23, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (183) : భండారు శ్రీనివాసరావు

 

‘బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండిపెడతాను’ అనే సామెత మా ఆవిడ తరచుగా చెప్పేది, పుష్కరానికి ఒకసారి ఎప్పుడైనా నేను చదివిన పేపర్లు మడతపెట్టి పెడుతున్న సందర్భంలో.
పదకొండుమంది పిల్లలు వున్న ఇంట్లో చిన్నవాడిని కదా! పక్కబట్టలు సర్దిపెట్టడం, బట్టలు ఆరవేయడం, స్నానానికి నీళ్ళు తోడుకోవడం ఇలాంటి చిన్నచిన్న పనులన్నీ నాకు చెప్పేవాళ్ళు కాదు.
ఇక మా ఆవిడ నా జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి మా ఇంటికి నేనే స్వయం ప్రకటిత మహారాజుని. సర్వంసహా చక్రవర్తిని. మా ఆవిడ పేరుకు మహామంత్రి కానీ, సమయానికి నాకు అన్నీ అమర్చిపెట్టే జీతం భత్యం లేని సేవకురాలు. దాదాపు యాభయ్ ఏళ్ళు సాగిన ఈ వైభోగానికి, ఆరేళ్ల కిందట మా ఆవిడ పోవడంతో తెర పడిందనే అనుకున్నా. అయినా రాసిపెట్టింది ఎక్కడికి పోతుంది? కొడుకులు, కోడళ్ళ రూపంలో ఆ అదృష్టం కొనసాగుతోంది.
‘నేను రేపటి మనిషిని, నా ఆలోచనలు అభిప్రాయాలు వర్తమానంకంటే చాలా చాలా ముందుంటాయి’ అనేది నా గురించి నేను చాలా కాలంగా పెట్టుకున్న నమ్మకం.
అయితే రేపో మాపో నా వయసు ఎనభయ్యవ పడిలో పడబోతున్న తరుణంలో కానీ, నా నమ్మకంలోని డొల్లతనం ఏమిటన్నది నాకు తెలిసి రాలేదు.
నేను రేపటి మనిషిని కాకపోగా, ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్న పాతరాతి యుగం మనిషిని అనే వాస్తవం తెలిసి రావడానికి ఇంతకాలం పట్టింది. ఎందుకంటే అన్నీ ఇలా జరగాలని అనుకుంటానే కానీ ఆ దిశగా ఒక్క అడుగూ వేయకపోవడం నా ప్రత్యేకత.
“మీరు చాలా అదృష్టవంతులండీ” అన్నది ఓ రోజు పొద్దున్న వచ్చిన పనిమనిషి.
నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే, ఎందుకు అని అడిగే సందర్భం కాదు కదా!
మళ్ళీ తనే చెబుతోంది.
“పొద్దున్న వస్తానా, ఆయమ్మ అదే మీ కోడలు గారు ప్రతిరోజూ తను పని (అంటే ఆమె ఉద్దేశ్యం Work from Home అన్నమాట) లోకి వెళ్ళే ముందు నాకు ఇవన్నీ పదేపదే చెబుతుంటారు.
‘పాపా పడుకునే బెడ్డు క్లీన్ చేయి. పక్క బట్టలు రెండ్రోజులకోసారి మార్చు. దిండు కవరు మార్చి వేయి. గది బాగా శుభ్రంగా ఉంచు. బాత్‌రూంలో తడి లేకుండా పొడి బట్టతో తుడిచేయి. బయట ఆరేసిన ఆయన బట్టలు అన్నీ తెచ్చి అలమారాలో సర్ది పెట్టు. మంచి నీళ్ళ సీసా, గ్లాసు మరిచిపోకు.’
“ఇలాగే ఎన్నెన్నోజాగర్తలు చెప్పి వెళ్లి ఆ మిషన్ ముందు కూచుంటారు. రోజూ ఇదే వరస. అదేమిటో, ఇవ్వాళ నేను రావడం లేటయింది. కానీ నేను వచ్చేలోపే నాకు రోజూ చెప్పే చెప్పిన పనులన్నీ ఆమెగారే ఈరోజు చేసినట్టున్నారు. గదంతా శుభ్రంగా వుంది. ఇలా కనిపెట్టి చూసే కోడలు దొరకడం మీ అదృష్టం అంటున్నాను. పాపం ఆ మహాతల్లి వుంటే ఆమెని ఎంత సుఖపెట్టేదో ఈ అమ్మాయిగారు.”
అలాగా! అనుకున్నాను. ప్రతిరోజూ నా గది అలాగే శుభ్రంగా వుంటుంది. పనిమనిషి రాని రోజున కోడలు నిషానే ఇవన్నీ చేస్తోంది అని కూడా తెలియదు. అసలు పనిమనిషి వచ్చిందా రాలేదా! ఎవరు ఏ పని చేస్తున్నారు అని గమనించే తీరిక లేకుండా, ఏదో కొంపలు మునిగినట్టు తెల్లారకముందే కంప్యూటర్ ముందు కూచుంటాను. ఇంట్లో ఏమి జరుగుతుందో తెలవదు, ఒకప్పుడు ఇప్పుడు కూడా. వెనుకటిలాగే నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. అదృష్టం కాక మరేమిటి?
అన్నీ వుండి ఏమీ లేకపోవడమే జీవితం
మేరా నాం జోకర్ సినిమాలో రాజ్ కపూర్ పాత్ర చెప్పినట్టు జీవితం ఆగదు, సాగిపోతూనే వుంటుంది.
‘నేను లేకుండా ఈయన ఎట్లా బతుకుతారో ఏమిటో’ అని, తాను చనిపోయే ముందు ఆఖరు క్షణంలో మా ఆవిడ అనుకునే వుంటుంది. ఏదో రాసుకోవడం, స్నేహితులతో పిచ్చాపాటీ కాలక్షేపాలు చేయడం తప్పిస్తే నా మటుకు నాకుగా బతకగల తెలివితేటలు, పని పాటలు చేసుకోగల శక్తియుక్తులు ఆ భగవంతుడు ఇవ్వలేదు. నా బనియన్ సైజ్ ఏమిటో కూడా నాకు తెలియదనేది నా గురించి నేను వేసుకునే జోకు.
