11, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (231) : భండారు శ్రీనివాసరావు

 

మనసు కోతి

ఇంటి జాగాలోనే మొక్కకోసమో, పాదు కోసమో ఓ జానెడు బెత్తెడు నేల తవ్వుతాం. బొచ్చెడు మట్టి బయటకు వస్తుంది. మళ్ళీ ఆ గుంటను అదే మట్టితో పూడ్చినా ఇంకా చాలా మన్ను మిగిలే వుంటుంది.
జీవితం అంతే! తవ్వుతూ పొతే బోలెడు బోలెడు అనుభవాలు, తరచుకుంటూ పొతే ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని మరచియేవి. మరికొన్ని మరచిపోలేనివి.
2003 లో ఒక రోజు. అంటే ఇరవై రెండేళ్ల నాటి మాట.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూకి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్. ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము.
నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్డుపై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మకుమారీల ప్రధాన కార్యస్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పురాణ సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మకుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమందిమి, జర్నలిష్టులకు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల హైదరాబాదు నుంచి వచ్చిన బృందంలో వున్నారు. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.
శుక్రవారం
‘అంబర చుంబిత’ అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో పైకి వెడితే వచ్చే గురు శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది.
కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలు పెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ, దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరు చెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడికంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది. ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో, రీలు కెమెరాలో తీసిన ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ‘ఆంధ్రా సీఎం’ అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూలో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి.
గురుశిఖరానికి వెళ్ళే దారిలో పది పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే వాళ్ళు మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది. అక్కడ మాకు హైదరాబాదు నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు.
కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశాడట. ఇది విన్న తరవాత చేసే పనిపట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మకుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి దాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి. మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
‘కర్మబంధాలలో చిక్కుపోయిన ఆత్మ, తన తండ్రి అయిన పరమాత్మను గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు’ దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి, ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మకుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యానముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో, ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మకుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అమృత ఘడియలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే, నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానంలో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మకుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేశ మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాధునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
ఉపశ్రుతి:
చారిత్రక ప్రదేశం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రదేశం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం, ఆసక్తి వుంటే మాత్రం ఆ యాత్ర పరిపూర్ణం అవుతుంది. లేని పక్షంలో ఇలా లేనిపోని ఊసులు రాసుకోవడానికి తప్పిస్తే, ఇలా వెళ్లాం, అలా చూశాం, ఇదిగో వచ్చాం బాపతు అవుతుంది.





(ఇంకా వుంది)

10, అక్టోబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (230) : భండారు శ్రీనివాసరావు

  

ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.

అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.

గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా  వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని  చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల  హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు  అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవ దర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది.  అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి  వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు  తర్వాత, దర్శనం చేసుకుని మనసులో  కోరుకుంటే  అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను.  కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు.

సువిశాల ప్రాంగణంలో  అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి  ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత  అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ.

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఆయన తరచుగా  మా దగ్గరకు వస్తుండే వారు. అనేక ఆధ్యాత్మిక  విషయాలు చర్చిస్తూ వుండేవారు.

ఆయన కుమారుడే  సౌందర రాజన్ రంగరాజన్.

తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. ఇది జరిగి కూడా చాలా ఏళ్ళు అవుతోంది.

ఆ సంగతులు ఆయన మాటల్లోనే. 

మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి  వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.

ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం, చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.

దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం!

అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో  వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.

నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.

మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు  ఓ అధికారి ఇలా అన్నారు.

సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిష్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం.

ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను.

రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.

ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను.

అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు  దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం.

ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.

“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే.

వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా.

ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది.  దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు)

అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే  ఒక  హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.

ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ  దయ అని నేను నమ్ముతాను.

వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన  భర్త వెంట నడవాలంటే  గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”

 

ఇటువంటి వారితో పరిచయాలు, వారి జీవితాలతో ముడిపడి వున్న సంఘటనలు దేవుడి పట్ల నా భావనలను పూర్తిగా మార్చి వేసాయి.

నేనే ఒక జీరోని అని నమ్ముతున్నప్పుడు, నా చుట్టూ వున్నవాళ్ళు అందరూ నా కంటే గొప్పవాళ్లే కదా!  అలాగే ఈ విశాల విశ్వంలో మన అందరికంటే శక్తివంతమైన ఒక పరమాత్మ ఉన్నాడని నమ్మితే అందులో తప్పేముంది? తప్పల్లా, ఆ పేరు చెప్పుకుని చేసే తప్పుడు పనులని సమర్థించడమే!

