడయింది. భవిష్యత్తుపై ఆందోళనరకరకాల మానసిక వొత్తిళ్ళు ఇందుకు కారణమంటున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో 92 శాతం మంది 16 నుంచి 40 ఏళ్ళ మధ్య వారేనని తేలింది. వీరిలో అధిక సంఖ్యాకులు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే వుండడం విశేషం. దాదాపు తొంభయ్ వేలమందికి పైగా వివిధ వయస్కుల వాళ్ళు ఈ కేంద్రానికి ఫోన్ చేసి నిద్ర సంబంధిత రుగ్మతల విముక్తికి సలహాలు తీసుకున్నారంటే ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
నిద్ర సరిగా పట్టకపోయినానిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటెపర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత!  మేలుకోండి’ అని బోధించారు అలనాడే స్వామీ వివేకానంద. అంచేత  మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. చక్కటి నిద్రతో బహు చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూచేతిలో ఘంటం వుంటే చాలదు, వాటితో పాటు  - “నిరుపహతీ స్తలంబురమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబుబంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు.
అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసివేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకాపడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకుమని మెరిసే తారలతో కూడిన నీలాకాశాన్ని పడక గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతేమత్తు పదార్దాలకూమాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ మందు కొడితేనే కానీ నిద్రపట్టదు అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.   వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీపట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదుమందు తప్ప.
అంచేత ఆదివారం ఉచిత సలహా ఏమిటంటే,
పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా ఎంచక్కా హాయిగా నిద్రపోదాం పదండి.
ఉపశ్రుతి: మొగుడు పెళ్ళాం మీద ఇంటి కప్పు ఎగిరిపోయేలా గావుకేకలు వేస్తున్నాడు. ఆ ఇల్లాలు మౌనంగా భరిస్తోంది. అతగాడికి చర్రున మండింది.
“గొంతు ఎండేలా ఇలా ఓ పక్కన నేను మొత్తుకుంటుంటే, ఏమిటలా మిడి గుడ్లేసుకు వింటున్నావు. అర్ధం అయిచావడం లేదా!” అన్నాడు.
“అంత మృదువుగా మీరలా  చెబుతుంటే బోధపడక చస్తుందా.  కళ్ళు మూసుకుంటే నిద్ర పోతున్నది, అసలు లెక్కలేకుండా పోతున్నది అని మళ్ళీ మీరే కసురుకుంటారు’ అన్నదావిడ లేచి చక్కా పోతూ.  (09-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595  

NOTE: Courtesy Image Owner