కారు సర్వీసింగ్ చేయించడం, కార్ వాష్ చేయించడం, ఇన్వర్టర్ లో వాడే అదేదో డిస్టిల్డ్ వాటర్ బాటిల్ కొనడం, కారుకు పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ తీసుకోవడం, బకాయి ఉన్న ట్రాఫిక్ చలానాలు పే చేయడం, వెహికిల్ ఇన్స్యూ రెన్స్ రెన్యూ చేయడం, నిజానికి ఈ కాలం వారికి ఇవన్నీ చిన్నపనులే కావచ్చు. కాకపోతే బద్దకమే స్టిరాస్తిగా కలిగిన నా వంటి వారికి పెద్ద పనులే. ఇవన్నీ, ఇవన్నే కాదు, ఇంకా చాలా పనులు నాకు తెలియకుండానే చేసేసి, నేను నిశ్చింతగా కాలుమీద కాలు వేసుకుని హాయిగా రోజులు దొర్లించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిపెట్టే కోడల్ని చూసినప్పుడు, అద్దంలో నాకు నా పాతరాతి యుగం మొహమే కనిపిస్తుంది.
ఇక ఇప్పుడు ఇన్ని వేల మైళ్ళు దాటి అమెరికా వస్తే ఇక్కడా అదే సీను రిపీటు.
ఏదో ఇక్కడ సుఖపడిపోతున్నారని అక్కడ అనుకుంటాము కానీ అది పొరబాటు.
ఒక పక్క ఉద్యోగాలు.. మరో పక్క ఇంటిపనులు. మగవాళ్ల సాయం వుంటుంది కానీ అదేదో నామమాత్రం అని నాకు అనిపిస్తోంది. శనివారం వచ్చింది అంటే చాలు, ఆ రోజు నడుం వాల్చే ప్రసక్తి వుండదు. వారానికి సరిపడా ఇంటెడు చాకిరీ మా కోడలు భావనే. అయిదు వందల మైళ్ళ దూరాన వున్న యూ జీన్ లో ఉంటున్న చిన్నమనుమరాలిని, అక్కడ నాలుగేళ్ళుగా అది ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి, సామాను కారులో వేసి తీసుకురావడానికి మా వాడు సందీప్ శనివారం పొద్దునే బయలుదేరి వెళ్ళాడు. దాంతో భావన ఒక్కతే అన్ని పనులు నిభాయించుకుంటోంది.
చెప్పాకదా! నాకు పక్క బట్టలు పద్దతిగా సర్ది పెట్టుకునే మంచి అలవాట్లు లేవని. ఇక్కడ అంటే అమెరికాలో మా పెద్ద కోడలు భావన ఎప్పుడు మెట్లు దిగి కిందికి వెడుతుందో, ఎప్పుడు గది నీటుగా సర్డుతుందో తెలవదు, నేను స్నానం చేసి వచ్చేసరికి స్టార్ హోటల్లో మాదిరిగా గదీ, పడక క్లీన్ చేసి పెడుతుంది. బ్లాంకెట్లు చక్కగా పరుస్తుంది. దిండు గలీబులు మారుస్తుంది. అయ్యోపాపం రేపు ఈ ఛాన్స్ తనకి ఇవ్వకుండా నేనే సర్ది పెడదాము అని గట్టిగా అనుకుంటాను. కానీ పుట్టుకతో వచ్చిన అలవాట్లు అంత త్వరగా ఎలా మారతాయి. మర్నాడు మళ్ళీ మామూలే. తను చేయడం, నేను చూడడం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఫిల్టర్ కాఫీ, కాసేపు ఏదో ఒక ఓటీటీ మూవీ, మధ్యాన్నం వేడివేడిగా భోజనం, సాయంత్రం నా షరామామూలు సాయంకాలక్షేపానంతర విందు. ప్రతి మంగళవారం విధిగా, భాషతో సంబంధం లేకుండా లింకన్ స్క్వేర్ సినీ మార్క్ దియేటర్లో ఒక సినిమా. అందుకే అంటారు జరుగుబాటు వుంటే జబ్బంత సుఖం లేదని.
ఇవన్నీ సరే! ఇవన్నీ వుంటే మనసు నిశ్చింతగా వుంటుందా! ఏమో నాకు డౌటే!
ప్రపంచంలో అతి భయంకరమైనది ఒంటరితనం! దానికీ భయమేమో! అర్ధరాత్రి కాగానే నన్ను కావిలించుకుని పడుకుంటుంది.
రావణుడి లంకలో నిద్రిస్తున్న స్త్రీల మాదిరిగా మంచం మీద అస్తవ్యస్తంగా పరచుకున్న పక్క బట్టలు. నిద్రపట్టని కళ్ళతో కంటున్న పీడకలలు.
అయితేనేం, నిద్ర పట్టనిది ఈ పూటే. రేపు అనేది వుంది కదా! భయమెందుకు?
ఎప్పుడో అరవై ఏళ్ళకు పూర్వం రాసుకున్న గేయం రాత్రివేళ గుర్తుకు వస్తుంది.
“దూరానికి సరళరేఖల్లా కనబడ్డా
నిజానికి ఎన్నో కనబడని వొంకర్లు
ఆలోచనలకు పెయింట్ వేసి వుంచినా
నిద్రపట్టే వేళకు
మెదడు తుప్పురాలుతున్న చప్పుడు
నిశ్శబ్దం చేసే ధ్వని భరించడం ఎలా
పగలు పలురకాల అనుభవాల్ని నమిలి
నాలుక కొసతో నిశీధిని నంజుకుని
నవ్వి, నలిగి
పక్కపై చేరే సమయానికి
ఆలోచనల నల్లుల బారులు
లోపలి వ్యక్తి చేసే చీకటి ఆక్రందనలు
ఇక నిద్రపట్టడం ఎలా?
లేచి లైటు వెయ్యాలి”
కొసమెరుపు: “నువ్వు ఎంత నిరాశాజనకంగా అయినా రచనలు చేయి. కానీ ఒక ఆశావహమైన ముగింపు మాత్రం ఇవ్వు”, అని సలహా ఇస్తూ, ‘లేచి లైటు వెయ్యాలి’ అనే చివరి వాక్యాన్ని తానే జోడించి, ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ గేయాన్ని అక్షరం మార్చకుండా ప్రచురించారు నాటి ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మగారు. గ్రేట్ ఎడిటర్, గ్రేట్ రైటర్.
(Gratitude can be expressed in many ways. This is one)
కింది ఫోటోలు:
అమెరికాలో నా వైభోగం:
(23-06-2025)
(ఇంకావుంది)