కింది ఫోటో:

చిలుకూరు ఆలయ ఆవరణలో సౌందర రాజన్ గారి గృహంలో  మా ఆవిడ, నేను.



(ఇంకా వుంది)  

8, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (229): భండారు శ్రీనివాసరావు

 

నా నడక చూడ తరమా!
‘మా ఆయన నిద్ర మంచం దిగి నాలుగు అడుగులు నడిస్తే, అరిసెలు వండి పెడతాను’ అనేది మా ఆవిడ.
గతంలో ఓ పుష్కర కాలానికి పైగా రోజువారీ, కొండొకచో పూటవారీ టీవీ చర్చల పుణ్యమా అని పొద్దున్నే నిద్ర లేవడం అలవాటయింది. చర్చల అనంతరం ఇంటికి చేరగానే మళ్ళీ పడక సీను నిత్యకృత్యం.
2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి.
బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ ముందు కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం, డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా, డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాలని అనుకున్నాను.
అలా మొదలైన నా నడక, ద్వితీయ విఘ్నం వుండరాదనుకున్న కారణంగా రెండే రెండు రోజులు సాగి, మూడో రోజే ఆగిపోయింది. మా ఇంటికి పార్క్ దగ్గరే కానీ, దాన్ని చేరే రోడ్డు మీద నడవడం ఎంత గగనమో మొదటి రోజునే తెలిసింది. నడిచే వాళ్ళు కానీ, వాహనాలు నడిపే వాళ్ళు కానీ ఎవరూ రోడ్డు సెన్స్ పాటిస్తున్నట్టు లేదు. ఎవరు ఎటు నుంచి వచ్చి మీద పడతారో తెలియదు. ఏ వాహనం ఎటు నుంచి వచ్చి సర్రున వచ్చి రాసుకుంటూ పోతుందో తెలవదు. ఎదురుగా వాహనం రాదు అనుకుని జాగ్రత్తగా నడిచి వెడుతున్నా కూడా, రాంగ్ రూటులో ఎదురుగా ద్విచక్ర వాహనాలు దూసుకుంటూ వస్తాయి. అవి దగ్గరకు వచ్చేదాకా తెలవదు. పైగా రోడ్డు మీద మొనతేలిన ఎదురు రాళ్ళు. ఈ వయసులో కాలో చెయ్యో విరగగొట్టుకుంటే సానుభూతి కూడా వుండదు.
పోనీ పేవ్ మెంటుపై నడుద్దామనుకుంటే, సర్కస్ చేస్తూ నడవాలి.
జానెడు బెత్తెడు పేవ్ మెంటుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసి వున్న వాహనాలు, ఇప్పట్లో ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకున్నట్టు తాపీగా విశ్రాంతి తీసుకుంటూ వుంటాయి. మిగిలిన కాసింత జాగాలోనే వీధికుక్కలు తమ కాలకృత్యాలకు సర్దుకుంటాయి. చూడకుండా కాలు వేస్తే ఇంతే సంగతులు. ఈ నరకం కంటే, మెడ నొప్పే నయమనిపించింది. దాంతో లేకలేక అరవయ్యో ఏట మొదలు పెట్టిన కాలినడక వ్యాయామం కాస్తా, అలవాటు లేని ఔపోసనంలా రెండు రోజుల ముచ్చటగా ముగిసింది.
అయితే, ఈ రెండు రోజుల కాలినడక నాకో పుణ్యమూర్తిని పరిచయం చేసింది.
తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మ, నా వాకింగ్ ప్రయోగంలో మొట్టమొదట పరిచయం అయిన వ్యక్తి.
అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్ట పడింది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటూ వుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు. కానీ జర్నలిస్టు గుణం ఇంగువ కట్టిన గుడ్డ కదా! నెమ్మదిగా కదిలించి విషయాలు రాబట్టాను.
చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక, మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ బతుకు, చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణంగా మారింది.
సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్నతనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవు కానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి (అప్పటికి) యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. నాటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.
ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు, కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ, రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొప్పు కోలేదు.
వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటి వాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్ట చెబుతుంది.
సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పుడు పది రూపాయల నోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.
బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.
‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపించేది.
అన్ని రోజులు ఒకే రకంగా గడవవు కదా! మధ్యలో ఇల్లు మారి మరో ప్రాంతానికి వెళ్లి, భూమి గుండ్రం అన్నట్టు మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిన ఇంటికే కొన్నేళ్ళకు చేరాము. సీతమ్మ గురించి విచారిస్తే ఆమె లేదన్న విచారకర వార్త తెలిసింది.
ఇదో బాధాకర అధ్యాయం.
తోకటపా:
ఇదేదో పరాయి దేశాన్ని పొగిడి, మన దేశాన్ని కించపరచడానికి కాదు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశం నాగరికత నేర్పిందని చరిత్ర చెప్పే పాఠాలు నిజమే. కానీ అది గతం. ఇప్పుడెక్కడున్నాం. అదీ ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అమెరికాలో కుమారుడి దగ్గర ఉంటున్న రోజుల్లో శాస్త్రి గారు ఒక రోజు పొద్దున ఫోన్ చేశారు. శాస్త్రి గారంటే వేమూరి విశ్వనాధ శాస్త్రి. వీవీ శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి బాగా తెలుస్తుంది. స్టేషన్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
శాస్త్రిగారు అమెరికాలో ఉంటున్నది దక్షిణ సాన్ ఫ్రాన్సిస్ స్కోలోని పసిఫికా అనే ప్రాంతంలో. దగ్గరలో పసిఫిక్ మహాసముద్రం బీచ్. అక్కడికి మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన సన్నటి కాలిబాట బాగానే ఉన్నప్పటికీ దారి ఎగుడు దిగుడుగా ఉంటుందట. ఎనభయ్ దాటిన వయసులో ఆయన మెల్లగా నడిచి వెడుతున్నప్పుడు, ఎదురుగా వచ్చేవారు బాట మీద నుంచి కొంచెం పక్కకు దిగి దారి ఇస్తారట. వృద్ధులకు అక్కడి వారు ఇచ్చే గౌరవం అది. మొన్న ఒక వ్యక్తి కుక్కతో సహా వాహ్యాళికి వచ్చి ఈయనకు ఎదురు పడ్డాడట. కుక్క ముందు నడుస్తోంది. ఆ ఆసామీ దాని గొలుసు పట్టుకుని వెనకనే వస్తున్నాడట. చిత్రంగా ఆ కుక్క కూడా శాస్త్రి గారు ఎదురుపడగానే పక్కకు తప్పుకుని శాస్త్రి గారికి దారి ఇచ్చిందట. ఇది చూసినప్పుడు ఆయనకు హైదరాబాదు అనుభవం గుర్తుకు వచ్చిందట.
శాస్త్రి గారికి కృష్ణా నగర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో సొంత ఇల్లు వుంది. రోజూ ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే అలవాటు. అసలే ఇరుకు రోడ్లు. పేవ్ మెంట్లు సరిగా వుండవు. పైగా వన్ వే. వాహనాలు వేగంగా దూసుకు పోతుంటాయి. ఆటోలు అడ్డదిడ్డంగా కాలిబాటల మీదనే పార్క్ చేస్తారు. ‘కాస్త పక్కకు తీస్తావా’ అని ఒక ఆటో డ్రైవర్ ని మర్యాదగానే అడిగారట. ‘నేనెందుకు తీయాలి, మీరే దిగి రోడ్డు మీద వెళ్ళండి’ అని దురుసుగా జవాబిచ్చాడట.
కామెంటు అనవసరం కదా!
కింది ఫోటో:
అమెరికాలో ఆహ్లాదకరమైన వాహ్యాళి