22, జూన్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (182) : భండారు శ్రీనివాసరావు

 

ఫోటో మాట్లాడుతుందా!

‘‘ఈ శంఖంలో తీర్ధం కదా పోయాల్సింది, బియ్యం పోస్తున్నావేమిటి’

పొద్దున్నే ఆలోచనల దొంతరలో మంచం పక్కన గోడకు తగిలించి వున్న ఫొటోకు నేను  సంధించిన ప్రశ్న ఇది. నా అజ్ఞానంధకారానికి పరాకాష్ట.  

హైదరాబాదుకు కొన్ని వేల మైళ్ళ దూరంలో, అమెరికా పశ్చిమ భాగంలో సియాటిల్ లోని  మా పెద్దవాడి ఇంట్లో నాకోసం ప్రత్యేకించిన విశాలమైన పడకగదిలో నిద్రపట్టని అర్ధరాత్రివేళ తడిమిలేపుతున్న పాత జ్ఞాపకాలు.

 

మరక మంచిదే అన్నట్టు ఒక్కోసారి ఒంటరితనం కూడా మంచిదే. హాయిగా ఎలాంటి  అంతరాయం లేకుండా ప్రశాంతంగా జ్ఞాపకాలను నెమరు వేసుకోవచ్చు. ఆలోచనలకు ఆటంకం వుండదు. ఎప్పటెప్పటివో చిన్నప్పటి విషయాలు మనసులో సుళ్ళు తిరుగుతుంటాయి. ఏమిటలా శూన్యంలోకి చూస్తున్నావు అని అడిగేవాళ్ళు ఆ సమయంలో వుండరు. అంతూపొంతూ లేకుండా  సాగే ఆలోచనలను  ఆనకట్టలు, అడ్డుకట్టలు లేకుండా అక్షరబద్ధం చేసుకోవచ్చు.  అల్లెక్సా వినిపించే ఘంటసాల పాడిన పాత   సినిమా పాటలు వింటూ ఎంచక్కా రాసుకోవచ్చు. నడిచివచ్చిన దారిని రివైండ్ చేసి చూసుకోవాలి అంటే ఒంటరితనాన్ని మించిన నేపధ్యం వుండదు ఎవరికైనా, ప్రత్యేకించి నా వయసువారికి.

ఇళ్ళల్లో పూజకు వాడే శంఖాల్లో బియ్యమే పోయాలిట. ఇంకోటి తెలుసా! ఇరవై ఏళ్ళ క్రితం కాబోలు  ఆర్వీవీ కృష్ణారావు గారితో మనం  తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన  ఈ శంఖాన్ని ఇస్కాన్ టెంపుల్ లో కొని మనకిచ్చారు’ అంటోంది గోడమీద ఫోటో. నిజమే ఫోటో మాట్లాడుతోంది. మాట్లాడేది మా ఆవిడే. నాకు నోట మాట రాలేదు.

‘.........’

 

ఈ బుల్లి విగ్రహం చూశారా! విష్ణుమూర్తి పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చున్న ఈ ప్రతిమను శేఖరరెడ్డిగారి భార్య, నా ఫ్రెండ్ అరుణ కొని నాకు ప్రెజెంట్ చేసింది’

‘.......’

ఈ చిన్న వెండి తులసి కోటను   విమలక్కయ్య ఇచ్చింది. ఎనిమిదేళ్ళు దాటింది. అయినా మెరుపు తగ్గలేదు. మన పూజా మందిరంలో ఉన్న వాటిల్లో చాలావరకు ఆమె ఇచ్చినవే. అదిగో ఆ కుంకుమ భరిణ. ఆ  దేవుడి పీట. మంచి మనసుతో ఇచ్చింది. అందుకే ఇన్నేళ్ళయినా  ఇలా మెరిసిపోతున్నాయి’

‘..........’

చనిపోయి ఏ స్వర్గంలో వున్నారో సరస్వతి వదిన గారు. ఈ సరస్వతీ దేవి విగ్రహం ఆమె ఇచ్చిందే. పాతికేళ్ళయి౦దేమో! మనం   మాస్కో నుంచి వచ్చిన కొత్తల్లో చూడడానికి వచ్చినప్పుడు ఇచ్చారు’

‘...........’

ఈ చిన్ని వెండి మందిరం భారతి వదిన గారు ఇచ్చారు. మాస్కోనుంచి తిరిగొచ్చి మనం దుర్గానగర్ లో ముస్లిముల ఇంట్లో అద్దెకు వున్నప్పుడు, అన్నగారికి గుండె ఆపరేషన్ మంచిగా  జరిగి సంతోషంగా ఇంటికి వెడుతూ వదిన గారు ప్రేమతో ఇచ్చిన కానుక ఇది’

‘.........’

ఏడేళ్ళ నాడు బుజ్జివాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెండి సామాన్లు తీసుకోవడానికి అమీర్ పేట షాపుకు వెళ్ళినప్పుడు మనమూ వెంట వెళ్లాం గుర్తుందా! చిన్ని లక్ష్మీ దేవి, పక్కన రెండు చిన్న ఏనుగులు ఉన్న ప్రతిమ చూసి ముచ్చట పడితే,  మీరు అప్పటికప్పుడే కార్డు గీకి కొనేశారు. బహుశా ఇన్నేళ్ళ కాపురంలో మీరు కొన్న దేవుడి బొమ్మ ఇదొక్కటే!’

‘............’

 

అసలు నేను ఆ పూజ  గదిలోకి అడుగు పెట్టింది ‘విగ్రహాలు కడుగుతూ, కడుగుతూ  ఆ సందట్లో  టిఫిన్ తిని మాత్ర వేసుకోవడం మరిచిపోయావా అని అడగడానికి.

ఇంత పాత సంగతులు ఇలా విపులంగా చెబుతుంటే ఇక మతిమరపు గురించి ఏం అడగను. పులుకడిగిన దేవుళ్లకు ఓ దణ్ణం  పెట్టేసి చక్కా బయటకు వచ్చాను.  

    

దేవుళ్ల సంప్రోక్షణ జరిగింది 2019 జులై 18 వ తేదీన. 

ఆగష్టు 18 న తాను లేదు.

ఈ పూజలన్నీ ఏమైపోయాయో ఏమో మరి.

ఏ పూజలు, పునస్కారాలు తెలియని నేను మాత్రం ఇలాగే వున్నా మరి.

‘ఇంకా పడుకోలేదా! కాసేపు పడుకోండి. మళ్ళీ మనం బయలుదేరి దాదాపు కెనడా దాకా కారులో వెళ్ళాలి. ఈ రాత్రికి వచ్చేద్దాం’ అంటున్నాడు మా వాడు.