2024


2004




(ఇంకా వుంది)

7, అక్టోబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో – (228) : భండారు శ్రీనివాసరావు

 ఒకరోజు కోటీశ్వరుడు

కలర్ బ్లైండ్ నెస్.  దీన్ని తెలుగులో ఏమంటారో తెలవదు. రంగులు సరిగా గుర్తుపట్ట లేకపోవడం అని విన్నాను. ఈ కంటి జబ్బు నాకు లేదు. అయినా చప్పున కలర్లు గుర్తుంచుకోలేను. అంటే నిన్న కలిసిన మనిషి ఏ రంగు చొక్కా వేసుకున్నాడు అని మర్నాడు ఎవరైనా అడిగితే నేను చప్పున జవాబు చెప్పలేను.

రవికాంచనిచో కవిగాంచును అన్నట్టు కొన్ని అత్యల్ప స్వల్ప విషయాలు కూడా జర్నలిస్టుల దృష్టిని దాటిపోలేవని ఒక్కోసారి అనిపిస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వై.ఎస్.  జగన్ మోహనరెడ్డి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి నుదుటిమీద తిరునామాలు దిద్ది ఆయన తలకు పరివట్టం (పట్టు వస్త్రంతో తలపాగా) చుట్టి శేష వస్త్రాన్ని మెడపై ధరింప చేశారు. సరే ఈ విశేషాలన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి. అయితే ఒక  టీవీ జర్నలిస్టు తలపాగా రంగును పసికట్టి, అది అధికార వైసీపీ రంగును పోలి వుందని పాయింటు తీశారు. అంతటితో ఆగకుండా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పసుపు రంగు పరివట్టం చుట్టారని గుర్తు చేస్తూ, టీటీడీ అధికారులు కూడా ఏ ఎండకాగొడుగు మాదిరిగా పాలక పక్షాలను బట్టి తలపాగా రంగులు మారుస్తున్నారా అంటూ  మరో  పాయింటు లేవదీశారు. ముందే చెప్పినట్టు నాకు రంగులు గుర్తుండవు కనుక నేనేమీ చెప్పలేను.

అయితే ఈ సందర్భంలో నాకు ఓ సొంత అనుభవం గుర్తుకు వచ్చింది.

చంద్రబాబునాయుడు దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయిన తర్వాత వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను అప్పుడు దూరదర్సన్ కరస్పాండెంటుగా పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగారి స్వాతంత్ర దినోత్సవం సందేశం కాబోలు రికార్డు చేయాలి. షరా మామూలుగా ఆ సందేశం స్క్రిప్ట్ కాపీ ఓ ప్లాస్టిక్ ఫోల్డర్ లో పెట్టుకుని సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగారి ముఖ్య పౌర సంబంధాల అధికారికి అందచేసాను. ఆయన దాన్ని అందుకుంటూ మందహాసం చేస్తూ ‘ఏమండీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టు లేదు’ అన్నారు సరదాగా.

ఏమిటా అని చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు పసుపు. ఆయన రెడీ విట్ కి నాకూ నవ్వు వచ్చింది.

ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కొలువుల్లో పనిచేసేవారికి అంతటి నిశిత పరిశీలన వుండాలి. దాన్ని మనం తప్పుపట్టలేము కూడా.

కొన్నేళ్ళ క్రితం ప్రముఖ నటుడు చిరంజీవి, అప్పటి  ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డిని కలుసుకున్నప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రికి కప్పిన శాలువ రంగుపై కొంత చర్చ నడిచింది. ఆ శాలువా రంగు పసుపు రంగు కావడం ఈ చర్చకు కారణం. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా  ధరించిన దుస్తుల రంగు నీలివర్ణం అని మరో మిత్రుడు చెప్పారు.  ఏవో కానీ,  ఈ రెండు వాదనలు నాకు నచ్చవు. రాజకీయాల్లో రంగులు మార్చేవారు ఉండవచ్చు. కానీరంగుల్లో రాజకీయాలు వుండవు.

నిజానికి పసుపు రంగు అనేది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నుంచి వుంది. అలాగే నీలి రంగు వైసీపీ పుటకకు ముందు నుంచీ వుంది. మరి ఎందుకీ వర్ణ వివక్ష!

మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుబట్టి మనకు కనబడే రంగు వుంటుంది.

ఈ రంగులతో నేనూ ఓ సారి ఇబ్బంది పడ్డాను.

దాదాపు నలభయ్ ఏళ్ళయింది నేను  కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం. అక్కడ మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా దుస్తులు వేసుకోవాల్సిందే. లేకపోతే అక్కడ చలికి గడ్డకట్టుకుని పోతాం. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత కోటు వేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

జెమినీ టీవీలో చర్చాకార్యక్రమాలు నిర్వహించే పాత రోజుల్లో సంగతి ఇది. జెమినీ వాళ్ళు ఆ ఒక్కరోజు నన్ను కోటీశ్వరుడిని చేశారు.

బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ స్టుడియోలో పనికిరాదు. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల,  ఆ రోజు నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం కెమెరా కంటికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి, పాత కోటు కప్పుడు  వ్యవహారం మా ఇంట్లో చర్చనీయాంశం అయ్యేదేమో! మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. (చూసేది కాదు) అదన్నమాట!



 




Disclaimer : ఇది ఏవిధంగాను రాజకీయ పోస్టు కాదు