దీవిలో ఒక రోజు

 అమెరికా- కెనడా సరిహద్దుల్లో పసిపిక్ మహాసముద్రంలో  దీవులు కొన్ని వున్నాయి. సియాటిల్ నుంచి కెనడాకు రెండున్నర గంటల్లో కారులో వెళ్ళవచ్చు. రోడ్డు మార్గం ద్వారా మాత్రమే  కాకుండా హెలికాప్టర్లు, విమానాల ద్వారా కూడా ఆ దీవులను చేరుకోవచ్చు.

 అనకోర్టెస్ అనే పట్టణం నుంచి ఫెర్రీల (పెద్ద పెద్ద మర బోట్లు) ద్వారా కూడా వెళ్ళవచ్చు. మనతో పాటు మన వాహనాలను కూడా ఈ బోట్లలో తీసుకువెళ్ళడానికి వీలుంది. నిర్ణీత రుసుము చెల్లించి సందీప్ కారుని నేరుగా ఫెర్రీలోని పార్కింగ్ లాట్ లోకి చేర్చాడు. డజన్ల సంఖ్యలో అక్క డ కార్లు పార్క్ చేసుకునే వీలుంది.

 పై అంతస్తులో పర్యాటకులకోసం విశాలమయిన లాంజ్ లు వున్నాయి. అన్ని వైపులా నిలువెత్తు అద్దాలు బిగించడం వల్ల వెచ్చగా, హాయిగా చుట్టూ పరిసరాలను గమనిస్తూ సముద్రయానాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఫెర్రీలో బార్, రెష్టారెంట్ తొ సహా అన్నిరకాల వసతులు వున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు వున్నాయి.

 

 గంటన్నర పాటు సముద్రంలో ప్రయాణించి సాన్ జువాన్ (అమెరికన్లు ‘సాన్ వాన్’ అని పలుకుతారు) దీవుల్లోని ఫ్రైడే హార్బర్ కు చేరుకున్నాము. బోటు నుంచి కారు కిందకు దింపుకుని,  విశాలమయిన దీవిలో సన్నటి రోడ్లపై కలయ తిరిగాము. దీవికి అన్నివైపులా పసిఫిక్ మహాసముద్రం. ఎక్కడో సుదూరంగా నీలి సముద్రాన్ని నీలాకాశం తాకుతున్న ఫీలింగ్.

 పేరుకు దీవి కానీ ఫ్రైడే హార్బర్ అన్ని వసతులు కలిగిన చిన్నపాటి నగరమనే చెప్పాలి. రెష్టారెంట్లు, సినిమా హాళ్ళు, హోటళ్ళు, మ్యూజియం, చిన్న సైజు విమానాలు దిగడానికి ఎయిర్ స్ట్రిప్, సంపన్నులయినవారు విడిది గృహాలుగా కొనుగోలు చేసుకున్న ఖరీదయిన ఇళ్లు,  హాలీవుడ్ చిత్రంలో సెట్ మాదిరిగా చూడచక్కగా వుంది. ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగన్నం,  పులిహార లాగించి చూడాల్సినవి అన్నీ చూసి వస్తుంటే వర్షం మొదలయింది. సాయంత్రం అయిదు గంటలకే చిమ్మ చీకట్లు కమ్మే వాతావరణం. బోటు లంగరు వేసిన ప్రదేశం కనుక్కునే సరికి తాతలు దిగివచ్చారు. మొత్తానికి ఎలాగయితేనేం, కారుతో సహా తిరిగి బోట్లో పడ్డాం.

జీవితమంటేనే జ్ఞాపకాలు.

కింది ఫోటోలు :

మా ఆవిడ ఫోటోతో మాటామంతీ

ఫ్రైడే హార్బర్
















(ఇంకావుంది)

 

18, జూన్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (181) - భండారు శ్రీనివాస రావు

 

'ఇలా ఎలా చిక్కిపోయారు పాపా' అంది నా పెద్దకోడలు భావన సియాటిల్ లో ఇంట్లో అడుగుపెడుతున్న నన్ను చూసి.
2025 జూన్ 12 తెల్లవారు ఝామున హైదరాబాద్ నుంచి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి మళ్ళీ అదే తేదీన అమెరికా చేరాను, ఒంటరి ప్రయాణం ఈ వయసులో ఎలాగా అనే మా వాళ్ళ సందేహాలు తీరుస్తూ.
కిందటి ఏడాది ఇదే రోజుల్లో ఇక్కడే వున్నాను. డిసెంబరులో హైదరాబాద్ లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి మనుమరాలు శిఖిర పెళ్ళికి అమెరికా నుంచి మా పిల్లలు వచ్చారు. అందరం కలిసి ఎంతో కాలం కూడా కాలేదు. అయినా చిక్కిపోయాను అంటోంది, కోడలు. ఏదో మాట వరసకి అన్నది అని అనుకోవడానికి వీలు లేకుండా కారణం కూడా చెప్పింది.
హైదరాబాద్ వచ్చినప్పుడు, రెడీ మేడ్ కాకుండా టైలర్ దగ్గర కొలతలు ఇచ్చి కుట్టించారు. ఆ ప్యాంటు వదులుగా కనపడడం చూసి భావన అలా అనుకుంది.
అసలు కారణం ప్యాంటుకు బెల్ట్ పెట్టుకోకపోవడం.
అమెరికా ప్రయాణం పెట్టుకునే నా బోటి బద్ధకస్తులు బెల్ట్ అస్సలు పెట్టుకోకూడదు. లాప్ టాప్ తెచ్చుకోకూడదు. ప్రతిచోటా తనిఖీలే. ముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో. తిరిగి దోహాలో దిగినప్పుడు. మళ్ళీ అక్కడ విమానం ఎక్కే ముందు. బెల్ట్ విప్పాలి. మళ్ళీ పెట్టుకోవాలి. చివరకు విసుగు పుట్టి దోహాలో బెల్ట్ వదిలేసాను. లాప్ టాప్ తో మరో యాతన. దాన్ని చెక్ ఇన్ లో వేయడం కుదరదు. క్యాబిన్ బ్యాగేజీ లోనే వేయాలి. దీనికోసం హ్యాండ్ లగేజీ. లేకపోతే సామాను లోపల వేసి హాయిగా చేతులు ఊపుకుంటూ వెళ్ళవచ్చు. కానీ అది లేనిపక్షంలో అమెరికాలో కాలక్షేపం ఎలా. అంచేత నెసిసరీ ఈవిల్ అని ఈ యాతన భరించక తప్పదు.
దోహా నుంచి ఏకధాటిగా ఇరవై గంటలు విమాన ప్రయాణం నాకేమీ ఇబ్బంది కలిగించలేదు కానీ ఈ తనిఖీలే ఇబ్బంది పెట్టాయి. ప్రతి దగ్గర పుష్కర స్నానాల ఘాట్ దృశ్యాలే. తనిఖీ కాగానే ప్రతి ఒక్కరూ సామాను కలెక్ట్ చేసుకోవడం, బెల్టులు పెట్టుకోవడం. ఆడవాళ్ళ తనిఖీ మరీ ఇబ్బంది పెట్టేదిగా వుంది. అక్కడ సరైన జాగా కూడా వుండదు. అన్నీ వెతుక్కోవడమే. ఈ హడావిడిలో ఏమి మరచిపోతామో తెలవదు. నిజం చెప్పొద్దూ,
బెల్ట్ వదిలేసిన తర్వాత ప్రాణం తెరిపిన పడింది.
సియాటిల్ వచ్చిన మరునాడే ఆరెగాన్ ప్రయాణం. దూరం చూస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం. కానీ సరైన కార్లు, రోడ్లు కారణంగా అయిదు గంటల్లో వెళ్లిపోవచ్చు.
నా మనుమరాలు సృష్టి అరెగాన్ యూనివర్సిటీలో నాలుగేళ్లు చదివింది.
అమెరికాలో గ్రాడ్యుయేషన్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. దీనితో పాటు కమెన్స్ మెంట్ అనే మరో వేడుక నిర్వహిస్తారు. అంటే, అక్కడికి నుంచి అసలు సిసలు జీవితంలో ప్రవేశించడం అనే అర్ధం ఏమోమరి!
ఇలాంటి వేడుకలకు విద్యార్థులు, వారి తలితండ్రులు, బామ్మలు, తాతలు, చుట్ట పక్కాలు, స్నేహితులు తరలి వెడతారు. దాంతో ఈ యూనివర్సిటీ వున్న చిన్న పట్టణం యూ జీన్ (Eugene) లో వసతి పెద్ద సమస్య. అందుకే చాలా ముందుగా హోటళ్ళు బుక్ చేసుకుంటారు. నాది నాన్చుడు వ్యవహారం కనుక మూల్యం మా వాడు చెల్లించాల్సి వచ్చింది. అమెరికా ప్రయాణం విషయంలో చివరి ఘడియ వరకూ నేను తేల్చి చెప్పకపోవడం వల్ల విమానం ఛార్జీలు అధికంగా చెల్లించడమే కాకుండా, వేడుక జరిగే వూళ్ళో హోటళ్ళు అన్నీ మూడు రెట్లు ధరలు పెంచేసాయి. అయినా, గదులు అన్నీ బుక్ అయిపోయాయి. దాంతో వంద మైళ్ళ దూరంలో వున్న ఆరెగాన్ రాష్ట్ర రాజధాని సేలం (Salem) లో హిల్టన్ హోటల్ డబల్ ట్రీ లో మూడు రోజులు గదులు బుక్ చేశారు. ఇందువల్ల ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి వంద మైళ్లు ప్రయాణం చేసి, మళ్ళీ రాత్రికి అంత దూరం ప్రయాణం చేసి బసకు చేరాల్సిన పరిస్థితి.
సరే! నాదేముంది. హాయిగా ఖరీదైన ఆడి కారులో ఒళ్ళు అదరకుండా సుఖమైన ప్రయాణం. డ్రైవింగ్ అవస్థ మా వాడిది. నా భోజనానికి ఇబ్బంది లేకుండా భావన రైసు కుక్కరుతో తయారు. ఇటాలియన్, థాయ్, చైనీస్ ఇలా పూటకో హోటలు. భావన తెలివిగా వాళ్ళతో మాట్లాడి నా భోజనం అందరితో పాటు అక్కడే చేసేలా చేసింది.
వేడుక జరిగే యాభై వేల కెపాసిట్ కలిగిన స్పోర్ట్స్ స్టేడియం Autzen మూడు వంతులు నిండి పోయింది. కొన్ని వేల కార్లు రావడంతో ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి పోలీసులు బాగా శ్రమ పడ్డారు.
దాదాపు అయిదు వేలకు పైగా విద్యార్థులు, సుమారు ముప్పై వేల మంది వాళ్ళ తాలూకు జనంతో Autzen స్టేడియం కళకళలాడింది. ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మానవ సంబంధాలకు ఆట్టే ప్రాముఖ్యం ఇవ్వరు అనే అపోహ తొలగిపోయేలా తలితండ్రులు, బామ్మలు, తాతయ్యలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాళ్ళ పిల్లల ఫోటోలు వున్న ప్ల కార్డులు ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని సంబరంగా ఊపుతూ కానవచ్చారు.
ఈ యూనివర్సిటి సింబల్ బాతు ( DUCK). నగరంలో ఎక్కడ చూసినా నిలువెత్తు బాతు బొమ్మలే.
Once a duck is always a duck అనే బ్యానర్లు.
బాతు బొమ్మలు వున్న టీ షర్థులు, కీ చైన్లు.
యూనివర్సిటీ ప్రెసిడెంట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి బాగా మాట్లాడారు. ఆయన ప్రతి మాటకు స్టేడియం చప్పట్లతో మారుమోగింది.
తోక టపా:
అమెరికా ప్రయాణం అంటే నా వయసు వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినవి మూడు ముక్కలు.
విమానాలు, కార్లు, కాళ్ళు.
విమానాల్లో వేల మైళ్లు ప్రయాణాలు, వందల మైళ్లు కారు జర్నీలు, మైళ్ళ కొద్దీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడకలు.
ఈ మూడో దాంతో నాకు అస్సలు పడదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్ మాణింగ్ వాక్ చేసే నాకు ఇక్కడ నడకలు ఇబ్బంది పెట్టాయి.
ఆలస్యంగా వెళ్లడం వల్ల దగ్గరలో పార్కింగ్ దొరక్క చాలా దూరం నడవాల్సి వచ్చింది. డస్సిపోయి, ఒకచోట దారిపక్కన పచ్చటి గడ్డి తివాసీ మీద నడుం వాల్చాను కూడా. పక్క వాళ్ళను పట్టించుకునే దేశం కాదు కనుక, ఎవరూ పట్టించుకోలేదు.
కాకపొతే ఈ సమయంలో మా కళ్ళ ముందే రెండు కార్లు ఢీ కొట్టుకుని బాగా దెబ్బతిన్నాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు నిమిషాల్లో వచ్చి ట్రాఫిక్ సర్దుబాటు చేశారు.
సాయంత్రానికల్లా మళ్ళీ సియాటిల్.
కింది ఫోటోలు :
గ్రాడ్యుయేషన్ వేడుక దృశ్యాలు.
మా కుటుంబ సభ్యులు ఎవరూ కనపడరు. వందల ఫోటోలు తీస్తారు కానీ సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు. అది వాళ్ళ పాలసీ.
రెండు కార్ల ఢీ
అలసి సొలసి దారిపక్కన పచ్చగడ్డిపై నేను.

(ఇంకా వుంది)
All reactions:

14, జూన్ 2025, శనివారం

ఆయాం ఎ బిగ్ జీ్రో (180) భండారు శ్రీనివాస రావు

ఆయాం ఎ బిగ్ జీరో (180) - భండారు శ్రీనివాస రావు

అమెరికాలో మాస్కో

నాకు తేదీలు వారాలు సరిగా గుర్తుండవు. ఇక అమెరికా ప్రయాణంలో మరీ అయోమయం.

హైదరాబాద్ లో జూన్ 12, గురువారం తెల్లవారుఝామున నాలుగుంబావుకు బయలుదేరి, దాదాపు 23 గంటలు విమానయానం చేసి మళ్ళీ 12 గురువారం మధ్యాన్నం సియాటిల్ చేరుకున్నాను. మధ్యలో మాయం అయిన ఒకరోజు విష్ణు మాయ. 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు, భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకున్నాను. మళ్ళీ అదే రోజు అవే టాబ్లెట్లు వేసుకోవాలా అక్కరలేదా? ఇదో పెద్ద మీమాంస. 

రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ గా వుండే నావంటి మనిషికి రావాల్సిన సందేహం కాదని సమాధాన పరచుకున్నాను.

బెల్ వ్యూ లో ఇంటికి చేరి కోడలు భావనతో కాసేపు ముచ్చట్లు చెప్పి బాత్ టబ్ లో వేడి నీటి ధారలతో శరీరాన్ని మర్ధనా చేసుకుని దోహా నుంచి సియాటిల్ కు ఇరవై గంటలు ఏకధాటిగా చేసిన ప్రయాణపు బడలిక కొంత తీర్చుకుని,  భావన అప్పటికప్పుడు చేసిన వేడి భోజనం తిని ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయాను.

మరునాడు శుక్రవారం ఉదయం నలుగురం కారులో అరెగాన్ బయలు దేరాము. సృష్టి యూనివర్సిటీలోనే వుంది.

 పోర్ట్ లాండ్ దాటక ముందే కారును ఒక అడవి బాటకు మళ్ళించారు.
గుబురుగా పెరిగిన వృక్షఛాయల నడుమ ఒక సెలయేరు పారుతోంది. అక్కడే కారులో కూర్చుని ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోరను మౌంటైన్ హై గడ్డపెరుగుతో తిన్నాము. నాతో ప్రయాణం అంటే భావనకు ఇదో అదనపు పని భారం. లేకపోతే వాళ్ళు హాయిగా పిజ్జాలతో భోజనం అయిందనిపించే వాళ్లేమో!

ఆ అడవిలో ఒక చిత్రం చూశాను. యూనిఫారాల్లో వచ్చిన సిబ్బంది, అధికారులు పొడవాటి గొట్టాలతో  ట్యాంకుల్లో తెచ్చిన నీటిని అడవిపై స్ప్రే చేస్తున్నారు. ఎందుకుటా! కార్చిచ్చులు చెలరేగి అడవులు తగులబడి పోకుండా చూడడం కోసమట. అప్పటికి వంద మైళ్లకు పైగా దాటివచ్చాము. దారికి రెండు వైపులా కనిపించిన జనవాసాలు తక్కువ. గుబురుగా పెరిగిన పచ్చటి అడవులు ఎక్కువ. అయినా వృక్ష సంపదను కాపాడుకోవడానికి వాళ్ళ ఆరాటం చూసి ముచ్చట వేసింది. అయితే కారు దిగి ఫోటో తీయడానికి సంక్షేపించాను.

కాసేపటి తర్వాత కారు కొలంబియా నదిపై నిర్మించిన వంతెన దాటి అరెగాన్ రాష్ట్రంలో ప్రవేశించింది. కింద నదిలో పడవలు, పైన ఆకాశంలో విమానం, వంతెన రోడ్డుపై కార్లు ఇలా అన్ని రకాల ప్రయాణ సాధనాలు. అయితే అన్నింటినీ ఒకే ఫోటో ఫ్రేములో బంధించడం నాకు చేత కాలేదు.

మధ్యలో ఒకచోట, వాంకూవర్ అనే చోట మెక్ డోనాల్డ్ లో వేడి కాఫీ కోసం ఆగాము. రెస్టు రూమ్ తెరుచుకోవడానికి ఒక కోడ్ నెంబరు ఇచ్చారు. అదీ ఆర్డర్ డిస్ ప్లే బోర్డుపై కావాల్సినవి కొనుక్కుని ఆన్ లైన్ పేమెంట్ చేసిన తర్వాత. ఈ దేశంలో ఏదీ ఉచితం కాదు అనే సత్యం మరోసారి బోధపడింది.

మొత్తం మీద చేరాల్సిన అడంగు సేలం (SALEM) చేరి, ముందుగా బుక్ చేసుకున్న డబుల్ ట్రీ హిల్ టన్ హోటల్లో శుక్రవారం రాత్రి సేదతీరాము.  అక్కడికి గంట దూరంలో వున్న యూ జీన్ (EUGENE) లోని యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక.

 అక్కడ నుంచి నా మనుమరాలు సృష్టి తన కారులో మా హోటల్ కు చేరుకుంది. అందరం కలిసి వెళ్లి దగ్గరలోని థాయ్ రెస్టారెంటుకు వెళ్ళాము. వాళ్ళు తమకు ఇష్టం అయినవి తిన్నారు. హోటల్ కు రాగానే భావన వెంట తెచ్చిన కుక్కర్ లో నిమిషాల మీద వేడి అన్నం, సాంబారు తయారు చేసి, ఆవకాయ కారంతో అన్నం పెట్టింది.
చెప్పాను కదా!
ఇలాంటి ట్రిప్పుల్లో వున్న లగేజికి తోడు నా తిండి అలవాట్లు భావనకు మరో భారం అని.
తెల్లారిన తర్వాత యూనివర్సిటీ కి వెళ్ళాలి.

తోక టపా :

అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే 'తొమ్మిదివేల'ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి - ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.
ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశంలోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క డిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటే దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్,బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ దేశంలోని పట్టణాలకు వున్నాయి.

కింది ఫోటో :
సేలం నగరంలో థాయ్ రెస్టారెంట్లో వంటకాల వడ్డన సొగసు 
( ఇంకా వుంది )